Donald Trump: అమెరికా ప్రెసిడెంట్‌గా మొదటి రోజే ట్రంప్ తీసుకోబోయే నిర్ణయాలు

What Donald Trump is going to do on Day 1 in White house: అమెరికా అధ్యక్షుడిగా డోనల్డ్ ట్రంప్ గెలిచారు. అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే తీసుకునే సంచలన నిర్ణయాలు ఏంటి అనేదే ఇప్పుడు చాలామంది ముందున్న సందేహం. ఆ విషయంలో ట్రంప్ ఫుల్ క్లారిటీతో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేస్తానని గతేడాది డిసెంబర్‌లోనే ట్రంప్ ప్రకటన చేశారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే బాధ్యతలు తీసుకున్న తొలిరోజే తాను తీసుకోబోయే నిర్ణయాల గురించి వివరించారు.

తనపై ఉన్న కేసుల కొట్టివేత, దేశం సరిహద్దులను మూసేయడం, అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని వారి సొంత దేశాలకు తిరిగి పంపించడం, వాషింగ్టన్ డీసీలో అమెరికా పార్లమెంట్‌పై దాడి చేసిన వారిపై కేసులు కొట్టేయడం.. ఇలా ఇంకెన్నో సంచలన నిర్ణయాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మొదటి రెండు సెకన్లలోనే వారిని ఫైర్ చేస్తా - ట్రంప్

తనపై ఉన్న రెండు ఫెడరల్ కేసులను వాదిస్తున్న స్పెషల్ కౌన్సిల్‌ను తక్షణమే తొలగిస్తానని ట్రంప్ స్పష్టంచేశారు. అది కూడా పదవిని చేపట్టిన తరువాత రెండు సెకన్లలోనే ఆ పని చేస్తానని చెప్పారు. ట్రంప్‌ను బాగా ఇబ్బంది పెట్టిన కేసులలో అడల్ట్ ఫిలిం స్టార్ స్టార్మీ డానియెల్ కేసు ఒకటి. డోనల్డ్ ట్రంప్‌తో తనకు శారీరక సంబంధం ఉందని, ఆ విషయం దాచిపెట్టేందుకు ఆయన తనకు 1,30,000 డాలర్లు ఇచ్చారని స్టార్మీ డానియెల్ కోర్టుకెక్కారు. ఈ కేసుతో కోర్టు విచారణ ఎదుర్కొన్న మొట్టమొదటి అమెరికా మాజీ అధ్యక్షుడిగా ఆయన రికార్డుకెక్కారు. అందుకే తనని అంత చికాకు పెట్టిన ఆ కేసును వాదించిన స్పెషల్ కౌన్సిల్ భరతం పట్టడంలో ట్రంప్ ఏ మాత్రం వెనుకాడటం లేదని ఆయన చేసిన ప్రకటనే చెబుతోంది.

అమెరికా అధ్యక్షుడి హోదాలో క్రిమినల్ కేసుల విషయంలో ఏ నిర్ణయమైనా తీసుకునే స్వేచ్ఛ ఆయనకు ఉంటుంది. ఆ విచక్షణాధికారాలే ట్రంప్ ఇలాంటి ప్రకటన చేయడానికి కారణమయ్యాయి. ఎన్నికల నిర్వహణలో ట్రంప్ జోక్యం చేసుకున్నారనే అభియోగాలతో జార్జియాలో మరో కేసు నమోదైంది. ఈ కేసును 2029 వరకు హోల్డ్ చేసే ఆలోచనలో ట్రంప్ ఉన్నారు.

కోటి 10 లక్షల మంది క్రిమినల్స్‌ను దేశం దాటిస్తా

ట్రంప్ తీసుకోబోయే రెండో నిర్ణయం అక్రమ వలసదారులను దేశం దాటించడం. అక్రమ వలసదారులను ట్రంప్ క్రిమినల్స్‌తో పోల్చారు. అమెరికా చెబుతున్న లెక్కల ప్రకారం దాదాపు ఒక కోటి 10 లక్షల మంది అక్రమంగా ఉంటున్నారు. అంత మందిని సొంత దేశాలకు తిప్పి పంపడం అనేది సాధారణ విషయం కాదని అక్కడి విశ్లేషకులు చెబుతున్నారు. అందుకు భారీ సంఖ్యలో పోలీసులు, ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్‌తో పాటు అనేక విభాగాలు పనిచేయాల్సి ఉంటుంది. పెద్ద సంఖ్యలో విమానాలు కావాలి. అన్నింటికి మించి వారిని తిరిగి తీసుకోవడానికి ఆయా దేశాలు కూడా ఒప్పుకోవాలి. ఇవన్నీ ట్రంప్ ఎదుట ఉన్న సవాళ్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఆ ప్రభుత్వ అధికారుల ఉద్యోగాలపై కఠిన నిర్ణయం

అమెరికా ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వం నిర్ణయాలను రిపోర్టర్లకు లీక్ చేస్తున్నట్లుగా కొంతమంది సివిల్ సర్వీస్ ఉద్యోగులపై ఆరోపణలున్నాయి. వారిని ఆ ఉద్యోగాల్లోంచి సాగనంపించే యోచనలో ట్రంప్ ఉన్నారు. ఈ నిర్ణయం కొన్ని వేల మంది ఉద్యోగుల భవితవ్యాన్ని ప్రశ్నార్ధకం చేయనుంది.

అమెరికా పార్లమెంట్‌పై దాడి చేసిన 1500 మందికి ఊరట

అమెరికా పార్లమెంట్‌పై దాడి చేసిన 1500 మందికి ఊరట కల్పిస్తానని ట్రంప్ చెప్పారు. వినడానికి ఇది కొంచెం విడ్డూరంగా ఉంది కదా. కానీ రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్లు అమెరికా అధ్యక్షుడు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. 2021 జనవరి 6న భారీ సంఖ్యలో డోనల్డ్ ట్రంప్ మద్దతుదారులు అమెరికా పార్లమెంట్ భవనంపై దాడికి వెళ్లారు. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా గెలిచి ఇంకా బాధ్యతలు తీసుకోవడానికి ముందు జరిగిన ఘటన ఇది. అమెరికా కాంగ్రెస్ భవనం వద్ద అల్లర్లకు కారణమైన ఈ ఘటనలో దాదాపు 1500 మందిపై కేసులు నమోదయ్యాయి. వాళ్లంతా కూడా దేశభక్తి కలిగిన వాళ్లుగా ట్రంప్ అభిప్రాయపడ్డారు. అందుకే వారిని ఆ కేసుల నుండి విముక్తి చేయనున్నట్లు ట్రంప్ చెప్పారు.

చైనాకు భారీ సుంకం రూపంలో షాక్

డోనల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా వచ్చీ రావడంతోనే చైనాకు గట్టి షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ విషయాన్ని కూడా ఎన్నికల హామీలలో ఆయనే చెప్పారు. అమెరికా దిగుమతి చేసుకుంటోన్న ఉత్పత్తులపై భారీగా సుంకం విధించనున్నట్లు ట్రంప్ చెప్పారు. ముఖ్యంగా చైనా నుండి వచ్చే ఉత్పత్తులపై ఈ సుంకం ఇంకాస్త ఎక్కువే ఉంటుందన్నారు. తాను తీసుకునే ఈ నిర్ణయం అమెరికాలో పరిశ్రమలు పెరిగి స్థానికంగా ఉపాధి కల్పనకు బాటలు వేస్తుందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories