Top 6 News Of The Day: సిద్ధిపేటలో పోలీసులు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తోపులాట.. మరో 5 ముఖ్యాంశాలు

Top 6 News Of The Day: సిద్ధిపేటలో పోలీసులు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తోపులాట.. మరో 5 ముఖ్యాంశాలు
x
Highlights

1) సిద్ధిపేటలో పోలీసులు vs కాంగ్రెస్ సిద్ధిపేటలో హరీష్ రావు రాజీనామాకు డిమాండ్ చేస్తూ ఫ్లెక్సీలు వెలిసినప్పటి నుండి అక్కడ హైటెన్షన్ వాతావరణం...

1) సిద్ధిపేటలో పోలీసులు vs కాంగ్రెస్

సిద్ధిపేటలో హరీష్ రావు రాజీనామాకు డిమాండ్ చేస్తూ ఫ్లెక్సీలు వెలిసినప్పటి నుండి అక్కడ హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ముఖ్యంగా ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ వద్ద కేసీఆర్ ఫ్లెక్సీ చించివేత అనంతరం కాంగ్రెస్ vs బీఆర్ఎస్ వివాదం మరింత ముదిరింది. మంగళవారం రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మైనంపల్లి హన్మంత రావు పొన్నాల చౌరస్తాలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులర్పించి అక్కడి నుండి సిద్ధిపేట టౌనులోకి ర్యాలీగా బయల్దేరారు. ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ ముందు నుండి వెళ్లేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించారు. అయితే, అదే సమయంలో అక్కడ బీఆర్ఎస్ సమావేశం జరుగుతోంది. రుణమాఫీ కానీ రైతుల సమస్యను ఎలా పరిష్కరించాలి అనే అంశంపై మాట్లాడేందుకు బీఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారు. అలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఒక్కచోటకి వస్తే పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందనే భయంతో పోలీసులు కాంగ్రెస్ ర్యాలీని అడ్డుకుని మరో దారిగుండా వెళ్లాల్సిందిగా సూచించారు. అందుకు కాంగ్రెస్ శ్రేణులు ఒప్పుకోకపోవడంతో అక్కడ పోలీసులకు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసుల ఎంతకీ ఒప్పుకోకపోవడంతో చివరకు కాంగ్రెస్ శ్రేణులు మరో రహదారిలో తమ ర్యాలీని తీసుకువెళ్లాల్సి వచ్చింది.

2) కోల్‌కతా కేసులో దీదీ సర్కారుపై సుప్రీం కోర్టు సీరియస్..

కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసును సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. ముందుగా పశ్చిమ బెంగాల్ సర్కురుపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఘటనపై అనేక ప్రశ్నలు సంధించింది. అంతేకాకుండా దేశంలో వైద్యులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకునేందుకు కొత్తగా నేషనల్ టాస్క్‌ఫోర్స్ ఆఫ్ డాక్టర్స్ పేరిట ఓ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ బృందాన్ని మూడు వారాల్లోగా మధ్యంతర నివేదిక అందించాలని.. అలాగే రెండు నెలల్లో పూర్తి నివేదిక అందించాలని సుప్రీం కోర్టు స్పష్టంచేసింది. ప్రస్తుతం ఉన్న చట్టాలు వైద్యులపై దాడులను నిలువరించలేకపోతున్నాయని.. అందుకే కొత్తగా నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. వైద్యుల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ నేషనల్ టాస్క్‌ఫోర్స్ సిఫార్సులు చేస్తుంది అని సుప్రీం కోర్టు పేర్కొంది.

3) కవితకు మళ్లీ తప్పని నిరాశ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ, సీబీఐ నుండి విచారణ ఎదుర్కుంటూ తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ విషయంలో మరోసారి నిరాశే ఎదురైంది. కవితకు బెయిల్ ఇవ్వలేమని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆగస్టు 8న ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

అయితే, ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న సీబీఐ, ఈడీ వాదనలు వినకుండా బెయిల్ ఇవ్వలేం అని తేల్చిచెప్పిన సుప్రీం కోర్టు.. ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 27వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఈ కేసులో ఇప్పటికే సుప్రీం కోర్టు అఫిడవిట్ దాఖలు చేసినప్పటికీ.. ఈడీ ఇంకా తన అఫిడవిట్ దాఖలు చేయకపోవడంతో శుక్రవారంలోగా ఆ పని పూర్తి చేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఈడీకి స్పష్టంచేసింది.

4) హమ్ సాత్ సాత్ హై.. సిద్ధరామయ్యకు అండగా డికే శివకుమార్

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను డిప్యూటీ సీఎం డికే శివకుమార్ వెనకేసుకొచ్చారు. సిద్ధరామయ్యకు మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ స్కామ్‌తో ఎలాంటి సంబంధం లేదని, రాజకీయ లబ్ధి కోసమే బీజేపి ఈ డ్రామాలాడుతోంది అని మండిపడిన డికే శివకుమార్.. బీజేపి నేతలను గుంట నక్కలతో పోల్చారు. సీఎం సిద్ధరామయ్య తప్పు చేశారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని, కాంగ్రెస్ పార్టీ 100 శాతం ఆయన వెంటే అండగా ఉందని స్పష్టంచేశారు.

5) లేటెరల్ ఎంట్రీ ప్రకటనను వెనక్కి తీసుకున్న UPSC

కేంద్రం ఇచ్చిన ఆదేశాలతో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేటెరల్ ఎంట్రీ ప్రకటనను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 17న విడుదల చేసిన నోటిఫికేషన్ వెనక్కి తీసుకుంటున్నట్లుగా యూపీఎస్సీ తమ ప్రకటనలో పేర్కొంది. దీంతో వివిధ విభాగాల్లో జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ హోదాల్లో 45 మందిని నియామక ప్రక్రియ రద్దయింది. అంతకంటే ముందుగా రాహుల్ గాంధీ ఇదే లేటెరల్ ఎంట్రీ అంశాన్ని లేవనెత్తుతూ కేంద్రంపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కేంద్రంలోని కీలక పోస్టులను కేంద్రం లేటెరల్ ఎంట్రీ పేరుతో యూపీఎస్సీ ద్వారా కాకుండా ఆర్ఎస్ఎస్ నుండి భర్తీ చేస్తోంది అని రాహుల్ గాంధీ ఎక్స్ ద్వారా మండిపడ్డారు.

6) అట్టుడికిన బద్లాపూర్.. పట్టాలపై నిరసన ప్రదర్శన

మహారాష్ట్రలోని థానె జిల్లా బద్లాపూర్‌లోని ఓ పాఠశాలలో అటెండర్ ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన స్ఖానికంగా కలకలం సృష్టించింది. అక్కడి పిల్లల తల్లిదండ్రులు, స్థానికులు భారీ సంఖ్యలో రోడ్లు, రైలు పట్టాలపైకి చేరుకుని ధర్నాలు నిర్వహించారు. దీంతో ఆ ప్రాంతం ఆందోళనలతో అట్టుడికిపోయింది. ఈ ఘటన జరగక ముందువరకు ప్రశాంతంగా ఉన్న బద్లాపూర్‌లో పరిస్థితి ఒక్కసారిగా అదుపుతప్పిపోవడంతో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ఈ ఘటనపై స్పందించారు. నిందితులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. వెంటనే సిట్ ఏర్పాటు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసుపై విచారణ జరిపించనున్నట్లు హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories