Top 6 News Of The Day: నాగార్జునకు కౌంటర్ ఇచ్చిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. మరో 5 ముఖ్యాంశాలు

Top 6 News Of The Day: నాగార్జునకు కౌంటర్ ఇచ్చిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. మరో 5 ముఖ్యాంశాలు
x
Highlights

1) ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై స్పందించిన నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై సినీ నటుడు నాగార్జున స్పందించారు. ఎలాంటి నోటీసులు...

1) ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై స్పందించిన నాగార్జున

ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై సినీ నటుడు నాగార్జున స్పందించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కోర్టు స్టే ఇచ్చిన అంశంపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుని కూల్చివేతలు చేపట్టడం బాధాకరం అని అన్నారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ వివాదం ఇంకా కోర్టులోనే ఉంది. కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌ సెంటర్‌ని కూల్చివేశారు. మా పరువు ప్రతిష్టలు కాపాడుకోవడం కోసం, కొన్ని వాస్తవాలను అందరి ముందు బయటపెట్టడం అవసరం అనిపించి ఈ ప్రకటన చేస్తున్నాను. అంతేకాకుండా నాగ్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసి మధ్యంతర స్టే కూడా తెచ్చుకున్నారు. నాగార్జున ప్రకటన పూర్తి సారాంశం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2) ఎన్ కన్వెన్షన్ సెంటర్‌కి ఎలాంటి స్టే లేదు.. అంతా మానిపులేషనే.. రంగనాథ్ సంచలన విషయాలు వెల్లడి

ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ కూల్చివేత వివాదం కోర్టుకెక్కిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ తాజాగా ఈ అంశంపై స్పందించారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్‌కి కోర్టు నుండి గతంలో ఎలాంటి స్టే లేదని రంగనాథ్ స్పష్టంచేశారు. రంగనాథ్ ప్రెస్ రిలీజ్ ద్వారా ఇంకొన్ని సంచలన విషయాలు వెల్లడించారు. తమ్మిడికుంట చెరువు ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను తొలగించడం జరిగింది. అలా కూల్చేసిన ఎన్నో అక్రమ కట్టడాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూడా ఒకటి అని రంగనాథ్ చెప్పుకొచ్చారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటూ అక్రమ పద్ధతిలో నిర్మించిన నిర్మాణాల్లో వ్యాపారం కొనసాగిస్తోంది. ఏ.వి. రంగనాథ్ చెప్పిన పూర్తి సంచలన విషయాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

3) నెయిల్ కట్టర్స్‌తో దాడి చేశారు.. కేటీఆర్ ప్రెస్ మీట్

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విషయంలో తాను చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ మహిళా కమిషన్ ఎదుట వివరణ ఇచ్చారు. మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరైన కేటీఆర్.. కమిషన్ ఎదుట జరిగిన పరిణామాలను మీడియాకు వివరించారు. అయితే అదే సమయంలో కాంగ్రెస్ మహిళా నేతలు జనాన్ని వెంటేసుకుని వచ్చి తన వెంట వచ్చిన మహిళా ప్రజాప్రతినిధులపై దాడి చేశారని కేటీఆర్ ఆరోపించారు. ఈ దాడి కోసం నెయిల్ కట్టర్స్ ఉపయోగించడం మరింత దారుణం అని ఆవేదన వ్యక్తంచేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

4) ఫోన్ ట్యాపింగ్ కేసుపై స్పందించిన హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని...కేసులో కీలక నిందితులను ఇప్పటికే అరెస్టు చేశామని తెలిపారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులపై... రెడ్ కార్నర్ నోటీసులను జారీ చేయాలని సీబీఐ డైరెక్టర్‌ని కోరామన్నారు. సీబీఐ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసిన తర్వాత వారిని దేశానికి తీసుకొస్తామని అన్నారు. ఈ కేసులో ఎవరికి సంబంధం ఉన్నా వారిని విచారిస్తామని సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి స్పష్టం చేశారు.

5) ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భట్టి విక్రమార్క భేటి

తెలంగాణ ఆర్థిక పరిస్థితిని వివరించి.. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరాం అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మొత్తం 8 అంశాలను ఆర్ధికమంత్రి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. విభజన చట్టంలోని నిధుల పంపకం త్వరితగతిన చేయాలని కోరినట్టు వెల్లడించారు భట్టి. గత ప్రభుత్వం చేసిన అప్పులు రాష్ట్రానికి భారంగా మారాయని, ప్రతినెలా జీతాలకంటే ఎక్కువగా అప్పులు, వాటి వడ్డీలు చెల్లించేందుకే పోతున్నాయని తెలిపారు. చెరువులు, కొండలను కాపాడాలనేదే తమ లక్ష్యమని, హైడ్రాకు ప్రజలు సహకరించాలని భట్టి కోరారు. చట్టం ప్రకారమే నిర్ణయాలు ఉంటాయన్నారు. లెక్కలతో సహా ఎన్ని చెరువులు కబ్జాకు గురి అయ్యాయో ప్రజల ముందు పెడతాం అన్నారు డిప్యూటీ సీఎం భట్టి.

6) కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో పాలిగ్రాఫ్ టెస్టులు

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనపై సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో విచారణ ఎదుర్కుంటున్న ఆరుగురికి శనివారం పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ఉండగా ఘటన జరిగిన సమయంలో కాలేజ్ ప్రిన్సిపల్ గా ఉన్న సందీప్ ఘోష్, ఆరోజు డ్యూటీలో ఉన్న మరో నలుగురు వైద్యులకు ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories