Los Angeles Wildfires: లాస్ ఏంజెలెస్‌ను బుగ్గి చేసిన అడవి మంటలు.. కార్చిచ్చుకు అసలు కారణం ఏంటి?
Los Angeles Wildfires: కాలిఫోర్నియా స్టేట్‌లో కార్చిచ్చు ఎంతకీ శాంతించడం లేదు. మహోగ్రంగా మారిపోయిన అగ్ని కీలలు ఇండ్లు, చెట్లు, పుట్టలు అనే తేడా లేకుండా దహించేస్తూ దూసుకుపోతున్నాయి.
Los Angeles Wildfires: కాలిఫోర్నియా స్టేట్‌లో కార్చిచ్చు ఎంతకీ శాంతించడం లేదు. మహోగ్రంగా మారిపోయిన అగ్ని కీలలు ఇండ్లు, చెట్లు, పుట్టలు అనే తేడా లేకుండా దహించేస్తూ దూసుకుపోతున్నాయి. లాస్ ఏంజెలెస్ నగరంలోని ఖరీదైన గృహాలు కాస్తా బూడిగా మారిపోయితున్నాయి. 12 వేలకు పైగా నివాసాలు దహనమైపోగా.. ఇప్పటి వరకూ 24 మంది చనిపోయారు. కార్చిచ్చు వ్యాపించడానికి మానవ తప్పిదాలే కారణమని పర్యావరణవాదులు చెబుతున్నారు. న్యూఇయర్ వేడుకల టపాసులపై అనుమానానాలు మొదలయ్యాయి.
అమెరికా చరిత్రలోనే అత్యంత వినాశకర ప్రకృతి వైపరీత్యం ఇది. ఏటా కార్చిచ్చులు చెలరేగడం సర్వసాధారణమైపోయిన కాలిఫోర్నియా రాష్ట్రంలో ఈసారి రగిలిన మంటలు సామాన్యమైనవి కాదు. ముఖ్యంగా లాస్ ఏంజెలెస్‌లో కార్చిచ్చు ఎంతకీ శాంతించడం లేదు. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమై ప్రాంతంపై అగ్ని కీలలు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డాయి. కార్చిచ్చు తొలుత లాస్‌ఏంజెలెస్ ఉత్తర డౌన్‌టౌన్‌లో మొదలైంది. క్రమంగా విస్తరించింది. ఇది శాన్ ఫ్రాన్సిస్కో వైశాల్యం కన్నా అధికం. జె.పాల్ గెట్టీ మ్యూజియం, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వరకూ మంటలు చొచ్చుకొస్తున్నాయి. హాలీవుడ్ ప్రముఖులు నివసించే ప్రాంతాల్లోని విలాసవంతమైన గృహాలు, అపార్టుమెంట్ భవనాలు, వ్యాపార కేంద్రాలు నామరూపాల్లేకుండా పోయాయి.
లాస్ ఏంజెలెస్ ప్రాంతంలో చెలరేగిన మంటలు ఇప్పటి వరకూ 24 మందిని బలి తీసుకున్నాయి. ఇందులో అత్యధికంగా ఏటోన్ ఫైర్‌లోనే 16 మంది ప్రాణాలు కోల్పోగా.. పాలిసేడ్స్‌లో 8 మంది చనిపోయారు. అగ్నికీలలు ఇప్పటికిప్పుడు ఆరిపోయే పరిస్థితి లేకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. కార్చిచ్చు మొదలైన తర్వాత కొందరు కనిపించకుండాపోయారు. వారి ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు. బూడిద కుప్పల్లో అన్వేషిస్తున్నారు. ఇందుకోసం జాగిలాల సాయం తీసుకుంటున్నారు. మరోవైపు అదృశ్యమైన తమవారి కోసం బాధితులు అధికారులను సంప్రదిస్తున్నారు. కార్చిచ్చు నష్టపోయినవారిని అదుకోవడానికి మానవతావాదులు ముందుకొస్తున్నారు. నగదు, దుస్తులు, వస్తువులు, ఆహారం రూపంలో విరాళాలు అందజేస్తుందన్నారు.
అడవి మంటలకు మొత్తం 12,000 నిర్మాణాలు ఆహుతయ్యాయి. దాదాపు 160 చదరపు కిలోమీటర్ల పరిధిలోని అడవి కాలిబూడిదయ్యింది. మంటలు పాలిసేడ్స్‌లోని 23,707 ఎకరాలను, ఏటోన్‌లోని 14,117 ఎకరాలను, కెన్నెత్‌లోని 1,052 ఎకరాలు, హుర్సెట్‌లోని 779 ఎకరాలను దగ్ధం చేశాయి. ఇప్పటి వరకూ 12 లక్షల 92 వేల కోట్ల రూపాయల మేర ఆస్తులకు నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. విలువైన వస్తువులు, గృహోపకరణాలు అగ్నికీలల్లో మాడిపోయాయి. సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలంటూ లక్షా 50 వేల మందికి ఆదేశాలు జారీ చేశారు. నిరాశ్రయుల కోసం తొమ్మిది షెల్టర్లు ఏర్పాటు చేశారు. మంటలు ఆరిపోయిన తర్వాత తిరిగివచ్చిన బాధితులు బూడిగా మారిన ఇళ్లను చూసుకొని బోరున విలపిస్తున్నారు. అయితే కాలిపోయిన ఇళ్ల వద్దకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. శిథిలాల నుంచి ప్రమాదకరమైన వాయువులు వెలువడుతున్నాయని, అవి పీల్చడం ప్రాణాంతకమని చెబుతున్నారు.
కార్చిచ్చును అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది అహోరాత్రులు ప్రయతిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. మంటలను ఆర్పేందుకు 1,354 ఫైర్ ఇంజన్లు, 84 హెలికాప్టర్లు నిర్విరామంగా పని చేస్తున్నారు. 14,000 వేల మంది అగ్నిమాపక సిబ్బంది విధి నిర్వహణలో నిమగ్నమయ్యారు. మంటలను ఆర్పివేయడానికి స్థానిక అగ్నిమాపక దళంతో పాటు కెనడా, మెక్సికో నుంచి వచ్చిన అదనపు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలకు బలమైన ఈదురుగాలులు తోడవుతుండడంతో పరిస్థితి నియంత్రణలోకి రావడం లేదని అధికారులు చెప్పారు. మంటలు ఒక చోట నుంచి మరోచోటుకు వేగంగా వ్యాపిస్తున్నాయి. దట్టమైన పొగ అలుముకోవడం సహాయక చర్యలకు ఆటంకంగా మారుతోంది. మరోవైపు మంటలు ఆర్పడానికి చాలినంత నీరు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. 440 మిలియన్ లీటర్ల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్ ఖాళీ అయ్యింది. కొందరు సంపన్నులు విచ్చలవిడిగా నీరు వాడేశారని, అందుకే ఈ దుస్థితి ఏర్పడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
సంపన్న ప్రాంతమైన పాలిసేడ్స్ ప్రాంతంలో ఓవైపు అడవి మంటలు కొనసాగుతుంటే మరోవైపు దొంగలు చెలరేగిపోతున్నారు. కార్చిచ్చు బారి నుంచి కాపాడుకునేందుకు స్థానికులు ఇళ్లను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఈ ఇండ్లే దొంగలకు లక్ష్యంగా మారుతున్నాయి. ఆ ఇళ్లలోని ఖరీదైన వస్తువులను దోచేస్తున్నారు. లాస్ ఏంజెలెస్ పోలీసులు ఇప్పటి వరకూ 29 మంది మంది దొంగలను పట్టేసుకున్నారు. వీరిలో కొందరు ఫైర్ సిబ్బంది దుస్తులు ధరించి వచ్చినట్లు గుర్చించారు. ముఖ్యంగా అక్రమ వలసదారులు ఈ తరహా దొంగతనాల్లో పాల్గొంటున్నారని లాస్ ఏంజెలెస్ పోలీసులు తెలిపారు. ఖాళీ చేసిన ఇళ్లలో దొంగతనాలను నివరించేందుకు 400 మంది నేషనల్ గార్డ్స్‌ను మోహరించారు.
మరోవైపు కాలిఫోర్నియా కార్చిచ్చు ఇప్పటికూ రాజకీయ రంగు పులుముకుంది. అధికారుల చేతగానితనమేనని కాబోయే అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ విమర్శించగా.. డెమోక్రట్ సెనేట్, కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ ఆ విమర్శలను తిప్పి కొట్టారు. అంతేకాదు.. లాస్ ఏంజెలెస్ పూర్తిగా నాశనం కావడంతో.. ‘‘లాస్ ఏంజెలెస్ 2.0’’ పేరిట పునర్మిర్మాణ ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపారాయన. ఫెడరల్‌తో పాటు స్థానిక దర్యాప్తు సంస్థలు కార్చిచ్చు రాజుకోవడానికి గల కారణాలను పసిగట్టే పనిలో ఉన్నాయి. అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత వినాశకరమైన ప్రకృతి వైపరీత్యమని అని కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ అభివర్ణించారు.
లాస్ ఏంజెలెస్ ప్రాంతంలో ఎందుకు ఈ కార్చిచ్చు మొదలైంది అనే చర్చ మొదలైంది. మరోవైపు అతిపెద్దదైన పాలిసేడ్స్ ఫైర్‌కు న్యూఇయర్ వేడుకలే కారణం అని భావిస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా కాల్చిన టపాసులతో అంటుకొన్న మంటలు క్రమంగా రాజుకొని విస్తరించాయని భావిస్తున్నారు. సాధారణంగా అడువుల్లో పిడుగుపాటు కారణంగా మంటలు చెలరేగుతుంటాయి. కరెంటు స్తంబాలు నేలకొరిగినప్పుడు కూడా మంటలు వస్తుంటాయి. అయితే మానవ తప్పిదాలే చాలా సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యాలకు కారణమవుతున్నాయని పర్యావరణ వాదులు చెబుతున్నారు. అడవుల్లో కాల్చి పడేసిన సిగరెట్ పీకలు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఎండిపోయిన ఆకులు, గడ్డి సులభంగా అంటుకుని మంటలు చెలరేగుతుంటాయి. అడవుల్లో వేసే చలిమంటలు కూడా మరో కారణమని భావిస్తున్నారు. ఇకనైనా పర్యావరణ పరిరక్షణపై దృష్టి పెట్టకపోతే ప్రకృతి విపత్తులు మరింత ప్రమాద కరంగా మారుతాయని పర్యావరణ వాదులు ఆందదోళన వ్యక్తం చేస్తున్నారు.
కాలిఫోర్నియా రాష్ట్రంలో 2022, 2023లో వరుసగా రెండేళ్లు భారీగా వర్షాలు కురిశాయి. లాస్ ఏంజెలెస్ ప్రాంతంలో ఏకంగా 133 సెంటీమీటర్ల వర్షం పడింది. దీంతో చెట్లు బాగా పెరిగాయి. 2024లో పరిస్థితి ఒక్క సారిగా తారుమారైంది. లాస్ ఏంజెలెస్‌లో చాలా రోజులుగా వర్షాలు కురియడం లేదు. వర్షాలు పడక పోవడంతో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో అక్కడి అడువులు, కొండల్లో చెట్లు, చేమలు ఎండిపోయాయి. ఇవి త్వరగా అంటుకునే ప్రమాదం ఏర్పడింది. ప్రతి ఏటా ఈ సమయంలో శాంటా అనా’ గాలులు వీస్తుంటాయి. వీటి వేగం గంటకు 129 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ గాలులు కార్చిచ్చుకుతోడయ్యాయి. ఈ గాలుల వేగానికి మంటలను ఆర్పడం కూడా కష్టతరంగా మారింది. మంటలను ఆర్పేందుకు ఆకాశం నుంచి రసాయనాలను వెదజల్లేందుకు హెలికాప్టర్లు కూడా ఎగరలేకపోతున్నాయి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire