పేపర్లు లేవని.. ఏకంగా స్కూల్‌ పరీక్షలు రద్దు

Sri Lanka Cancels School Exams Over Paper Shortage
x

పేపర్లు లేవని.. ఏకంగా స్కూల్‌ పరీక్షలు రద్దు

Highlights

Sri Lanka Crisis: డ్రాగన్ కంట్రీ దెబ్బకు.. ఆ దేశం దివాలా తీసింది.

Sri Lanka Crisis: డ్రాగన్ కంట్రీ దెబ్బకు.. ఆ దేశం దివాలా తీసింది. స్వతంత్రానంతరం ఎన్నడూ చవిచూడని మహా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. తగిన పేపర్లు, ఇంకులు లేవని.. ఏకంగా స్కూళ్లలో నిర్వహించే పరీక్షలను రద్దు చేసింది. నిత్యావసరాలు ఆకాశాన్నంటాయి. ఒక గుడ్డు 35 రూపాయలకు చేరింది. కిలో చికెన్‌ వెయ్యి రూపాయలయ్యింది. ఈ దారుణ పరిస్థితులు మన పొరుగు దేశం శ్రీలంకలో నెలకొన్నాయి. ఆర్థిక సంక్షోభానికి కారణం చైనానే అంటూ అక్కడి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. సాయం పేరిట డ్రాగన్‌ దేశాన్ని కబళిస్తుందని మండిపడుతున్నారు.

రావణుడి పాలనలో భోగభాగ్యాలతో లంక తులతూగేదని మనకు రామాయణం నుంచి తెలుస్తోంది. అయితే ఆ దేశంలో ఇప్పుడు పరిస్థితులు ఆంజేయుడు దహనం చేసిన తరువాత లంకలాగా మారాయి. విదేశీ మారక నిల్వలు క్షీణించడంతో శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. దేశంలో స్వాతంత్రానంతరం ఎన్నడూ చవిచూడని ఆర్థిక సంకోభం నెలకొంది. ఇంధనంతో పాటు నిత్యవసర ధరలు ఆకాశాన్నంటాయి. కప్పు చాయ్‌ ధర ఏకంగా 100 రూపాయలకు చేరింది. లీటరు పెట్రోలు 280, గుడ్డు 35, కిలో చికెన్‌ ధర వెయ్యి రూపాయలకు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్నమో రామచంద్రా అంటూ.. అల్లాడుతున్నారు. పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే ఆఖరికి పేపర్లు లేవని పాఠశాలల్లో నిర్వహించే పరీక్షలను కూడా రద్దు చేసింది. దీనంతటికి ఇబ్బడి ముబ్బడిగా చైనా ఇచ్చిన అప్పులే కారణమంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఒకప్పుడు భారత్‌కు అత్యంత మిత్రదేశంగా ఉండేది పొరగుదేశం శ్రీలకం. ఉప ఖండంలో బలీయమైన శక్తిగా ఉన్న భారత్‌ను కాదని శ్రీలంక చైనా ట్రాప్‌లో పడింది. డ్రాగన్‌ కంట్రీ మాటలు నమ్మి.. భారీగా ప్రాజెక్టులను నిర్మించేందుకు లంక ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రోడ్లు, పోర్టులు, పవర్‌ ప్రాజెక్టులతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాల పేరుతో చైనా భారీగా అప్పులు ఇచ్చింది. డ్రాగన్‌ ఇచ్చిన రుణాలను శ్రీలంక అడ్డూ అదుపులేకుండా ఖర్చు చేసింది. అప్పులు చెల్లించలేక ఆ దేశం చేతులెత్తేసింది. ఇదే అదునుగా చైనా పలు నౌకాశ్రయాలను తన గుప్పెట్లోకి తెచ్చుకుంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకలో ఇటీవల చైనా విదేశాంగ మంత్రి పర్యటించారు. అప్పులపై ఏ మాత్రం స్పందించకపోవడంతో శ్రీలంక ప్రభుత్వం భంగపడింది. చైనా తీరు తెలిసి రాపక్సే సోదరులు నిండా మునిగామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆపన్న హస్తం కోసం దిక్కులు చూస్తున్నారు.

శ్రీలంక ఆర్థిక సంక్షోభంపై భారత్‌ స్పందించింది. పొరుగు దేశానికి సాయం అందిస్తామని భారత్‌ తెలిపింది. 1.5 బిలియన్‌ డాలర్లను సాయం అందించడంతో పాటు 400 మిలియన్‌ డాలర్ల కరెన్సీ స్వాప్‌ సాయాన్ని ప్రకటించింది. ఇదే కాకుండా సెటిల్‌మెంట్‌ 515 మిలియన్‌ డాలర్లకు చేరినట్టు అధికార వర్గాలు తెలిపాయి. శ్రీలంకకు భారత్‌ చేస్తున్న సహాయంతో న్యూఢిల్లీ-కొలంబో మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. హిందూ మహాసముద్రంలో బలపడాలని ఆశిస్తున్న డ్రాగన్‌కు ముకుతాడు వేసేందుకు భారత్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

శ్రీలంకను నిండా ముంచేసిన చైనా ఇప్పుడు బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, అప్ఘానిస్తాన్‌, ఆఫ్రికా దేశాలపై కన్నేసింది. అక్కడ కూడా ఇబ్బడి ముబ్బడిగా అప్పులు ఇచ్చి ఆయా ప్రాంతాల్లో తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు డ్రాగన్‌ కంట్రీ ఎత్తులు వేస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీలంక తరువాత మరే దేశం చైనా బారిన పడిన దివాలా తీస్తుందో వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories