Sunita Williams: అంతరిక్షం నుంచి భూమి మీదకు రావడం ఇప్పట్లో సాధ్యం కాదా?

Should Sunita Williams Stay in Space Until February 2025
x

Sunita Williams: అంతరిక్షం నుంచి భూమి మీదకు రావడం ఇప్పట్లో సాధ్యం కాదా?

Highlights

Sunita Williams: సునీతా విలియమ్స్ అంతరిక్షం నుంచి భూమి మీదకు రావడానికి ఇంకా చాలా నెలలు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సునీతా విలియమ్స్ అంతరిక్షం నుంచి భూమి మీదకు రావడానికి ఇంకా చాలా నెలలు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సునీత, బారీ బుచ్ విల్మోర్ లను అంతరిక్షంలోకి తీసుకువెళ్ళిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారి తిరుగు ప్రయాణం గందరగోళంలో పడింది.

వారు తిరిగి భూమి మీదకు రావాలంటే ఈ సాంకేతిక సమస్యలను పరిష్కరించాలి. అవన్నీ అనుకున్న సమయానికి పూర్తి కాకపోతే, వారిని 2025 ఫిబ్రవరి నెలలో మరో స్పేస్ షిప్ ద్వారా భూమి మీదకు తీసుకువస్తామని నాసా చెబుతోంది. అంటే, సునీత, విల్మోర్ లు ఇంకా ఆరు నెలల కన్నా ఎక్కువే అంతరిక్షంలో ఉండాల్సి వస్తుంది.

ఎనిమిది రోజుల పర్యటన ఎనిమిది నెలలకు

సునీతా విలియమ్స్, బారీ బుచ్ విల్మోర్ లు బోయింగ్ కు చెందిన మానవ సహిత వ్యోమనౌకలో 2024 జూన్ 6న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఎనిమిది రోజుల పాటు వీరిద్దరూ అంతరిక్ష కేంద్రంలోనే ఉండాలని షెడ్యూల్ ను రూపొందించారు.

నిర్ణీత షెడ్యూల్ ప్రకారంగా ఈ ఏడాది జూన్ 14న రిటర్న్ జర్నీ చేయాలి. కానీ, వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఈ సమస్యలను సరిచేసే ప్రయత్నాలు ప్రారంభించారు.

ఈ వ్యోమనౌక అన్ డాక్ చేయడానికి సిద్దంగా ఉందా లేదా అనే విషయాన్ని నాసా స్పష్టం చేయలేదు. స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలను నిర్ణీత సమయంలో పూర్తి చేయలేకపోతే 2025 ఫిబ్రవరిలో స్పేస్ ఎక్స్ క్రూ 9 లో వీరిని భూమి మీదకు తీసుకువస్తామని నాసా ప్రకటించింది.

స్టార్ లైనర్ లో ఏం జరిగింది?

బోయింగ్ సంస్థ అంతరిక్షంలోకి మానవులను తీసుకెళ్లే వ్యోమనౌక స్టార్ లైనర్ ను తయారు చేసింది. ఇందులో సునీతా విలియమ్స్, విల్మోర్ లను అంతరిక్షంలోకి పంపారు. ఈ ప్రయోగం విజయవంతమైతే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి విమానాల్లో వెళ్లినట్టుగానే అంతరిక్షంలోకి వెళ్లవచ్చు.

సాంకేతిక సమస్యలతోనే స్టార్ లైనర్ అంతరిక్షయాత్ర ప్రారంభమైంది. దీంతో ఒక్క రోజు ఆలస్యంగా సునీతా, విల్మోర్ లు అంతరిక్షంలోకి వెళ్లారు. తిరుగు ప్రయాణానికి వీరు సిద్దమైన సమయంలో మరోసారి సాంకేతిక సమస్యలు మొదలయ్యాయి. వ్యోమనౌకలోని థ్రస్టర్లలలో కొన్ని పనిచేయలేదు. హిలీయం లీకేజీని గుర్తించారు.

స్టార్ లైనర్ ప్రొపల్షన్ సిస్టమ్ ను విస్తృతంగా పరీక్షించారు. హీలియం స్థాయిలు స్థిరంగా ఉన్నాయని నాసా నిర్దారించింది. ఇందులోని 28 థ్రస్టర్లలో 27 పనిచేస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. మరో థ్రస్టర్ పనిచేయడం లేదు. హీలియం లీకేజీ, థ్రస్టర్ సమస్యలకు మూల కారణాలను కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు.

19 పరీక్షలు చేసిన నాసా

స్టార్ లైనర్ లోని సాంకేతిక సమస్యలను సరిచేసిన తర్వాత 19 పరీక్షలు పూర్తి చేశారు. అయితే ఈ వ్యోమనౌక అన్ డాక్ చేసేందుకు సిద్దంగా ఉందా లేదా అనే విషయమై ఇంకా ఒక నిర్ధారణకు రాలేదు. వచ్చే వారంలో ఈ విషయమై నిర్ణయం తీసుకోనుంది నాసా. ప్రొపల్షన్ సిస్టమ్ అనేది స్పేస్ క్రాఫ్ట్ సర్వీస్ మాడ్యూల్ లో భాగం. ఇది స్టార్ లైనర్ క్యాప్సూల్ ను ఐఎస్ఎస్ నుండి దూరంగా బ్యాకప్ చేయడానికి భూమి వాతావరణం గుండా ప్రయాణించడానికి సహాయపడుతుంది.

వ్యోమనౌక రీఎంట్రీ పొజిషన్ లోకి వెళ్లేందుకు, సర్వీస్ మాడ్యూల్ విడిపోయే ముందు క్యాప్యూస్ ను సరైన వేగానికి తగ్గించడానికి థ్రస్టర్లు అవసరమౌతాయి. ఈ దశ తర్వాతే క్యాప్సూల్ తుదిదశకు చేరుకుంటుంది. 28 థ్రస్టర్లలో ఒకటి పనిచేయకపోవడంతో మిషన్ ఆలస్యమైందని చెబుతున్నారు.

స్పేస్ ఎక్స్ లో అంతరిక్షానికి ఇద్దరే వ్యోమగాములు… ఎందుకంటే?

స్పేస్ ఎక్స్ క్రూ 9 వ్యోమనౌక ఈ నెల 18 లోపుగా ఐఎస్ఎస్ కు చేరాలని ప్లాన్ చేశారు. అయితే దీని కంటే ముందుగానే స్టార్ లైనర్ ను అన్ డాక్ చేయాలని భావించారు. కానీ, స్టార్ లైనర్ లో టెక్నికల్ సమస్యలు ఇంకా సరికాలేదు.

మరోవైపు స్పేస్ ఎక్స్ లో కూడా టెక్నికలు సమస్యలు తలెత్తాయి. దీంతో స్పేస్ ఎక్స్ క్రూ 9 అంతరిక్షయానం సెప్టెంబర్ 24 కు వాయిదా పడింది. ఆ లోపుగా టెక్నికల్ సమస్యలను సరిచేయనున్నారు. ఈ వ్యోమనౌకలో తొలుత జెనా కార్డ్‌మాన్, నిక్ హేగ్, స్టెఫానీ విల్సన్‌, రోస్కోస్మోస్ లు అంతరిక్షానికి వెళ్లాలని ప్లాన్ చేశారు. కానీ, అంతరిక్షంలోనే చిక్కుకున్న సునీతా విలియమ్స్, విల్మోర్ లను వెనక్కి తీసుకువచ్చేందుకు గాను స్పేస్ ఎక్స్ క్రూ 9 లో ఇద్దరు వ్యోమగాములే వెళ్లనున్నారు. రిటర్న్ జర్నీలో సునీతా బ్యాచ్ తో కలిసి నలుగురు ఉండేలా నాసా ప్లాన్ చేస్తోంది.

అంతరిక్షంలో అన్ని రోజులుంటే ఏమవుతుంది?

సునీతా విలియమ్స్, విల్మోర్ లు అంతరిక్షంలోకి చేరి 2 నెలలు దాటింది. అయితే ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉంటే వ్యోమగాములకు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వ్యోమగాములు మైక్రోగ్రావిటీకి ఎక్కువకాలం గురికావడంతో కంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు.

కళ్ల నరాల వాపు, కంటి ఆకారంలో మార్పు , కన్ను పొర ముడతలు పడటం వంటి లక్షణాలను వ్యోమగాముల్లో చూడవచ్చు. మరోవైపు స్పేస్‌ ఫ్లైట్-అసోసియేటెడ్ న్యూరో-ఓక్యులర్ సిండ్రోమ్ కు గురౌతారని వైద్య నిపుణులు చెబుతున్నారు.

సునీతా విలియమ్స్ ఇప్పటికే రెండుసార్లు అంతరిక్షానికి వెళ్లి తిరిగి వచ్చారు. కానీ, ఈసారి మాత్రమే అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. మరో ఆరు నెలల పాటు ఆమె అక్కడే ఉండాల్సిన పరిస్థితులు రావడం కొంత ఆందోళనకు గురి చేస్తోంది.

Also Read: Sunita Williams: భారత సంతతికి చెందిన ఈ ఆస్ట్రోనాట్‌కు అంతరిక్షంలో ఎదురైన సమస్య ఏంటి?


Show Full Article
Print Article
Next Story
More Stories