భారత ఉపఖండంలో కరోనా హాట్ స్పాట్ లు ఇవే!

భారత ఉపఖండంలో కరోనా హాట్ స్పాట్ లు ఇవే!
x
Highlights

ఉపఖండంలో ఉన్న పెద్ద దేశం ఇండియా. జనాభా కూడా చాలా ఎక్కువ. మరి ఇండియాలో కరోనా ప్రభావం ఎలా ఉంది...? అసలు మొదటి కేస్ ఎక్కడ ట్రేస్ అవుట్ అయ్యింది..?...

ఉపఖండంలో ఉన్న పెద్ద దేశం ఇండియా. జనాభా కూడా చాలా ఎక్కువ. మరి ఇండియాలో కరోనా ప్రభావం ఎలా ఉంది...? అసలు మొదటి కేస్ ఎక్కడ ట్రేస్ అవుట్ అయ్యింది..? ప్రస్తుత పరిస్థితి ఏంటో తెలుసుకుందాం..?

భారత్ లో రోజురోజుకు కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కల్గిస్తోంది. మొదట ఒక కేసుతో మొదలై.. నెల రోజుల పాటు నెమ్మదిగా పెరిగిన కేసుల సంఖ్య ఆ తర్వాత వారం వారం రెట్టింపైయాయి. మొదటి నెల రోజుల్లో కరోనా కేసులు పెద్దగా పెరగలేదు. ఆ నెలంతా కూడా కేవలం 3 కేసులే నమోదయ్యాయి. రెండో నెలలలో కేసుల సంఖ్య క్రమేపీ పెరిగిపోయింది. జనవరి 30 నాటికి ఒకటే కేసు నమొదైంది. కేసుల సంఖ్య 10కి చేరడానికి 34 రోజులు పట్టింది. ఆ తర్వాత 6 రోజుల్లో కేసులు 50కి పెరిగాయి. తర్వాత 4 రోజుల్లో కేసుల సంఖ్య 100 దాటింది. అనంతరం 6 రోజులకు కేసులు 200కి చేరాయి. తర్వాత 4 రోజుల్లో 500 దాటాయి. అనంతరం 5 రోజుల్లో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత 3 రోజుల్లోనే 1800 దాటాయి. తర్వాత ఒక రోజులో కేసుల సంఖ్య 2 వేలు దాటింది.

ఢిల్లీ మర్కజ్‌లో మత ప్రార్థనలకు హాజరైన వారిలో చాలా మందికి కరోనా సోకడంతో మనదేశంలో కోవిడ్-19 సంఖ్య భారీగా పెరిగింది. ఈ క్రమంలో మొత్తం కేసుల సంఖ్య 2 వేల మార్క్‌ను దాటింది. 21 రోజుల లాక్ డౌన్‌తో ఎక్కడికక్కడ బంద్ అయ్యాయి. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ఆంక్షలు విధించారు. వలస కార్మికులు వేర్వేరు రాష్ట్రాల్లో ఇరుక్కుపోయి కష్టాలు పడుతున్నారు. కరోనాపై పోరాటానికి భారత ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కూడా ప్రవేశ పెట్టింది.

భారత ఉపఖండంలో ముఖ్యమైన దేశం బంగ్లాదేశ్. ఈ దేశంలో కరోనా ప్రభావం ఎలా ఉంది..? కరోనాను ఎదుర్కొనేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి..? ఒకసారి చూద్దాం.

భారత్‌ సరిహద్దులో ఉన్న బంగ్లాదేశ్‌లో కూడా కరోనా కల్లోలం కొనసాగుతోంది. బంగ్లాదేశ్‌లో మొదటి మూడు కరోనా కేసులు మార్చి 7న నమోదైయాయి. అయితే భారత్, పాకిస్థాన్‌తో పోలిస్తే కరోనా నిర్థారణ పరీక్షలు తక్కువగా జరిగాయని అంటున్నారు. అందుకే పాజిటివ్ కేసులు సంఖ్య కూడా బంగ్లాదేశ్‌లో తక్కువగా ఉందని చెబుతున్నారు. 16 కోట్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్‌లో ఆ స్థాయిలో కోవిడ్ పరీక్షలు జరగలేదనే విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది వైరస్‌ సోకి చనిపోయినా .. అవి సాధారణ మరణాల్లోకి నెట్టేశారని అక్కడి వార్తపత్రికలు, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దేశం మొత్తం కరోనా కేసులు నమోదవుతోన్నా కేవలం రాజధాని ఢాకాలోనే కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

జనవరి నెలలోనే కరోనా బాధితులను గుర్తించేందుకు ఎయిర్ పోర్టులో థర్మల్ స్కానింగ్ ఏర్పాటు చేసింది బంగ్లాదేశ్ ప్రభుత్వం. ఆ సమయంలో చైనాలో కరోనా విజృంభించడంతో అక్కడి నుంచి వచ్చే ప్రతీ వ్యక్తిని థర్మల్ స్క్రీనింగ్ చేయడం ప్రారంభించారు. చైనాలోని హుహాన్‌లో చిక్కుక్కున్న 312 మంది బంగ్లాదేశీయులను ఫిబ్రవరి 1న ప్రత్యేక విమానంలో స్వదేశానికి తీసుకొచ్చారు. వారిని ఢాకాలోని ఐసోలేషన్‌ సెంటర్‌కు తరలించి 14 రోజులు వుంచారు. చైనా టూరిస్టుల వీసాలను రద్దు చేశారు. ఛిట్టగాంగ్ పోర్ట్ వద్ద కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా బంగ్లాదేశ్‌లోకి కరోనా ప్రవేశించింది. దీంతో మార్చి 26 నుంచి ఏప్రిల్ 4 వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది బంగ్లాదేశ్ ప్రభుత్వం. ఆ తర్వాత లాక్‌ డౌన్‌ను ఏప్రిల్ 11 వరకు పెంచింది.

ఉపఖండంలోని దాయాది దేశం పాకిస్థాన్ లో కూడా కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా పంజాబ్ ప్రావిన్స్ ప్రాంతంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. పాకిస్థాన్‌లో కరోనా అప్‌డేట్ ఒకసారి చూద్దాం.

పాకిస్థాన్‌‌లో సైతం కరోనా అలజడి రేపుతోంది. ఫిబ్రవరి 26న పాకిస్థాన్‌లో మొదటి రెండు కేసులు నమోదయ్యాయి. ఇరాన్ నుంచి వచ్చిన ఈ ఇద్దరికి కరోనా సోకినట్టు నిర్థారించి వారిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అయితే మొదటి రెండు కేసులు నమోదైన వారం రోజులకే దాయాది దేశంలో మరో మూడు కేసులు వెలుగుచూశాయి. ఇందులో ఒకటి దేశ రాజధాని ఇస్లామాబాద్‌లో నమోదైంది. దీంతో పాకిస్థాన్ సర్కార్‌కు వణుకు మొదలైంది.

మార్చి 20న పాకిస్థాన్‌లో తొలి కరోనా మరణం సంభవించింది. సింధ్ ప్రావిన్స్‌కు చెందిన 77 ఏళ్ల వ్యక్తికి లోకల్ ట్రాన్స్‌మిషన్ ద్వారా వైరస్ సోకడంతో చనిపోయాడు. క్రమం పెరుగుతూ వచ్చి ఏప్రిల్ 3 నాటికి కరోనా కేసుల సంఖ్య పాకిస్థాన్‌లో 2 వేలు దాటింది. ముఖ్యంగా పంజాబ్ ప్రావిన్స్‌లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. కేసుల పెరుగుదలతో అలర్ట్ అయిన ఇమ్రాన్ ఖాన్ సర్కార్ వెంటనే లాక్ డాన్ విధించింది. పంజాబ్, సింధ్, బలుఛిస్థాన్, ఆజాద్ కశ్మీర్, గిల్గిత్ -బలితిస్థాన్‌ ప్రాంతాల్లో ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది.

భారత్ దిగువన ఉన్న శ్రీలంకలో సైతం కరోనా ప్రభావం చూపింది. దీంతో అక్కడి పార్లమెంట్ ఎన్నికలు కూడా వాయిదా పడ్డాయి. చైనా టూరిస్టు ద్వారా శ్రీలంకలో ప్రవేశించిన కరోనా అక్కడి ప్రజలను ఇళ్లకే పరిమితం అయ్యేలా చేసింది. శ్రీలంలో కరోనా వ్యాప్తి ఎలా జరిగిందో ఓ సారి చూద్దాం.

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ శ్రీలంకలోనూ విస్తరించింది. ఈ దేశంలో కూడా బాధితుల సంఖ్య అంతంకంతకు పెరుగుతోంది. మార్చి 3న ఓ శ్రీలంకకు చెందిన వ్యక్తి ఇటలీలో కరోనా బారినపడినట్టు గుర్తించారు. అయితే శ్రీలంకలో మాత్రం జనవరి 27నే మొదటి కరోనా కేసు నమోదైంది. 44 ఏళ్ల చైనా మహిళ టూరిస్టుకు కరోనా సోకినట్టు నిర్థారించారు.

అనంతరం కూడా కరోనా కేసులు నమోదు కావడంతో శ్రీలంక అలర్ట్ అయ్యింది. 45 క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇతర దేశాల నుంచి వచ్చే టూరిస్టులను క్వారంటైన్‌కు తరలించింది. మార్చి 18న పలు ప్రాంతాల్లో శ్రీలంక కర్ఫ్యూ విధించింది. కరోనా కారణంగా శ్రీలంకలో పార్లమెంట్ ఎలక్షన్స్ వాయిదా పడ్డాయి.

ఇక భారత ఉపఖండంలోని నేపాల్, భూటాన్, మాల్దీవులను సైతం కరోనా వదలలేదు. ఈ దేశాల్లో కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ మహ్మమారి వ్యాప్తిని అరికట్టడానికి ఆయా దేశాలు చర్యలు చేపట్టాయి.

భారత్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే దేశం నేపాల్‌లో కూడా కరోనా నేనున్నా అని చాటుకుంది. ఇక్కడ జనవరి 24నే మొదటి కరోనా కేసు నమోదయ్యింది. దీంతో నేపాల్‌లో జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అయినా మరికొన్ని కేసులు నమోదయ్యాయి. దీంతో మార్చి 24 నుంచి ఏప్రిల్ 8 వరకు లాక్ డౌన్ విధించారు.

ఇక ఉపఖండంలోని మరోదేశమైన భూటాన్‌లో మార్చి 6న మొదటి కరోనా కేసు నమోదయ్యింది. 76 ఏళ్ల ఓ అమెరికన్ టూరిస్ట్‌కు కరోనా రావడంతో భూటాన్ అలర్ట్ అయ్యింది. అతడు సుమారు 90 మందితో కాంటాక్ట్ అయినట్టు గుర్తించి వారిని క్వారంటైన్‌కు పంపారు. అయితే భూటాన్‌లో నమోదైన కరోనా కేసుల్లో అందరూ విదేశాల నుంచి వచ్చిన వారే.

ఇక ఉపఖండంలో పర్యాటక రంగానికి పేరు గాంచిన మాల్దీవుల్లో సైతం కరోనా కలకలం రేపింది. మాల్దీవులకు వచ్చే విదేశీ టూరిస్టుల సంఖ్య చాలా ఎక్కువ. ఇల ఇటలీ నుంచి వచ్చిన ఓ టూరిస్టుకు మార్చి 7నే కరోనా వచ్చినట్టు గుర్తించారు. దీంతో అతడు బస చేసిన రిసార్ట్స్ ‌లోని అందరినీ క్వారంటైన్‌కు పంపారు. ఆ తర్వాత కూడా కరోనా కేసులు నమోదవుతూ ఉండటంతో మాల్దీవుల ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ విధించింది. విదేశీ టూరిస్టుల రాకపై ఆంక్షలు విధించింది. అయితే టూరిజంపైనే ఆధారపడే ఈ దేశానికి కరోనా ఎఫెక్ట్ ఎక్కువగానే తగిలింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories