October 7 Hamas Attacks On Israel: ఇజ్రాయెల్‌పై హమాస్ దాడికి ఏడాది.. ఈ ఏడాదిలో ఎప్పుడేం జరిగింది? ఎవరెక్కువ నష్టపోయారు?

October 7 Hamas Attacks On Israel: ఇజ్రాయెల్‌పై హమాస్ దాడికి ఏడాది.. ఈ ఏడాదిలో ఎప్పుడేం జరిగింది? ఎవరెక్కువ నష్టపోయారు?
x
Highlights

what happened on october 7th 2023 in israel and how hamas attacked israel, how west asia region changed in this last one year

October 7 Attacks On Israel: ఇజ్రాయెల్‌పై గతేడాది అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాద సంస్థ దాడులు జరిపి ఏడాది పూర్తయింది. ఇజ్రాయెల్‌లోకి చొచ్చుకుపోయిన హమాస్ ఉగ్రవాదులు అక్కడ 1200 మందిని పొట్టనపెట్టుకోవడంతో పాటు 251 మందిని బంధీలుగా తీసుకున్నారు. అందులో 97 మంది ఇప్పటికీ వాళ్ల చెరలోనే బంధీలుగా ఉన్నారు. హమాస్ చేతుల్లో మిగతావారి ప్రాణాలు పోయే ఉంటాయని అందరూ భావిస్తున్నారు.

ఎంతో శక్తివంతమైన రక్షణ వ్యవస్థ, మొసాద్ లాంటి సీక్రెట్ ఇంటెలిజెన్స్ సంస్థ ఉన్న ఇజ్రాయెల్‌కి ఈ దాడి ఊహించని షాక్ ఇచ్చింది. అది మొదలు గత ఏడాది కాలంలో అడపాదడపా లెబనాన్‌, పాలస్తినాలోని హమాస్‌తో పాటు దాని అనుబంధ సంస్థ అయిన హెజ్బొల్లా మిలిటెంట్ స్థావరాలపై ఇజ్రాయెల్ సేనలు విరుచుకుపడుతూనే ఉన్నాయి. వీలు చిక్కినప్పుడల్లా అక్టోబర్ 7 ఎటాక్‌కి ప్రతీకారం తీర్చుకుంటూనే ఉన్నాయి. అందులో భాగంగానే ఇప్పటికే గాజాలో హమాస్, హెజ్బొల్లా ఫైటర్స్ తలదాచుకుంటున్నట్లుగా భావిస్తున్న ప్రాంతాలపై ఎయిర్ స్ట్రైక్స్ జరిపి అనేక భవనాలను నేలమట్టం చేశారు.

ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి అనంతరం గత ఏడాది కాలంగా జరుగుతున్న ప్రతీకార దాడులతో పశ్చిమాసియాలో పరిస్థితి అంతా ఒక్కసారిగా మారిపోయింది. ఇజ్రాయెల్ ప్రతీకారదాడులతో విరుచుకుపడుతుండటంతో ఎప్పుడు, ఎటువైపు నుండి ఏ బాంబు దాడి జరుగుతుందో అర్థంకాక లెబనాన్, పాలస్తినా వాసులు బిక్కుబిక్కుమంటున్నారు.

2007 నుండి ఇప్పటివరకు జరుగుతున్న ఈ ప్రతీకారదాడుల్లో ఒక్క గాజాలోనే 41 వేల మంది చనిపోయినట్లుగా అక్కడి ఆరోగ్య మంత్రిత్వ ఒక ప్రకటనలో పేర్కొంది. గాజా ఆర్థికంగా చితికిపోయింది. గాజా వాసులు ఆహార కొరతతో అల్లాడుతున్నారు. ఈ యుద్ధం కారణంగా 19 లక్షల మంది జనం తమ నివాసాలను కోల్పోయి రోడ్డునపడ్డారు. ఇప్పటికీ వాళ్లు హమాస్, హెజ్బొల్లా ఏర్పాటు చేస్తోన్న తాత్కాలిక టెంట్లు వంటి శిబిరాల్లోనే తలదాచుకుంటున్నారు. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు ఐక్యరాజ్య సమితి, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఇరువైపుల నుండి కాల్పుల విరమణ ఒప్పందానికి గతేడాది నవంబర్‌లో అమెరికా, కతార్, ఈజిప్ట్ దేశాల మధ్యవర్తిత్వంతో చేసిన ప్రయత్నాలు కొంతమేరకు ఫలించాయి. దీంతో హమాస్ చెర నుండి కొంతమంది బంధీలను విడిపించడంలో ఇజ్రాయెల్ సక్సెస్ అయింది. కానీ ఆ తరువాత మళ్లీ పరిస్థితి చేయిదాటిపోవడంతో పశ్చిమాసియాలో ఇక ఎప్పుడేం జరుగుతుందా అనే అనిశ్చిత వాతావరణం ఏర్పడింది.

పేజర్లు, వాకీటాకీలు పేల్చేసి హడలెత్తించిన ఇజ్రాయెల్

మొన్నటి సెప్టెంబర్ 17న హెజ్బొల్లాకు ఇజ్రాయెల్ ఎవ్వరూ ఊహించనిరీతిలో షాకిచ్చింది. హెజ్బొల్లా మిలిటెంట్స్ ఉపయోగిస్తోన్న పేజర్లను పేల్చేసింది. ఈ దాడిలో డజన్ మందికిపైగా చనిపోగా దాదాపు 3 వేల మంది వరకు గాయపడ్డారు. ఆ షాక్ నుండి ఇంకా తేరుకోకముందే ఆ మరునాడే వాకీటాకీలను పేల్చేసి మరోసారి ఇజ్రాయెల్ ప్రపంచానికి షాకిచ్చింది. ఓవైపు వైమానిక దాడులు, మరోవైపు గ్రౌండ్ ఎటాక్స్‌తో ఇజ్రాయెల్ తమ ప్రతీకారదాడులను కొనసాగిస్తూనే ఉంది.

హసన్ నస్రల్లా హత్యతో మరోసారి భగ్గుమన్న ఇరాన్

ఇరాన్ మద్దతుతో పనిచేస్తోన్న హెజ్బొల్లాకు నేతృత్వం వహిస్తోన్న హసన్ నస్రల్లాను మొన్నటి సెప్టెంబర్ నెలలో జరిపిన వైమానిక దాడుల్లో ఇజ్రాయెల్ మట్టుపెట్టింది. నస్రల్లా హత్య ఇజ్రాయెల్‌కి అతిపెద్ద విజయంగా చెబుతుండగా హెజ్బొల్లా, హమాస్ సంస్థలతో పాటు వాటికి మద్ధతిస్తోన్న ఇరాన్, లెబనాన్, పాలస్తినాలకు గట్టి ఎదురుదెబ్బగా తరువాతి పరిస్థితులు చెబుతున్నాయి. దీంతో ఇజ్రాయెల్‌పై మరోసారి ప్రతీకారదాడులకు వ్యూహరచన చేసిన ఇరాన్... ఈసారి అక్టోబర్ 1న రాత్రివేళ ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ మిస్సైల్స్ వర్షం కురిపించింది. ఇజ్రాయెల్‌పై 180 నుండి 200 వరకు మిస్సైల్స్ ప్రయోగించింది. 90% మిస్సైల్స్ తమ లక్ష్యాలను ఛేదించాయని ఇరాన్ ప్రకటించినప్పటికీ.. ఇజ్రాయెల్ మాత్రం అమెరికా సేనలతో కలిసి ఆ మిస్సైల్ ఎటాక్‌ని సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు స్పష్టంచేసింది. అంతేకాదు.. ఇజ్రాయెల్ ఇప్పటివరకు ఇరాన్ మిసైల్ ఎటాక్ వల్ల నష్టం జరిగినట్లుగా ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు.

ఇరాన్‌పై ప్రతీకారదాడికి సిద్ధమైన ఇజ్రాయెల్.. చూస్తూ ఊరుకోం అంటున్న ఇరాన్

మిస్సైల్ ఎటాక్స్ చేసి ఇరాన్ పెద్ద తప్పు చేసిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ఇరాన్ అంతకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని ఇజ్రాయెల్ స్పష్టంచేసింది. ఈసారి ఇజ్రాయెల్ చేయబోయే దాడి కచ్చితంగా భారీస్థాయిలోనే ఉంటుందనేది పశ్చిమాసియాలో పరిస్థితిని గమనిస్తున్న వారి అభిప్రాయం. ఇజ్రాయెల్ ఈసారి ఇరాన్‌లోని చమురు నిక్షేపాలపై దాడి చేస్తుందా లేక అక్కడి అణ్వాయుధ స్థావరాలపై దాడి చేస్తుందా అనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. అయితే, ఇరాన్ కూడా అంతే గట్టిగా స్పందించింది. ప్రతీకారదాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోం అని ఇరాన్ హెచ్చరించింది.

గతేడాది అక్టోబర్ 7న హమాస్ దాడి హమాస్ vs ఇజ్రాయెల్ అన్నట్లుగానే మొదలైనప్పటికీ.. ఈ ఏడాది కాలంలో వరుస ప్రతీకారదాడులతో అది కాస్తా దేశాల మధ్య యుద్ధం జరుగుతోందా అనేంతగా మారిపోయింది. బయటి నుండి చూడ్డానికి ఇరాన్ vs ఇజ్రాయెల్ అనేట్లుగానే కనిపిస్తున్నప్పటికీ.. ఆ చుట్టూనే ఉన్న ఇజ్రాయెల్ మిత్రదేశాలు, ఇరాన్ మిత్ర దేశాలు కూడా ఈ యుద్ధంలో భాగమయ్యే అవకాశాలు లేకపోలేదు. దీంతో ఇప్పుడిది రెండు దేశాల మధ్య యుద్ధం కాదు.. అంతకుమించిన యుద్ధం అనే స్థాయికి వెళ్లిపోయింది. అందుకే ప్రపంచదేశాలు సైతం రేయింబవళ్లు పశ్చిమాసియాపై ఓ కన్నేసిపెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories