అమెరికా కాబోయే అధ్యక్షుడు బైడెన్ కు ధర్మపురి పూజారికి మధ్య సంబంధం ఏమిటి?

అమెరికా కాబోయే అధ్యక్షుడు బైడెన్ కు ధర్మపురి పూజారికి మధ్య సంబంధం ఏమిటి?
x

Joe Biden with Dharmapuri priest (file image)

Highlights

శ్వేతసౌధాన్ని అలంకరించేందుకు రెడీగా ఉన్న జో బైడెన్‌కు హైందవ సంప్రదాయాలంటే మక్కువా అంటే అవుననే అంటున్నారు జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన చంద్రశేఖర శర్మ.

అమెరికా అధ్యక్షుడు ఎవరో ఇంకా క్లారిటీ లేదు. కానీ బైడెన్ పేరు ఇప్పుడు ప్రపంచమంతటా మారుమోగుతూనే ఉంది. అలానే జగిత్యాల జిల్లా ధర్మపురిలో కూడా బైడెన్ పేరు ప్రత్యేకంగా తలుచుకుంటున్నారు. ధర్మపురికి చెందిన ఓ వ్యక్తికి, బైడెన్‌కి సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది.

శ్వేతసౌధాన్ని అలంకరించేందుకు రెడీగా ఉన్న జో బైడెన్‌కు హైందవ సంప్రదాయాలంటే మక్కువా అంటే అవుననే అంటున్నారు జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన చంద్రశేఖర శర్మ. అంతేకాదు జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా.. ప్రపంచ అగ్రరాజ్య అధినేతగా అవతరించేందుకు యునైటెడ్ స్టేట్స్ లోని డెలవర్ మహాలక్ష్మి అమ్మవారి కృపతో పాటు.. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి లక్ష్మీనర్సింహా స్వామి ఆశీస్సులు ఉన్నాయంటున్నారు.

అసలు బైడెన్ ఏంటి..? ధర్మపురితో సంబంధం ఏంటి..? అని అనుకుంటున్నారా..? ఈ చర్చ అంతటికి కారణం ఓ ఫోటో. జో బైడెన్ అమెరికాలోని ఓ హిందూ దేవాలయంలో పూజలు చేసే సమయంలో ఓ పుజారి ఆయన నుదుటన బొట్టు పెడుతున్న ఫోటో ఇది. ఆ ఫోటోలో జో బైడెన్‌తో ఉన్న వ్యక్తే చంద్రశేఖర్ శర్మ. ఆయనకి జో బైడెన్ కి మధ్య ప్రత్యేక అనుభందం ఉందంటున్నారు అమెరికాలో ఉన్న చంద్రశేఖర శర్మ.

చంద్రశేఖర్ శర్మది జగిత్యాల జిల్లా ధర్మపురి. శృంగేరీ, ఢిల్లీ వంటి పలు ప్రదేశాల్లో వేద అధ్యయనం చేశారు చంద్రశేఖర్. ఆ తర్వాత తెలిసినవారి ద్వారా అమెరికాకు ప్రయాణమయ్యారు. కానీ.. చంద్రశేఖర్ కు వీసా లభించలేదు. ఆ సమయంలో శేఖర్ ను అమెరికాకు తీసుకురావడం కోసం డెలవర్ రాష్ట్రంలోని విల్మింగ్టన్ పట్టణంలోని మహాలక్ష్మి ఆలయం వాళ్ల ప్రోత్సాహంతో పాటు.. బైడెన్ సహాయం చేశారు. చంద్రశేఖర్ శర్మ వీసాకు అడ్డంకులను తొలగించేందుకు కృషి చేశారు.

ప్రస్తుతం చంద్రశేఖర్ శర్మ అమెరికాలోని శానిఫ్లాన్సిస్కో నగరంలోని డబ్లిన్ లో మరో నలుగురు పూజారులతో కలిసి.. తానే స్వయంగా పంచముఖ హనుమాన్ ఆలయాన్ని స్థాపించి స్వామి కైంకర్యాలతో ఆ నగరంలో హైందవ ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతున్నారు. అయితే హైందవ సంప్రదాయాల పట్ల జో బైడెన్ కు అపారమైన గౌరవముందని.. డెలవర్ రాష్ట్రంలోని విల్మింగ్టన్ మహాలక్ష్మి ఆలయంలో ఆయనకు స్వయానా తన చేత తిలకం దిద్దడంతో పాటు.. కుంభాభిషేకం చేయడం వంటివి ఓ మధురానుభూతంటున్నారు. బైడెన్ హిందూ ధర్మాన్ని గౌరవించేవారని.. మహాలక్ష్మి ఆలయానికి వచ్చినప్పుడు అక్కడున్న విగ్రహాల గురించి క్షుణ్ణంగా తెలుసుకునేవారని చెబుతున్నారు చంద్రశేఖర్ శర్మ.

ఇప్పుడు చంద్రశేఖర్ శర్మ జోబైడెన్ కు తిలకం దిద్దే ఫోటో సోషల్ మీడియాలో పలువురు షేర్ చేసుకుంటుండంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. చంద్రశేఖర్ శర్మకి సహాయం చేయడంతో ధర్మపురి లక్ష్మీనర్సింహా స్వామికి నిత్యం బైడెన్ పేరిట పూజలు చేస్తున్నారట. అంతేకాదు.. బైడెన్ డెలెవర్ రాష్ట్రంలో ఉన్న మహాలక్ష్మీ దేవాలయానికి ప్రత్యేకంగా వస్తుంటారని ఆయన చెబుతున్నారు. హిందూ ఆచార సాంప్రదాయలపై బైడెన్ కి అమితమైన ఆసక్తి ఉండటం గర్వంగా ఉందంటున్నారు స్థానికులు. గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ఒబామా కూడా ఆంజనేయ స్వామి విగ్రహం జేబులో పెట్టుకునే వారని ప్రచారం జరిగింది. ఇప్పుడు బైడెన్ ని ప్రస్తావిస్తూ ఒబామాని గుర్తుచేసుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories