డెత్‌ స్పాట్‌గా ఆన్‌లైన్‌ గేమ్స్‌.. సడన్‌గా ఆగిపోతున్న చిన్నారుల గుండెలు.. మరి మీ పిల్లలు పదిలమేనా..?

Representational image
x

Representational image

Highlights

Kids: వీడియో గేమ్స్‌.. యూతే కాదు.. చిన్నారులు కూడా వాటికి బానిసలే.

Kids: వీడియో గేమ్స్‌.. యూతే కాదు.. చిన్నారులు కూడా వాటికి బానిసలే. కాస్త టైమ్ దొరికితే చాలు మొబైల్ లేదా సిస్టమ్‌ ముందు కూర్చొవడం ఆన్‌లైన్‌ ఆటల్లో మునిగిపోవడం కామన్‌ అయిపోయింది. ఇక మల్టీ ప్లేయర్‌ గేమ్స్‌కైతే గంటల కొద్దీ ఆడుతూ అడిక్ట్‌ అయిపోతున్నారు. కానీ చిన్నారులకు వీడియో గేమ్స్ అంత సేఫ్ కాదట. అదే పనిగా ఆడితే ఏకంగా వారి గుండెపైనే ఎఫెక్ట్‌ పడుతుందట. మరి గేమ్స్‌కు, హార్ట్‌కు మధ్య లింకేంటి..? వణుకు తెప్పిస్తున్న శాస్త్రవేత్తల విశ్లేషణలపై హెచ్‌ఎంటీవీ స్పెషల్ ఫోకస్.

ఆటలేవైనా ఆహ్లాదరకంగా ఉండాలి. మానసిక ఉల్లాసానికి తోడ్పడాలి. శారీరకంగానే కాదు, మానసికంగా కూడా దృఢంగా చేసేలా ఉండాలి. కానీ కాలం మారిపోయింది. ఆరుబయట ఆడటం పోయి ఆన్‌లైన్‌లోనే ఆటలాడే రోజులు ఎప్పుడో వచ్చాయి. శారీరక శ్రమ లేకుండా ఇంట్లోనే కూర్చొని ఆటలాడేస్తున్నారు. అయితే గత కొన్నేళ్లుగా ఆడటం వల్ల చాలామంది ఈ వీడియో గేమ్స్‌కు అడిక్ట్‌ అయ్యారు. నిత్యం ఏదో సమయం చూసుకుని మరీ మొబైల్ లేదా ట్యాబ్‌, అదీ కాకపోతే మానిటర్‌లో ఏం చక్కా గేమ్స్‌ ఆడేస్తున్నారు.

ప్రస్తుతం ఆన్‌లైన్ గేమ్స్‌ వేల కోట్ల వ్యాపారం. వేలల్లో కంపెనీలు, కోట్లల్లో గేమర్స్. వెతికే ఓపిక ఉండాలే కానీ ప్లే స్టోర్‌లో వందలకొద్దీ యాప్స్‌ కనిపిస్తాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఏదో ఆటకు బానిసే. అందుకే ఈ బిజినెస్‌లోకి బడా కంపెనీలు సైతం వచ్చిపడ్డాయి. మొన్నటివరకు పబ్జీ గేమ్స్‌కు.. యూత్ ఎంతలా అడిక్ట్‌ అయ్యారో తెలిసిందే. అది కాస్తా బ్యాన్ కావడంతో ప్రస్తుతం ఆ బ్యాచ్‌ అంతా ఫ్రీ ఫైర్ కు టర్న్ అయ్యారు. ఇక చిన్నారుల కోసం ప్రత్యేకమైన గేమ్స్‌ చాలానే ఉన్నాయి. రేసింగ్‌, షూటింగ్‌, వార్‌ లాంటి గేమ్స్‌ పిల్లల కోసం ప్రత్యేకంగా తయారుచేసి ఉన్నాయి. చూడగానే ఆడలానే ఆంగ్జైటీ కలిగేలా డిజైన్ చేయబడి ఉంటాయి. దీంతో వాటిలోకి పిల్లలు త్వరగా ఎంట్రీ ఇస్తున్నారు.

అంతేకాదు ఇవి అన్‌ లిమిటెడ్‌ పీరియడ్‌తో గేమ్స్‌ డిజైన్ చేసి ఉంటాయి. దీంతో ఒక్కసారి మొదలు పెడితే ఇక అంతే వాటికి అంతే ఉండదు. గంటల కొద్దీ ఆ ఆటపైనే కూర్చోవాలి. తిండి, నిద్ర కూడా మర్చిపోయి ఆడేస్తూ ఉంటారు. అలాంటి ఆటలతో కంపెనీలకు కావాల్సిన రెవెన్యూ జనరేట్ అవుతుంది. మల్టి ప్లేయర్ గేమ్స్‌ అయితే ఇంకా కిక్కు ఉంటుంది. ఎక్కువ మందితో ఆడి గెలవాలనే కసి ఉంటుంది. దీంతో అలాంటి గేమ్స్‌కు ఆక్యూపెన్సీ ఎక్కువ.

అయితే ఎక్కువగా ఇలా వీడియో గేమ్స్‌ ఆడే పిల్లల్లో ఆరోగ్య సమస్యలు వస్తాయని ఎన్నో అధ్యయనాలు చాలాకాలం క్రితమే వచ్చాయి. కానీ ప్రస్తుతం తెరపైకి వచ్చిన కథనం మాత్రం వణుకు తెప్పిస్తోంది. అదే పనిగా ఆటలాడే పిల్లల్లో ఏకంగా హృద్రోగ సమస్యలు తలెత్తుతాయన్న నివేదికలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఏకంగా ప్రాణాపాయంగా పరిణమించే ప్రమాదం పొంచి ఉందని తేల్చిచెబుతున్నారు. ఆస్ట్రేలియాలోని హార్ట్ సెంటర్‌ ఫర్ చిల్డ్రన్ పరిశోధకులు ఈ సందర్భంగా ఓ నివేదికను రూపొందించారు. హార్ట్‌ రిథమ్‌ అనే జర్నల్‌లో ఈ నివేదికను ప్రచురించారు.

వీడియో గేమ్స్‌ అందులో ముఖ్యంగా యుద్ధాలు జరిగే ఆటలు ఆడుతున్న చిన్నారుల్లో ఈ రకమైన ముప్పును కనుగొన్నట్లు నివేదికలో వివరించారు. ఈ గేమ్స్‌ ఆడే సమయంలో చిన్నారుల్లో గుండెపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుందని చివరకు అది ప్రాణాపాయంగా పరిణమిస్తుందని తెలిపారు. ఆటలు ఆడుతూ ఒక్కోసారి స్పృహ కోల్పోవడం కూడా జరుగుతుందని మల్టీ ప్లేయర్ యుద్ధాల తరహా గేమ్స్‌లో ఎక్కువ మంది పిల్లలు స్పృహ తప్పిపోయినట్లు గుర్తించినట్లు పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. కొంతమందికైతే ఏకంగా గుండె ఆగిపోయిందని వివరించారు. మెడికల్ టెర్మినాలజీ ప్రకారం కాటెకొలామినెర్జిక్‌ పాలీమార్ఫిక్‌ వెంట్రిక్యులర్‌ టాకీకార్డియా, కాంటెనిటల్‌ లాంగ్‌ క్యూటీ సిండ్రోమ్ వంటి సమస్యలు గేమ్స్‌ ఆడే పిల్లల్లో తలెత్తుతాయని ఇవి క్రమంగా గుండె పనితీరుపై ప్రభావం చూపుతాయని నివేదికలో పొందుపర్చారు.

అయితే అలా ఆటలాడుతూ స్పృహ‌కోల్పోతే చిన్నారులను వెంటనే కార్డియాలజీ వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. వాస్తవానికి కొంతమంది పిల్లల్లో హృదయ స్పందన క్రమబద్ధంగా ఉండదు. తల్లిదండ్రులు దాన్ని ముందుగా గుర్తించరు. అలాంటి చిన్నారులు వీడియో గేమ్స్‌ ఆడినప్పుడు వారి హృదయంపై తీవ్ర ఒత్తిడి నెలకొని ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం పొంచి ఉంటుంది. ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో పిల్లలను ఓ కంట కనిపెట్టుకోవాలంటున్నారు నిపుణులు. ఈ విషయంలో సంబంధిత ఆరోగ్య సంస్థలు కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పరిశోధకులు వివరిస్తున్నారు. మరోవైపు ఆటలాడే సమయంలో గెలవాలన్న తపన ఉన్న సమయంలో బాడీలో బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందని తద్వారా అది గుండె అనారోగ్యానికి దారి తీస్తుందని కూడా అధ్యయనాలు వచ్చాయి.

ఒక్క గుండె సంబంధిత సమస్యలే కాదు.. వీడియో గేమ్స్‌ ఆడే పిల్లల్లో ఉబకాయమే అతి భారీ సమస్య. ఒకే దగ్గర కూర్చొని గంటల కొద్దీ కదలకుండా గేమ్స్ ఆడుతూ శారీరక శ్రమ లేకుండా గడుపుతున్నారు. తద్వారా చిన్నారుల్లో అధిక బరువు సమస్య తలెత్తుతోంది. ఇలా లావెక్కడానికి ఆహారపు అలవాట్లు కూడా దోహదం చేస్తాయి. ఈ ఉబకాయం ముందు ముందు భారీ అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి. ఫలితంగా చిన్న వయస్సులోనే పెద్ద సమస్యలను తలకెత్తుకోవాల్సి వస్తుంది.

మరోవైపు ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడే పిల్లలే లక్ష్యంగా సైబర్‌ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్‌గా గేమ్‌ ఆడుతున్న సమయంలో సైబర్ మోసగాళ్లు ఏదో లింకును పంపిస్తారు. దాన్ని క్లిక్ చేస్తే ఆ మొబైల్‌ నెంబర్‌కు లింక్‌ అయిన బ్యాంక్ అకౌంట్‌ నుంచి డబ్బులు మాయం అవుతున్నాయి. ఇక మరో రకమైన మోసం ఏంటంటే ఆన్‌లైన్‌ గేమ్స్‌లో నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లేందుకో గేమ్‌ అప్‌గ్రేడ్‌ అయ్యేందుకో పాయింట్లు, లైఫ్‌లు వంటిని పొందేందుకో ఏదైనా విభిన్న సేవల పేరుతో యూజర్‌ నుంచి భారీ మొత్తాన్ని వసూలు చేస్తాయి. ఈ సమయంలో పిల్లలకు తెలియకుండా వేలు, లక్షలతో వాటిని కొనుగోలు చేస్తారు. ఇలాంటి ఘటనలు కూడా మనదేశంలో చాలానే జరిగాయి. ఇలా గేమ్స్‌తో చిన్నారులు రకరకాలుగా నష్టపోతున్నారు. ఫలితంగా వారి కుటుంబాలకు తీరని వేధన మిగిలిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories