Blood Pressure: బీపీ చెక్ చేస్కో ఇండియా...

Blood Pressure
x

Blood Pressure: బీపీ చెక్ చేస్కో ఇండియా...

Highlights

బీపీ చెకప్ లో దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. కేరళలో 89 శాతం,తమిళనాడు, పాండిచ్చేరిలో 83 శాతం మంది బీపీని చెక్ చేసుకుంటారు.

Blood Pressure: బ్లడ్ ప్రెషర్ ఎప్పుడూ కంట్రోల్లో ఉండాలి. లేదంటే హార్ట్ ప్రాబ్లమ్ రావచ్చు. అందుకే, రక్తపోటు కరెక్టుగా ఉందో లేదో చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. తేడాగా ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి, అవసరమైన మందులు తీసుకోవడం ప్రారంభించాలి.

కానీ, ఇండియాలో ఈ అవగాహన చాలా మందికి లేదని తాజా నివేదికలు వెల్లడి చేస్తున్నాయి. భారతదేశంలో బీపీ చెక్ చేసుకోని వారి సంఖ్య 30 శాతం కన్నా ఎక్కువేనని ఐసీఎంఆర్ నివేదిక తెలిపింది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఈ రిపోర్ట్ ను విడుదల చేసింది. గుండెజబ్బులకు రక్తపోటు ప్రధాన కారణం. అయితే బీపీ చెకప్ విషయంలో నిర్లక్ష్యంగా ఉండడం కూడా కొన్ని సమయాల్లో ప్రాణాపాయానికి దారితీసే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

బీపీ చెకప్ లో దక్షిణాది రాష్ట్రాలు టాప్

బీపీ చెకప్ లో దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. కేరళలో 89 శాతం,తమిళనాడు, పాండిచ్చేరిలో 83 శాతం మంది బీపీని చెక్ చేసుకుంటారు. కానీ, దీనికి విరుద్దంగా మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, రాజస్తాన్, గుజరాత్, నాగాలాండ్ ,ఒడిశా, జార్ఖండ్ లలో 58 నుంచి 64 శాతం మంది బీపీ చెకప్ చేసుకుంటున్నారు.

ఇక దేశ సగటున 76 శాతం. దేశంలోని ప్రతి పది మందిలో ముగ్గురు బీపీ చెక్ చేసుకోవడం లేదు. 18 ఏళ్ల నుంచి 54 ఏళ్ల మధ్య వయస్సున్నవారిలో ఐసీఎంఆర్ సర్వే నిర్వహించింది.

బీపీ అంటే ఏంటి?

శరీరం మొత్తానికి రక్తాన్ని పంప్ చేయడానికి గుండె ఉపయోగించే శక్తిని కొలిచే పద్దతినే బీపీ లేదా రక్తపోటుగా పిలుస్తారు. బీపీని మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యురీలో కొలుస్తారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి బీపీ 120/80ఎంఎంహెచ్ గా ఉంటుంది.

అయితే, ఇది 140/90 దాటితే దీన్ని హై బీపీగా చెబుతారు. రక్తపోటు 90/60 కంటే తక్కువగా ఉంటే దాన్ని లోబీపీగా పరిగణిస్తారు. గుండెకు దగ్గరగా ఉన్నప్పుడు రక్తం వేగంగా ప్రవహిస్తుంది. అది దూరంగా వెళ్లే కొద్దీ వేగం తగ్గుతుంది. ఆ తర్వాతే ఇది సిరల్లోకి వెళ్తుంది. శరీరంలోని ధమనుల్లో ఉన్న పీడనం ఆధారంగా రక్తపోటును గుర్తిస్తారు. అయితే శరీరం మొత్తం ఇది ఒకేలా ఉండదు.

బీపీ ఎందుకు చెక్ చేసుకోవాలి?

బీపీని తరచుగా చెక్ చేసుకోవడంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. హైపర్ టెన్షన్ ను ముందుగా గుర్తిస్తే గుండె జబ్జులను , కిడ్నీ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. రక్తపోటును అదుపులో ఉంచుకొంటేనే తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు.

ఎప్పుడు బీపీ చెక్ చేసుకోవాలి

బీపీ చెకప్ చేసుకోవడానికి అరగంట ముందు వరకు పొగాకు, ఆల్కహాల్ తీసుకోవద్దు. అంతేకాదు భోజనం కూడా చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు. మూత్రాశయం నిండుగా ఉన్నా కూడా బీపీ ఎక్కువగా చూపించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

బీపీ ఎక్కువ ఉన్నవాళ్లు ప్రతి రోజూ రెండుసార్లు చెకప్ చేసుకోవాలి. ఉదయం టిఫిన్ కు ముందు, సాయంత్రం మరోసారి బీపీ చెకప్ చేసుకోవాలి. అంతేకాదు ప్రతిరోజూ ఒకే సమయంలో బీపీ చెకప్ చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

మారిన జీవనశైలి, ఆహార అలవాట్లు ప్రస్తుతం మనిషి రక్తపోటును ప్రభావితం చేస్తున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా హైబీపీకి గురయ్యేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా బీపీని కంట్రోల్ ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories