తిరుగుబాటు దళాలకు అధికారాన్ని అప్పగించేందుకు అంగీకరించిన సిరియా మాజీ ప్రధాని
సిరియా అధ్యక్షుడు బషర్-అల్-అసద్ దేశం విడిచి పారిపోయారు. అసద్ రాజ కుటుంబంపై పోరాడుతున్న తిరుగుబాటుదారులు డిసెంబర్ 8 ఆదివారం నాడు అధ్యక్ష భవనంలోకి...
సిరియా అధ్యక్షుడు బషర్-అల్-అసద్ దేశం విడిచి పారిపోయారు. అసద్ రాజ కుటుంబంపై పోరాడుతున్న తిరుగుబాటుదారులు డిసెంబర్ 8 ఆదివారం నాడు అధ్యక్ష భవనంలోకి చొచ్చుకుపోయారు. అప్పటికే, అసద్, ఆయను కుటుంబ సభ్యులు ఆ భవనం నుంచి వెళ్లిపోయారు.
దాంతో, సిరియాలో 50 ఏళ్ల పాటు సాగిన అసద్ రాజవంశీకుల పాలనకు తెరపడింది. తిరుగుబాటుదారులు రాజధాని దమాస్కస్ తిరుగుబాటుదారుల వశమైంది.
అధికార బదిలీకి సిద్దమన్న సిరియా ప్రధాని
తిరుగుబాటుదారులు రాజధానిని స్వాధీనం చేసుకుని అధ్యక్ష భవనంలోకి దూసుకుపోయారు. ఫర్నీచర్ సహా తమకు నచ్చిన వస్తువులను తీసుకెళ్లారు. ఆ భవనంలో అధ్యక్షుడి కుటుంబం దాచుకునేందుకు నిర్మించిన బంకర్ బయటపడింది. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తిరుగుబాటు తరువాత పోలీసులు, సైనికులు తమ స్థావరాలను వదిలి వెళ్ళిపోయారు. గత కొన్ని దశాబ్దాల ఉద్రిక్త వాతావరణానిక భయపడి లెబనాన్ వంటి దేశాలకు వలసపోయిన వారంతా ఇప్పుడు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ప్రయత్నాలు ప్రయత్నాలు ప్రారంభించారు.
నిజానికి, తిరుగుబాటు దళాలతో చర్చలు జరిపిన తర్వాతే అసద్ సిరియాను వదిలి వెళ్ళారని ఆయనకు ఆశ్రయం ఇచ్చిన రష్యా తెలిపింది. అధికారాన్ని శాంతియుతంగా బదిలీ చేయడానికి ఆయన సూచనలు ఇచ్చారని కూడా రష్యా ఒక ప్రకటనలో తెలిపింది. సిరియా ప్రధానమంత్రి మహమ్మద్ ఘాజీ జలాలీ అధికార బదిలీకి సిద్ధమని అన్నారు.ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయవద్దని కోరారు.
సిరియా అంతర్యుద్దం చరిత్ర ఏంటి?
2010-11 లో సిరియాలో బషర్ అల్- అసద్ కు వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం ఆయనను దేశం విడిచిపారిపోయేలా చేసింది. తొలుత ఈ ఉద్యమాన్ని తక్కువగా అంచనావేసిన అధ్యక్షుడు ఆ తర్వాత హింసామార్గంతో దాన్ని అణచివేసేందుకు ప్రయత్నించారు. కానీ, ఆయన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. తిరుగుబాటు మరింత తీవ్రమైంది.
అసద్ ప్రభుత్వంలో అవినీతి, నిరుద్యోగం పెరిగిపోయిందని, స్వేచ్ఛ లేదని స్థానికుల్లో భావన ఏర్పడింది. నిరంకుశ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పొరుగు దేశాలతో సాగుతున్న ఉద్యమాల నుంచి స్పూర్తి పొంది సిరియాలో కూడా ఆందోళనలు ప్రారంభమయ్యాయి.2011 మార్చిలో సిరియాలోని డీరా నగరంలో ఆందోళనలు తీవ్రమయ్యాయి. ఈ ఆందోళనలను ప్రభుత్వం అణచివేసింది.
అయితే ఈ నిరసనలు దేశ వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. విపక్షాలు కూడా ఈ నిరసనల్లో పాల్గొన్నాయి. తమను రక్షించుకునేందుకు నిరసనకారులు ఆయుధాలు చేపట్టారు. టర్కీ, కొన్ని పశ్చిమ దేశాలు, కొన్ని గల్ఫ్ దేశాలు తిరుగుబాటుదారులకు సహకరించాయి.మరో వైపు సిరియా అధ్యక్షుడికి మద్దతుగా రష్యా, ఇరాన్ లు నిలిచాయి. 2015 నాటికి రష్యా సహకారంతో తిరుగుబాటును అణచివేశారు సిరియా అధ్యక్షులు. ప్రభుత్వ వ్యతిరేక గ్రూపులకు ప్రధాన మద్దతుదారులలో టర్కీ ఒకటి.2017లో ఏప్రిల్ లో అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా సేనలు పరోక్షంగా సిరియాలో రంగ ప్రవేశం చేశాయి.
తండ్రి మరణంతో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన బషర్
బషర్ తండ్రి హఫీజ్ అల్ -అసద్. ఆయన మిలటరీ అధికారిగా, బాత్ పార్టీకి గట్టి మద్దతుదారుడిగా ఉన్నారు.1966లో ఆయన రక్షణ మంత్రి అయ్యారు. 1971లో ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. 200లో మరణించే వరకు ఆయన ఆ పదవిలోనే కొనసాగారు. తండ్రి బతికున్నంతకాలం అసద్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
లండన్ లోని కింగ్స్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ చదివారు. ఎంబీఏ కోసం ఆయన హార్వర్డ్ యూనివర్శిటీలో చేరారు. బషర్ అన్న బాసెల్ 1994లో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అసద్ రాజకీయ వారసుడు అలా ప్రమాదంలో చనిపోవడంతో ఆయన తమ్ముడైన బషర్ సిరియాకు తిరిగి రావాల్సి వచ్చింది. తన మానాన తాను రాజకీయాలకు దూరంగా లండన్ లో ఉన్న బషర్ అసద్ అలా కుటుంబ వారసత్వాన్ని స్వీకరించాల్సి వచ్చింది. సిరియాకు తిరిగి ఆయన సైన్యంలో చేరారు.
హఫీజ్ అల్ -అసద్ 2000 సంవత్సరంలో మరణించడంతో బషర్ అసద్ సిరియా అధ్యక్షుడు అయ్యారు. నిజానికి, సిరియా అధ్యక్షుడు కావాలంటే కనీస వయసు 40 ఏళ్లు. ఉండాలి. కానీ, 34 ఏళ్ళ బషర్ కోసం అధ్యక్ష పదవి వయోపరిమితిని 34 ఏళ్ళకు తగ్గిస్తూ రాజ్యాంగ సవరణ చేశారు. ఆయన అధ్యక్షుడు అయిన కొత్తలో సిరియాలో భావ ప్రకటన స్వేచ్ఛా వాతావరణం కనిపించింది. పౌరచర్చలు కూడా జరిగేవి. ఈ వాతావరణాన్ని అప్పట్లో దమాస్కస్ వసంతం అనే వారు. కానీ, ఆ తరువాత కొన్నేళ్ళకే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
ఇరాక్ యుద్ధం ఎఫెక్ట్
2003లో ఇరాక్ యుద్ధంతో బషర్ అల్ -అసద్ కు పశ్చిమ దేశాలకు దూరం పెరగడం ప్రారంభమైంది. ఇరాక్ పై అమెరికా దాడిని బషర్ వ్యతిరేకించారు.అయితే 2003 డిసెంబర్ లో పలు కారణాలతో సిరియాపై అమెరికా ఆంక్షలు విధించింది. లెబనాన్ మాజీ ప్రధానమంత్రి రఫిక్ హరిరి 2005 ఫిబ్రవరిలో బేరూత్ లో హత్యకు గురయ్యారు. ఇది సిరియా, దాని మిత్రదేశాల పనిగా అనుమానాలు వ్యక్తమయ్యాయి.అయితే ఈ హత్యపై వచ్చిన ఆరోపణలను సిరియా అధ్యక్షులు తోసిపుచ్చారు. అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగడంతో పాటు లెబనాన్ లో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. ఈ పరిణామాలతో లెబనాన్ నుంచి సిరియా వైదొలిగింది.
గోడలపై రాతలతో ఉద్యమానికి నాంది
దారా నగరంలో 2011 ఫిబ్రవరి 26న 14 ఏళ్ల మౌవియా సియాస్నే అనే బాలు ఇప్పుడు నీ వంతు వచ్చింది డాక్టర్ అంటూ గోడలపై రాశారు. ఈ విషయం స్థానికంగా ఉన్న పోలీస్ అధికారి అతిఫ్ నజీబ్ కు తెలిసింది. ఆయన అసద్ కు సన్నిహితులు. గోడలపై రాసిన విషయంలో సంబంధం ఉన్నారనే అనుమానంతో 20 మంది పిల్లలను పోలీసులు పట్టుకెళ్లారు.
ఈ పిల్లల పేరేంట్స్ పోలీసుల చుట్టూ తిరిగారు. పిల్లలను చిత్రహింసలకు గురి చేస్తున్నారని తెలిసి వారు ఆందోళనకు దిగారు. 26 రోజుల తర్వాత పిల్లను పోలీసులు విడిచి పెట్టారు. జైలు నుంచి పిల్లలు విడుదలైన తర్వాత ఈ పిల్లల పరిస్థితి మరింత దిగజారింది. దీంతో ప్రజలు నిరసనలను ఉధృతం చేశారు.
ఈ నిరసనలను అణచివేసేందుకు సిరియా ప్రభుత్వం హింసనే ఎంచుకుంది.ఇది హింసాత్మకంగా మారింది. ఈ సమయంలో సిరియా సైన్యం చీలిపోయింది. 2011 జులైలో ్రీ సిరియన్ ఆర్మీగా ఏర్పడిన చీలిక విభాగం అసద్ కుటుంబంపై పోరాటానికి దిగింది. ఇందులో ఐసిస్, జబాత్ అల్ సుస్రా, ఆల్ ఖైదా, ఖుర్దు గ్రూపులు చొరబడ్డాయి.
ఎవరీ అబూ మహమ్మద్ అల్ జులానీ?
సిరియా తిరుగుబాటుకు నాయకత్వం వహించింది హయత్ తహర్- ఆల్ -షామ్ అనే సంస్థ. ఈ హెచ్.టి.ఎస్ అధినేత అబూ మహమ్మద్ అల్ -జలానీ. ఆయన ఒకప్పుడు ఆల్ ఖైదా తీవ్రవాది. 9/11 దాడులు జులానీని అల్ ఖైదాలో లో చేరేలా చేశాయి. 2003లో జులానీ ఇరాక్ వెళ్లి ఆల్ ఖైదాలో చేరారు. ఆల్ ఖైదాలో ఆయన పేరు తెచ్చుకున్నారు. 2006లో అమెరికా దళాలు ఆయనను అరెస్ట్ చేశాయి.
ఐదేళ్లు జైలుశిక్షను అనుభవించి ఆయన బయటకు వచ్చారు. ఆల్ ఖైదా అనుబంధ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశంతో సిరియాలో ఆల్ నుస్రా ఫ్రంట్ ను ఏర్పాటు చేశారు. ఆల్ నుస్రా ఫ్రంట్ విస్తరణలో భాగంగా ఆయనకు ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ ఐఎస్ఐ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదితో సంబంధాలు ఏర్పడ్డాయి. 2013లో అబూ బకర్ ఆల్ ఖైదాతో సంబంధాలు తెంచుకున్నారు.
ఇప్పుడు హెచ్.టీ.ఎస్ సిరియాలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉంది. దేశంలో సాధారణ పరిస్థితులను నెలకొల్పుతామని, అధికార వ్యవస్థను ఏర్పాటు చేస్తామని అంటోంది. కానీ, రాజధాని దమాస్కస్ వీధుల్లో మిలటరీ దుస్తుల్లో తుపాకులు పట్టుకుని తిరుగుతున్న తిరుగుబాటుదారుల దృశ్యాలు అక్కడి ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తునే ఉన్నాయి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire