కొత్త ప్రభుత్వానికి ఆర్థిక సవాళ్ళు..

కొత్త ప్రభుత్వానికి ఆర్థిక సవాళ్ళు..
x
Highlights

రోట్లో తల పెట్టాక రోకటి పోటుకు వెరవడమెందుకు అని సామెత. ఆంధ్రప్రదేశ్ నూతన సీఎం జగన్ పరిస్థితి అలానే ఉంది. చేతిలో ఉన్నది 100 కోట్లు.. తక్షణం కావాల్సింది...

రోట్లో తల పెట్టాక రోకటి పోటుకు వెరవడమెందుకు అని సామెత. ఆంధ్రప్రదేశ్ నూతన సీఎం జగన్ పరిస్థితి అలానే ఉంది. చేతిలో ఉన్నది 100 కోట్లు.. తక్షణం కావాల్సింది 5 వేల కోట్లు. ఈ ఈక్వేషన్ ను బ్యాలెన్స్ చేయడం అంత తేలికేం కాదు. ఈ నేపథ్యంలో అసలు ఏపీకి అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ? ఇప్పుడున్న పరిస్థితి ఏంటి ? జగన్ ముందున్న సవాళ్ళేంటి ? మరి వాటికి పరిష్కారమార్గాలేవైనా ఉన్నాయా?

ఏ వ్యాపారసంస్థకైనా ఆస్తులు, అప్పులు, ఆదాయ వనరులు, నిర్వహణ మూలధనం ఇవన్నీ ముఖ్యమే. ఇంటికైనా రాష్ట్రానికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఈ సూత్రం గురించి పారిశ్రామికవేత్త అయిన జగన్ కు ప్రత్యేకించి చెప్పాల్సింది కూడా లేదు. కాకపోతే ఇప్పుడు ఆయన సీఎంగా బాధ్యతలు నిర్వహించిన రాష్ట్రం ఆర్థిక పరిస్థితి మాత్రం అస్తవ్యస్తంగా ఉంది. ఖజానా నిండుకుంది. చేతిలో 100 కోట్లు ఉంటే తక్షణ చెల్లింపులే 5 వేల కోట్ల దాకా ఉన్నాయి. ఈ పరిస్థితిని జగన్ ఎలా చక్కదిద్దగలుగుతారన్నదే ఇప్పుడు ఆసక్తిదాయకంగా మారింది.

అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అనేది ఒకనాటి మాట. ఆస్ట్రేలియా మొట్టమొదటి పూర్తి ఆటోమేటెడ్ డ్రైవర్ రహిత రైలు తయారైంది ఆంధ్రప్రదేశ్ లో అనేది నిన్నటి మాట. శ్రీ సిటీలోని అల్ స్టోమ్ తయారీ కేంద్రంలో ఈ రైలు కోచ్ లు ఆస్ట్రేలియాకు వెళ్ళాయి. నిజంగా ఆంధ్రప్రదేశ్ మాత్రమే గాకుండా యావత్ భారతదేశం కూడా గర్వించదగిన అంశమిది. అలాంటి గర్వకారణ అంశాలకు బదులుగా యావత్ రాష్ట్ర ప్రజానీకాన్ని భయపెట్టే అంశాలను గురించి నేడు మనం మాట్లాడుకోవాల్సి వస్తోంది. అదే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. దాని గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే చేతిలో ఉన్నది 100 కోట్ల రూపాయలు. తక్షణం చెల్లించాల్సింది 5 వేల కోట్ల రూపాయలు. రెండిటికీ ఏ మాత్రం పొంతన లేదు. అయినా రెండిటి మధ్య సమన్వయం సాధించాల్సిన అవసరమైతే ఉంది. ఈ గంట గడిస్తే చాలు అనే తరహాలో ఈ రోజు గడిస్తే చాలు....అని అధికార యంత్రాంగం ఆందోళన చెందుతున్న సందర్భమిది.

ఇది ఏ ఒక్కరోజు ఖర్చు కారణంగానో ఏ ఒక్క ఏడాది వ్యయాల కారణంగానో చోటు చేసుకున్నది కాదు. గత ఐదేళ్లుగా ఎక్కువగా అప్పుల మీదనే రాష్ట్రాన్ని నడిపించిన కారణంగా ఏర్పడిన దుస్థితి. అప్పు చేయడం తప్పు కాదు కాకపోతే స్థోమతను మించి చేసిన అప్పులు అనవసరంగా చేసిన వ్యయాలు ప్రజాకర్షక పథకాలపై వెచ్చించిన మొత్తాలు రాష్ట్ర ఆర్థికవ్యవస్థను ఛిన్నాభిన్నం చేశాయి. జూన్ 1న జీతాలు చెల్లించగలమో లేదో అని అధికారయంత్రాంగం ఆందోళన చెందుతున్న సమయమిది. రాష్ట్ర విభజన నాటికి సరైన ఆదాయ వనరులు లేని మాట నిజమే. అయితే ఆదాయ వనరులను పెంచుకోవడం కంటే కూడా అప్పులు తీసుకువచ్చి ప్రాజెక్టులు, పథకాలు, కార్యక్రమాలు చేపట్టడంపైనే గత ప్రభుత్వం అధికంగా దృష్టి వహించిందనే విమర్శలూ ఉన్నాయి. విభజన నాటికి 97 వేల కోట్ల రూపాయల అప్పలు ఉంటే ఐదేళ్ళ తరువాత ఆ మొత్తం 2 లక్షల 57 వేల కోట్లకు చేరిందని గణాంకాలు తెలియజేస్తున్నాయి. అవసరానికి ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవడం వేరు. ఓవర్ డ్రాఫ్ట్ లపైనే ఆధారపడడం వేరు. దురదృష్టవశాత్తూ ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్ ల పైనే ఆధారపడింది. 2014 నుంచి మొన్నటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సార్లు ఓవర్ డ్రాఫ్ట్ తీసుకుంది.

ఆర్బీఐ నుంచి తీసుకునే వేస్ అండ్ మీన్స్ పరిమితిని 100 శాతం దాటిన తరువాతే ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్తారు. వేస్ అండ్ మీన్స్ పై చెల్లించే వడ్డీ కంటే కూడా ఓవర్ డ్రాఫ్ట్ పై వడ్డీ మరింత అధికం. మరో వైపున ఇతర మార్గాల ద్వారా కూడా గత ప్రభుత్వం భారీ స్థాయిలో రుణాలు సమీకరించింది. వాటిపై కూడా వడ్డీ భారం అధికమైపోతోంది. అధిక రుణం పొందే స్థోమత ఉన్నప్పుడు ఒక స్థాయి వరకు రుణం తీసుకునే వారే సొంత షరతులు విధించగలుగుతారు. స్థోమతను మించి అప్పులు తీసుకుంటే రుణదాతల షరతులకు తలొగ్గక తప్పదు. ఇప్పడు జరిగింది అదే. దీంతో కొత్త ప్రభుత్వానికి వ్యయాలు చేయడంలో ముందరి కాళ్ళకు బంధాలు పడినట్లయింది. అందుకే పనులు ప్రారంభించని టెండర్లను నిలిపివేశారు. వివిధ కట్టడాల నిర్మాణాల పనులను తాత్కాలికంగా ఆపేశారు. పాతిక శాతం లోపు పూర్తయిన పనులకు బిల్లుల చెల్లింపు నిలిపివేసినట్లుగా చెబుతున్నారు. మిగితా వాటిపై సమీక్షలు జరపాలని, పొదుపు చర్యలను పాటించాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు అందినట్లు చెబుతున్నారు.

ప్రజా సంక్షేమ పథకాలకు, ప్రజాకర్షక పథకాలకు మధ్య విభజన రేఖ అతి స్వల్పమైంది. గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు హడావుడిగా పసుపు- కుంకుమ, అన్నదాత సుఖీభవ లాంటి పలు పథకాలను ప్రవేశపెట్టింది. వాటికి చెల్లింపులను చేసింది. దీంతో ఖజానాపై అదనపు భారం పడింది. ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.8 వేల కోట్ల వరకు రుణాలు తీసుకునేందుకు రిజర్వు బ్యాంకు రాష్ట్రప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. అందులో 5 వేల కోట్లను గత ప్రభుత్వం ఏప్రిల్ లోనే సేకరించి వ్యయం చేసేసింది. మే నెల ఆరంభంలో మరో 2 వేల కోట్లు తీసుకొని వ్యయం చేసేసింది. దీంతో మరి కొద్ది వారాల పాటు రుణాలు సేకరించేందుకు కూడా గడ్డుకాలం ఉంటుంది. కేంద్రం నుంచి తక్షణ సాయం పొందితే తప్ప రాష్ట్రం ప్రస్తుత గండం నుంచి గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదు.

కేంద్రప్రభుత్వంతో మిత్రత్వంతో ఉంటే ఎక్కువ నిధులు వస్తాయన్నది ఒక ఆశ. కేంద్రంతో కొట్లాడుతుంటే నిధులు తక్కువగా వస్తాయన్నది మరో భయం. లోక్ సభలో సాధించిన భారీ మెజారిటీ నేపథ్యంలో వైసీపీ లాంటి ప్రాంతీయ పార్టీల అవసరమే బీజేపీ కి లేదు. ఏపీలో పార్టీపరంగా తమకు ఎలాంటి ప్రయోజనాలు లేకుంటే కేంద్రం సహాయం చేసేందుకు ముందుకు వస్తుందా అన్నది మరో సందేహం. ఇక మిగిలిన ఏకైక మార్గం రాష్ట్రం సొంతంగా పరిపుష్ఠం కావడమే.

ఏపీకి పరిశ్రమలు వెల్లువెత్తితే రాష్ట్రంలో అభివృద్ధి చోటు చేసుకొని పన్నుల రూపంలో రాబడి పెరుగుతుంది. పరిశ్రమలు వెల్లువెత్తే అవకాశాలు మాత్రం అంతగా కనిపించడం లేదు. కేంద్రంలో బీజేపీ బాగా బలోపేతమైనే నేపథ్యంలో ప్రత్యేక హోదా వచ్చే అవకాశం కూడా పెద్దగా కనిపించడం లేదు. ఇక ఆశలన్నీ కేంద్రం వివిధ రూపాల్లో అందించే సాయం పైనే. ఆ సాయం పొందాలంటే కేంద్రంతో సానుకూల ధోరణితోనే ఉండక తప్పకపోవచ్చు. అమరావతి అభివృద్ధి ఒక్కసారిగా చోటు చేసుకునేది కాదు. అది దశలవారీగా పూర్తి కావాల్సిందే. ప్రభుత్వ భాగస్వామ్యం కంటే ప్రైవేటు భాగస్వామ్యం ఎక్కువగా ఉంటేనే ప్రభుత్వంపై వ్యయాల భారం తగ్గుతుంది. బెంగళూరు, హైదరాబాద్ లతో అమరావతి పోటీ పడాల్సి ఉన్నప్పటికీ ఒక్కసారిగానే పూర్తిస్థాయి పోటీ ఇవ్వడం సాధ్యం కాదనే అంశాన్ని కూడా గుర్తించాలి. ఒక్క సారిగా పెద్ద చెట్టును నాటడం సాధ్యం కాదు. ఓ చిన్న మొక్కనే పెద్ద చెట్టుగా వృద్ధి చేయాల్సి ఉంటుంది. అలా వృద్ధి చేస్తేనే ఆ అభివృద్ధి సుస్థిరంగా కూడా ఉంటుంది. సుస్థిరదాయకత లేని అభివృద్ధి ఎక్కువ రోజులు కూడా ఉండదనే విషయాన్ని గుర్తించాలి.

ప్రజాస్వామ్యంలో సంక్షేమ పథకాల అమలు తప్పనిసరి. పార్టీలు మాత్రం ప్రజాకర్షక పథకాలకే ప్రాధాన్యం ఇస్తుంటాయి. ఈ రెండు రకాల పథకాల మధ్య తేడాను గుర్తించడం కష్టమే అయినప్పటికీ అసాధ్యం మాత్రం కాదు. ప్రజాకర్షణ పథకాల నుంచి ఓట్ల ఆకర్షణను తొలగిస్తే చాలు. కాకపోతే ఆ పని చేయడం మాత్రం కష్టమే. అందుకు రకరకాల వడపోతలు తప్పవు. ఆలా వడపోస్తే ఓటర్ల అసంతృప్తికి గురికాక తప్పదు. అలాంటప్పుడు ఆదాయ వనరులను బాగా పెంచుకోవడం ఒక్కటే ప్రభుత్వం ముందున్న మార్గం. ఒకప్పుడు ప్రజాకర్షక పథకాలు పెద్దగా పట్టించుకోని చంద్రబాబు నాయుడు తాజా ఎన్నికలకు ముందు ఆ బాట పట్టారు.

నూతన సీఎం జగన్ సైతం ఆ తరహా పథకాలకు వాగ్దానం చేసి అధికారం లోకి వచ్చారు. 45 ఏళ్ళకే పెన్షన్, విద్యార్థుల తల్లుల ఖాతాలో డబ్బులు, ఫీజు రీ ఇంబర్స్ మెంట్ లాంటివెన్నో వీటిలో ఉన్నాయి. ఇప్పుడు వాటిని నెరవేర్చకుండా తప్పించుకోవడం సాధ్యం కాదు. అలాగని వాటన్నిటినీ ఒక్కసారే అమలు చేయడం కూడా వీలవదు. అందుకే ముందుగా రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై విభాగాలవారీగా శ్వేత పత్రాలు వెలువరిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఆ తరువాత దశలవారీగా, అసలైన అర్హులకే, నిజంగా అవసరం ఉన్న వారికే పథకాలను అందించేందుకు కృషి చేయాలి. ప్రజలు సైతం ఆయా పథకాల ఉద్దేశాలను దృష్టిలో ఉంచుకొని అవసరమైన వారికి మాత్రమే అవి అందేలా చూసేందుకు ముందుకు రావాలి. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం, త్యాగాలు తప్పనిసరి. రేపటి నాడు ఆదాయాలు పెరిగి ఆర్థికాభివృద్ధి సాధించాలంటే ఇప్పుడు పొదుపు మార్గం పట్టి ఆర్థిక క్రమశిక్షణతో మెలగక తప్పదు.


Show Full Article
Print Article
Next Story
More Stories