America Wildfire: లాస్ ఏంజెల్స్ తగలబడిపోతోంది... అసలేమైంది? ఈ కార్చిచ్చుకు అసలు కారణం ఏంటి ?

America Wildfire: లాస్ ఏంజెల్స్ తగలబడిపోతోంది... అసలేమైంది? ఈ కార్చిచ్చుకు అసలు కారణం ఏంటి ?
x
Highlights

Los Angeles Wildfire latest news updates: లాస్ ఏంజెల్స్ తగలబడిపోతోంది... క్యాలిఫోర్నియా కార్చిచ్చుకు అసలు కారణం ఏంటి ?

Reasons behind Los Angeles wildfire : అమెరికాను కార్చిచ్చు హడలెత్తిస్తోంది. జనవరి 7న క్యాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్‌లో మొదలైన ఈ వైల్డ్ ఫైర్ ఇప్పటికి వారం రోజులు గడుస్తున్నప్పటికీ రోజుకింత పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. అమెరికాలో ఇప్పటికి ఇలా 17 సార్లు వైల్డ్ ఫైర్ రాజుకుని అడవులు తగలబడిపోయాయి. కానీ ఈస్థాయిలో 24 మందిని బలిదీసుకుని వేల ఎకరాల మేర మంటలు వ్యాపించడం, వేల కోట్లలో ఆస్తులు అగ్నికి ఆహుతవడం మాత్రం ఇదే మొదటిసారి అని అమెరికన్ మీడియా చెబుతోంది.

లాస్ ఏంజెల్స్‌లో ప్రస్తుతం ఎటు చూసినా బూడిదే కనిపిస్తోంది. మంగళవారం వరకు అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం ఇప్పటికే 30 వేల ఎకరాలకుపైగా ఈ కార్చిచ్చు వ్యాపించింది. అసలు ఈ కార్చిచ్చుకు కారణం ఏంటి? అమెరికాలో తరచుగా అడవులు ఎందుకు తగలబడుతున్నాయి? ఈ వైల్డ్ ఫైర్ ఆపేందుకు అమెరికా ఏం చేస్తోంది? ప్రభుత్వం ఏం చెబుతోందనేదే నేటి ట్రెండింగ్ స్టోరీ.

ఎటుచూసినా బొగ్గు, బూడిదే

అమెరికా చరిత్రలో ఇదే అతి పెద్ద ప్రకృతి విపత్తు. అమెరికాలో అడవులు తగలబడటం ఇవాళ కొత్తేం కాదు. కానీ ఈసారి ఆ వైల్డ్ ఫైర్ అన్‌స్టాపబుల్ అంటోంది. ఎన్ని ఫైర్ ఇంజన్లు వచ్చినా, ఎన్ని హెలీక్యాప్టర్లతో ట్యాంకుల కొద్ది నీరు గుమ్మరించినా మంటలు అదుపులోకి రావడం లేదు. పైగా మంటలు ఆ పక్కనే ఉన్నకొత్త ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం లాస్ ఏంజెల్స్‌లో కనుచూపుమేరలో ఎటుచూసినా ఓవైపు నగరాన్ని మింగేస్తోన్న మంటలు, మరోవైపు కాలిబూడిదైన భవనాలే కనిపిస్తున్నాయి. మంచు కురిసినట్లుగా పైనుండి బూడిద రాలుతోంది. అక్కడక్కడ నిప్పురవ్వలు ఎగిరిపడుతున్నాయి.

మంటలు ఎక్కడ రాజుకున్నాయి... ఎలా వ్యాపించాయి?

లాస్ ఏంజెల్స్‌కు పశ్చిమాన 32 కిమీ దూరంలోని పాలిసేస్‌లో జనవరి 7న ఈ వైల్డ్ ఫైర్ మొదలైంది. లాస్ ఏంజెల్స్ మాత్రమే కాదు, క్యాలిఫోర్నియాలోని చుట్టుపక్కల నగరాల ఫైర్ ఇంజన్లన్నీ వచ్చి ఆర్పినా ఆ మంటలు అదుపుకాలేదు. పదుల సంఖ్యలో హెలిక్యాప్టర్స్ ట్యాంకులలో నీళ్లు మోసుకెళ్లి గుమ్మరిస్తున్నాయి. ఇక్కడ 23వేల ఎకరాలకు పైగా స్థలంలో మంటలు అంటుకున్నాయి. అందులో అనేక జనావాసాలు, పెద్దపెద్ద అంతస్తులు, రాజ భవనాలు మంటల్లో కాలిబూడిదయ్యాయి.

ఈ మంటలు అదుపులోకి రాకముందే లాస్ ఏంజెల్స్‌కు ఉత్తరం వైపున ఈటన్ ప్రాంతంలో మంటలు అంటుకున్నాయి. ఇక్కడ కూడా 14,000 ఎకరాలకు మంటలు వ్యాపించాయి. శాన్ ఫెర్నాండోకు ఉత్తరాన హస్ట్ అనే చోట కూడా మంటలంటుకున్నాయి. ఇక్కడ 800 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆస్తులన్నీ కాలీబూడిదయ్యాయి.

ప్రాణాలు అరచేత పట్టుకుని...

హస్ట్‌లో ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినప్పటికీ లాస్ ఏంజెల్స్‌లోనే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మొత్తం లక్షలాది మందిని ఇళ్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. కాలిపోతున్న ఇళ్లను, ఆస్తులను చూసి గుండెలపై బాదుకుంటూ ఆర్తనాదాలు పెడుతున్నారు. ఉత్తి చేతులతో ప్రాణాలరచేత పట్టుకుని లాస్ ఏంజెల్స్ ఖాళీ చేసి వెళ్తున్నారు. ఇళ్లన్నీ కాలి బూడిదవడంతో లక్షల మంది నిరాశ్రయులయ్యారు. తాము తిరిగొచ్చాక ఎక్కడుండాలి, బతకడానికి ఏం చేయాలని గుండెలవిసేలా రోదిస్తున్నారు. కాలిపోతున్న తమ ఇళ్లవైపు చూస్తూ రోడ్లపైనే రోజులు వెళ్లదీస్తున్నారు. దాదాపు 1200 ఇళ్లు, మరో 200 బిజినెస్ కాంప్లెక్సులు, ఆఫీసులు, పరిశ్రమల భవనాలు పూర్తిగా కాలిబూడిదయ్యాయి.

లక్షల కోట్లలో ఆస్తి నష్టం

ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సుమారు 250 బిలియన్ డాలర్ల నుండి 275 బిలియన్ డాలర్ల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనాలు వస్తున్నాయి. ఒక బిలియన్ డాలర్ అంటే 8 వేల 657 కోట్ల రూపాయలకు సమానం. ఆ లెక్కన చూస్తే లాస్ ఏంజెల్స్ లో జరిగిన ఆస్తి నష్టం మొత్తం లక్షల కోట్లలో ఉంటుందని ఒక అంచనా.

బూడిదైన హాలీవుడ్, వ్యాపార ప్రముఖుల ఇళ్లు

సముద్రం ఒడ్డున ఉన్న హాలీవుడ్ హిల్స్ అనే ప్రాంతం మొత్తం అగ్నికి ఆహుతైంది. ఇక్కడ భారీ సంఖ్యలో హాలీవుడ్ ప్రముఖులు ఉన్నారు. మిలియన్ డాలర్లు పెట్టి రాజ భవనాల తరహాలో కట్టుకున్న వారి కలల సౌదాలన్నీ అందులోనే కాలి బూడిదయ్యాయి. హాలీవుడ్ సూపర్ స్టార్ మెల్ గిబ్సన్, ప్యారిస్ హిల్టన్, బిల్లీ క్రిస్టల్, జాన్ గుడ్‌మన్, బెల్లా హడీడ్... ఇలా చెప్పుకుంటూపోతే ఆ లిస్ట్ చాలా పెద్దదే ఉంది.

ఇళ్లు విడిచిపెట్టిన ఇండియన్ సెలబ్రిటీలు

ఎంతోమంది బాలీవుడ్ తారలకు కూడా లాస్ ఏంజెల్స్ లో సొంతిళ్లు ఉన్నాయి. అమెరికా వెళ్లినప్పుడల్లా వారు అక్కడే ఉంటారు. ఇంకొంతమంది అక్కడే స్థిరపడ్డారు. లాస్ ఏంజెల్స్ వైల్డ్ ఫైర్ ఘటనపై ప్రీతి జింటా స్పందిస్తూ... దేవుడి దయ వల్ల తమ కుటుంబం సురక్షితంగానే బయటపడినట్లు తెలిపారు. నోరా ఫతేహి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెడుతూ... 5 నిమిషాల క్రితమే పోలీసులు తనని ఇళ్లు ఖాళీ చేయించారని తెలిపారు. ప్రియాంకా చోప్రా తన ఇంట్లోంచి చూస్తే కాలిపోతున్న నగరం కనిపిస్తోందని తెలిపారు. ఇక బతుకుదెరువు కోసం అమెరికా వెళ్లిన భారతీయుల పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. ఏం చేయాలో, ఎక్కడికెళ్లాలో తెలియక అక్కడి నుండి అమెరికాలోనే మరో చోటుకు రీలొకేట్ అవ్వాలా అనే సందిగ్ధంలో వాళ్లు రోజులు వెళ్లదీస్తున్నారు.

క్యాలిఫోర్నియా ప్రభుత్వం ఫెయిల్ - ట్రంప్

లాస్ ఏంజెల్స్ కార్చిచ్చుపై డొనల్డ్ ట్రంప్ స్పందించారు. క్యాలిఫోర్నియా అధికార యంత్రాంగం, ప్రభుత్వం ఫెయిలైందని ట్రంప్ అన్నారు. ఎంతకీ మంటలు అదుపులోకి రాకపోవడంతో ట్రంప్ వాదనతో ఏకీభవించే వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది.

అసలీ వైల్డ్‌ఫైర్‌కు కారణమేంటి?

లాస్ ఏంజెల్స్ తగలబడటానికి కారణం ఏంటనేదే ఇప్పుడు అందరినీ వేధిస్తోన్న ప్రశ్న. అమెరికా డిటెక్టివ్స్ దీనిపైనే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. రెండో ప్రదేశమైన ఈటన్ లో అగ్ని ప్రమాదానికి సౌతెర్న్ క్యాలిఫోర్నియా ఎడిసన్ అనే ఎలక్ట్రికల్ కంపెనీ నిర్లక్ష్యమే కారణమంటూ న్యాయవాదులతో కూడిన ఒక లా ఫర్మ్ కేసు పెట్టింది. బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు వచ్చిన తరువాత కూడా ఆ ఎలక్ట్రికల్ కంపెనీ వారు ఓవర్ హెడ్ వైర్లలో విద్యుత్ సరఫరా నిలిపేయలేదని, అందువల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆ సంస్థ ఆరోపిస్తోంది. దీనిపై విచారణ జరుగుతోంది. కానీ అసలు మొదటి ప్రమాదానికి కారణమైన నిప్పు ఎక్కడ, ఎలా పుట్టిందనేది ఇప్పటివరకు తేలనేలేదు. ప్రస్తుతం పోలీసులు, ఫైర్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి మంటలు ఆర్పే పనిలో, జనాలను ఖాళీ చేయించే పనుల్లోనే బిజీ అయ్యారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో కాల్చిన ఫైర్ క్రాకర్స్ వల్లే ఈ ప్రమాదం జరిగిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

పొంచి ఉన్న మరో ప్రమాదం

ఇప్పటికే బిక్కుబిక్కుమంటున్న లాస్ ఏంజెల్స్ కు మరో ప్రమాదం పొంచిఉంది. బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది మంటలకు మరోసారి ఆజ్యం పోసే ప్రమాదం ఉందన్న ఆలోచనే వారికి హడలెత్తిస్తోంది. 3400 మంది అగ్నిమాపక శాఖ సిబ్బంది ప్రస్తుతం మంటలు ఆర్పేపనిలో బిజీగా ఉన్నారు. త్వరలోనే మంటలు అదుపులోకి రావాలని, లాస్ ఏంజెల్స్ ఊపిరి పీల్చుకోవాలని మనం కూడా కోరుకుందాం.

Show Full Article
Print Article
Next Story
More Stories