ప్రపంచ పెద్దన్న పోస్టు ఈసారి ఎవరికి దక్కబోతోంది..?

ప్రపంచ పెద్దన్న పోస్టు ఈసారి ఎవరికి దక్కబోతోంది..?
x
Highlights

అగ్ర రాజ్యంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. డిజిటల్‌ ప్రచారం తీవ్రస్థాయిలో సాగుతోంది. అమెరికా చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా ఒక వర్గం ఓట్ల కోసం...

అగ్ర రాజ్యంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. డిజిటల్‌ ప్రచారం తీవ్రస్థాయిలో సాగుతోంది. అమెరికా చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా ఒక వర్గం ఓట్ల కోసం అభ్యర్థులిద్దరూ తపించిపోతున్నారు. ఇంతకీ ఆ వర్గం ఏది..? వారు ఎవరిని సమర్థించబోతున్నారు.

మరో 46 రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. కరోనా కారణంగా ఎన్నికల ప్రచార సభలు ఇంకా జోరందుకోలేదు. అయితే డిజిటల్‌ ప్రచారం మాత్రం ముమ్మరంగా సాగుతోంది. అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వ్యవహారశైలి...ప్రపంచమంతా చూసింది. కరోనా కాలంలో ట్రంప్‌ విన్యాసాలను అమెరికన్లు ప్రత్యక్ష్యంగా చూశారు. ఎన్నికలు జరిగే నవంబర్‌ 3వ తేదీలోగా ఎట్టిపరిస్థితుల్లోనూ కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజల మనస్సులను గెలుచుకోవాలని ట్రంప్‌ ఉవ్విళ్ళూరుతున్నారు. అదే సమయంలో భారతీయ అమెరికన్ల హృదయాలను కూడా దోచుకోవాలని ట్రంప్‌ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ప్రవాస భారతీయులు టెక్సాస్‌లో నిర్వహించిన హౌడీ మోడీ కార్యక్రమానికి ట్రంప్‌ హాజరయ్యారు. అదేవిధంగా మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ట్రంప్‌ హాజయ్యారు. ట్రంప్‌ తన డిజిటల్‌ ప్రచారంలో మోడీ సభలను ఉపయోగించుకుంటున్నారు. భారత ప్రధాని మోడీతో కలిసి పాల్గొన్న కార్యక్రమాలను డిజిటల్‌ ప్రచారంలో వాడుకోవడం ద్వారా భారతీయుల ఓట్లు కొల్లగొట్టవచ్చన్నది ట్రంప్‌ ఆలోచనగా ఉంది. అందులో భాగంగానే హిందూ వాయిసెస్‌ ఫర్‌ ట్రంప్‌ పేరుతో రిపబ్లికన్లు ప్రచారం చేస్తున్నారు. ఈ ఏడాది జరుగుతున్న ఎన్నికల్లో ప్రత్యేకంగా హిందూ అమెరికన్‌ అనే కొత్త నినాదం అమెరికాలో బాగా వినిపిస్తోంది.

ట్రంప్‌ భారతీయ అమెరికన్ల ఓట్ల కోసం మోడీని వాడుకోవడంతో పాటు హిందువుల ఓట్లన్నీ తనకే అని చెప్పుకుంటున్నారు అదేవిధంగా డెమోక్రాట్లు కూడా హిందూ కార్డ్‌ ప్రయోగిస్తున్నారు. అమెరికాలో ఉన్న హిందువులను రక్షించగలిగేది డెమోక్రాట్లు మాత్రమేనని నచ్చచెప్పేందుకు జో బిడెన్‌ ప్రయత్నిస్తున్నారు. హిందూ అమెరికన్స్‌ ఫర్‌ బిడెన్‌ అనే ప్రచార కార్యక్రమంతో డెమోక్రాట్లు తాము హిందూ రక్షకులం అని చెప్పుకుంటున్నారు. అమెరికా చరిత్రలో డెమొక్రాట్లు హిందూ అమెరికన్ల గురించి మాట్లాడటం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. ట్రంప్‌ పాలనలో హిందువులపై విద్వేష దాడులు మూడు రెట్లు పెరిగాయని డెమొక్రాట్లు ప్రచారం చేస్తున్నారు. 2015లో దేశంలో ఐదు చోట్లే హిందువులపై దాడులు జరగ్గా 2019లో ఆ సంఖ్య 15కి పెరిగిందని ప్రభుత్వ లెక్కలను ఉదహరిస్తూ వివరిస్తున్నారు.

భారతీయ అమెరికన్లు చాలాకాలంగా డెమొక్రాట్లకే మద్దతిస్తున్నారు. దాదాపు 45 లక్షల మంది భారతీయ సంతతి ప్రజలు అమెరికాలో నివసిస్తున్నారు. 2016లో కేవలం 16 శాతం మంది మాత్రమే ట్రంప్‌కు ఓటేశారు. ఈసారి ట్రంప్‌కు భారతీయ సంతతి ఓట్లు పెరగవచ్చని డెమొక్రాట్ల పార్టీలోని భారతీయ విభాగం భావిస్తోంది. వీసాల విషయంలో ట్రంప్‌ తీసుకున్న గందరగోళ వైఖరి కొంత ఇబ్బంది కలగించినా రాజకీయంగా భారత్‌కు మద్దతిస్తున్న ట్రంప్‌ పట్ల సానుకూలత వ్యక్తమవుతోంది. కశ్మీర్‌, NRC విషయాల్లో ట్రంప్‌ మౌనంగానే ఉన్నారు ఇటీవల చైనాతో సరిహద్దుల్లో దూకుడుగా వ్యవహరించిన సమయంలో ట్రంప్‌ పూర్తిగా ఇండియా పక్షం వహించారు. ప్రధాని మోడీ తీసుకుంటున్న నిర్ణయాలన్నిటికీ ట్రంప్‌ సంపూర్ణ తోడ్పాటు ఇస్తుండటంతో అమెరికాలోని హార్డ్‌ కోర్‌ హిందువులంతా రిపబ్లికన్‌ పార్టీకే ఓట్లేస్తారని భావిస్తున్నారు.

జో బిడెన్‌ క్యాంప్‌ కూడా భారతీయ అమెరికన్ల ఓట్లలో ఈసారి ఎక్కువ శాతం ట్రంప్‌కే పడతాయని అంచనా వేస్తున్నారు. అందుకే డెమొక్రాట్లు కూడా తొలిసారి హిందూ కార్డ్‌ ప్రయోగిస్తున్నారు. ఇందులో భాగంగానే భారతీయ అమెరికన్ల కోసం జో బిడెన్‌ ప్రత్యేకంగా విజన్‌ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. ఆగస్టు 15న భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించారు. వినాయకచవితికి ఉపాధ్యక్ష అభ్యర్థి అయిన భారతీయ సంతతి నేత కమలా హ్యారిస్‌ శుభాకాంక్షలు తెలియచేశారు. భారత్‌ ఎదుర్కొంటున్న సరిహద్దు సమస్యలను ప్రత్యేకించి చైనాతో ఎదురవుతున్న సమస్యల్ని విజన్‌ డాక్యుమెంట్‌లో పొందుపరిచారు జో బిడెన్‌. హిందువుల ఓట్లను ఆకట్టుకోవడానికి అటు ట్రంప్‌, ఇటు జో బిడెన్‌ ఇద్దరూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

గత ఎన్నికల్లో డెమోక్రాటిక్‌ పార్టీకి ఉపాధ్యక్ష అభ్యర్థిగా బరిలో నిలిచిన జో బిడెన్‌ అమెరికన్లకు పరిచయం ఉన్నవాడే. ట్రంప్‌ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలే ఆయన ఓటమికి దారి తీస్తాయని బిడెన్‌ అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా గత ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతుగా రష్యా పనిచేసిందనే ఆరోపణలు కూడా ఈసారి ఆయన గెలుపును దెబ్బతీస్తాయని ఆశిస్తున్నారు. భారతీయ వృత్తి నిపుణులు ఎదుర్కొంటున్న వీసా సమస్యలన్నీ పరిష్కరిస్తామని బిడెన్‌ హామీ ఇస్తున్నారు. అదేవిధంగా ట్రంప్‌కు ఉన్న ప్రతికూల అంశాలన్నిటినీ తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బిడెన్‌ వ్యూహం రూపొందిస్తున్నారు.

ప్రపంచ దేశాలతో అమెరికా తొండాట ఆడుతుంది. అక్కడ జరిగే ఎన్నికలు కూడా అలాగే ఉంటాయి. ప్రజలు ఒకరికి ఓటేస్లే..అధ్యక్షుడు మరొకరు అవుతారు. ఇంతకీ అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతాయి? లాభమెవరికి? నష్టమెవరికి..?

అక్కడ ప్రజలే నేరుగా తమ పాలనాధిపతిని ఎన్నుకుంటారు. కాని మెజారిటీ ప్రజలు ఓటేసినవారే అధ్యక్షడు అవుతారన్న గ్యారెంటీ లేదు. కాంగ్రెస్‌ ప్రతినిధులు ఏ పార్టీ నుంచి ఎక్కువ మంది గెలిస్తే...ఆ పార్టీ అభ్యర్థే అమెరికా అధ్యక్షుడు అవుతారు. అమెరికా ఎన్నికల వ్యవస్థ ఎంత విచిత్రంగా ఉంటుందో అధ్యక్ష ఎన్నికలు జరిగిన ప్రతిసారీ రుజువవుతూనే ఉంటుంది.

మరో నాలుగేళ్ళ పటు శ్వేత భవనంలో కూర్చునేది ఎవరనే చర్చలు అమెరికాలో జోరుగా సాగుతున్నాయి. అమెరికన్ల అభిప్రాయాలు తెలుసుకునేందుకు పోలింగ్‌ కంపెనీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన ప్రచారం, ప్రజాభిప్రాయం ప్రకారం డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బిడెన్‌ ముందంజలో ఉన్నట్లు చెబుతున్నారు. గత ఎన్నికల్లో కూడా హిల్లరీ క్లింటన్‌ విజయం సాధిస్తారనే పోలింగ్‌ కంపెనీలు ఊహించాయి. ఆవిధంగానే హిల్లరీకి 30 లక్షల ఓట్ల మెజారిటీ లభించింది. కాని ప్రతినిధుల సంఖ్య తగ్గడంతో ఆమె ఓటమిపాలైంది. ట్రంప్‌ ఖాతాలో విజయం చేరింది. అమెరికా ఎన్నికల వ్యవస్థ కూడా భారత్‌ మాదిరిగానే విచిత్రంగా ఉంటుంది. పేరుకు ప్రజలు ప్రత్యక్షంగా అధ్యక్షుడ్ని ఎన్నుకుంటున్నప్పటికీ ప్రతినిధుల సంఖ్యే అధ్యక్షుడి జయాపజయాలు నిర్ణయిస్తుంది. అందుకే ఎక్కువ మంది ప్రజలు ఎన్నుకున్నప్పటికీ హిల్లరీ అధ్యక్షురాలు కాలేకపోయారు.

అమెరికాలో ఎన్నికల ముందు ప్రిపరేటరీ ఎన్నికలు జరుగుతుంటాయి ఈ ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ అభ్యర్థి బిడెన్‌కే మెజారీటీ అమెరికన్ల మద్దతు లభిస్తోంది. బిడెన్‌కు 51 శాతం మంది మద్దతిస్తున్నారు. ట్రంప్‌కు కేవలం 43 శాతమే సానుకూలంగా ఉన్నారు. 2016 ఎన్నికల్లో కూడా ఇదేవిధంగా జరిగింది. వేళ్ళమీద లెక్కించగలిగిన కొన్ని పెద్ద రాష్ట్రాలు ఫలితాలను తారుమారు చేసేశాయి. ప్రతి రాష్ట్రం అక్కడున్న ఓట్ల ఆధారంగా ప్రతినిదుల సభకు, సెనేట్‌కు సభ్యుల్ని పంపిస్తుంది. ఎలక్టోరల్‌ కాలేజ్‌లో 538 ఓట్లు ఉండగా 270 ఓట్లు పొందినవారే అధ్యక్షుడవుతారు. కొన్ని రాష్ట్రాల్లో అత్యధిక సభ్యులుంటారు. అభ్యర్థులు అక్కడే ప్రచారాన్ని కేంద్రీకరిస్తారు. సభ్యులు తక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఓట్లు ఏకపక్షంగా పడినప్పటికీ అధికంగా సభ్యలున్న రాష్ట్రాలే అధ్యక్షుడ్ని నిర్ణయిస్తున్నాయి. అందువల్లే ఎక్కువ మంది ప్రజలు ఓట్లేసినవారు కాకుండా ఎక్కువ మంది ప్రతినిధుల్ని గెలిపించుకున్నవారు అధికార పీటం ఎక్కుతున్నారు.

పారిశ్రామిక రాష్ట్రాలైన మిషిగాన్‌, పెన్సిల్వేనియా, విస్‌కాన్సిన్‌లో గతసారి ట్రంప్‌ 1 శాతం కంటే తక్కువ మెజారిటీతో ఎక్కువ సీట్లు పొందారు. ఇప్పుడు ఈ మూడు రాష్ట్రాల్లో బిడెన్‌ ముందంజలో ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. అదేవిధంగా ట్రంప్‌ భారీ మెజారిటీతో ఎక్కువ సీట్లు గెలుచుకున్న లోవా, ఓహియో, టెక్సాస్‌ రాష్ట్రాల్లో కూడా బిడెన్‌ ముందంజలో ఉండటం రిపబ్లికన్లను కలవరపెడుతోంది. అయితే రానున్న వారాల్లో పరిస్థితి ట్రంప్‌కు అనుకూలంగా మారిపోతుందని ఆయన ప్రచార మేనేజర్లు ఆశిస్తున్నారు. కాని ఎకనామిస్ట్‌ పత్రిక మాత్రం బిడెన్‌కే అనుకూలంగా ఉందని చెబుతోంది. ట్రంప్‌ తన హామీల్ని నిలబెట్టుకోకపోవడం కరోనా విషయంలో ఆయన వ్యవహరించిన తీరుతోనే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు.

కరోనా ఉధ్రుత రూపం దాల్చినపుడు మార్చిలో అమెరికా అంతటా ఎమర్జెన్సీ ప్రకటించారు. ఆ వెంటనే కరోనాను కట్టడి చేయడానికి 50 బిలియన్‌ డాలర్లను ట్రంప్‌ విడుదల చేశారు. ఆ సమయంలో 55 శాతం ట్రంప్‌కు మద్దతు పలికారు. ఆ సమయంలో డెమొక్రాట్లు అధ్యక్షుడు ట్రంప్‌కు ఏమాత్రం మద్దతీయలేదు. అయితే జులై నాటికి రిపబ్లికన్‌ మద్దతుదారులు కూడా ట్రంప్‌ చర్యల్ని ప్రశ్నించడం ప్రారంభించారు. ఇప్పుడు కరోనా మహమ్మారి అమెరికా ఎన్నికలను ప్రభావితం చేస్తుందనే ప్రచారం మొదలైంది. అందుకే నవంబర్‌ 3కు మందే వ్యాక్సిన్‌ను ప్రజలకు అందుబాటులోకి తేవాలని ట్రంప్‌ కంకణం కట్టుకున్నారు. అది ఎంతమేరకు నెరవేరుతుందో తెలియదు.

భారతీయ ఓటర్ల మాదిరిగానే అమెరికన్‌ ఓటర్లు కూడా ఒక పట్టాన అంతుపట్టరు. అదే సమయంలో అక్కడి ఎన్నికల వ్యవస్థ కూడా ఫలితాల్ని తారుమారు చేస్తుంటుంది. ఎక్కువ మంది ఓటర్లు మద్దతిచ్చినవారి కంటే ఎక్కువ మంది ప్రతినిధుల్ని గెలిపించుకోగలిగినవారే శ్వేతసౌధంలో కొలువు దీరుతారు. అందుకే ఎక్కువ సీట్లు ఉన్న రాష్ట్రాల మీదే పట్టు బిగించడానికి రెండు పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories