Income Tax: నలుగురిని కంటే.. లైఫ్ లాంగ్‌ ట్యాక్స్‌ ఫ్రీ..

Want to Avoid Paying Income Tax Have 4 or More Babies
x

Income Tax: నలుగురిని కంటే.. లైఫ్ లాంగ్‌ ట్యాక్స్‌ ఫ్రీ

Highlights

Hungary: ప్రపంచ జనాభా ఏటా భారీగా పెరుగుతోంది. భారత్ వంటి దేశాల్లో మరీ ఎక్కువగా ఉన్నది. 2020లో ప్రపంచ జనాభా 784 కోట్ల మంది.

Hungary: ప్రపంచ జనాభా ఏటా భారీగా పెరుగుతోంది. భారత్ వంటి దేశాల్లో మరీ ఎక్కువగా ఉన్నది. 2020లో ప్రపంచ జనాభా 784 కోట్ల మంది. ఇది 2021 నాటికి 790 కోట్లు, 2022 నాటికి 797 కోట్లకు, 2023 నాటికి 804 కోట్లకు ప్రపంచ జనాభా చేరుకుంది. ఈ సంఖ్యలను చూస్తే జనాభా ఏటా పెరుగుతోంది. కానీ.. వాస్తవానికి ఏడాదికి ఏడాది జనాభా పెరుగుదల తగ్గుతోంది. కానీ.. చాలా దేశాల్లో జనాభా క్రమంగా తగ్గుతోంది. జనాభా తగ్గడమంటే.. అది ఏ దేశానికైనా శాపమే. ఎందుకంటే.. ఎంత సంపద ఉన్నా.. జనాలు లేకపోతే దాన్ని ఏం చేసుకుంటారు? ఇప్పుడు ఇలాంటి సమస్య ఓ యూరోప్‌ దేశానికి ఎదురయింది. అందుకే జనాభాను పెంచుకునేందుకు వినూత్నమైన ఆలోచనలు చేస్తోంది. నలుగురు కంటే ఎక్కువ సంతానాన్ని కంటే.. జీవితాంతం ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం లేదంటూ స్వయంగా ఆ దేశ ప్రధానమంత్రి ప్రకటించారు. అలా అయినా ప్రజలు ఎక్కువ మందిని కంటారని ఆశపడుతున్నారు.

అంటే.. ఇది ఆ దేశంలోని జనాభా తగ్గుదల ఎంత ప్రమాదకరంగా మారిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇంతకు ఇలా ప్రకటించిన యూరోప్‌ దేశం ఏది? అంటే.. హంగేరి. మీకు తెలుసా.. 1989లోనే హంగేరి దేశ జనాభా కోటి 40వేల మంది ఉన్నారు. కానీ.. 2024 జనవరి నాటికి ఈ జనాభా భారీగా పెరగాలి. కానీ.. అందుకు విరుద్ధంగా ఆ దేశంలో జనాభా పడిపోయింది. ప్రస్తుతం ఆ దేశ జనాభా 96 లక్షల మందే. జనాభాను పెంచుకోవడానికి గత్యంతరం లేక ఆ దేశం వలసదారులను ప్రోత్సహించాల్సి వస్తోందని హంగేరి ఆవేదన వ్యక్తం చేస్తోంది.

నిజానికి యూరోప్‌లోని చాలా దేశాల్లో జనాభా క్షీణిస్తోంది. జననాల రేటు భారీగా పడిపోయింది. ఈ క్రమంలో హంగేరి అప్రమత్తమయ్యింది. దేశ జనాభాను పెంచేందుకు వినూత్న చర్యలకు ఉపక్రమించింది. తాజాగా ఆ దేశ ప్రధాని విక్టర్ ఓర్బన్ మాట్లాడుతూ.. యూరోప్‌లో జననాలు భారీగా పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో గత్యంతరం లేక తాము వలసలను ప్రోత్సహించాల్సి వస్తోందని వాపోయారు. అందుకే జనాభాను పెంచేందుకు ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నట్టు వెల్లడించారు. నలుగురు కంటే ఎక్కువ మంది పిల్లలను కంటే.. జీవితకాలం ఆదాయ పన్ను నుంచి మినహాయింపును ఇస్తున్నట్టు ప్రకటించారు.

చిన్నారుల సంరక్షణ కేంద్రాలను 21వేలకు పెంచినట్టు హంగేరి ప్రధాని ప్రకటించారు. అంతేకాదు.. పెద్ద కుటుంబాలు పెద్ద పెద్ద కార్లను కొనుగోలు చేయడానికి వీలుగా సబ్సిడీలను కూడా ఇస్తామని ఓర్బన్ వెల్లడించారు. ఇలాంటి మినహాయింపులతో కుటుంబ వ్యవస్థను, పెళ్లిళ్లను ప్రోత్సాహించినట్టు అవుతుందని పీఎం స్పష్టం చేశారు. ఒకవేళ జనాభాను పెంచుకోకపోతే స్వదేశంలో తాము మైనార్టీలుగా మారడం ఖాయమని హెచ్చరించారు. ఇది ఒక్క హంగేరికే పరిమితం కాదని.. యూరోప్‌ అంతా ఇలాగే మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే హంగేరిలో జనాభా తగ్గడం కొత్తేమీ కాదు. నిజానికి 2021లో హంగేరీ జనాభా 97 లక్షల మంది కాగా.. 2022లో కాస్తా పెరిగింది. దేశ జనాభా 99 లక్షల మందికి చేరింది.

దీంతో 2019లో జననాల రేటు పెంపునకు ప్రకటించని ప్రోత్సాహకాలు ఫలించాయని హంగేరి సంబరపడింది. 2022లో 99 లక్షల మంది జనాభా ఉండగా.. 2023లో కోటి మందికి చేరింది. అయితే 2024లో మళ్లీ జనాభా సంఖ్య పడిపోయింది. అదే సమయంలో జనాల రేటు కూడా తగ్గడంతో హంగేరిలో మళ్లీ ఆందోళన మొదలైంది. 2024లో ప్రతి వెయ్యి మందికి కేవలం 9 మందినే కన్నారు. 2023తో పోల్చుకుంటే 0.43 శాతం తగ్గింది. నిజానికి హంగేరి 2019 నుంచే జనాభా క్షీణించడంపై దృష్టి సారించింది. వివాహాలకు సబ్సిడీ రుణాలను అందించే వినూత్న ప్రక్రియకు తెరలేపింది. 41 ఏళ్ల లోపు పెళ్లి చేసుకునే జంటలకు రుణాల్లో 33 వేల డాలర్ల సబ్సిడీని ప్రకటించింది.

మన కరెన్సీలో చెప్పాలంటే.. 27వేల రూపాలకు పైగా సబ్సిడీ లభిస్తుందన్నమాట. అంతేకాదు.. ఇద్దరు పిల్లలను కంటే వారు తీసుకున్న రుణాల్లో మూడో వంతు మాఫీ చేస్తామని అప్పట్లో ప్రకటించింది. ముగ్గురు పిల్లలను కంటే మొత్తం రుణం మాఫీ చేసింది. నిజానికి ఈ ప్రోత్సాహకాలు కొంత ఫలితాలను ఇచ్చాయి. కానీ.. మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చింది. అందుకే ఈసారి మరిన్ని ప్రోత్సాహకాలను హంగేరీ ప్రకటించింది. అందులో భాగంగానే నలుగురు కంటే ఎక్కువ పిల్లలను కంటే.. లైఫ్ లాంగ్‌ టాక్స్‌ మినహాయింపును ప్రకటించింది. ఇక యూరోప్‌లోని మరో దేశం ఫ్రాన్స్‌ కూడా జననాల రేటు పడిపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ దేశంలో జననాల రేటు హగేరి కంటే దారుణంగా ఉంది.

ప్రతి వెయ్యి మందికి కేవలం ఆరుగురు పిల్లలు జన్మించారు. 2023లో ఫ్రాన్స్‌లో 6 లక్షల 78 వేల మంది పిల్లలు న్మించారు. 2022తో పోలిస్తే.. జననాల రేటు 7 శాతం తగ్గింది. 2020లో పోలిస్తే మాత్రం జననాల రేటు 20శాతం పడిపోయింది. ఇది ఆ దేశ జనాభా సంక్షోభాన్ని ఎత్తి చూపుతోంది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత.. ఫ్రెంచ్‌ జననాల రేటు ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. అయితే జనాభా సంక్షోభాన్ని అరికట్టేందుకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మాక్రాన్ ఎలాంటి చర్యలు చేపట్టారు? ఫ్రాన్స్‌లో తల్లిదండ్రులకు ఇచ్చే సెలవులను మాక్రాన్‌ పెంచారు. ప్రస్తుతం తలిదండ్రులకు ఫ్రాన్స్‌లో రెండు రకాల సెలువులను ఇస్తున్నారు. ఒకటి ప్రాథమిక ప్రసూతి సెలవు, రెండోది అదనంగా ఏడాది సెలువు.

నిజానికి ఈ సెలవుల సమయంలో పూర్తి స్థాయిలో జీతాలను చెల్లించడం లేదు. ఫ్రాన్స్‌లో ప్రసూతి, ఏడాది సెలవుల సమయంలో నెలకు 453 డాలర్ల కంటే ఎక్కువగా వేతాన్ని ఇవ్వడం లేదు. పైగా జాబ్‌ మార్కెట్‌ నుంచి మహిళలు దూరమవుతున్నారు. ప్రసూతి సెలవు సంవత్సరం పాటు ఉంటుంది. ఈ నేపథ్యంలో మాక్రాన్‌ ప్రభుత్వం సమూల మార్పులను ప్రతిపాదిస్తోంది. తల్లిదండ్రులు ఇద్దరూ పిల్లలతో 6 నెలలు గడపాలని, ఆ సమయంలో కూడా మంచి వేతనమే ఇస్తామని చెబుతున్నది. ముందు ప్రసూతి సెలవులు.. డెలివరీ తరువాత లీవ్‌ను కూడా ఇస్తారు. ఇది వ్యూహాత్మకంగా పని చేస్తుందని నిపుణులు గట్టిగా చెబుతున్నారు. అయితే హంగేరి, ఫ్రాన్స్‌ జనాభా సంక్షోభానికి కారణమేమిటి?

ఆర్థిక వ్యవస్థ, వాతావరణ మార్పులతో సమస్యలు పెరిగాయని 30 శాతం మంది యూరోప్‌ జంటలు చెబుతున్నాయి. పిల్లలను పెంచడం ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారిందని 28 శాత మంది ఫ్రెంచ్ జంటలు వాపోతున్నాయి. కనుక ఇది సంస్కృతిక మార్పు కానేకాదు. అంటే.. పిల్లలను వద్దని యూరోపియన్లు కోరుకోవడం లేదన్నమాట. నిజానికి 66 శాతం జంటలు కనీసం ఒక బిడ్డనైనా కనేందుకు సిద్ధ పడుతున్నారు. 20 శాతం మంది మాత్రమే ఇద్దరు పిల్లలను కనేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. కానీ.. వారిని పరిస్థితులు అడ్డుకుంటున్నాయి. అధిక ద్రవ్యోల్బణం, వాతావరణ మార్పులు వంటి భయాలు యూరోపియన్లను వెంటాడుతున్నాయి. అదే సమయంలో రుణాలు పెరుగుతున్నాయి.

ప్రస్తుతం ఆరోగ్య సంరక్షణ స్ట్రాంగ్‌గా ఉంది. అందుకే ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తున్నారు. గతేడాది ఫ్రాన్స్‌ మరణాల రేటు 6.5 శాతానికి తగ్గింది. హంగేరిలో అయితే ప్రతి వెయ్యి మందిలో కేవలం సగటున 15 మంది మాత్రమే చనిపోతున్నారు. దీనికి కారణం ప్రజల ఆరోగ్యం ఆర్గానిక్‌గా ఉంది. అంటే పిల్లలు పుట్టకుండా ప్రభుత్వాలు అడ్డుకోవడం లేదు. అలా అని ఎక్కువ మంది పిల్లలను కనమని కూడా బలవంతం చేయడం లేదు. ఇన్నాళ్లు ఈ సమస్యను పెద్దగా యూరోప్ దేశాలు పట్టించుకోలేదు. కానీ.. ఇప్పుడు చాలా దేశాలు జనాభా పడిపోవడంపై దృష్టి సారిస్తున్నాయి. పైగా వలసలను నివారించాలని కోరుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో సొంతంగా జనాభాను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని యూరోపియన్ దేశాలు భావిస్తున్నాయి. అందులో భాగంగానే యువ జంటలకు భారీగా ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నాయి. పెళ్లిళ్లు చేసుకోవాలని.. పిల్లలను కనాలని కోరుతున్నాయి. అయితే యూరోపియన్లు పిల్లలను కనేందుకు ఆసక్తి చూపుతారా? లేదా? అన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే మరి.

Show Full Article
Print Article
Next Story
More Stories