MrBeast Youtube Sensation: యూట్యూబ్ వీడియోలతో వేల కోట్లు సంపాదిస్తున్న మిస్టర్ బీస్ట్ ఎవరు? అతడి సక్సెస్ సీక్రెట్ ఏంటి?

Who is MrBeast
x

MrBeast Youtube Sensation: యూట్యూబ్ వీడియోలతో వేల కోట్లు సంపాదిస్తున్న మిస్టర్ బీస్ట్ ఎవరు?

Highlights

MrBeast: యూట్యూబ్ గురించి తెలిసిన వారికి మిస్టర్ బీస్ట్ (MrBeast) ఎవరో తప్పకుండా తెలిసే ఉంటుంది.

MrBeast: యూట్యూబ్ గురించి తెలిసిన వారికి మిస్టర్ బీస్ట్ (MrBeast) ఎవరో తప్పకుండా తెలిసే ఉంటుంది. యూట్యూబ్‌లో ఆయనకు 25 కోట్ల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఫాలోవర్స్ విషయంలోనూ బీస్టే నంబర్ వన్. యూట్యూబ్‌లో అతను ఒక వీడియో పెడితే కోట్ల సంఖ్యలో వ్యూయర్స్ వచ్చేస్తారు. డాలర్స్ జడివాన కురిపిస్తారు. యూట్యూబ్ చానల్‌తో మెగా బిజినెస్‌మ్యాన్ స్థాయిలో కోట్ల డాలర్లు సంపాదిస్తున్న మిస్టర్ బీస్ట్ ఎవరు?

అసలు పేరు Jimmy Donaldson

జిమ్మీ డోనాల్డ్సన్... ఇదీ మిస్టర్ బీస్ట్ అసలు పేరు. వయసు 26 సంవత్సరాలు. 2012లో యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు. పదేళ్ళలో ఒక వ్యాపారవేత్తగా ఎదిగాడు. ఫోర్బ్స్ మేగజైన్ ప్రకారం 2022లో అతడి సంపద 4,200 కోట్లకు పైమాటే.

ఇంత డబ్బు ఎలా సంపాదించాడు?

అమెరికాకు చందిన డోనాల్డ్సన్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కాలేదు. వీడియోలు తీయడంలో తన నైపుణ్యాన్ని క్రమక్రమంగా పెంచుకున్నడు. కొత్తగా ఎలా ఎడిట్ చేయాలో తెలుసుకున్నాడు. యూట్యూబ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఏమేం చేయాలో లోతుగా అధ్యయనం చేశాడు. క్వాలిటీ కంటెంట్ ఇస్తూ క్రమక్రమంగా తన వ్యూస్ పెంచుకున్నాడు. ఇవాళ యూట్యూబ్‌నే శాసించగల స్థాయికి ఎదిగాడు.

గేమ్ ప్లే ఫుటేజితో మొదలుపెట్టి...

చాలా మంది ఈతరం కుర్రాళ్ళలాగా మిస్టర్ బీస్ట్ కూడా తన చానల్‌ను మైన్‌క్రాఫ్ట్ వంటి ఆన్ లైన్ గేమ్ ఫుటేజితో ప్రారంభించాడు. అప్పుడు అతడి వయసు 13 ఏళ్ళు. ఆ తరువాత కొత్త ఐడియాలతో వీడియోలు పోస్ట్ చేయడం ప్రారంభించాడు. ఇతర క్రియేటర్స్‌తో డిస్కస్ చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. ట్రెండ్స్ తెలుసుకుని వీడియోలు చేయడం నుంచి ట్రెండ్ సెట్ చేసే వీడియోలు చేయడం వరకూ వచ్చేశాడు.

డోనాల్డ్సన్ 2017లో ఓ వీడియో చేశాడు. అదే అతడి ఫస్ట్ వైరల్ వీడియో. ఆ వీడియోలో ఏమీ లేదు. అతడు 1 నుంచి లక్ష వరకు అంకెలు లెక్కబెట్టాడు. 40 గంటల వీడియోను 24 గంటలకు తగ్గించినట్లు చెబుతూ ఆ వీడియో యూట్యూబ్‌లో పబ్లిష్ చేశాడు. ఇదేం పిచ్చి అనిపిస్తోందా? మరదే పాయింట్! అలాంటి వింత వీడియోలతో వెరైటీగా యూట్యూబ్‌లో సెన్సేషన్ సృష్టించాడీ కుర్రాడు. ఆ నంబర్ల వీడియోకు ఇప్పటికి 3 కోట్ల వ్యూస్ వచ్చాయి.

మొదటి ఇలాంటి చిత్రమైన ఆలోచనలను వీడియోలుగా మార్చడంతో యూట్యూబ్ కమ్యూనిటీలో స్టార్ అయ్యాడు. వీడియో వ్యూస్ సాధించడంలో అతడు అనుసరించిన రెండో స్ట్రాటజీ డబ్బులు పంచడం. వ్యూయర్స్‌కు, ఇతర వ్యక్తులకు, చారిటీ సంస్థలకు బోలెడంత డబ్బు ఉచితంగా ఇస్తుంటాడు మిస్టర్ బీస్. అలా డబ్బు ఇస్తున్న దృశ్యాల్ని వీడియోలుగా తీసి పోస్ట్ చేస్తుంటాడు. వాటికి విపరీతమైన వ్యూస్ వస్తుంటాయి.

68 కోట్ల వ్యూస్ తెచ్చిన వీడియో

నెట్ ఫ్లిక్స్ సూపర్ హిట్ ప్రోగ్రామ్ స్క్విడ్ గేమ్‌ (Squid Game) లోని సెట్స్ అన్నీ రీక్రియేట్ చేసి, ఈ షో తరహాలోనే గేమ్స్ నిర్వహించాడు మిస్టర్ బీస్ట్. దాదాపు 25 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ గేమ్ షోను ప్రొడ్యూస్ చేసి రికార్డ్ చేశాడు. విజేతకు దాదాపు 40 లక్షల ప్రైజ్ మనీ కూడా ఇచ్చాడు. ఈ వీడియో యూట్యూబ్‌లో సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

ఇదే మిస్టర్ బీస్ట్ చానల్లో మోస్ట్ వాచ్‌డ్ వీడియో. ఇప్పటి వరకు 680 మిలియన్స్ వ్యూస్‌ అంటే దాదాపు 68 కోట్ల వ్యూస్‌తో ఈ వీడియో అక్షరాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ ఒక్క వీడియో మీదే అతడికి 40 కోట్ల రూపాయలు వచ్చాయి. మరో విషయం ఏంటంటే, ఈ వీడియో ప్రొడ్యూస్ చేయడానికి ఆయనకు స్పాన్సర్ దొరికాడు. అంటే, వీడియో ఖర్చు చేతి నుంచి పెట్టకుండానే బీస్ట్ అంత డబ్బు సంపాదించాడన్నమాట.

మిస్టర్ బీస్ట్ సక్సెస్ ఫార్ములా

ఓ 26 ఏళ్ళ కుర్రాడు నంబర్ వన్ యూట్యూబర్ ఎలా అయ్యాడు? కాలేజీ చదువు మధ్యలోనే వదిలేసి యూట్యూబ్ చానల్నే కెరీర్‌గా ఎలా మార్చుకున్నాడు?

మిస్టర్ బీస్ట్ సక్సెస్ సీక్రెట్స్‌లో అన్నింటికన్నా ముఖ్యమైనది.. భారీతనం. ఖరీదైన ప్రొడక్షన్స్ వాల్యూతో వీడియోలు తీస్తాడు. యూట్యూబ్ వీడియోనే కదా అని ఆషామాషీగా తీయడు. డబ్బు, శ్రమ, ఉద్వేగం.. ఈ మూడూ వీలైనంత ఎక్కువగా... సింపుల్‌గా చెప్పాలంటే అతిగా ఉండేలా చూసుకుంటాడు.

రెండో సీక్రెట్... స్క్రోల్-స్టాపింగ్ టైటిల్స్! అంటే, యూట్యూబ్ చానల్‌ను స్క్రోల్ చేస్తూ వెళ్ళే వారిని ఆపేసేలా టైటిల్స్ ఇవ్వడం. మచ్చుకు ఇవి చూడండి. చావబోతున్న 100 కుక్కలను కాపాడాను, ఈ భూమి మీద ప్రతి దేశం 250,000 డాలర్ల కోసం ఫైట్ చేస్తుంది, పాడుబడిన నగరంలో 7 రోజులు.

మూడో సీక్రెట్... క్రమం తప్పకుండా వీడియోలు పోస్ట్ చేస్తుండడం. వీడియోలు తయారు చేయడంలో క్రియేటివిటీ, అంకితభావం ఏమాత్రం తగ్గనివ్వడు మిస్టర్ బీస్ట్. క్రమం తప్పకుండా తన వీక్షకులకు ఎప్పటికప్పుడు కొత్త వీడియోల విందు ఇస్తూనే ఉంటాడు. దానికి సంబంధించిన సమాచారాన్ని షేర్ చేసుకుంటూ ఉంటాడు.

నాలుగో సీక్రెట్ – పిచ్చి. యూట్యూబ్ అంటే డోనాల్డ్సన్‌కు వల్లమాలిన పిచ్చి. అది లేకుండా ఒక క్షణం కూడా ఉండలేదు. ఎప్పుడూ అదే యావ. అదే ఆలోచన. యూట్యూబ్ అల్గారిథమ్ లోతుగా అధ్యయనం చేయడం, ఏ వీడియో ఎలా వైరల్ అవుతుందన్నది పరిశీలించడానికి అయిదేళ్ళు అందులో కూరుకుపోయానని అతడే ఒకసారి చెప్పుకున్నాడు.

బ్రాండింగ్ అండ్ ప్రమోషన్: ఒక రేంజికి వచ్చిన తరువాత బ్రాండింగ్స్, ప్రమోషన్స్ మీద ఫోకస్ పెట్టాడు మిస్టర్ బీస్ట్. బ్రాండ్ డీల్స్ మీద అతడికి వచ్చే ఆదాయం మూలుగా ఉండదని చెబుతుంటారు.

ఇంత డబ్బుతో ఏం చేస్తాడు?

వేల కోట్ల డబ్బున్నా అతడు సంపన్నుడు కాదని అంటారు. తనకు వచ్చే ఆదాయాన్ని మళ్ళీ ఖరీదైన, ఇంట్రెస్టింగ్ వీడియోలు తీయడానికే ఖర్చు చేస్తానంటాడు మిస్టర్ బీస్ట్. డబ్బు వస్తున్న కొద్దీ ఇంకా భారీ స్థాయిలో వీడియోలు తీయాలని ప్లాన్ చేస్తుంటానని అతడు చెబుతుంటాడు.

మిస్టర్ బీస్ట్ ఫ్యాన్స్ కూడా అతడు చాలా మంచివాడు, అణకువతో మెలిగే మనిషి అని చెబుతుంటారు. మిగతా యూట్యూబర్లతో అతడు స్నేహపూర్వకంగా ఉంటాడు. ముఖ్యంగా, తన అభిమానులతో మాట్లాడడానికి వీలైనంత సమయం కేటాయిస్తాడు. ఇక, పేదలకు, అవసరం ఉందని అడిగిన వారికి లేదనకుండా కరెన్సీ కట్టలను దానం చేయడం మిస్టర్ బీస్ట్ పాపులారిటీ ఎలాంటిదో యూట్యూబ్ ప్రేక్షకులకు బాగా తెలుసు.

మిస్టర్ బీస్ట్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి?

ఎప్పుడూ కొత్తది ప్రయత్నించాలి. అదే బీస్ట్ సూత్రం. ఆడియన్స్ ఎంగేజ్ అయ్యేలా ఇంతవరకూ ఎవరూ చేయని వీడియోను సృష్టించాలి. ఇది జిమ్మి డోనాల్డ్సన్ నుంచి ఉత్సాహవంతులైన కొత్త యూట్యూబర్స్ నేర్చుకోవాల్సిన మొదటి పాఠం.

ఓపిగ్గా పని చేయాలి, క్రమం తప్పకుండా వీడియోలు పోస్ట్ చేయాలి.. చేసే పని పట్ల అంకితభావం ఉండాలి. ఇది రెండో పాఠం.

యూట్యూబ్‌లో టాప్ పొజిషన్లో ఉన్న వారితో కొలాబరేట్ కావడం.. సక్సెస్‌ను మరో లెవెల్‌కు తీసుకువెళ్తుంది. మిస్టర్ బీస్ట్ ఈ సూత్రాన్ని బాగా అమలు చేస్తాడు. విజయవంతంగా వీడియోలు చేస్తున్న ఇతర యూట్యూబర్లతో కలిసి ప్రోగ్రామ్స్ చేస్తుంటాడు. వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు. ఈ కొలబరేషన్ యాటిట్యూడ్ అలవర్చుకోవడం అతడి నుంచి నేర్చుకోవాల్సిన మూడో పాఠం.

మీ చానల్‌కు వస్తే ఏం దొరుకుతుందో క్లారిటీ ఇవ్వడం యూట్యూబ్ బిజినెస్‌లో చాలా ముఖ్యం. మిస్టర్ బీస్ట్ చానల్లోకి వెళ్తే ఏం ఉంటుందో, ఎలాంటి సర్‌ప్రైజెస్ ఉంటాయో ఆడియన్స్‌కు బాగా తెలుసు. వారిని బీస్ట్ ఎప్పుడూ డిజప్పాయింట్ చేయరు. సో.. చానల్‌కు ఒక డెఫినెట్ క్యారెక్టర్ ఇవ్వడం అతడి నుంచి తెలుసుకోవాల్సిన ఫోర్త్ లెసన్.

మరీ ముఖ్యమైన అయిదో పాఠం... ట్రెండ్ ఫాలో అవడం మాత్రమే కాదు. ట్రెండ్ క్రియేట్ చేయాలి లేదా ట్రెండ్‌ను మరో లెవెల్‌కు తీసుకువెళ్ళాలి. ఇందుకు బీస్ట్ చేసిన స్క్విడ్ గేమ్ వీడియో ఓ తిరుగులేని ఎగ్జాంపుల్.

Show Full Article
Print Article
Next Story
More Stories