World Hypertension Day: ఒక గ్రాము ఉప్పు ఎక్కువైతే బీపీ ఎన్ని పాయింట్లు పెరుగుతుంది?
ఉప్పు లేదా సోడియం.. దీన్ని ఏ పేరుతోనైనా పిలవండి. మీరు తినే ప్రతి ఆహార పదార్థంలోనూ ఇది కలిసే ఉంటుంది.
ఉప్పు లేదా సోడియం.. దీన్ని ఏ పేరుతోనైనా పిలవండి. మీరు తినే ప్రతి ఆహార పదార్థంలోనూ ఇది కలిసే ఉంటుంది.
అయితే, ఉప్పు ఎక్కువైనా లేదా తక్కువైనా చాలా అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. వీటిలో రక్తపోటు ముఖ్యమైనది. మే 17న ప్రపంచ ‘హైపర్‌టెన్షన్ డే’ (రక్తపోటు దినోత్సవం)గా జరుపుకుంటారు.
ఈ నేపథ్యంలో అసలు రోజుకు ఎంత ఉప్పు తీసుకోవాలి, ఇది ఎక్కువైనా లేదా తక్కువైనా ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.
ఇది చాలా ముఖ్యం..
మన శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన ఖనిజాల్లో సోడియం కూడా ఒకటి. శరీరంలో నరాలు ఆరోగ్యంగా పనిచేసేందుకు, మెరుగైన రక్త ప్రసరణకు, పోషకాలు శరీరం శోషించుకోవడానికి, కండరాల పనితీరుకు సోడియం చాలా ముఖ్యం.
సోడియం మనకు ఉప్పు (సాల్ట్) ద్వారానే అందుతుంది. సాధారణంగా సోడియం, ఉప్పులను పర్యాయపదాలుగా వాడుతుంటారు.
కానీ, ఉప్పు లేదా సాల్ట్‌ను సోడియం క్లోరైడ్‌గా పిలుస్తారు. దీనిలో 40 శాతం సోడియం, 60 శాతం క్లోరైడ్ ఉంటాయి.
ప్రస్తుతం మనం తీసుకునే ఉప్పులో అయోడిన్, ఐరన్, ఫోలిక్ యాసిడ్ లాంటి పోషకాలను కూడా అదనంగా కలుపుతుంటారు.
ఉప్పులో మళ్లీ టేబుల్ సాల్ట్, పింక్ సాల్ట్, సీ సాల్ట్ ఇలా చాలా రకాలు ఉంటాయి.
మొత్తానికి శరీరం సరిగ్గా పనిచేయాలని ఉప్పు తప్పనిసరిగా అందాల్సిందే.
ఎంత తీసుకోవాలి?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) రోజుకు 5 గ్రాముల ఉప్పు (సోడియంలో అయితే రెండు గ్రాములు) మాత్రమే తీసుకోవాలని సూచిస్తోంది.
దీన్ని స్పూన్‌లలో చెప్పుకోవాలంటే ఒక లెవల్ టీస్పూన్ సాల్ట్ అంటే తలకొట్టు టీస్పూన్ (టీస్పూన్ సాల్ట్‌లో గోపురంలా కనిపించేదాన్ని తీసేసి) మాత్రమే తీసుకోవాలి.
అయితే, మన దేశంలో సగటున ఒక్కొక్కరు 8 గ్రాముల వరకూ ఉప్పు తీసుకుంటున్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అధ్యయనంలో తేలింది.
సగటున మగవారు (8.9 గ్రాములు), ఉద్యోగాలు చేసేవారు (8.6 గ్రాములు), ధూమపానం చేసేవారు (8.3 గ్రాములు) తీసుకుంటున్నట్లు ఐసీఎంఆర్ తెలిపింది.
‘‘ఉప్పును మనం ఐదు గ్రాములకు పరిమితం చేసుకోగలిగితే రక్తపోటును 25 శాతం వరకూ తగ్గించుకోవచ్చు. దీని కోసం ముఖ్యంగా ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్‌పై మనం దృష్టి పెట్టాలి’’ అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్స్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ డా. ప్రశాంత్ మాథుర్ నేచర్ జర్నల్‌తో చెప్పారు.
ఉప్పు తక్కువైతే..
సాధారణంగా ఉప్పు ఎక్కువగా తీసుకోవడం గురించే తరచూ వింటుంటాం. కానీ, ఉప్పు తక్కువైనా సమస్యే.
రక్తంలో సోడియం స్థాయిలు పడిపోయినప్పుడు ఇన్సులిన్ హార్మోన్ నుంచి వచ్చే సంకేతాలకు రక్తకణాలు సరిగా స్పందించవు. ఫలితంగా రక్తంలో ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. ఇదే మధుమేహానికీ దారితీయొచ్చు.
మరోవైపు ఉప్పు తక్కువగా తీసుకుంటే రక్తపోటు కూడా తగ్గుతుంది. ఇది మరీ తగ్గిపోయినా ప్రమాదమే.
ఆహారంలో ఉప్పు తక్కువైతే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా పెరుగుతాయని 2003లో నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది.
అయితే, మన దేశంలో ఉప్పు తక్కువ తీసుకోవడం కంటే అతిగా తీసుకోవడమే ఎక్కువని విజయవాడకు చెందిన న్యూట్రీషనిస్టు బీ రోహిణి చెప్పారు.
ఒక గ్రాము ఎక్కువైతే..
ఉప్పును విపరీతంగా తీసుకుంటే అధిక రక్తపోటు, గుండె పోటు, గుండె విఫలం కావడం, పక్షవాతం, కాలేయం విఫలం, కిడ్నీ వ్యాధులు లాంటి చుట్టుముడతాయని లాన్సెట్ నిర్వహించిన అధ్యయనంలోనూ తేలింది.
భారత్‌తోపాటు 18 దేశాలకు చెందిన 95,700 మందిపై ఈ అధ్యయనం నిర్వహించారు. దీనిలో సోడియం రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ తీసుకునేవారిలో సగటున ఒక్కో గ్రాము సోడియం తీసుకున్నప్పుడు రక్తపోటు 2.86 ఎంఎంహెచ్‌జీ పెరుగుతుందని తేలింది.
ఇక్కడ ఐదు గ్రాముల సోడియం అంటే 12.5 గ్రాముల ఉప్పు. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన 2 గ్రాముల సోడియం (5 గ్రాముల ఉప్పు) కంటే రెండున్నర రెట్లు ఎక్కువ.
దీన్ని తగ్గించుకోవడం ఎలా?
ముఖ్యంగా ప్రాసెస్డ్ ఫుడ్స్‌పై మనం ఎక్కువ దృష్టి పెట్టాలని న్యూట్రీషనిస్టు రోహిణీ చెప్పారు.
‘‘వాస్తవానికి మనం ఎంత ఉప్పు తీసుకుంటున్నామో గమనించం. దీన్ని ఈ రోజు నుంచే గమనించడం మొదలుపెట్టాలి. మన తీసుకునే ఫుడ్ ప్యాకెట్ లేబుల్‌పై ఎంత ఉప్పు ఉందో కూడా చదవాలి’’ అని ఆమె చెప్పారు.
‘‘సాధారణంగా ఒక చిప్స్ ప్యాకెట్‌లో మన రోజు మొత్తానికి అవసరమైన సాల్ట్ ఉంటుంది. రెండు నిమిషాల్లో తయారయ్యే నూడుల్స్, ఇతర ఫాస్ట్‌ఫుడ్స్‌లోనూ అంతే. వీటికి అదనంగా మన భోజనంలో సాల్ట్ కూడా కలిస్తే చాలా ఎక్కువ డోసు అయిపోతుంది’’ అని ఆమె వివరించారు.
లో-సోడియం సాల్ట్ కూడా అంతే..
ఊరగాయలు, చట్నీలు, అప్పడాలు లాంటివి ఎంత తగ్గించుకుంటే అంత మంచిదని ఆమె సూచించారు. ముఖ్యంగా ఆహార పదార్థాలపై అదనంగా ఉప్పు చల్లుకోవడం తగ్గించాలని అన్నారు.
మార్కెట్‌లో లభించే లో-సోడియం సాల్ట్‌తోనూ ముప్పేనని ఆమె అన్నారు. ‘‘సాధారణంగా ఇలాంటి ఇలాంటి సాల్ట్‌లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఎక్కువగా తీసుకుంటే హుండెకు ముప్పే’’ అని ఆమె అన్నారు.
ఆహారంలో ఉప్పు ఎక్కువగా వేసుకోవాలనే కోరిక తగ్గాలంటే నిమ్మ నారింజ, పుదీనా లాంటివి వేసుకొని నీటిని తాగాలని ఆమె సూచించారు. ‘‘చివరగా ఒక మాట చెప్పాలంటే.. ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకోమని చెబుతాను. దీని వల్ల ఒక సోడియం మాత్రమే కాదు, చాలా అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు’’ అని ఆమె వివరించారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire