జూలియన్ అసాంజ్ ఒప్పుకున్న నేరమేంటి? అమెరికాతో కుదిరిన డీల్ ఏంటి?

Which Crime did Julian Assange Confess to What is the Deal With America
x

జూలియన్ అసాంజ్ ఒప్పుకున్న నేరమేంటి? 

Highlights

Julian Assange: జూలియన్ అసాంజ్ నేరం అంగీకరించేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు ఆయన కోర్టులో పత్రాలు సమర్పించారు.

Julian Assange: జూలియన్ అసాంజ్ నేరం అంగీకరించేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు ఆయన కోర్టులో పత్రాలు సమర్పించారు. అమెరికాలో గూఢచర్యం చట్టాన్ని ఉల్లంఘించారని ఆయనపై అభియోగాలున్నాయి.

52 ఏళ్ల అసాంజ్ అమెరికా జాతీయ రక్షణ పత్రాలను బహిర్గతం చేయడానికి కుట్ర పన్నారనే అభియోగాలను అంగీకరించినట్టుగా నార్తర్న్ మరియానా ఐలాండ్స్ డిస్ట్రిక్ట్ కోర్టులో పత్రాలు దాఖలు చేశారు. దీంతో కోర్టు విచారణకు హాజరయ్యేందుకు ఆయనను యూకే జైలు నుండి సోమవారం విడుదల చేశారు.


అసాంజ్‌కు ఎట్టకేలకు స్వేచ్ఛ

యూకేలోని అత్యంత భద్రత కలిగిన బెల్మార్ష్ జైలు నుండి విడుదలైన అసాంజ్.. అమెరికా ఫసిఫిక్ భూభాగంలోని సైపాన్ కోర్టుకు హాజరుకానున్నారు. ఆయన 1901 రోజులు బెల్మార్ష్ జైలులోనే గడిపారు. జైలు నుండి విడుదల కాగానే వికిలీక్స్ ఎక్స్ వేదికగా ‘జూలియన్ అసాంజే ఫ్రీ’ అంటూ ప్రకటనను విడుదల చేసింది. యూకే నుండి వెళ్లే ముందు అసాంజ్ నీలిరంగు చొక్కా, జీన్స్ ధరించి ప్రైవేట్ జెట్ విమానం ఎక్కుతున్న వీడియోను వికిలీక్స్ విడుదల చేసింది. ఈ కేసు విచారణ తర్వాత ఆయన అస్ట్రేలియాకు తిరిగి వస్తారని వికిలీక్స్ ఆ ప్రకటనలో వివరించింది. జూలియన్ స్వేచ్ఛను పొందారని ఆయన భార్య స్టెల్లా ఎక్స్ లో పోస్టు చేశారు.

సంచలనాలకు కేంద్రమైన వికిలీక్స్

వికిలీక్స్ ను అసాంజ్ 2006లో ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా ఆయన రహస్య డాక్యుమెంట్లు, వీడియోలను బహిర్గతం చేసి ప్రపంచ వ్యాప్తంగా పేరొందారు. బాగ్దాద్‌లో ఇద్దరు పాత్రికేయులు సహా డజను మందిని అమెరికా చంపిందని వికిలీక్స్ అప్పట్లో విడుదల చేసిన వీడియోలు ప్రపంచమంతటా సంచలనం సృష్టించాయి. యుఎస్ అపాచీ హెలికాప్టర్ దాడి దృశ్యాలు అప్పట్లో వికిలీక్స్ పేరు మోరుమోగేలా చేశాయి. 2010 ఆఫ్గనిస్తాన్, ఇరాక్ యుద్ధాలకు సంబంధించిన లక్షలాది యుఎస్ రహస్య పత్రాలను, దౌత్య కేబుల్స్ ను ఆయన బహిర్గతం చేశారు.


ట్రంప్ పాలనలో అసాంజేపై అభియోగాలు

వికిలీక్స్ అనేక దేశాలకు సంబంధించిన పలు రహస్య పత్రాలను బహిర్గతం చేసింది. అమెరికాకు ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో గూఢచర్యం చట్టాన్ని ఉల్లంఘించారని అసాంజ్ మీద 2019లో 17 అభియోగాలు మోపాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మాజీ ఆర్మీ ఇంటలిజెన్స్ అనలిస్ట్ చెల్సియా మానింగ్ తో కలిసి ఆయన కుట్ర పన్నారని అమెరికా న్యాయవాదులు వాదించారు. చెల్సియా మానింగ్ కు ఏడేళ్లు జైలు శిక్ష విధించారు. 2017లో అమెరికా అధ్యక్షుడు ఒబామా శిక్షను తగ్గించడంతో ఆమె విడుదలయ్యారు. ఇదిలా ఉంటే అసాంజ్‌పై క్రిమినల్ అభియోగాలు మోపడం భావ ప్రకటనా స్వేచ్చకు ముప్పు ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. ప్రభుత్వ అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘనలపై సంచలన కథనాలను బయటపెట్టినందునే అసాంజ్‌పై అభియోగాలు మోపినట్టుగా వికిలీక్స్ తెలిపింది.

అసాంజ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు

అసాంజ్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలతో స్వీడన్ వారంట్ పై 2010 లో లండన్ లో అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారణ నిమిత్తం ఆయనను స్వీడన్ కు పంపవచ్చని కోర్టు తీర్పు ఇవ్వడంతో 2012లో ఈక్వెడార్ లోని లండన్ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందారు. ఏడేళ్లు ఆయన చిన్న రాయబార కార్యాలయంలోనే ఉన్నారు.

ఈ సమయంలో స్వీడన్ పోలీసులు అసాంజ్‌పై మోపిన లైంగిక అభియోగాలను ఉపసంహరించుకున్నారు. బెయిల్ షరతులను ఉల్లంఘించారనే ఆరోపణలపై యూకే పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అమెరికా అప్పగింత కేసు కోర్టులో ఉండడంతో జైలులో నిర్బంధించారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న అసాంజ్ కేసును ఉపసంహరించుకోవాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్ పై ఒత్తిడి పెరగడంతో సోమవారం నాడు కోర్టులో ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేశారు.

అసాంజ్ కేసును పరిశీలించాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో అస్ట్రేలియా ప్రభుత్వం బైడెన్ ను కోరింది. ఏళ్ల తరబడి జైలులో అసాంజేను ఉంచడం వల్ల ఒరిగేదేమీ లేదని అస్ట్రేలియా ప్రభుత్వం అప్పట్లో వ్యాఖ్యానించింది. నేరాంగీకర పిటిషన్ డీల్ మీద స్పందించేందుకు అస్ట్రేలియా ప్రభుత్వ ప్రతినిధి నిరాకరించారు. విచారణ పూర్తయ్యే వరకు ఈ విషయమై స్పందించడం సముచితం కాదన్నారు.


అసాంజ్ తల్లి ఏమన్నారంటే

అసాంజ్ తల్లి నేరాంగీకార ఒప్పందంపై స్పందించారు. ఎట్టకేలకు తన కుమారుడి కష్టాలు ముగిసినందుకు ధన్యావాదాలు తెలిపారు. ఈ మేరకు ఆమె అస్ట్రేలియా మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు. నిశ్శబ్ద దౌత్యం ప్రాముఖ్యాన్ని, శక్తిని ఈ ఘటన రుజువు చేస్తుందని ఆమె అన్నారు.

అసాంజ్ విడుదలపై అస్ట్రేలియాలో హర్షాతిరేకాలు

జూలియన్ అసాంజ్‌ను జైలు నుండి విడుదల చేయాలని పోరాటం చేసిన ప్రజా ప్రతినిధులకు ఈ వార్త సంతోషాన్నిచ్చింది. అసాంజ్ విడుదల కావడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని అస్ట్రేలియా మాజీ ఉప ప్రధాని బర్నబీ జాయిస్ అన్నారు. అసాంజ్ కేసు ఇంకా ముగింపు దశకు చేరుకోలేదని ఆయన హెచ్చరించారు. అసాంజ్‌ను స్వదేశానికి ఆహ్వానించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టుగా అస్ట్రేలియన్ గ్రీన్స్ సెనేటర్ డేవిడ్ షో బ్రిడ్జ్ చెప్పారు.

అమెరికా న్యాయ శాఖ, అసాంజ్ మధ్య ఈ ఏడాది జూన్ లో ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం మేరకు అదనపు జైలు శిక్ష విధించబోమని అమెరికా అంగీకరించడంతో నేరాన్ని అసాంజ్ అంగీకరించినట్టుగా సమ్మతించారని సమాచారం. ఇందుకు సంబంధించిన లీగల్ ప్రక్రియ ప్రారంభమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories