Justin Trudeau resignation: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా... మోదీతో పెట్టుకుని తప్పు చేశారా?

Justin Trudeau resignation: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా... మోదీతో పెట్టుకుని తప్పు చేశారా?
x

Justin Trudeau resignation: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా... భారత్ తో కయ్యం ట్రూడో కొంప ముంచిందా ? 

Highlights

Justin Trudeau resignation: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా... మోదీతో పెట్టుకుని తప్పు చేశారా? అసలు ట్రూడో ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది?

Justin Trudeau resignation: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా చేశారు. ఏడాది క్రితమే కెనడాలో జస్టిన్ ట్రూడో సర్కారుపై వ్యతిరేకత పెరుగుతున్నట్లు వార్తలొచ్చాయి. ఆ వ్యతిరేకత నుండి బయటపడేందుకు ట్రూడో తీసుకున్న నిర్ణయాలు ఈసారి సొంత పార్టీ అయిన లిబెరల్ నుండే వ్యతిరేకత ఎదుర్కునేలా చేశాయి. ఈ ఏడాది జరగనున్న కెనడా ప్రధాని ఎన్నికల్లో గెలిచేందుకు ఆయన చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. ఫలితంగా మూడోసారి కూడా ప్రధాని అవుదామనుకున్న ట్రూడో రెండోసారి పదవీకాలం పూర్తికాకుండానే గద్దె దిగిపోవాల్సి వచ్చింది.

ఇంతకీ ట్రూడో విషయంలో ఏం జరిగింది? భారత్‌తో కయ్యానికి కాలు దువ్వి ట్రూడో సెల్ఫ్ గోల్ చేసుకున్నారా? భారత ప్రధాని మోదీతో గొడవ పెట్టుకుని ట్రూడో తప్పు చేశారా? అసలు ట్రూడో రాజీనామా చేయాల్సి రావడానికి కారణం ఆయన భారత్‌పై నిరాధారమైన ఆరోపణలు చేసి భారత్ కు కెనడా శత్రువు అనే ఇమేజ్ తేవడమేనా? ఈ ప్రశ్నలకు సమాధానమే నేటి ట్రెండింగ్ స్టోరీ.

జస్టిన్ ట్రూడో 9 ఏళ్ల పాలనకు సెల్ఫ్ గోల్?

జస్టిన్ ట్రూడో 2015 నవంబర్ 4న కెనడాకు తొలిసారి ప్రధాని అయ్యారు. ఆ నాలుగేళ్లు పలు కుంభకోణాల ఆరోపణలతోనే గడిచిపోయింది. దీంతో 2019 లో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ.. ఈసారి ప్రభుత్వాన్ని నడిపించేందుకు మిత్రపక్షాల సహాయం తప్పనిసరైంది. అక్కడే మొదటిసారితో పోల్చుకుంటే ట్రూడో 2.0 సర్కారుకు మార్కులు తగ్గిపోయాయి. అంతేకాదు... ప్రభుత్వానికి మరో రెండేళ్లు మిగిలి ఉందనగానే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందనే అపవాదు మూటగట్టుకోవాల్సి వచ్చింది.

కెనడాలో ఈ ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, అంతకంటే ఏడాది ముందు నుండే ట్రూడో తన ప్రభుత్వంపై వ్యతిరేకతను పోగొట్టుకునేందుకు కొన్ని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. ఆ నిర్ణయాలన్నీ భారతీయులను ఇబ్బంది పెట్టేవో లేక భారత్ ను ప్రపంచం ముందు దోషిగా చూపించేవిగానో కనిపించాయి.

హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు

2023 జూన్ 19న కెనడాలో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురయ్యారు. వాన్‌కోవర్‌లో రాత్రి 8:30 గంటలప్పుడు గురుద్వారా నుండి బయటికొస్తున్న నిజ్జర్‌ను గుర్తుతెలియని దుండగులు హత్యచేశారు. ఖలిస్తాన్ పేరుతో సిక్కులకు ప్రత్యేక రాజ్యం ఇవ్వాలని కెనడా భూభాగంపై నుండి భారత్‌కు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తోన్న ఖలిస్తానీ వ్యక్తే ఈ హర్దీప్ సింగ్ నిజ్జర్.

కెనడా దృష్టిలో ఆయనొక ఉద్యమ నేత. కానీ భారత్‌లో మాత్రం దేశద్రోహం సహా పలు కేసుల్లో నిజ్జర్ ఒక వాంటెడ్ టెర్రరిస్ట్. పట్టుకుని జైల్లో వేయాలని భారత్ చూస్తోన్న టెర్రరిస్టుల్లో నిజ్జర్ ఒకరు. అలాంటి నిజ్జర్ హత్యకు గురైతే ఆ హత్యా నేరాన్ని జస్టిన్ ట్రూడో భారత్‌పైకి తొసేందుకు ప్రయత్నించారు.

నిజ్జర్ హత్య కెనడాలో ఉన్న భారత దౌత్యవేత్తలు చేయించిందేనని జస్టిన్ ట్రూడో సర్కారు ఆరోపించింది. కెనడా గడ్డపై భారత ప్రభుత్వం అసాంఘీక చర్యలకు పాల్పడుతోందన్నారు. ఈ నేరాల వెనుక భారత హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రమేయం ఉందన్నారు. అమిత్ షాపై కెనడా విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డేవిడ్ మోరిసన్ చేసిన ఈ ఆరోపణలు పెను సంచలనం సృష్టించాయి.

భారత్‌పై చేసిన ఆరోపణలతోనే భారత్‌కు కెనడా దూరమైది. అమిత్ షాపై మరోసారి చేసిన ఆరోపణలతో ఆ దూరం మరింత పెరిగింది. ట్రూడో సర్కారు చేసిన ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. వెంటనే కెనడాలో ఉన్న దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించుకుంది.

ట్రూడోకు భారత్‌ను నిందించాల్సిన అవసరం ఏమొచ్చింది?

2023 కెనడా జనాభా లెక్కల ప్రకారం 83 లక్షల మంది విదేశీయులు కెనడాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అందులోనూ భారతీయుల సంఖ్య ఎక్కువ. కెనడాలోని కొన్ని ప్రాంతాల్లో సిక్కు ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అక్కడ ఎన్నికల్లో పోటీ చేసి నెగ్గాలంటే వారికి సిక్కుల ఓట్లు చాలా ముఖ్యం.

కెనడా ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ముందుగా మెజారిటీ ఓటర్ల నుండి మద్దతు ఉన్నట్లుగా పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ఎక్కడైతే సిక్కులు ఎక్కువగా ఉన్నారో... ఆయా ప్రాంతాల్లో వారు చెప్పిన వ్యక్తులే అభ్యర్థులుగాఫైనల్ అవుతారు. అంటే... అభ్యర్థుల ఎంపిక నుండి గెలుపు వరకు అక్కడి రాజకీయ పార్టీలకు సిక్కు ఓటర్ల మద్దతు అంత ముఖ్యం అన్నమాట. అందుకే కెనడాలో సిక్కులకు ఇష్టారాజ్యంగా నడుస్తోందనే వాదనలున్నాయి.

ట్రూడో కూడా 2025లో జరిగే ఎన్నికల్లో మరోసారి ప్రధానిగా గెలిచేందుకు అక్కడి సిక్కు ఓటర్లను తనవైపు తిప్పుకోవాలనుకున్నారనే అభిప్రాయం వ్యక్తమైంది. సిక్కులకు ఔట్రైట్ గా సపోర్ట్ చేస్తే వారి ఓట్లన్నీ లిబరల్ పార్టీకే పడతాయనేది ట్రూడో ప్లాన్ గా ప్రచారం జరిగింది.

కెనడాలో ఖలిస్తానీ ఉద్యమం చేస్తోన్న సిక్కులకు భారత్ అంటే పడదు. ఆ విధంగా హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసును భారత్ పై వేసి అక్కడి సిక్కులను తనవైపునకు తిప్పుకోవాలనేది జస్టిన్ ట్రూడో ప్లాన్ అనే టాక్ రెండు దేశాల్లో వినిపించింది. కానీ కెనడాలో కేవలం సిక్కులు మాత్రమే కాదు... భారత్ నుండి వెళ్లి అక్కడే స్థిరపడిన హిందువులు కూడా భారీ సంఖ్యలోనే ఉన్నారు. సరిగ్గా ఇక్కడే ట్రూడో సిక్కుల భుజంపై పెట్టి కాల్చాలనుకున్న గన్ మిస్ ఫైర్ అయింది.

కెనడాలో హిందువులపై ఖలిస్తానీల దాడి

నవంబర్ 3, ఆదివారం నాడు కెనడాలోని హిందూ సభా మందిర్ వద్ద హిందువులపై కొంతమంది సిక్కులు దాడికి పాల్పడ్డారు. ఇది రెండు దేశాల మధ్య దూరం పెంచే ఘటన మాత్రమే కాదు... కెనడాలోని హిందువులు కూడా ట్రూడో సర్కారుకు వ్యతిరేకమయ్యేలా చేసింది. అప్పటికే కెనడాలో అధికార లిబరల్ పార్టీ ఖలిస్తానీ ఉద్యమంతో రెచ్చిపోతున్న సిక్కులకు అండగా నిలుస్తోందనే ఆరోపణలున్నాయి. భారత్ కూడా ట్రూడో సర్కారు చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ కెనడా ప్రభుత్వమే భారత్‌కి వ్యతిరేక ఉద్యమాలు చేస్తోన్న ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చి ప్రోత్సహిస్తోందనే వాదనను వినిపించింది. ఈ పరిణామాలన్నీ ట్రూడో సర్కారును సెల్ఫ్ డిఫెన్స్‌లో పడేశాయి.

యూ టర్న్ తీసుకున్న ట్రూడో

భారత ప్రధాని మోదీ, విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్, నేషనల్ సెక్యురిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ వంటి వాళ్ల ప్రమేయంతోనే నిజ్జర్ హత్య జరిగిందని వచ్చిన వార్తలను ట్రూడోనే స్వయంగా ఖండించాల్సి వచ్చింది. ఇవన్నీ కెనడాలో అధికార పార్టీని ఇరుకున పెట్టాయి. అసలే ఓవైపు ట్రూడోపై పరిపాలన పరంగా అంతర్గత విమర్శలు... మరోవైపు అంతర్జాతీయ విబేధాలు లిబరల్ పార్టీని ఆలోచనలో పడేశాయి.

2025 ఎన్నికల్లో లిబరల్ పార్టీ మళ్లీ గెలవాలంటే ఇంకా జస్టిన్ ట్రూడో ప్రధాని పదవిలో కొనసాగరాదని సొంత పార్టీనే ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో మూడోసారి కెనడా ప్రధాని అవ్వాలనుకున్న ట్రూడో ఎన్నికలు రాకముందే గద్దె దిగాల్సి వచ్చింది. ఇదంతా చూస్తోంటే ట్రూడో తనకు తెలియకుండానే మోదీతో పెట్టుకుని తప్పు చేశారా అనే టాక్ కూడా వినిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories