సరిహద్దుల్లో పెరిగిపోతున్న టెన్షన్.. భారత్ భూభాగాన్ని కబళిస్తున్న చైనా..
ఈ రోజు మనం మాట్లాడుకుందాం భారత్- చైనా మధ్య ముదిరిపోయిన సరిహద్దు వివాదంగురించి కమ్ముకొస్తున్న యుద్ధమేఘాల గురించి. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం...
ఈ రోజు మనం మాట్లాడుకుందాం భారత్- చైనా మధ్య ముదిరిపోయిన సరిహద్దు వివాదంగురించి కమ్ముకొస్తున్న యుద్ధమేఘాల గురించి. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం కొత్తదేమీ కాదు కాకపోతే కరోనా నేపథ్యంలో ఈ వివాదాల తీవ్రత పెరిగిపోయింది మాత్రం ఇప్పుడే. ఒక్క భారతదేశమనే కాదు అటు హాంకాంగ్, తైవాన్ లపై కూడా చైనా రెచ్చిపోయి వ్యవహరిస్తోంది. మరో వైపున అమెరికాతో కయ్యానికి కాలు దువ్వుతోంది. ఓ వైపున వాణిజ్య యుద్ధం మరో వైపున మిలిటరీ వ్యూహం ఒక్క ముక్కలో చెప్పాలంటే యావత్ ప్రపంచానికి వ్యతిరేకంగా చైనా తీవ్రమైన జాతీయవాదంతో ఊగిపోతున్నది.
చైనా ఈ పేరు చెప్పగానే భాయి భాయి అంటూనే కడుపులో కత్తులు కుచ్చిన సంఘటన గుర్తుకొస్తుంది. ఆ యుద్ధం జరిగి దాదాపు 50 ఏళ్ళు కావస్తున్నా... ఆ నెత్తుటి గాయాలు మాత్రం ఇంకా పచ్చిగానే ఉన్నాయి. నాటి నుంచి కూడా ఆ గాయాలనే మళ్లీ మళ్లీ రేపుతోంది చైనా. సరిహద్దు వివాదం కాస్తా చిన్న పాటి యుద్ధంగా మారుతోంది. ముష్టిఘాతాల స్థాయి దాటి యుద్ధ విమానాలు రంగంలోకి దిగిన పరిస్థితి వచ్చింది. ఒకేసారి దాడి కాకుండా ఒక్కో మైలు చొప్పున ఆక్రమించుకోవడం చైనాకు ఆనవాయితీ. ఇప్పుడు మాత్రం చైనా చేస్తున్న ఈ అప్రకటిత యుద్ధానికి మరో కారణం కూడా తోడైంది. అదే చైనా జాతీయవాదం. అది తెరపైకి రావడానికీ ఎన్నో కారణాలున్నాయి.
చైనా చైర్మన్ జిన్ పింగ్ తన విచక్షణ కోల్పోయారు. కరోనా విషయంలో ఒక వైపున అంతర్జాతీయ సమాజం చైనాను దోషిగా నిలబెడుతోంది. మరో వైపున చైనా ఆర్థిక వ్యవస్థ పతనమైపోయింది. కోట్లాది మంది ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికిప్పుడు ఆయన రాజకీయ అధికారానికి వచ్చిన ముప్పేమీ లేకపోయినా.... ఇన్నేళ్లుగా చైనా ఆయన పై కనబర్చిన విశ్వసనీయతకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రజల్లో తన పలుకుబడి పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మరో వైపున యావత్ ప్రపంచం ఒక్కటై తనపై ధిక్కార స్వరం వినిపించడాన్ని ఆయన సహించలేకపోతున్నారు. తనకంటూ ఓ గొప్ప విజయం అవసరమైంది. అందుకే అటు చైనా ప్రజలకు ఇటు ప్రపంచ దేశాలకూ తానంటే ఏమిటో ఓ బలమైన సందేశాన్ని ఇవ్వాలనుకున్నారు. అందులో భాగంగానే చైనా ఇప్పుడు యుద్ధోన్మాదంతో వెర్రితలలు వేస్తోంది. అందుకే ఇటు భారత్ ను అటు హాంకాంగ్, తైవాన్ లను లక్ష్యంగా చేసుకుంది.
భారత్ విషయానికి వస్తే తాజాగా తూర్పు లద్దాఖ్ లో చైనా చర్యలతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారత్ సైతం అదనపు బలగాలను మోహరించింది. ఈ నెల మొదటి నుంచి ఈ ప్రాంతంలో రెండు దేశాల సైనికుల మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి. దెమ్ చోక్, చుమార్, దౌలత్ బేగ్ ఓల్ది, గాల్వాన్ లోయ వద్ద ఈ తరహా వివాదాలు చోటు చేసుకున్నాయి. సుమారు ఐదేళ్లుగా ఇక్కడ ఈ తరహా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. 2018లో కూడా దెమ్ చోక్ వద్ద చైనా బలగాలు సుమారు 400 మీటర్ల మేర భారత్ భూభాగంలోకి చొచ్చుకువచ్చాయి. సాధారణంగా ఒక దేశం తన భూభాగంలో రోడ్డు నిర్మాణం వంటి మౌలిక వసతులను ఏర్పరచుకునే క్రమంలో ఈ దాడులు మరింతగా జరుగుతుంటాయి. ఇప్పుడు జరిగింది కూడా అలాంటిదే. దేప్పాంగ్ - గల్వాన్ లోయకు మధ్య 255 కిలోమీటర్ల మేర పొడవైన రహదారి నిర్మాణాన్ని భారత్ చేపట్టింది. దీనిపై చైనా దళాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మే 6న సరిహద్దులో చైనా విమానాలు భారత్ భూభాగానికి అతి సమీపంగా వెళ్లాయి. మే 12న కూడా ఇదే తరహా ఘటనలు జరిగాయి. దీంతో భారత్ సైతం తన యుద్ధ విమానాలను అక్కడికి పంపించింది. స్థానిక సైనికాధికారుల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. లద్దాఖ్ ప్రాంతంలో ఆర్మీ చీఫ్ నరవణే ఇటీవల పర్యటించడం అక్కడి ఉద్రిక్తతలకు అద్దం పడుతోంది. తూర్పు లద్దాఖ్ లోని ప్యాంగ్యాంగ్ సరస్సు తీరం వెంబడి చైనా 5 వేల మంది సైనికులను మోహరించింది.
1950ల నుంచే చైనా వరుసగా అనేక వివాదాలను రేకెత్తిస్తూనే వచ్చింది. 1950లలోనే చైనా జింజియాంగ్ నుంచి పశ్చిమ టిబెట్ దాకా 1,200 కి.మీ. రోడ్డు నిర్మించింది. అందులో 179 కి.మీ. రోడ్డు భారత్ భూభాగమైన ఆక్సాయ్ చిన్ గుండా వెళ్తుంది. 1958లో చైనా ప్రచురించిన పటాలు చూసే దాకా అక్కడ చైనా రోడ్డు నిర్మించిన విషయాన్ని భారత్ గుర్తించలేక పోయింది. నాటి నుంచి కూడా ఆక్సాయ్ చిన్ వివాదం కొనసాగుతూనే ఉంది. 1962లో చైనా- భారత్ యుద్ధం జరిగింది. ఆ తరువాత కొన్ని దశాబ్దాల పాటు చిన్న వివాదాలు తలెత్తినా అవి పెద్దగా ముదిరిపోలేదు. 2013 లో లద్దాఖ్ లో దౌలత్ బేగ్ ఓల్ది సెక్టార్ లో వివాదం చోటు చేసుకుంది. 2014లో లద్దాఖ్ ప్రాంతంలోనే దెమ్ చోక్ గ్రామం వద్ద మరో వివాదం చోటు చేసుకుంది. 2015 సెప్టెంబర్ లో ఉత్తర లద్దాఖ్ ప్రాంతంలో భారత్ బలగాలతో చైనా బలగాలు తలపడ్డాయి. 2017లో భూటాన్ సరిహద్దుల్లో భారత్ - చైనా మధ్య డోక్లామ్ వివాదం చోటు చేసుకుంది. కొన్ని నెలల పాటు ఈ వివాదం కొనసాగింది. భారత్ భూభాగాలను ఆక్రమించుకోవడంలో చైనా వివిధ రకాల వ్యూహాలను అనుసరించింది. మొదటగా చైనా గ్రామీణ ప్రాంత ప్రజలు భారత్ భూభాగాన్ని ఆక్రమించుకునేలా ప్రోత్సహిస్తుంది. ఆ తరువాత వారికి అండగా రంగంలోకి దిగుతుంది. మరో రకం వ్యూహంలో భాగంగా భారత్ సైన్యం గస్తీ తక్కువగా ఉండే ప్రాంతాల్లోకి క్రమంగా చొచ్చుకువస్తుంటుంది. ఇలా సరిహద్దుల్లో వీలు దొరికినప్పుడల్లా ఒక్కో మైలు ప్రాంతాన్ని ఆక్రమిస్తూ వచ్చింది. గత పదేళ్లలో చైనా ఈ విధంగా 2 వేల చ.కి.మీ. భూభాగాన్ని ఆక్రమించినట్లు ఒక అంచనా. మరో వైపున అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం కూడా తనదే అని చైనా అంటోంది. భారత్ పై ఒత్తిడి తేవాలనుకున్నప్పుడల్లా అరుణాచల్ ప్రదేశ్ అంశం తెరపైకి వస్తుంటుంది. ఇన్నేళ్లుగా చైనా దాష్టీకాలను భారత్ సహించింది. ఇక సహించలేని పరిస్థితి వచ్చింది. చైనాకు గట్టి సమాధానం ఇవ్వాల్సిన సందర్భం వచ్చింది. అందుకు అవసరమైతే...హాంకాంగ్, తైవాన్ అంశాలను వాడుకోవాలి. అవసరమైతే టిబెట్ అంశాన్ని మరోసారి తెరపైకి తేవాలి. ఇలాంటి విషయాల్లో అంతర్జాతీయ సమాజంతో కలసి పని చేయాలి.
చైనా- భారత్ సరిహద్దు వివాదం వెనుక నేరుగా తెరపైకి రాని అంశాలు మరెన్నో ఉన్నాయి. కరోనా ప్రపంచవ్యాప్తం కావడం వెనుక చైనా హస్తముందని అమెరికాతో సహా మరెన్నో దేశాలు భావిస్తున్నాయి. కరోనా ను కట్టడి చేయడంలో సరిగా వ్యవహరించనందుకు గాను చైనా తమకు పరిహారాలు చెల్లించాలని అవి కోరుతున్నాయి. అంతే కాదు వివిధ రకాల ఆంక్షలు విధించేందుకు కూడా అవి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా మిత్ర దేశాల సరసన చేరకుండా భారత్ ను నిరోధించేందుకు కూడా సరిహద్దు వివాదాలను చైనా ఓ అస్త్రంగా చేసుకుంటోంది.
తూర్పు లద్దాఖ్ మొదలుకొని సిక్కిం దాకా భారత్ - చైనాల మధ్య 3,488 కిలోమీటర్ల మేరకు వాస్తవాధీన రేఖ ఉంది. ఇంటి సమస్యలు, హాంకాంగ్, తైవాన్ వివాదాల నుంచి చైనీయుల దృష్టి మళ్లించేందుకు ఈ సరిహద్దు వివాదాలను చైనా ఉపయోగించుకుంటోంది. అంతేగాకుండా పాకిస్థాన్, నేపాల్ లతో భారత్ వ్యహరిస్తున్న తీరును చెడుగా చిత్రీకరించేందుకు కూడా చైనా ప్రయత్నిస్తోంది. ఇక కరోనా కట్టడి చేయడంలో తన వైఫల్యానికి వ్యతిరేకంగా యావత్ ప్రపంచం ఏకతాటిపైకి రావడాన్ని కూడా చైనా సహించలేకపోతున్నది. అలాంటి దేశాల సరసన భారత్ చేరవద్దని అది కోరుకుంటున్నది. ఆ దిశలో భారత్ పై ఒత్తిడి తెచ్చేందుకు కూడా సరిహద్దు వివాదాలను ఓ ఆయుధంగా చేసుకుంటోంది. గ్రేట్ లీప్ ఫార్వర్డ్ రివల్యూషన్ వైఫల్యం కారణంగా 1962లో చైనా భయంకరమైన కరువును ఎదుర్కొంది. ఆ కరువు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు భారత్ తో యుద్ధం చేసింది. తాజాగా చైనాలో దేశీయ ఆర్థిక వైఫల్యాలు, అంతర్జాతీయంగా కరోనా వివాదం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మరోసారి సామ్రాజ్య విస్తరణను ప్రయోగించింది. 1979లో కూడా చైనా ఇదే విధంగా చేసింది. అప్పట్లో అంతర్గత అసంతృప్తిని దూరం చేసేందుకు వియత్నాంతో సరిహద్దు యుద్ధం చేసింది. చైనా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే అతలాకుతలమైపోయింది. అలాంటప్పుడు భారత్ తో భారీ యుద్ధం అటు ఆర్థికంగా ఇటు వాణిజ్యపరంగా చైనాకు చేటు తెచ్చేదే అవుతుంది. అందుకే భారత్ పై ఒత్తిడి తెచ్చే స్థాయిలో మాత్రమే చిన్నపాటి కొట్లాటలకు చైనా తెగబడే అవకాశం ఉంది. బీజేపీ అధికారం లోకి వచ్చిన తరువాత సరిహద్దులో భారత్ రోడ్డు నిర్మాణం లాంటి మౌలిక వసతులను పెంచుకోవడం చైనాకు కంటగింపుగా మారింది. అలాంటి మౌలిక వసతులను అడ్డుకోవడం కూడా ఇప్పటి వివాదాల ప్రధాన ఉద్దేశం.
ఇక హాంకాంగ్, తైవాన్ ల విషయానికి వస్తే చైనా తాజాగా తన రెండు నూతన యుద్ధవిమానవాహక నౌకలను ఒక్కసారిగా పచ్చ సముద్రంలో మోహరించింది. చైనా మెయిన్ ల్యాండ్, కొరియా ద్వీపకల్పానికి మధ్య పచ్చ సముద్రముంది. అక్కడి నుంచి కాస్తంత దిగువకు వెళ్లితే దక్షిణ చైనా సముద్రం. ఈ రెండు నౌకలు కూడా త్వరలోనే దక్షణి చైనా సముద్రంలోకి చేరుకునే అవకాశం ఉంది. ఈ సముద్రం అటు జపాన్ నుంచి ఇటు భారత్ దాకా మిలిటరీ బ్యారేజ్ గా ఉంటుంది. నిజానికి ఈ సముద్ర ప్రాంతంపై మరెన్నో దేశాలకు అధికారం ఉంది. చైనా మాత్రం దక్షిణ చైనా సముద్రమంతా తనదేనని అంటోంది. ఈ విషయంలో 2016లో అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా బేఖాతరు చేసింది. పునరేకీకరణ నినాదంతో చైనా కొనసాగిస్తున్న దూకుడును ప్రపంచం లోని పలు దేశాలు విమర్శిస్తున్నాయి. తాజాగా యుద్ధ నౌకల మోహరింపుతో తైవాన్ ను ఆక్రమించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. హాంకాంగ్ విషయానికి వస్తే...జాతీయ భద్రత చట్టం పేరుతో దానిపై ఇప్పటికే తన పట్టును బిగిస్తోంది. ఇక ఈ రెండు దీవుల విషయంలో అమెరికా వ్యవహార ధోరణి ఇప్పుడు కీలకం కానుంది. దక్షిణ చైనా సముద్రం లో ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, సింగపూర్ లతో కలసి సైనిక కార్యకలాపాలను అమెరికా తీవ్రతరం చేసే అవకాశం ఉంది. లేదంటే ...చైనాతో అనవసర వివాదం ఎందుకనుకుంటే మాత్రం అమెరికా తన సైనిక కార్యకలాపాలను తగ్గించుకునే అవకాశం కూడా ఉంది. అమెరికాలో ఎన్నికలకు ముందు అంతర్జాతీయంగా తనకొక బలమైన విజయం కావాలనుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తారన్న దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి పడింది.
భారత్ - చైనాల మధ్య టిబెట్ అంశం మరోసారి తెరపైకి రావడం కూడా చైనాకు మింగుడు పడని అంశంగా మారింది. భారత్ లో ప్రవాస ప్రభుత్వం నిర్వహిస్తున్న టిబెటన్ల ఆధ్మాత్మిక నాయకుడు దలైలామా వయస్సు ఇప్పుడు 84 ఏళ్లు. తన వారసుడిని ఆయన ఇప్పటి వరకూ ప్రకటించలేదు. మరో వైపున ఆయన ఎంపిక చేసిన పంచెన్ లామా ను చైనా అపహరించింది. అది జరిగి పాతికేళ్లు గడిచాయి. ఇప్పటికీ చైనా ఆయన ఉనికిని బయటపెట్టలేదు. కాకపోతే ఆయన చదువు పూర్తయిందని, ఉద్యోగం చేసుకుంటున్నాడని ఇటీవల వెల్లడించింది. టిబెట్ అంశం నేటికీ ప్రపంచవ్యాప్తంగా నివురు గప్పిన నిప్పులా ఉంది. దానికి తోడు హాంకాంగ్, తైవాన్ లాంటి అంశాలను వివాదాలుగా చేయడం ద్వారా చైనా పై ప్రపంచ ఒత్తిడి పెరిగేలా చేయాలన్న వాదన ఇప్పుడు బలంగా వినవస్తోంది.
సైనికంగా చైనా తెస్తున్న ఒత్తిళ్లను తిప్పికొట్టేందుకు సైనికంగా మాత్రమే కాకుండా రాజకీయంగా కూడా ప్రయత్నించాల్సిన అవసరం ఉందన్న వ్యాఖ్యలూ వినవస్తున్నాయి. మహాబలిపురంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, భారత్ ప్రధాని మోడీ మధ్య జరిగిన చర్చలు పెద్దగా ఫలించలేదనే ప్రస్తుత పరిణామాలు తెలియజేస్తున్నాయి. చర్చలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందే....అదే సమయంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు కూడా దేశం సిద్ధంగా ఉండాలి. అలాంటి సందర్భం ఇప్పుడు వచ్చినట్లుగా కనిపిస్తోంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire