రాత్రి చేయకూడని 8 పనులు ఇవే

రాత్రి చేయకూడని 8 పనులు ఇవే
x
Highlights

Sleeping tips in Telugu: కొన్ని పనులు రాత్రిపూట చేయకూడదు. రాత్రిపూట హాయిగా ఉండాలంటే కొన్ని పాత అలవాట్లు వదిలించుకోవాలి.

Sleeping tips in Telugu: కొన్ని పనులు రాత్రిపూట చేయకూడదు. రాత్రిపూట హాయిగా ఉండాలంటే కొన్ని పాత అలవాట్లు వదిలించుకోవాలి. పగలంతా కష్టం చేసి ఇంటికి వచ్చాక, రాత్రి సుఖంగా నిద్రపోవడం వల్ల శరీరానికే కాదు, మెదడుకు కూడా కొత్త శక్తి వస్తుంది. కానీ, ఈ రోజుల్లో చాలా మందికి రాత్రి పూట నిద్ర సరిగా పట్టడం లేదు. రాత్రి పూట ప్రశాంతంగా ఉండాలంటే ఈ ఎనిమిది పనులు చేయాలని స్లీప్ స్పెషలిస్టులు చెబుతున్నారు.

1. స్క్రీన్ టైమ్ తగ్గించండి:

ఎలక్ట్రానికి పరికరాలతో గడిపే సమయాన్ని తగ్గించండి. స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్స్ లేదా కంప్యూటర్ తో గడపడం తగ్గించాలి. కనీసం, నిద్ర పోవడానికి ముందు ఒక గంట సేపు వాటికి దూరంగా ఉండండి. చక్కని నిద్రకు శరీరంలో మెలటోనిన్ విడుదల కావాలి. ఈ ఎలక్ట్రానికి డివైసెస్ వాడడం వల్ల, వాటి నుంచి వచ్చే బ్లూ లైట్ ఈ మెలటోనిన్ హార్మోన్ మీద దుష్ప్రభావం చూపిస్తుంది.

2. కెఫీన్ లేదా స్టిమ్యులంట్స్ వాడకండి:

సాయంత్ర వేళల్లో కాఫీ, టీ లేదా ఇతర ఎనర్జీ డ్రింక్స్ ఏవీ తాగవద్దు. కెఫీన్ ఉత్ప్రేరకం కాబట్టి అది నిద్రను చెడగొడుతుంది.

3. ఎక్కువ తినొద్దు:

నిద్రపోవడానికి ముందు అతిగా తినవద్దు. కడుపులో ఎక్కువ ఆహారం ఉంటే శరీరం దాన్ని అరిగించుకునేందుకు అవస్థ పడుతుంది. జీర్ణక్రియ నెమ్మదించడం వల్ల నిద్ర దూరమవుతుంది.

4. ఆల్కహాల్ తాగవద్దు:

మద్యం తాగితే మొదట్లో బాగానే అనిపించవచ్చు. నిద్ర మత్తు ముంచుకొచ్చిన ఫీలింగ్ రావచ్చు. కానీ, మత్తు వేరు ఆరోగ్యవంతమైన నిద్ర వేరు. మద్యం వల్ల స్లీప్-సైకిల్ దెబ్బ తింటుంది. క్రమక్రమంగా నిద్రలేమి సమస్య పెరుగుతుంది.

5. కఠినమైన వ్యాయామం వద్దు:

క్రమం తప్పకుండా రోజూ చేసే వ్యాయామం వల్ల రాత్రి పూట చక్కగా నిద్రపడుతుంది. కానీ, నిద్రపోవడానికి ముందు అతిగా వ్యాయామం లేదా వర్కవుట్స్ చేస్తే బాడీ స్టిమ్యులేట్ అయి, నిద్ర చెడిపోతుంది.

6. సాయంత్రాల్లో నిద్ర పోవద్దు:

మధ్యాహ్నం కాసేపు కునుకు తీస్తే మంచిదే. కానీ, సాయంత్రం 4, 5 గంటల తరువాత కునుకు తీయడం మానుకోవాలి. అలా చేయడం వల్ల రాత్రి నిద్ర పట్టని పరిస్థితి ఎదురవుతుంది. పగటి పూట కాస్త విశ్రాంతి కావాలనుకుంటే లంచ్ చేసిన కాసేపటి తరువాత ఓ పావు గంటో అరగంటో కునుకు తీయండి. సాయంత్రాల్లో మాత్రం ఆ పని చేయకండి.

7. ఒత్తిడి కలిగించే పనులు చేయొద్దు:

రాత్రి పూట నిద్ర పోవడానికి ముందు ఒత్తిడితో కూడుకున్న పనుల జోలికి వెళ్ళకండి. అలాంటి పనులకు బదులు ఆహ్లాదాన్నిచ్చే పుస్తకాలు చదవండి. వెచ్చని నీటితో స్నానం చేయండి. విశ్రాంతిగా గడపండి.

8. మరీ కాంతిమంతంగా ఉండే లైట్లు వద్దు:

పడుకునే గదిలో బ్రైట్ లైట్స్ ఉంటే మెలటోనిన్ హార్మోన్ విడుదల తగ్గిపోతుంది. నిద్రపోవడానికి కాస్త ముందు నుంచే గదిలో డిమ్ లైట్ వేసుకోండి. దానివల్ల శరీరానికి నిద్రకు సంబంధించిన సంకేతాలు అందుతాయి. కాసేపటికి, పడక ఎక్కితే హాయిగా నిద్రపడుతుంది.

ఈ ఆరోగ్య సూత్రాలతో పాటు ప్రతి వ్యక్తికీ కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ఎవరికి వారు తమ శరీరం ఎలాంటి పరిస్థితులకు ఎలా స్పందిస్తుందో తెలుసుకుని మసలుకోవాలి. శరీరం సహజ సిద్ధంగా కోరుకునే వాతావరణాన్ని కల్పించుకోవాలి. నిద్రపట్టని సమస్య చాలా రోజులుగా ఉంటే మాత్రం వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories