Bangladesh Crisis: దేశం వదిలి వెళ్ళిపోయిన షేక్ హసీనా… బంగ్లాదేశ్ సంక్షోభానికి కారణమేంటి? ఇప్పుడు ఆ దేశంలో ఏం జరుగుతోంది?

Sheikh Hasina left the country What is the cause of Bangladesh crisis What is happening in that country now
x

Bangladesh Crisis: దేశం వదిలి వెళ్ళిపోయిన షేక్ హసీనా… బంగ్లాదేశ్ సంక్షోభానికి కారణమేంటి? ఇప్పుడు ఆ దేశంలో ఏం జరుగుతోంది?

Highlights

హసీనా రాజీనామా చేయడంతో మధ్యంతర ప్రభుత్వ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో అల్లకల్లోలంగా మారిన బంగ్లాదేశ్ లో ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా సోమవారం రాజీనామా చేశారు. ఆమె రాజీనామాతో బంగ్లాదేశ్ పార్లమెంట్ రద్దయింది. అధికారం సైన్యం చేతుల్లోకి వెళ్ళింది.

అసలు ఆమె ఎందుకు రాజీనామా చేశారు? శాంతిభద్రతలు అదుపు తప్పి దేశం సైన్యం చేతుల్లోకి ఎలా వెళ్ళింది? ఈ ప్రశ్నలకు తోడు ఆ దేశంలో రేపు ఏమవుతోందనే టెన్షన్ కూడా పెరుగుతోంది.

ప్రస్తుతానికి, అపద్దర్మ ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించేందుకు బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీల నాయకులు, వైమానిక దళం అధికారులు పాల్గొన్నారు.


బంగ్లాదేశ్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు

హసీనా రాజీనామా చేయడంతో మధ్యంతర ప్రభుత్వ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మధ్యంతర ప్రభుత్వంలో నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ పేరును రిజర్వేషన్ల వ్యతిరేక పోరాటానికి నేతృత్వం వహిస్తున్న నహీద్ ఇస్లాం ప్రతిపాదించారు.

ప్రధాని పదవి రేసులో మరికొందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసి కార్యకలాపాలను కొనసాగించనున్నారు. దేశంలో కర్ఫ్యూను ఎత్తివేశారు. ప్రభుత్వ సంస్థలను తెరవాలని ఆదేశించారు. విద్యా సంస్థలు మంగళవారం నుంచి తెరుచుకున్నాయి. రిజర్వేషన్ల పోరాటంతో విద్యా సంస్థలు మూతపడ్డాయి.


షేక్ హసీనా పదవికి ఎసరు తెచ్చిన రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం

షేక్ హసీనా ప్రధానమంత్రి పదవి రాజీనామాకు రిజర్వేషన్ల వ్యతిరేక పోరాటం కారణమైంది. హసీనా సర్కార్ ప్రతిపాదించిన రిజర్వేషన్లను విద్యార్థులు వ్యతిరేకించారు. సుప్రీంకోర్టు కూడా ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పును వెల్లడించింది. ఈ తీర్పును అమలు చేస్తామని హసీనా సర్కార్ ప్రకటించింది.

సుప్రీంతీర్పు రిజర్వేషన్ల వ్యతిరేక పోరాటానికి బలం చేకూర్చింది. ఈ పోరాటాన్ని అణచివేసేందుకు హసీనా ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలోనే సుమారు 300 వందలకు పైగా మరణించారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆర్మీ ఆల్టిమేటంతో హసీనా తన పదవికి రాజీనామా చేసి ప్రత్యేక హెలికాప్టర్ లో భారత్ కు వచ్చారు.

రిజర్వేషన్ల వ్యతిరేక పోరాటం ఎందుకు ప్రారంభమైంది?

హసీనా తండ్రి షేక్ ముజిబిర్ రెహమాన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1972లో బంగ్లాదేశ్ సివిల్ సర్వీసెస్ లో రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు. బంగ్లాదేశ్ లిబరేషన్ మూమెంట్ లో పాల్గొన్న వారిని స్వాతంత్ర్య సమరయోధులుగా గుర్తిస్తూ ఫ్రీడమ్ ఫైటర్స్ కోటా కింద 30 శాతం నియామకాలను కేటాయించారు. మరో 10 శాతం యుద్ధ బాధిత మహిళలకు కేటాయించారు. ఇలాగే, వెనుకబడిన జిల్లాలకు చెందిన వారికి 40 శాతం కేటాయించారు. అన్నీ పోను మెరిట్ ప్రాతిపదికన జరిగే నియామకాల కోటా 20 శాతానికి పరిమితమైంది.

అయితే, 1975లో ముజిబిర్ రెహమాన్ హత్యకు గురైన తరువాత రిజర్వేషన్ల కోటాలో మార్పులు వచ్చాయి. వెనుకబడిన ప్రాంతాలకు చెందిన వారికి ఇచ్చిన 40 శాతం కోటాను 20 శాతానికి తగ్గించారు. మహిళల 10 శాతం కోటాను ఫ్రీడం ఫైటర్స్ కుటుంబాలకు మాత్రమే కాకుండా మహిళలందరికీ వర్తించేలా చేశారు. మూలవాసి ముస్లింలకు కొత్తగా 5 శాతం కేటాయించారు. ఈ మార్పులతో 1985 నాటికి మెరిట్ కోటా 45 శాతానికి పెరిగింది.

2010లో బంగ్లాదేశ్ ప్రభుత్వం.. ఫ్రీడమ్ ఫైటర్స్ కోటాను మనుమలు, మనుమరాళ్ళకు కూడా వర్తించేలా చేసింది. అయినప్పటికీ, ఈ కోటా కింద నియమితులయ్యే వారి సంఖ్య ఎన్నడూ 10 శాతానికి మించలేదు. ఈ కోటాల చట్టబద్ధతను సవాలు చేస్తూ 2018లో దాఖలైన పిటిషన్ ను బంగ్లాదేశ్ హైకోర్టు తోసిపుచ్చింది. అదే ఏడాది మార్చి 21న ప్రధాని షేక్ హసీనా తనకు ఫ్రీడమ్ ఫైటర్స్ కోటాను కొనసాగించాలని ఉందని అన్నారు. అయితే, అక్కడి విద్యార్థి సంఘాలు కోటాకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాయి. దాంతో, సివిల్ సర్వీసెస్ లోని కోటాలన్నింటినీ రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు షేక్ హసీనా. నిరసనకారులు రిజర్వేషన్ వ్యవస్థను సంస్కరించాలని కోరారు. మొత్తంగా తీసేయమని అడగలేదు. చివరికి 2020 జూలై 1 నుంచి రిజర్వేషన్ల రద్దు అమల్లోకి వచ్చింది.

రిజర్వేషన్ కోటాను పునరుద్దరించిన హసీనా

ప్రధాని షేక్ హసీనా 2024 జూన్ లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటాను పునరుద్దరిస్తూ నిర్ణయం తీసుకోవడంతో కొత్త వివాదం రాజుకుంది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగాలను మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కొందరు నిరసనకారులు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ వివాదమే చినికి చినికి గాలివానగా మారింది.


అవామీ లీగ్ పార్టీని తిరుగులేని శక్తిగా నిలిపిన హసీనా

హసీనా తండ్రి బంగ్లాదేశ్ వ్యవస్థాపకులు షేక్ ముజిబుల్ రెహమాన్. 1947లో ఆమె పుట్టారు. ఢాకా యూనివర్శిటీలో చదివే సమయంలోనే రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. బంగ్లాదేశ్ కు ప్రధానిగా ఉన్న రెహమాన్ ను ఆయన భార్య, ముగ్గురు కొడుకులను ఆర్మీ చంపింది. ఆ సమయంలో హసీనా ఆమె చెల్లెలు విదేశాల్లో ఉన్నారు. దీంతో వీరిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు.

పరిస్థితులు చక్కబడేవరకు ఆమె దేశానికి దూరంగానే ఉన్నారు. 1981లో అవామీ పార్టీ బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో ఆమె స్వదేశానికి తిరిగి వచ్చారు. దేశంలో పలు పోరాటాలు చేశారు. 1991 ఎన్నికల్లో ఆమె పార్టీకి ఆశించిన స్థానాలు రాలేదు.

1996లో అవామీ లీగ్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది. ప్రధానిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాతి ఎన్నికల్లో అవామీ లీగ్ పార్టీ ఓటమి పాలైంది. 2008లో ఆమె పార్టీ గెలిచింది. ఆ తర్వాతి నుంచి ఆమె వెనుదిరిగి చూసుకోలేదు.

ఈ ఏడాది జనవరిలో జరిగిన ఎన్నికల్లో అవామీ లీగ్ విజయం సాధించింది. ఈ ఎన్నికలను బిఎన్ పీ బహిష్కరించింది. 2014లో కూడా ఆ పార్టీ ఎన్నికలను బహిష్కరించింది. 2018లో ఆ పార్టీ పోటీ చేసినా అవామీ లీగ్ గెలిచింది.

హసీనా తన రాజకీయ జీవితంలో అనేక ఆటుపోట్లను చూశారు. తన ప్రత్యర్ధి పార్టీల నాయకులను జైళ్లకు పంపారనే ఆరోపణలు కూడా ఆమెపై చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఆమె తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ‌్లడంతో జైళ్లలో ఉన్న విపక్ష నాయకులను విడుదల చేయాలని దేశాధ్యక్షుడు షహబుద్దీన్ ఆదేశాలు జారీ చేశారు. నిరసనలతో అట్టుడికిపోతున్న బంగ్లాదేశ్ లో శాంతి నెలకొల్పేందుకు కృషి చేయాలని అమెరికా తదితర దేశాలు కోరుతున్నాయి. సైన్యం చేతుల్లోకి వెళ్ళిన బంగ్లాదేశ్ లో ప్రజస్వామ్య పాలనను వెంటనే పునరుద్ధరించాలని ఒత్తిడి చేస్తున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories