TOP 6 News Of The Day : వాళ్లకు కూడా రుణమాఫీ.. మరో 5 ముఖ్యాంశాలు

TOP 6 News Of The Day : వాళ్లకు కూడా రుణమాఫీ.. మరో 5 ముఖ్యాంశాలు
x
Highlights

వాళ్లకు కూడా రుణమాఫీ: మంత్రి ఉత్తమ్ ఇప్పటివరకు రుణమాఫీ జరగని రైతులు అసలు తమ రుణాలు మాఫీ అవుతాయా లేదా అనే అయోమయంలో ఉన్నారు. ఇదే విషయమై వారు సంబంధిత...

వాళ్లకు కూడా రుణమాఫీ: మంత్రి ఉత్తమ్

ఇప్పటివరకు రుణమాఫీ జరగని రైతులు అసలు తమ రుణాలు మాఫీ అవుతాయా లేదా అనే అయోమయంలో ఉన్నారు. ఇదే విషయమై వారు సంబంధిత పత్రాలు పట్టుకుని బ్యాంకులు, వ్యవసాయ శాఖ అధికారులు, తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. కాగా తాజాగా ఇదే విషయంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. సాంకేతిక కారణాల వల్ల కొంతమంది రైతులకు రుణమాఫీ అందలేదని, కానీ త్వరలోనే ఆ సాంకేతిక సమస్యలు పరిష్కరించి వారికి కూడా రుణమాఫీ వర్తింపజేస్తాం అని మంత్రి ఉత్తమ్ క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ లోని జలసౌధ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ మంత్రి ఉత్తమ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఫుడ్ పాయిజన్ కారణంగా నలుగురు విద్యార్థులు మృతి

అనాథ ఆశ్రమంలో రెండు రోజుల క్రితం కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థుల్లో నలుగురు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన అనకాపల్లి జిల్లా కోటఊరట్ల మండలం కైలాస పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. అనాథ ఆశ్రమంలో సమోస తిన్న 27 మంది పిల్లలు అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. వారిలో నలుగురి పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ప్రతి నలుగురిలో ఒక ఆంధ్రా వ్యక్తి : చంద్రబాబు

1991 లో ఆర్థిక సంస్కరణలు మొదలుకాగా.. దేశం ఐటి రంగంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది అని తాను ఆనాడే చెప్పానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అప్పట్లోనే విదేశాలకు వెళ్లి పెట్టుబడులు తెచ్చానని గుర్తుచేసుకున్నారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా భారతీయులు ఉంటారు. ప్రపంచంలో ప్రతీ నలుగురు ఐటి నిపుణుల్లో ఒక భారతీయుడు ఉంటారు. అలాగే ప్రతీ నలుగురు ఐటి నిపుణుల్లో ఒక ఏపీ వ్యక్తి ఉంటారు అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తిరుపతి జిల్లా శ్రీసిటీలో జరిగిన పలు కంపెనీల ప్రారంభోత్సవాలకు హాజరైన చంద్రబాబు అక్కడి పారిశ్రామిక వేత్తలతో సమావేశమైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

సిద్ధరామయ్యకు ఊరట

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆ రాష్ట్ర హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ స్థలాల కేటాయింపు స్కామ్ కేసు విషయంలో సీఎం సిద్ధరామయ్యను ప్రశ్నించేందుకు రాష్ట్ర గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గవర్నర్ ఆదేశాలను రద్దు చేయాల్సిందిగా కోరుతూ సీఎం సిద్ధరామయ్య హై కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. గవర్నర్ ఇచ్చిన ఉత్తర్వులు సరైన అవగాహన లేకుండా జారీ చేసినవి అని సిద్ధరామయ్య తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై స్పందించిన హై కోర్టు.. ఆగస్ట్ 29 వరకు ముఖ్యమంత్రిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ట్రయల్ కోర్టును ఆదేశించింది.

నామినేషన్ దాఖలు చేసిన అభిషేక్ సింఘ్వి

అభిషేక్ సింఘ్వి రాజ్యసభ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణ నుండి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. కే కేశవరావు బీఆర్ఎస్ పార్టీ నుండి బయటికి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఆయన తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడి నుండి రాజ్యసభ ఉపఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేశవరావు రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సభ్యుడి ఉప ఎన్నికకు అభిషేక్ మను సింఘ్వీ పేరును ప్రతిపాధిస్తూ తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ తీర్మానం చేసింది. నిన్న ఆదివారం నానక్రాంగూడలోని ఓ హోటల్లో భేటీ అయిన సీఎల్పీ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయానికి తమ మద్దతు తెలియజేస్తున్నట్లు ప్రకటించింది.

హైదరాబాద్‌లో భారీవర్షం

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భార వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం మొదలైన వర్షం కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం వరకు కురుస్తూనే ఉంది. దీంతో అనేక ప్రాంతాల్లో వరద నీరు రోడ్లపైకి చేరుకుని రహదారులు చెరువులు, కంటలను తలపించాయి. రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా మెహిదీపట్నం, టోలిచౌకి, గచ్చిబౌలి, ఫిలింనగర్, జూబ్లిహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో వర్షం ప్రభావం అధికంగా కనిపించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories