Sri Lanka: ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగం
Sri Lanka: శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ విధించారు. అధ్యక్షుడు గొట్టబాయ రాజపక్స పరారీతో శ్రీలంకలో పరిస్థితి అదుపుతప్పింది. ఆందోళనకారులు భారీ సంఖ్యలో ప్రధాని ఇంట్లోకి దూసుకెళ్లారు. దీంతో ప్రదాని నివాసం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. ప్రధాని నివాసం ఖాళీ చేయాలని ఆందోళనకారులను ఆర్మీ ఆదేశించింది.
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోయారు. మిలిటరీ విమానంలో మాల్దీవులు చేరుకున్నారు. ఇవాళ ఉదయం మాలే నగరంలోని వెలానా ఎయిర్‌పోర్టులో ఆయన ప్రత్యక్షమయ్యారు. గొటబాయతో పాటు ఆయన సతీమణి, ఇద్దరు బాడీగార్డులు వెంటవున్నారు. మాల్దీవుల ప్రభుత్వ ప్రతినిధులు గొటబాయకు స్వాగతం పలికారు. మాలేలోని ఎయిర్‌పోర్టులో దిగాక పోలీస్ ఎస్కార్ట్‌తో రహస్య ప్రాంతానికి తరలించారు. రాత్రి కొలంబో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి అధ్యక్షుడు గొటబాయ ఇద్దరు బాడీ గార్డులతో మిలిటరీ విమానం బయలుదేరినట్టు ఆ దేశ రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.
శ్రీలంకలో రాజకీయ సంక్షోభం ఇప్పట్లో సమసిపోయే సూచనలు కనిపించడంలేదు. ప్రజల ఆందోళనలు, ఆగ్రహంతో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయకుండానే దేశం విడిచి పారిపోయారు. ఈ రోజు తెల్లవారుజామున ఆయన భార్య సహా ఇద్దరు అంగరక్షకులతో కలిసి వాయుసేన విమానంలో మాల్దీవుల రాజధాని మాలేకు పరారైనట్లు వైమానిక అధికారి వెల్లడించారు. కాగా అధ్యక్ష పదవికి రాజీనామా విషయంలో తనను దేశం వీడి పోయేందుకు అనుమతిస్తేనే పదవి నుంచి వైదొలగుతానని మంగళవారం ఆయన మాట మార్చిన విషయం తెలిసిందే.
రాత్రి విమానం కావాలంటూ అధ్యక్షుడు గొటబాయ తమను కోరారని శ్రీలంక రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. నిబంధనలకు లోబడి విమానాన్ని సిద్ధం చేశామని అధికారులు చెప్పారు. శ్రీలంక త్రివిధ దళాలకు అధ్యక్షుడే సుప్రీం కమాండర్‌గా ఉంటారు. కాగా ప్రధానమంత్రి కార్యాలయం కూడా అధ్యక్షుడి పరారీని నిర్ధారించింది. గొటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోయారని తెలిపింది. మరోవైపు గొటబాయ తమ్ముడు, మాజీ ఆర్థిక మంత్రి బసిల్ రాజపక్స కూడా దేశం విడిచి పారిపోయాడు.
అరెస్టుల నుంచి తప్పించుకునేందుకే గొటబాయ రాజపక్స శ్రీలంక నుంచి పారిపోయాడని తెలుస్తోంది. అరెస్టు చేసే అవకాశం ఉండడంతోనే ఆయన విదేశాలకు పారిపోవాలని నిర్ణయించుకున్నారు. దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనల నేపథ్యంలో ఇవాళ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. కానీ అంతకన్నా ముందే, గొట్టబాయ శ్రీలంక విడిచి పారిపోయారు. ఈనెల 20న కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు.
తీవ్ర ప్రజాగ్రహం నేపథ్యంలో అధ్యక్ష పదవి నుంచి వైదొలగుతానని గొటబాయ ఇదివరకే పార్లమెంటు స్పీకర్‌కు, ప్రధాని రణిల్ విక్రమసింఘేకు తెలిపారు. స్పీకర్ మహింద అభయ్‌వర్ధనకు రాజీనామా లేఖను కూడా అందించినట్లు తెలుస్తోంది. అయితే, గొటబాయ కొత్త షరతు నేపథ్యంలో ఆయన రాజీనామా విషయమై స్పీకర్ ప్రకటన చేస్తారా.. లేదా అన్నది వేచి చూడాలి.
మరోవైపు శ్రీలంక రక్షణ శాఖ నుంచి అవసరమైన అన్ని అనుమతులు లభించిన తర్వాతే గొటబాయ, ఆయన భార్య సైనిక విమానంలో మాల్దీవులకు వెళ్లారని సైన్యం వెల్లడించింది. మొదట మాలెలో దిగేందుకు అక్కడి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ అనుమతి ఇవ్వలేదు. అయితే మాల్దీవుల పార్లమెంటు స్పీకర్ మజ్లిస్, మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ జోక్యం చేసుకుని గొటబాయ విమానం ల్యాండ్ అయ్యేందుకు మార్గం సుగమం చేశారు.
శ్రీలంకలో అఖిలపక్ష ప్రభుత్వ ఏర్పాటుకు విపక్ష పార్టీలు SJB, SLFP నేతలు సంప్రదింపులు ముమ్మరం చేశారు. తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు SJB నేత సాజిత్ ప్రేమదాస ఇప్పటికే అంగీకరించారు. ఆయనకు మద్దతను కూడగట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. శ్రీలంక రాజ్యాంగం ప్రకారం దేశ అధ్యక్షుడు, ప్రధాని రాజీనామాలు చేసిన పరిస్థితుల్లో ఆపద్ధర్మ అధ్యక్షుడిగా పార్లమెంటు స్పీకర్ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. 30 రోజుల్లోగా పార్లమెంటు సభ్యులు తమలో ఒకరిని కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకోవాలి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire