విజాయానికి 9 మెట్లు...ఇంతకీ జగన్ విజాయానికి ఆ తొమ్మిది మెట్లేవి?
రావాలి జగన్-కావాలి జగన్ అంటూ పాట హోరెత్తింది. జనం కూడా గెలవాలి జగన్, గెలుస్తాడు జగన్ అంటూ ఓట్ల వరద పారించారు. సీట్ల సునామీ సృష్టించారు. ఒక్క ఛాన్స్...
రావాలి జగన్-కావాలి జగన్ అంటూ పాట హోరెత్తింది. జనం కూడా గెలవాలి జగన్, గెలుస్తాడు జగన్ అంటూ ఓట్ల వరద పారించారు. సీట్ల సునామీ సృష్టించారు. ఒక్క ఛాన్స్ అంటూ అడిగిన జగన్‌కు, ఇదిగో అందుకో అంటూ యువనాయకుడికి వీరతిలకం దిద్దారు. ప్రత్యర్థుల ఊహకందని, ఎగ్జిట్‌పోల్స్‌కు అంచనాకు చిక్కని ఫలితాలు సాధించిన వైసీపీకి, ఇలాంటి ప్రభంజనం ఎలా సాధ్యమైంది నవరత్నాల్లాంటి తొమ్మది మెట్లున్నాయి వైసీపీ గ్రాండ్ విక్టరీకి ఇంతకీ జగన్ విజాయానికి ఆ తొమ్మిది మెట్లేవి?
1. ఒక్క ఛాన్స్ నినాదం
రావాలి జగన్..కావాలి జగన్
2. హామీలకు నీరాజనం
నవరత్నాలు
3. అభ్యర్థుల ఎంపికలో సామాజికాస్త్రం
బడుగులకు టికెట్లు
4. ప్రభుత్వ వ్యతిరేకతే ఆయుధం
బాబు వర్సెస్ జగన్
5. పాదయాత్ర ప్రభంజనం
ప్రజా సంకల్పం
6. తండ్రి వారసత్వం, విశ్వసనీయత
రాజన్న రాజ్యం
7. పీకే గైడెన్స్
8. హోదా
పట్టువదలని యోధ
9. తల్లి, చెల్లి అండగా
ప్రచార ప్రభంజనం
ఒక్క ఛాన్స్ నినాదం. ఆంధ్రప్రదేశ్ అంతటా మారుమోగింది. రావాలి జగన్, కావాలి జగన్ అంటూ హోరెత్తిన పాట, పిల్లలు, పెద్దలు, వృద్దులు ఇలా అందరి గుండెలనూ తాకింది. రాజన్న కుమారుడు జగన్‌కు ఒక్కసారైనా అవకాశమివ్వాలని జనం తపించారనడానికి ప్రభంజనంగా వీచిన ఫలితాలే నిదర్శనం. 2014లో కొద్ది ఓట్ల తేడాతో అధికారానికి దూరమైన వైసీపీ పట్ల, ప్రజలు సానుభూతి చూపారు. చంద్రబాబు పాలన చూశాం, ఒకసారి జగన్ అడ్మినిస్ట్రేషన్ చూద్దామని, రాజన్న పాలన అందిస్తాడేమోనని ఆశించారు. ఓట్ల వర్షం కురిపించాలని డిసైడయ్యారు.
2. హామీలకు నీరాజనం
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హామిలిచ్చాడు. నెరవేర్చాడు. జగన్ వాగ్దానమిస్తాడు. తండ్రిలానే తీరుస్తాడు. జనం ఇదే నమ్మారు. జగన్ ప్రకటించిన హామీలను మనసావాచా కర్మణా విశ్వసించారు. నవరత్నాలు అంటూ తొమ్మిది బలమైన హామిలిచ్చారు జగన్. ఎన్నికలకు రెండేళ్ల ముందే జనంలో వాటిని చర్చకు పెట్టారు. వీటికి తోడుగా పాదయాద్ర ముగింపు ఘట్టంలో హామీలవర్షం కురిపించారు. ప్రతి రైతుకి పెట్టుబడి కింద రూ.12,500, రైతు తరఫున ప్రభుత్వమే బీమా సొమ్ము చెల్లింపు, జీడి తోటలకు రూ.50 వేల పరిహారం, కొత్త జిల్లాల ఏర్పాటు, ప్రతి గ్రామంలో గ్రామ సెక్రటేరియట్, రూ.4వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల ఫండ్, అధికారంలోకి వచ్చిన నెల, రెండు నెలల్లోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ, డ్వాక్రా రుణాలు, వృద్దాప్య, వితంతు పెన్షన్ల రెట్టింపు, మరింత మెరుగ్గా ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్‌మెంట్, ఇలా చెప్పుకుంటూపోతే ఇంట్లో ముసలీముతక, పిల్లలు, తల్లిదండ్రులు ఇలా ప్రతి ఒక్కరికీ పథకాలు ప్రకటించారు. జనం వాటిని నమ్మారు. ఫ్యాను సునామీ సృష్టించారు.
3. అభ్యర్థుల ఎంపికలో సామాజికాస్త్రం
అభ్యర్థుల ఎంపికలో ఒకరకంగా జగన్‌వి సాహసోపేత నిర్ణయాలు. ప్రత్యర్థి పార్టీకి ఊహకందని వ్యూహమిది. ఉత్తరప్రదేశ్ తరహాలో సోషల్ ఇంజినీరింగ్‌కు పదునుపెట్టారు. ఒకవైపు ధనవంతులు, అగ్రకులాల అభ్యర్థులను టీడీపీ నిలబెడితే, మరోవైపు అదే బలమైనవారి మీద, బడుగులను బరిలో దించారు జగన్. అప్పటి వరకూ ఎవరికీ తెలియని, అసలు నియోజకవర్గంలో పెద్దగా ముఖ పరిచయమేలేని బీసీలు, ఎస్సీలు, మైనార్టీలకు చెందిన అపరిచిత అభ్యర్థులను నిలబెట్టాలని డేరింగ్ డాషింగ్‌గా నిర్ణయాలు తీసుకున్నారు. ఒకరకంగా కులాల ఏకీకరణ చేశారు. ఎలాగూ ఎస్సీలు, మైనార్టీలు, రెడ్డిలు తమ పార్టీ వైపే ఉంటారు కాబట్టి, టీడీపీకి బలమైన ఓటు బ్యాంకయిన బీసీలకు ఎక్కువ సీట్లిచ్చి, ఆ ఓట్లనూ ఫ్యాను కిందకు చేర్చారు. ఎన్టీఆర్ తర్వాత బీసీలకు, కొత్త ముఖాలకు సీట్లిచ్చిన నాయకుడిగా జగన్ చరిత్ర సృష్టించారు. అన్ని కులాలూ ఏకమయ్యాయి అనడానికి ఫలితాల నీరాజనమే నిదర్శనం.
4. ప్రభుత్వ వ్యతిరేకతే ఆయుధం
2014 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు, అమరావతి నిర్మాణంపై బాబు మాటలు, ఇలా ప్రభుత్వ వ్యతిరేకతపై, సందర్భమొచ్చినప్పుడల్లా సమరభేరి మోగించారు జగన్. రైతులు, డ్వాక్రా మహిళల రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, ఇలా బాబు ఇచ్చిన ప్రతి హామిని జనంలో లేవనెత్తారు జగన్. వాగ్దానాలు గాలికొదిలేశారని దుమ్మెత్తిపోశారు. ఇసుక ర్యాంపుల కుంభకోణం, రాజధాని భూముల సేకరణలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఇలా అనేక అంశాలపై జనంలో చర్చపెట్టారు. నివురుగప్పిన నిప్పులా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను మరింత మండించారు. ఈ రేంజ్‌లో సీట్ల వరద పారిందంటే, ఏ రేంజ్‌లో బాబు మీద వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చన్నది విశ్లేషకుల మాట. దాన్ని ఆయుధంగా మలచుకున్నారు జగన్.
5
. పాదయాత్ర ప్రభంజనం
జనంలో ఉన్నవాడే జననాయకుడు. నిత్యం ప్రజల్లో ఉండేవాడే ప్రజానేత. తండ్రి వైఎస్సార్ లక్షణాలు పుణికిపుచ్చుకున్న జగన్, నాన్నదారిలోనే పాదయాత్రతో జనంలోకి వెళ్లారు. అసెంబ్లీలో తన నోరు నొక్కేస్తున్నారంటూ, అసలు అసెంబ్లీకే పోకుండా జనంలోకే వెళ్లిపోయారు. అన్ని వర్గాల ప్రజలనూ పలకరించారు. దారిపొడవునా జనం కూడా నీరాజనం పలికారు. గోదావరి బ్రిడ్జి దాటిన సమయంలో జన సునామీ కనిపించింది. భారీ ఎత్తున జనం తరలివచ్చి, తమ సమస్యలు ఏకరువుపెట్టారు. వారందర్నీ పలకరిస్తూ, నేను విన్నాను, నేనున్నానంటూ భరోసా ఇచ్చారు జగన్. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా పాదయాత్ర చేసి, క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేశారు. అక్కడే అభ్యర్థులను కూడా డిసైడ్ చేశారు. అలా పాదయాత్ర, నేటి ప్రభంజనానికి బాటలు వేసింది.
6. తండ్రి వారసత్వం, విశ్వసనీయత
మీకు, చంద్రబాబుకు తేడా ఏంటని జాతీయ ఛానెల్స్, తెలుగు ఛానెల్స్ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు, జగన్ పదేపదే చెప్పిన సమాధానం విశ్వసనీయత. క్రెడిబిలిటీ. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడి వారసుడిగా, ప్రజలకిచ్చిన ప్రతి వాగ్దానమూ నెరవేరుస్తానని జనానికి నమ్మకం కలిగించారు జగన్. వైఎస్ పాలన చూసిన జనం, జగన్‌లోనూ అదే విశ్వసనీయత చూశారు. మాట ఇచ్చి తప్పే మనిషి కాదని విశ్వసించారు. అందుకే గెలిపించారు. తండ్రి వారసత్వం, విశ్వసనీయత జగన్ విజయానికి ఆరో మెట్టు.
7. పీకే గైడెన్స్
పీకే. ప్రశాంత్ కిశోర్. దేశంలోనే మోస్ట్ పాపులర్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్. ఈ రాజకీయ వ్యూహకర్త జగన్‌తో కలిశారు. జగన్ బలమేంటో, బలహీనతలేంటో స్టడీ చేశారు. గ్రౌండ్ లెవల్‌లో పార్టీ బలోపేతానికి ఎన్నో సూచనలు చేశారు. ఏయే నినాదాలు జనంలోకి ఎలా తీసుకెళ్లాలి, సోషల్ మీడియాను బలంగా ఎలా వాడాలి ప్రత్యర్థుల వ్యూహాలకు అనుగుణంగా ఎలాంటి ఎత్తులు వేయాలన్న అంశాలపై స్ట్రాటజీలు వేశారు. నవరత్నాలు, పాదయాత్ర, దీక్షలు, రావాలి జగన్, కావాలి జగన్ నినాదం, ప్రశాంత్ కిశోర్ సూచించినవేనని విశ్లేషకుల అభిప్రాయం.
8. హోదా పట్టువదలని యోధ
రాష్ట్ర విభజన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై పట్టువదలకుండా పోరాడిన క్రెడిట్ జగన్‌దే. స్టేటస్ కోసం ఉద్యమాలు చేశారు. నిరంతరం ఇదే అస్త్రంతో చంద్రబాబును ఇరుకునపెట్టారు. తన ఎంపీలతో రాజీనామా సైతం చేయించారు. దీంతో చంద్రబాబే డిఫెన్స్‌లో పడ్డారు. ప్రత్యేక హోదా అవసరం లేదన్న చంద్రబాబు యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది. ఇదే అంశాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లిన జగన్, స్టేటస్‌పై పూటకో మాట మారుస్తున్నారంటూ బాబుపై ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లోనూ ప్రత్యేక హోదానే ప్రధాన అంశంగా చేర్చారు. హోదాకు మద్దతిచ్చిన పార్టీకే లోక్‌సభలో మద్దతిస్తామని, అందుకే అత్యధిక ఎంపీలను గెలిపించాలంటూ జనానికి పిలుపునిచ్చారు. కేసీఆర్‌తోనూ కలవడానికి సిద్దపడ్డారు. హోదాపై జగన్ చిత్తశుద్దిని నమ్మారు జనం. అందుకే అత్యధికంగా లోక్‌సభ సీట్లనిచ్చారు.
9. తల్లి, చెల్లి అండగా ప్రచార ప్రభంజనం
జగన్ విజయానికి తొమ్మిదో మెట్టు కుటుంబం. తల్లి, చెల్లి, భార్య ప్రచారంలో జగన్‌కు సహకరించారు. ముఖ్యంగా జనంలో ఆల్రెడీ అభిమానమున్న షర్మిల, విజయమ్మలు జగన్ వెళ్లని చోట్లకు వెళ్లి క్యాంపెయిన్ చేశారు. బైబై బాబూ అంటూ షర్మిల తమదైన శైలిలో ప్రసంగించారు. జగనేమో బలహీనమైన అభ్యర్థులు, కొత్త అభ్యర్థులకు ప్రచారం చేస్తే, షర్మిల, విజయమ్మ మాత్రం బలమైన నాయకులకు క్యాంపెయిన్ చేశారు. ఇలా కుటుంబ సభ్యులంతా మూడు ప్రాంతాల్లోనూ నలుదిక్కులా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్ గెలుపుకు ఉడతా భక్తిలా బాటలేశారు.
ఆఖరిగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభంజనానికి పరోక్షంగా దోహదపడిన పార్టీ, జనసేన. నాడు అన్నయ్య స్థాపించిన ప్రజారాజ్యం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి విజయాన్నందిస్తే, నేడు తమ్ముడు పెట్టిన జనసేన టీడీపీ సానుకూల ఓట్లను చీల్చి, ఇన్‌డైరెక్టుగా వైసీపీ విక్టరీకి బాటలేసిందన్నది విశ్లేషకుల మాట.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire