*మూడోసారి అధ్యక్షుడిగా జిన్‌పింగ్ అయ్యేలా.. వైరస్‌ను అదుపు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు
China: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టుగా మారింది చైనీయుల పరిస్థితి. మూడోసారి అధ్యక్షుడు కావాలన్న జిన్‌పింగ్ కల అక్కడి ప్రజలు పడారని పాట్లు పడుతున్నారు. అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఇంకా నెల రోజుల సమయం ఉండడంతో జిన్‌పింగ్‌కు తమ విధేయత చూపేందుకు.. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు.. కరోనా కట్టడికి చేస్తున్న హడావిడి.. ప్రజలను కన్నీరు పెడుతుంది. తాజగా దేశమంతటా లాక్‌డౌన్ విధించారా? అన్నట్టుగా చైనా పరిస్థితి మారిపోయింది. ఏకంగా ఆ దేశంలోని 33 ప్రధాన నగరాలు లాక్‌డౌన్లలో మగ్గుతున్నాయి. ప్రపంచమంతా ప్రజలు సాధారణ జీవితం ఆస్వాధిస్తుంటే.. చైనీయులు మాత్రం జీరో కోవిడ్‌లో చిక్కుకుపోయారు.
చైనా కమ్యూనిస్టు పార్టీ-సీసీపీ 20వ జాతీయ సమావేశాలు అక్టోబరు 16న ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లోనే సీసీపీ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోనున్నారు. చైనా ప్రస్తుత అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ముచ్చటగా మారోసారి అధ్యక్ష బాధ్యతలను చేపట్టాలని కలలు కంటున్నారు. అయితే అదే సమయంలో వూహాన్‌లో పుట్టిన కరోనా చైనాను ఇంకా కలవర పెడుతూనే ఉంది. అధ్యక్ష ఎన్నిక నేపథ్యంలో జిన్‌పింగ్‌కు విధేయతను చూపించడానికి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు వైరస్‌ను కట్టడి చేసేందుకు భారీ హడావిడి చేస్తున్నారు. వారి అత్యుత్సాహం కారణంగా చైనా మూడో వేవ్ వచ్చిందా? అన్నట్టుగా అనుమానం వ్యక్తమవుతోంది. దేశ వ్యాప్తంగా 33 ప్రధాన నగరాలు మూతపడ్డాయి. అయితే వైరస్ కట్టడికి జీరో కోవిడ్ పాలసీ పేరుతో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న జిన్‌పింగ్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా ప్రపంచ ఎలక్ట్రానిక్ మార్కెట్ నగరం షెన్‌జెన్‌ను పూర్తిగా మూసేశారు. గ్వాంగ్‌డాంగ్‌లో ప్రావిన్స్‌లోని ఈ నగరంలో కోటి 80 లక్షల మంది జనాభా ఉన్నది. వారిలో 90 శాతం మంది నిత్యం కోవిడ్ పరీక్షలు చేయించుకుంటున్నారు.
నైరుతి సిచువాన్ ప్రావిన్స్ రాజధాని చెంగ్డులో 2 కోట్ల 100 లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఈ నగరంలో ఇటీవల 492 కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో అధికారులు భారీగా కరోనా నిర్ధారణ పరీక్షలను చేపట్టింది. గ్వాంగ్‌జౌ, ఈశాన్య ప్రాంతంలోని ఓడరేవు నగరం డాలియన్‌తో సహా ఇతర ప్రధాన నగరాలు నిర్మానుష్యంగా మారాయి. బీజింగ్‌లోని కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థుల కార్యకలాపాలపై నియంత్రణలను కఠినతరం చేశారు. ఇవే కాకుండా.. ప్రజలు అత్యవసరమైతే తప్ప.. ఇళ్ల నుంచి బయటకు రాకూడదంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. నగరాల్లోని ప్రజలైతే.. కిరాణ సరుకుల కోసం ఒక్కో కుటుంబంలో ఒక్కరు మాత్రమే బయటకు రావాలంటూ ఆంక్షలు విధిస్తున్నారు. మరో వారంలోగా వందకు పైగా నగరాల్లో లాక్‌డౌన్ విధించే అవకాశం ఉన్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే జిన్‌పింగ్ ప్రభుత్వంపై, జీరో కోవిడ్ పాలసీపై ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. కరోనా కట్టడి చేస్తున్నారా? లేక వరుస లాక్‌డౌన్లతో ప్రజలను చంపేస్తున్నారా? అంటూ అక్కడి ప్రజలు పాలకులపై మండిపడుతున్నారు. అయినా కూడా జిన్‌పింగ్ ప్రభుత్వం మాత్రం డోంట్ కేర్ అంటూ జీరో కోవిడ్ పాలసీపై కఠినంగానే వ్యవహరిస్తోంది.
చైనా వ్యాప్తంగా ఇప్పటివరకు 60 లక్షల మందిపైగా వైరస్ బారిన పడ్డారు. 24వేల 806 మంది వైరస్ బారిన పడి.. మృతి చెందారు. తొలిసారి కరోనా విజృంభించిన సమయంలోనే వైరస్ కట్టడికి జిన్‌పింగ్ ప్రభుత్వం జీరో కోవిడ్ విధానాన్ని తీసుకువచ్చింది. అయితే 2021 చివరి నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో ప్రపంచ వ్యాప్తంగా వైరస్ అదుపులోకి వచ్చింది. భారత్‌తో సహా పలు దేశాల్లో ఇప్పటికీ కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అయినా ఏ దేశంలోనూ పెద్దగా కరోనా నిబంధనలు అమలు చేయడం లేదు. కానీ.. చైనా మాత్రం ఇప్పటికీ వైరస్ పేరు చెబితే ఉలిక్కిపడుతోంది. ఒక్క కేసు నమోదైతే.. వెయ్యి కేసులు నమోదవుతున్నట్టుగా భయాందోళనకు గురవుతోంది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా.. డ్రాగన్ మాత్రం వైరస్‌ను పారదోలేకపోతోంది. కరోనా వేరియంట్ ఒమిక్రాన్.. జిన్‌పింగ్ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. జిన్‌పింగ్ ప్రభుత్వం చేస్తున్న ఓవర్ యాక్షన్‌కు ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణంలో ఎక్కడ లాక్‌డౌన్ ప్రకటిస్తారోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వరుస లాక్‌డౌన్లతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉపాధిని కోల్పోయి.. తినడానికి తిండిలేని పరిస్థితి నెలకొన్నది.
ఎలాగైనా మూడో సారి అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలని జిన్‌పింగ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే చైనా కమ్యూనిస్టు పార్టీలో ఓ వర్గం.. జిన్‌పింగ్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. మరోసారి జిన్‌పింగ్ అధ్యక్షుడు అయ్యే అవకాశాలు లేవని కొందరు విశ్లేషిస్తున్నారు. మరి కొందరు మాత్రం జిన్‌పింగ్‌కు కమ్యూనిస్టు పార్టీలో తిరుగులేదని చెబుతున్నారు. జీరో కోవిడ్, దేశంలో నెలకొంటున్న ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న నిరుద్యోగాన్ని నివారించడంలో జిన్‌పింగ్ ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శిస్తున్నారు. నిజానికి జీరో కోవిడ్ విధానంపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. అయినా జిన్‌పింగ్ ప్రభుత్వం మాత్రం జీరో కోవిడ్‌పై తగ్గేదే లేదంటూ భీష్మించింది. ప్రపంచ దేశాల్లో ప్రజలంతా ప్రశాంతంగా గడుపుతుంటే.. చైనాలో మాత్రం కోట్లాది మంది ప్రజలు లాక్‌డౌన్లలోనే మగ్గుతున్నారు. వరుస లాక్‌డౌన్లతో దేశవ్యాప్తంగా పరిశ్రమలు మూతపడ్డాయి. పరిశ్రమల్లో ఉత్పత్తి పడిపోయింది. కేవలం పరిశ్రమలపైనే ఆధారపడిన చైనా.. ఆర్థిక వ్యవస్థ.. వ్యవస్థ పతనం దిశగా అడుగులేస్తోంది. అయినా జిన్‌పింగ్ ప్రభుత్వం నివారణ చర్యలను చేపట్టడంలో విఫలమైంది. దీనికి తోడు బ్యాంకింగ్ రంగం కుదేలవడంతో.. పరిస్థితులు అధ్వానంగా మారాయి.
కరోనా వైరస్, ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, ప్రజల్లో వ్యతిరేకతతో పాటు తైవాన్ సమస్యలు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు తలనొప్పిగా మారాయి. నిత్యం అమెరికా ప్రతినిధులు... తైవాన్‌లో పర్యటిస్తున్నా.. చైనా మాత్రం కేవలం హెచ్చరికలతోనే సరిపెడుతోంది. ప్రస్తుతం జిన్‌పింగ్‌కు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire