TOP 6 News Of The Day: రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ.. మరో 5 ముఖ్యాంశాలు

TOP 6 News Of The Day: రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ.. మరో 5 ముఖ్యాంశాలు
x
Highlights

1) కోల్‌కతా డాక్టర్ రేప్, మర్డర్ కేసు లేటెస్ట్ అప్‌డేట్స్ కోల్‌కతా డాక్టర్ రేప్, మర్డర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుని సుమోటోగా...

1) కోల్‌కతా డాక్టర్ రేప్, మర్డర్ కేసు లేటెస్ట్ అప్‌డేట్స్

కోల్‌కతా డాక్టర్ రేప్, మర్డర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుని సుమోటోగా తీసుకుంటున్నట్టు ప్రకటించిన సుప్రీం కోర్టు.. ఆగస్టు 20న విచారణ చేపట్టనున్నట్టు స్పష్టంచేసింది. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆగస్టు 20న ఈ కేసు విచారణ చేపట్టనుంది. ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్జీ కర్ హాస్పిటల్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు కారణమైంది.

2) బీఆర్ఎస్‌పై బండి సంజయ్ హాట్ కామెంట్స్

కేంద్రమంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ పార్టీపై హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ అవుట్‌‌డేటెడ్‌ పార్టీ అని.. కేసీఆర్, కేటీఆర్ పేరెత్తితే జనం రాళ్లతో కొట్టేపరిస్థితి ఉందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవసరం కాంగ్రెస్‌కే ఉందన్న ఆయన.. అవినీతి పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకోదన్నారు. రుణమాఫీ కాకపోవడంతో కాంగ్రెస్ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారని.. రుణమాఫీపై కాంగ్రెస్ మాట తప్పిందని విమర్శించారు. 6 గ్యారంటీలను కాంగ్రెస్‌ పక్కకు నెట్టిందన్న బండి సంజయ్.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ డ్రామాలాడుతున్నాయన్నారు.

3) జార్ఖండ్ రాజకీయాల్లో కలకలం రేపిన చంపై సోరెన్ ఢిల్లీ పర్యటన

ఝార్ఖండ్ రాజకీయాల్లో చంపై సోరెన్ ఢిల్లీ పర్యటన అలజడి రేపింది. చంపై సోరెన్ బీజేపీలో చేరతారని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అయితే బీజేపీలో చేరే వార్తలను చంపై సోరెన్ ఖండించారు. JMM పార్టీలోనే కొనసాగుతానని వెల్లడించారు. వ్యక్తిగత పనిపై ఢిల్లీ వచ్చానని స్పష్టం చేశారు. తాను ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నానో.. జీవితాంతం అదే పార్టీలో కొనసాగుతానని పేర్కొన్నారు.

4) కులగణన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు

హైదరాబాద్ రవింద్ర భారతిలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, బ్రిటీషోళ్లకు ఎదురొడ్డి నిలిచిన గొప్ప పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గురించి భవిష్యత్ తరాలకు తెలిసేలా ఆయన స్వగ్రామమైన ఖిలా షాపూర్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. అందుకోసం ప్రభుత్వం రూ. 4.70 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇక ఇదే సభలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, కులగణన పూర్తి చేసిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన గౌడ సోదరులను ఉద్దేశించి మాట్లాడుతూ మంత్రి పొన్నం ఈ వ్యాఖ్యలు చేశారు.

5) రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేకు కేటీఆర్ లేఖ

రుణమాఫీ పేరుతో తెలంగాణలో అధికారంలో ఉన్న మీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆరోపిస్తూ ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ లేఖ రాశారు. "రుణమాఫీ నిబంధనలలో రకరకలా షరతులు పెట్టిన ప్రభుత్వం.. కేవలం 40 శాతం మంది రైతులకే రుణమాఫీ చేసి, రైతులకు అందరికీ చేసినట్లు చెప్పుకుంటోంది" అని ఆ లేఖలో పేర్కొన్నారు.

6) యూపీఎస్సీ కాదు.. ఆర్ఎస్ఎస్ - కేంద్రంపై రాహుల్ గాంధీ సెటైర్స్

కేంద్రంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి నిప్పులు చెరిగారు. కేంద్రం ప్రభుత్వంలోని కీలకమైన అధికారులను యూపీఎస్సీ ద్వారా వచ్చిన వారిని కాకుండా ఆర్ఎస్ఎస్ ద్వారా భర్తీ చేస్తోంది అని మండిపడ్డారు. ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ.. " కేంద్రం వైఖరికి ప్రత్యక్ష ఉదాహరణ సెబీ చైర్‌పర్సన్‌గా బయటి వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టడం" అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుత సెబీ చీఫ్ మాధవి పురి బుచ్ సహాయంతో గౌతం అదాని అక్రమ పద్ధతుల్లో భారీ మొత్తంలో ఆస్తులు కూడబెట్టారని హిడెన్‌బర్గ్ విడుదల చేసిన నివేదిక సంచలనం సృష్టించిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ ట్వీట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories