Top 6 News Of The Day: BJP లోకి హరీష్ రావు వస్తే.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు.. మరో 5 ముఖ్యాంశాలు

Top 6 News Of The Day: BJP లోకి హరీష్ రావు వస్తే.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు.. మరో 5 ముఖ్యాంశాలు
x
Highlights

1) బీజేపీలోకి హరీష్ రావు వస్తే.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు బీజేపీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి హరీష్ రావు, రేవంత్ రెడ్డి.. ఇలా ఎవరొచ్చినా...

1) బీజేపీలోకి హరీష్ రావు వస్తే.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి హరీష్ రావు, రేవంత్ రెడ్డి.. ఇలా ఎవరొచ్చినా స్వాగతిస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు అని ఇటీవల రేవంత్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. బీజేపీలో బీఆర్ఎస్ నేతల చేరికల వార్తలపై గతంలో బీజేపి నేతలు స్పందిస్తూ.. అవినీతిపరులకు తమ పార్టీలో చోటు లేదని వ్యాఖ్యానిస్తూ వచ్చారు. అలాంటిది తాజాగా బండి సంజయ్ ఇలా చెప్పడం రాజకీయవర్గాల్లో చర్చనియాంశమవుతోంది. ఇదేకాకుండా జన్వాడ ఫామ్ హౌజ్ విషయంలో కేటీఆర్‌ని ఎద్దేవా చేస్తూ బండి సంజయ్ మరో వ్యాఖ్య చేశారు. ఫామ్ హౌజ్ విషయంలో కేటీఆర్ చాలా అమాయకంగా మాట్లాడుతున్నారని.. ఒకవేళ ఫామ్ హౌజ్ తనది కాకపోతే గతంలో రేవంత్ రెడ్డిపై ఎందుకు కేసు పెట్టారని ప్రశ్నించారు. అప్పుడు సొంతమైన ఫామ్ హౌజ్ ఇప్పుడు లీజు అయిందా అని కేటీఆర్‌ని నిలదీశారు.

2) ఫామ్ హౌజ్ కూల్చివేత అంశంపై కేటీఆర్ రియాక్షన్

జన్వాడ ఫామ్ హౌజ్ తనది కాదని.. తాను దానిని లీజుకు తీసుకున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. జన్వాడ ఫామ్ హౌజ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించి ఉంటే తానే దగ్గరుండి కూలగొట్టిస్తానని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఒకవేళ ఎఫ్‌టిఎల్ పరిధిలో ఆ ఫామ్ హౌజ్ నిర్మించి దానిని కూలగొట్టాల్సి వస్తే.. అందుకు తనకు అభ్యంతరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కేవీపీ రామచంద్ర రావు, పట్నం మహేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, మధు యాష్కీ గౌడ్ వంటి నేతల ఫామ్ హౌస్‌ల ఫామ్ హౌజులు కూడా ఎఫ్‌టిఎల్ పరిధిలో ఉన్నాయన్నారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి ఫామ్ హౌజ్ ఎక్కడ ఉందో కూడా తనకు తెలుసని చెబుతూ పరోక్షంగా వాటిపై చర్యలేవని ప్రశ్నించారు.

3) చంద్రబాబుకు గుడ్ న్యూస్.. వైసీపీకి బ్యాడ్ న్యూస్

ఔను.. ఒకే వార్త చంద్రబాబుకు గుడ్ న్యూస్ కాగా.. వైసీపీకి బ్యాడ్ న్యూస్ అయింది. ఓటుకు నోటు కేసులో సుప్రీం కోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పాత్రపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ని సుప్రీం కోర్టు కొట్టివేసింది. గతంలో హై కోర్టు ఇచ్చిన తీర్పునే సమర్ధించిన సుప్రీం కోర్టు.. రాజకీయంగా పగలు, ప్రతీకారాలు తీర్చుకోవడానికి కోర్టులను ఉపయోగించుకోవద్దని ఆళ్ల రామకృష్ణా రెడ్డిని మందలించింది. జస్టిస్ సుందరేష్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఆళ్ల రామకృష్ణా రెడ్డి పిటిషన్ విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఏపీ సీఎం చంద్రబాబుకు కొత్త తలనొప్పులు లేకుండా ఎంతో ఊరటనిచ్చేదే అని చెప్పుకోవచ్చు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

4) లండన్‌కి వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వండి.. సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్

లండన్‌లో ఉన్న తమ కూతురిని చూసేందుకు వెళ్లాలని.. అందుకోసం తనకు 20 రోజులు అనుమతి ఇవ్వండని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాంపల్లిలోని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణ ఎదుర్కుంటున్న జగన్.. కోర్టు అనుమతి లేనిదే దేశం దాటడానికి వీల్లేదు. అందుకే ఆయన ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, జగన్ కి అనుమతి ఇవ్వడానికి వీల్లేదని సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రస్తుతం కేసు విచారణ వేగవంతంగా జరుగుతున్నందున జగన్ విదేశాలకు వెళ్లడానికి అనుమతి ఇవ్వొద్దని సీబీఐ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఈ పిటిషన్‌పై ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్నట్టు సీబీఐ కోర్టు స్పష్టంచేసింది.

5) రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారు.. లెక్కలివిగో అంటున్న కేటీఆర్

రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు టోకరా పెట్టింది అని కేటీఆర్ ఆరోపించారు. తాజాగా తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. " రుణమాఫీ విషయంలో ప్రభుత్వం రైతులను మోసం చేసిందని అన్నారు. రేవంత్ రెడ్డి సర్కారు ప్రకటించిన రుణమాఫీ అందకపోవడం వల్ల రైతులే స్వయంగా రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్నారు. రైతులు గుండెలు మండి రాస్తారోకోలు చేస్తోంటే.. ప్రభుత్వం పోలీసులను పంపించి వారిని అరెస్టులు చేయిస్తోంది. అన్నదాతలపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. రైతులు రుణమాఫీ కోసం ధర్నాలు చేస్తుండగా.. పోలీసులు మాత్రం వారికి కనీసం 7 సంవత్సరాలు శిక్షపడేలా సెక్షన్ 126, రెండు సంవత్సరాలు శిక్షపడేలా సెక్షన్ 189, ఏడాది శిక్షపడేలా సెక్షన్ 223 కింద కేసులు పెట్టి వేధిస్తున్నారు" అని కేటీఆర్ మండిపడ్డారు. రైతులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలకు దిగాల్సిందిగా కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

6) పోలాండ్ చేరుకున్న ప్రధాని మోదీ

రెండు దేశాల పర్యటన నిమిత్తం ఢిల్లీ నుండి బయల్దేరి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ ముందుగా పొలాండ్ రాజధాని వార్సా చేరుకున్నారు. పోలాండ్ చేరుకున్న ప్రధానికి అక్కడ ఘన స్వాగతం లభించింది. గత 50 ఏళ్లలో పోలాండ్ పర్యటనకు వెళ్లిన తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు సొంతం చేసుకున్నారు. పొలాండ్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ అక్కడి నుండే ఉక్రెయిన్‌కి వెళ్లనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories