ఆ చర్యలే ప్రజలకు దగ్గర చేశాయి !

ఆ చర్యలే ప్రజలకు దగ్గర చేశాయి !
x
Highlights

దిద్దుబాటు చర్యలే ఆ పార్టీకి కలిసొచ్చాయా? పరాజయంపై నేర్చుకున్న పాఠాలే వారికి అద్భుత ఫలితాలను సాధించేలా చేశాయా అంటే అవుననే తెలుస్తోంది. మూడు విడతల్లో...

దిద్దుబాటు చర్యలే ఆ పార్టీకి కలిసొచ్చాయా? పరాజయంపై నేర్చుకున్న పాఠాలే వారికి అద్భుత ఫలితాలను సాధించేలా చేశాయా అంటే అవుననే తెలుస్తోంది. మూడు విడతల్లో చేపట్టిన చర్యలు బీజేపీని గెలుపుబాట పట్టించినట్టు స్పష్టమవుతోంది. ఇంతకీ బీజేపీ గెలుపు కోసం ఏ సూత్రాన్ని పాటించింది.

గత ఏడాది చివర్లో మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత బీజేపీ చేపట్టిన దిద్దుబాటు చర్యలే ఆ పార్టీకి రక్షగా నిలిచాయి. ఆ రాష్ట్రాల్లో విజేతగా నిలిచిన కాంగ్రెస్‌ కన్నా ఎక్కువ పాఠాలు నేర్చుకున్న కమలనాథులు అద్భుత ఫలితాలను రాబట్టగలిగారు. తాజా సార్వత్రిక ఎన్నికల సరళిని క్షణ్నంగా విశ్లేషిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. ముఖ్యంగా బీజేపీ మూడు విడతల్లో చేపట్టిన చర్యలు ఆ పార్టీని గెలుపుబాట పట్టించాయి.

ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద నిందితుల తక్షణ అరెస్టులను నిలువరిస్తూ గత ఏడాది మార్చి 20న సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో దేశవ్యాప్తంగా దళిత సంఘాలు నిరసన వ్యక్తంచేశాయి. దీంతో ఆ ఏడాది చివర్లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికల్లో దళితులు, ముస్లింలు తమకు వ్యతిరేకంగా జట్టుకట్టకుండా చూసేందుకు మోడీ సర్కారు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఎస్సీ, ఎస్టీ చట్టంలోని నిబంధనలను పునరుద్ధరిస్తూ పార్లమెంటులో ఒక రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకురావాలని నిర్ణయించింది. దీనిపై దళితులు సంతృప్తి మాటెలా ఉన్నా అగ్రవర్ణాలు మాత్రం బీజేపీపై కినుక వహించాయి. ఎస్సీ, ఎస్టీ బుజ్జగింపు చర్యలకు ఆ పార్టీ పాల్పడతోందని ఆరోపించాయి.

గత ఏడాది చివర్లో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ప్రభావం పడింది. దీంతో బీజేపీ ఓటమిపాలైంది. అప్రమత్తమైన మోడీ సర్కారు సంప్రదాయంగా తనకు మద్దతుదారులైన అగ్రవర్ణాలను ప్రసన్నం చేసుకోవడంపై దృష్టి సారించించింది. అగ్రవర్ణాల్లో పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లకు ఈ ఏడాది జనవరి 7న ఆమోదం తెలిపింది. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం విషయంలో బీజేపీపై గుర్రుగా ఉన్న అగ్రవర్ణాలను ప్రసన్నం చేసుకోవడానికి వీలు కలిగింది. వారు ఎక్కువగా బీజేపీవైపు మొగ్గారని తాజా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు స్పష్టంచేస్తున్నాయి.

ఇక మూడో అస్త్రంగా మార్చి 2న మోడీ సర్కారు జాతీయ ఓబీసీ కమిషన్‌ని ఏర్పాటు చేసింది. దీంతో ఆ వర్గాల దీర్ఘకాల కల సాకారమైంది. కమిషన్‌లో కనీసం ఒక మహిళ, ఒక మైనార్టీ సభ్యులు ఉండాలంటూ ఎన్‌సీబీసీ బిల్లును రాజ్యసభలో అడ్డుకోవడానికి ప్రయత్నించడం వల్ల దేశవ్యాప్తంగా ఆ వర్గాల ఆగ్రహాన్ని కాంగ్రెస్‌ ఎదుర్కొంది. కాంగ్రెస్‌ అడ్డంకులను అధిగమిస్తూ గత ఏడాది ఆగస్టు 8న ఆ బిల్లుపై పార్లమెంటు ఆమోదాన్ని మోడీ సర్కారు పొందింది. తాము ఆకట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న వర్గాల వారిని అందులో ఛైర్మన్‌గా, సభ్యులుగా నియమించింది. దీంతో ఓబీసీలు బీజేపీ వైపు మొగ్గారు.

ఇక ఫిబ్రవరి 1న తన బడ్జెట్‌ ప్రసంగంలో తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయెల్‌ తదుపరి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పలు వర్గాలను లక్ష్యంగా చేసుకొని వరాలు కురిపించారు. రెండు హెక్టార్ల వరకూ వ్యవసాయ భూముల్లో సాగు చేస్తున్న రైతులకు మూడు విడతల్లో ఏటా 6వేలు జమ చేయనున్నట్లు ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందే అన్నదాతలకు రెండు విడతల చెల్లింపును పూర్తి చేశారు. అలాగే పేద కార్మికులకు పింఛన్లును ఇచ్చారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి చర్యలతో దెబ్బతిన్న స్థిరాస్తి రంగాన్ని పునరుద్ధరించేందుకు చర్యలను బడ్జెట్‌లో ప్రకటించారు. ఇవే బీజేపీని మళ్లీ పీఠంపై కూర్చుబెట్టేలా చేశాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories