Afghanistan: పంజ్ షేర్ లోయను ఆక్రమించేందుకు తాలిబన్ల ప్రయత్నాలు

Taliban Attempts to Occupy the Panjshir Valley
x

పంజ్ షేర్ లోయను ఆక్రమించేందుకు తాలిబన్ల ప్రయత్నాలు (ఫైల్ ఫోటో)

Highlights

*ఆక్రమణకు యత్నించిన తాలిబన్లను మట్టుబెట్టినట్లు సమాచారం *తాలిబన్లకు లొంగిపోయే ప్రసక్తే లేదంటున్న పంజ్ షేర్ ప్రజలు

Afghanistan : ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తుంది. పంజ్ షేర్ ప్రావిన్స్ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు తాలిబన్లు సిద్ధమమయ్యారు. భారీస్థాయిలో ఆయుధ సామగ్రితో ఆ ముఠా ఫైటర్లు వందల సంఖ్యలో పంజ్‌షేర్‌కు వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. అయితే భారీ ఆయుధాలతో పంజ్ షేర్ వైపు కదులుతున్న 300 మంది తాలిబన్ ఫైటర్లను సైన్యం మట్టుబెట్టినట్లు సమాచారం. వందలాది వాహనాల్లో పంజ్ షేర్ లోయవైపు తాలిబన్లు దూసుకెళ్తున్నారు. అయితే తాలిబన్లకు లొంగేప్రసక్తే లేదని పంజ్ షేర్ ప్రజలు చెప్తున్నారు. లోయలోకి వెళ్లే మార్గాల్లో ఎక్కడికక్కడ గట్టి పహారా కాస్తూన్నారు.

తాలిబన్లపై పోరాటానికి పంజ్ షేర్ సైన్యం కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. తాలిబన్లకు లొంగిపోయే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పంజ్‌షేర్‌ లో మరో భీకరపోరు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. దేశంలో తాలిబన్లను తిప్పికొట్టి, పంజ్‌షేర్ లోయలో ప్రతిఘటిస్తామని మాజీ వైస్ ప్రెసిడెంట్ అమ్రుల్లా సలేహ్, సోవియట్ వ్యతిరేక ముజాహిద్దీన్ మాజీ కమాండర్ అహ్మద్ షా మసూద్ కుమారుడు ప్రతిజ్ఞ చేశారు. ఆయన వెంట 6 వేల మందికిపైగా ఫైటర్లు ఉన్నట్లు తెలుస్తోంది.

అఫ్గాన్‌ రాజధాని కాబుల్‌కు ఉత్తరాన దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో హిందుకుష్‌ పర్వత శ్రేణుల్లో పంజ్‌షేర్‌ ఉంది. జనాభా దాదాపు లక్షన్నర. అందులో అత్యధికులు తజిక్‌ జాతి ప్రజలు. పంజ్‌షేర్‌ అంటే 'ఐదు సింహాలు' అని అర్థం. పేరుకు తగ్గట్టే ఇక్కడి ప్రజల్లో తెగువ ఎక్కువ. భౌగోళిక పరిస్థితులు కూడా కలిసివస్తుండటంతో పంజ్‌షేర్‌ సహజసిద్ధంగానే దుర్బేధ్యమైన కోటగా ఆవిర్భవించింది. 1980ల్లో సోవియట్‌ సైన్యంగానీ, 1990ల్లో తాలిబన్లుగానీ దీన్ని ఆక్రమించుకోలేకపోయారు. నాటి పోరాటాల్లో దిగ్గజ మిలటరీ కమాండర్‌ అహ్మద్‌ షా మసూద్‌ పంజ్‌షేర్‌ను ముందుండి నడిపించారు.

తాలిబన్లు, అల్‌ఖైదా ముష్కరులు సంయుక్తంగా కుట్ర పన్ని విలేకరుల వేషంలో ఆత్మాహుతి దాడి జరపడం ద్వారా 2001లో అహ్మద్ షా మసూద్ ను పొట్టనపెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు అహ్మద్‌ మసూద్‌, అఫ్గాన్‌ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ పంజ్‌షేర్‌ గడ్డపై తాలిబన్లపై పోరాటానికి వ్యూహాలు రచిస్తున్నారు. తండ్రి బాటలో తాలిబన్లను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అహ్మద్‌ మసూద్‌ ప్రకటించారు. తమ బలగాలకు ఆయుధాలు అందజేయాల్సిందిగా అమెరికాను ఇటీవల ఆయన కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories