Heart Attack: గుండెపోటుకు, కరోనాకు నిజంగానే సంబంధం ఉందా?

Heart Attack: గుండెపోటుకు, కరోనాకు నిజంగానే సంబంధం ఉందా?
x
Highlights

Heart Attack - COVID-19 : ఇటీవల కాలంలో గుండెపోటు బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల...

Heart Attack - COVID-19 : ఇటీవల కాలంలో గుండెపోటు బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా గుండె సంబంధిత సమస్యలు ఎక్కువవుతున్నాయి. మరీ ముఖ్యంగా గతంతో పోలిస్తే ఈమధ్య భారత్‌లో ఈ సమస్య ఇంకా ఎక్కువే కనిపిస్తోంది. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారిలో మాత్రమే కనిపించే ఈ సమస్య ప్రస్తుతం పట్టుమని పాతికేళ్లు కూడా నిండని వారిలోనూ కనిపిస్తోంది. యుక్త వయస్సులోనే గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు తరచుగా వార్తల్లో చూస్తున్నాం.

ఇదిలా ఉంటే గుండెపోటు రావడానికి.. అధిక రక్తపోటు, క్రమశిక్షణ లేని జీవనశైలి మాత్రమే కారణమనే భావన ఉంది. అయితే ఇప్పుడు ఈ జాబితాలోకి కరోనా మహమ్మారి కూడా వచ్చి చేరుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కోవిడ్‌-19 తర్వాత గుండెపోటు సమస్యలు పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో తాజాగా నిర్వహించిన ఓ సర్వే ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్లు అవుతుందంటున్నారు.

యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియా, లాస్‌ ఏంజెలిస్‌ తాజా పరిశోధనల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డయాబెటిస్‌ వంటి సమస్యతో సమానంగా.. తీవ్ర కొవిడ్‌ జబ్బూ గుండెపోటు, పక్షవాతానికి ప్రధాన కారణం కావొచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. తొలిసారి కొవిడ్‌-19 విజృంభించిన సమయంలో దీని బారినపడ్డవారికి మూడేళ్ల వరకూ గుండెపోటు ముప్పు, పక్షవాతం, ఏ కారణంతోనైనా మరణించే ముప్పు రెట్టింపవుతున్నట్టు బయటపడింది.

అప్పటికే గుండెజబ్బుతో బాధపడుతూ.. కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకని వారితో పోలిస్తే- గుండెజబ్బు, మధుమేహం లేని, తీవ్ర కొవిడ్‌ బారినపడ్డవారికి గుండెపోటు, పక్షవాతం, మరణం సంభవించే అవకాశాలు 21 శాతం అధికంగా ఉంటుందని పరిశోధనల్లో వెల్లడైంది. మరీ ముఖ్యంగా 'ఓ' బ్లడ్‌ గ్రూప్‌ ఉన్న వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయని అంటున్నారు. గుండెపోటు, పక్షవాతం ముప్పు పెరగటంలో కొవిడ్‌ వైరస్‌కు జన్యువుల మధ్య పరస్పర చర్య జరుగుతోందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు సంబంధించి మరికొన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories