భారత్‌కు సానుకూలంగా అమెరికా నిర్ణయం

US House Waives Sanctions on India’s Defence Deals with Russia
x

భారత్‌కు సానుకూలంగా అమెరికా నిర్ణయం

Highlights

*ఆంక్షల నుంచి మినహాయిపును ఇవ్వాలని.. దిగువ సభలో భారత సంతతి సభ్యుడు ఖన్న బిల్లు

America: రష్యా చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై విరుచుకుపడిన అమెరికా.. అనూహ్య నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి ఎస్‌-400 క్షిపణులను కొన్నందుకు భారత్‌పై విధించిన ఆంక్షల విషయంలో మినహాయింపును ఇచ్చేందుకు తాజాగా అమెరికా ప్రతినిధుల సభ అంగీకారం తెలిపింది. ఆమేరకు కాట్సా చట్టాన్ని సవరించేందుకు భారత సంతతికి చెందిన రో ఖన్నా అమెరికన్‌ కాంగ్రెస్‌లో బిల్లును ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటుద్వారా కాంగ్రెస్‌ దిగువ సభ బిల్లును ఆమోదించింది. దీంతో భారత్ - అమెరికా సంబంధాలు మరింత పటిష్ఠమవుతాయని కాంగ్రెస్‌ సభ్యుడు ఖన్నా తెలిపారు. అయితే ఈ బిల్లును ఎగువ సభను కూడా ఆమోదించాల్సి ఉంటుంది.

2014లో ఉక్రెయిన్‌ ఆధ్వర్యంలోని క్రిమియాను రష్యా ఆక్రమించింది. నాటి నుంచి రష్యాపై అమెరికా సహా పశ్చిమ దేశాలు భారీ ఆంక్షలను విధించాయి. ఆ తరువాత 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ రష్యా జోక్యం చేసుకుందన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 2017లో కాట్సా పేరుతో ఆంక్షల ద్వారా అమెరికా ప్రత్యర్థుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం కింద రష్యా రక్షణశాఖతో లావాదేవీలు నిర్వహించే దేశాలపై అమెరికా ఆంక్షలను విధిస్తోంది. ఇదిలా ఉంటే 2018లో రష్యా నుంచి ఐదు యూనిట్ల ఎస్‌-400 గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థలను కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో భారత్‌పై ఆంక్షలు తప్పవంటూ అప్పటి ట్రంప్‌ సర్కారు భారత్‌ను హెచ్చరించింది. దేశ భద్రతా ప్రయోజనాల దృష్ట్యా భారత్ ఈ ఒప్పందం విషయంలో ముందడుగే వేసింది. దీనిపై ఆంక్షలకు ట్రంప్‌ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. అంతకుముందే ఎస్‌-400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసిన టర్కీపై అమెరికా కాట్సాను ప్రయోగించింది.

అయితే భారత్‌పై ఆంక్షలు విధించకుండా మినహాయింపు ఇవ్వాలని కోరుతూ అమెరికాలో భారత సంతతికి చెందిన కాంగ్రెస్‌ నేతల నుంచి అభ్యర్థనలు వచ్చాయి. తాజాగా భారత సంతతికి చెందిన కాంగ్రెస్‌ సభ్యుడు రో ఖన్నా ఇటీవల చట్ట సవరణకు దిగువ సభలో బిల్లును ప్రవేశపెట్టారు. రష్యా నుంచి భారత్‌ భారీగా ఆయుధాలను కొనుగోలు చేసిందని ఉన్నట్టుండి మాస్కోతో ఢిల్లీ తెగతెంపులు చేసుకోలేదని ఖన్నా వివరించారు. సరిహద్దులో చైనా, పాకిస్థాన్‌ల నుంచి ముప్పు పెరుగుతోందని భారత్‌కు ఆయుధాల కొనుగోలు తప్పనిసరి పరిస్థితి అని ఆయన స్పష్టం చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో రష్యా ఆయుధాలను వదిలి అమెరికా, ఐరోపా నుంచి కొనుగోలు చేయడానికి సమయం పడుతుందని తెలిపారు. అప్పటివరకు కాట్సా ఆంక్షల నుంచి భారత్‌కు మినహాయింపును ఇవ్వాలని సభను ఖన్నా కోరారు. భారత్‌కు ఆంక్షల నుంచి మినహాయింపును ఇవ్వడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడుతాయని ఖన్నా వివరించారు.

ఖన్నా ప్రవేశపెట్టిన బిల్లను అమెరికా కాంగ్రెసస్‌లోని దిగువ సభ ఆమోదించింది. అయితే ఈ బిల్లు ఇక్కడి నుంచి ఎగువ సభకు వెళ్తుంది. ఎగువ సభ ఆమోదం తెలిపిన తరువాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వద్దకు చేరుతుంది. చివరిగా బైడెన్‌ సంతకం పెడితేనే దీనికి అమోదం లభిస్తుంది. అప్పుడే కాట్సా ఆంక్షల నుంచి భారత్‌కు మినహాయింపు లభించినట్టు అవుతుంది. అయితే కాట్సా ఆంక్షలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదేని గత ఏప్రిల్‌లో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకన్‌ తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య చేపట్టిన తరువాత పశ్చిమ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మాస్కోపై కఠిన ఆంక్షలు విధించాయి. అదే సమయంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు భారత్‌ ఒప్పందం చేసుకుంది. దీనిపై అమెరికాతో సహా పశ్చిమ దేశాలు భారత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే ముడి చమురు కొనుగోలు ఆంక్షల కిందికి రావన్న విషయాన్ని భారత్ అమెరికాకు స్పష్టంగా తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories