సంచలన నిర్ణయం తీసుకున్న సౌదీ అరేబియా.. మహిళలకు మరింత స్వేచ్ఛ..
* మహిళలకు మరింత స్వేచ్ఛ.. సంస్కరణల దిశగా సౌదీ అరేబియా.. ఇప్పటికీ మహిలలపై సౌదీలో పలు ఆంక్షలు
A Step Towards Progress: ఇస్లాం దేశాలంటే మహిళలపై కఠిన ఆంక్షలు విధిస్తాయి. వారి హక్కులను కాలరాస్తున్నాయి. మహిళ సింగ్‌ల్‌గా బయటకు వస్తే రాళ్లతో కొట్టి చంపేస్తున్నాయి. షరియా చట్టం పేరుతో అరాచకాలను సృష్టిస్తున్నాయి. మహిళలు చదువుకోవద్దంటూ తాలిబన్లు చెబుతున్నారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కోర్సులు యువతులు చదవడం సంస్కృతికి విరుద్ధమంటున్నారు. హిజాబ్ ధరించకపోతే శిక్ష తప్పదంటూ ఇరాన్ హూంకరిస్తోంది. అదే సమయంలో ఓ ఇస్లామిక్ కంట్రీ మాత్రం వినూత్న నిర్ణయం తీసుకుంది. బుర్కా ధరించడం యువతు ఇష్టమంటూ ప్రకటించింది. దీంతో అక్కడి మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఆ దేశం ఏది? ఎందుకు బుర్కాను ఐచ్చికమని ఎందుకు తేల్చింది?
ఇస్లాం దేశాల్లో మహిళల హక్కులను కాలరాస్తున్నారు. అఫ్ఘానిస్థాన్, ఇరాన్ వంటి దేశాల్లో మహిళపై కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. మహిళలు కనీసం ఒంటరిగా వెళ్లేందుకు కూడా స్వాతంత్రం లేకుండా పోయింది. అఫ్ఘానిస్థాన్‌లో మహిళ పొరబాటున బయటకు వస్తే కొరడా దెబ్బలు తప్పవు. ఒకవేళ బుర్కా, హిజాబ్ ధరించకపోతే రాళ్ల దెబ్బలు తప్పవు. బాలికా విద్యను నిషేధించారు. తాజాగా యూనివర్సిటీల్లో మహిళలు చదువుకోరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎందుకు విధించారనే కారణం తెలిస్తే అవాక్కవుతారు. యూనివర్శిటీ విద్యార్థునులు సరైన డ్రస్ కోడ్‌తో సహా నిబంధనలు పాటించడం లేదట. పైగా ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌తో పాటు వృత్తివిద్యాకోర్సులు ముస్లిం గౌరవ మర్యాదలకు, అఫ్ఘానిస్థాన్ సంస్కృతి సరిపోవట. బాలికలకు మాత్రమే విద్యనందించే మదర్సాలను కూడా మూసివేయాలని తాలిబన్లు నిర్ణయించారట. పోనీలే అని దయతలచి మసీదుల్లో నిర్వమించేందుకు అనుమతించినట్టు తాజాగా తాలిబన్ ప్రభుత్వం వెల్లడించింది. తాజా తాలిబన్ల నిర్ణయంపై ఇస్లాం దేశాలే మండిపడుతున్నాయి. ఇది ఇస్లాంకు వ్యతిరేకమని మానవత్వంపై దాడిగా ప్రపంచ దేశాలు విమర్శిస్తున్నాయి. కానీ తాలిబన్లు మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు. మహిళలు, బాలికలపై తాలిబన్లు చిత్ర విచిత్రమైన ఆంక్షలు విధిస్తున్నారు. సాధారణ జీవనంతో పాటు చదువు, ఉద్యోగాల వరకు అన్ని విషయాల్లోనూ మహిళల హక్కులను తాలిబన్లు కాలరాస్తున్నారు.
అఫ్ఘానిస్థాన్‌తో సరిహద్దును పంచుకుంటున్న ఇరాన్‌లోనూ పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. కాకపోతే కాబుల్ కంటే టెహ్రాన్‌లో పరిస్థితులు కొంచెం బెటర్‌గా ఉన్నాయి. కానీ షరియా చట్టాన్ని మాత్రం అమలుచేస్తోంది. మహిళలు తప్పనిసరి డ్రస్‌కోడ్ పాటించాల్సిందే. దుస్తుల ధారణ విషయంలో ఇరాన్ ప్రత్యేకంగా మొరాలిటీ పోలీసులను నియమించింది. అయితే మహ్సా ఆమిని అనే 22 ఏళ్ల యువతి హిజాబ్ సరిగ్గా ధరించలేదని సెప్టెంబరు 16న మొరాలిటీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ యువతి కస్టడీలోనే చనిపోయింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భారీగా మహిళలు రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టారు. మూడు నెలలైనా ప్రజల్లో ఆగ్రహం చల్లారడం లేదు. మొదట రాజధాని టెహ్రాన్‌కే పరిమితమైన ఆందోళనలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వస్తున్నారు. హిజాబ్‌ను తగులబెడుతున్నారు. పలువురు తమ జుట్టును కత్తిరించుకుంటున్నారు. హిజాబ్‌తో పాటు మొరాలిటీ పోలీసు వ్యవస్థను రద్దు చేయాలంటూ ప్రజలు పట్టుబడుతున్నారు. ఇప్పటికే మొరాలిటీ పోలీసుల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కానీ హిజాబ్ విషయంలో మాత్రం ససేమిరా అంది. ఆందోళనలపై ఉక్కుపాదం మోపింది. పలు చోట్ల బాంబు దాడులు, కాల్పులు జరిపించి ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. అంతేకాదు వేలాది మంది ఆందోళనకారులను అరెస్టు చేసింది. ఇప్పటివరకు వరకు ఇద్దరు ఆందోళనకారులను ప్రభుత్వం ఉరేసింది. ఆందోళనల్లో పాల్గొన్న 18వేల మందిని అరెస్టు చేసినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 60వేల మందికి పైగా అరెస్టు చేసి ఉంటారని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ రెండు దేశాలే కాదు ఇతర ఇస్లాం దేశాలు కూడా మహిళల హక్కులను హరించి వేస్తున్నాయి.
కానీ ఇస్లాం దేశాలకు భిన్నంగా సౌదీ అరేబియా నిర్ణయం తీసుకుంటోంది. అభివృద్ధి కోసం తన పంథాను మార్చుకుంటోంది అక్కడి మహిళల హక్కులకు ప్రాధాన్యమిస్తోంది. డ్రస్ కోడ్ విషయంలో ఇన్నాళ్లు కఠినంగా వ్యవహరించిన సౌదీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. డ్రస్‌కోడ్ ఆంక్షలను మరింతగా సడలించింది. హిజాబ్ ధరించడం మహిళల వ్యక్తిగతమని ప్రిన్స్ మహమ్మద్ బిన్ సాల్మన్-ఎంబీఎస్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. కానీ గౌరవప్రదమైన దుస్తులు ధరించాలని మాత్రం మహిళలకు సూచించారు. తాజా ఆదేశాలతో సౌదీ మహిళలు విజయం సాధించినట్టయ్యింది. నల్లటి సంప్రదాయ దుస్తులను వదిలేసి కలర్‌ఫుల్ దుస్తులను ధరించి మహిళలు ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. నిజానికి ప్రిన్స్ సాల్మన్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తరువాత మహిళ హక్కులపై దృష్టిసారించారు. దేశాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించాలని ఎంబీఎస్ సంకల్పించారు. అందులో భాగంగా భారీ సామాజిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. లింగ బేధాలను తొలగించేందుకు కృషి చేస్తున్నారు. 2019లోనే ఉద్యోగాల్లో పురుషులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. నిజానికి నాన్ ఇస్లామిక్ దేశాల్లో ఇవన్నీ సాధారణ హక్కులే. కానీ ఇస్లామిక్ కంట్రీల్లో మాత్రం స్త్రీలకు ఏ మాత్రం స్వేచ్ఛ ఉండదు. సౌదీలో మాత్రం ఇతర దేశాల్లాగే మహిళలకు స్వేచ్ఛ, హక్కులను ప్రభుత్వం కల్పిస్తోంది. మహిళుల క్యాబ్ డ్రైవర్లుగా మారుతున్నారు. విదేశాలకు వెళ్లే స్వేచ్ఛను ఇస్తోంది. తాజా పరిణామాలతో క్రమంగా సరళీకరణ దిశగా సౌదీ అరేబియా పయనిస్తోంది.
మహిళల విద్యపై తాలిబన్లు తీసుకున్న నిర్ణయంపై సౌదీ అరేబియా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మహిళల చదువును బ్యాన్ చేయడం అఫ్ఘాన్ మహిళల న్యాయమైన హక్కులను కాలరాయడమేనని సౌదీ అరేబియా విమర్శించింది. మహిళల హక్కులపై గొంతెత్తిన మహమ్మద్ బిన్ సాల్మన్‌ను పలు దేశాలు అభినందించాయి. అయితే ఇప్పటికీ కొన్ని విషయాల్లో మహిళలపై సౌదీలో పూర్తిగా ఆంక్షలను తొలగించలేదు. సంరక్షలు లేకుండా యువతి పెళ్లి చేసుకుంటే జైలు శిక్ష తప్పదు. పొడవాటి దుస్తుల విషయంలో ఇప్పటికీ ఆంక్షలు అమలవుతున్నాయి. మహిళా హక్కుల కోసం పోరాడిన పలువురి ఉద్యమకారులకు ప్రభుత్వం జైలు శిక్ష విధించింది. ఇలాంటి కొన్ని ఆంక్షలతో మహిళకు పూర్తిగా స్వేచ్ఛ లభించలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇతర ఇస్లాం దేశాలతో పోలిస్తే ఇది గణనీయమైన మార్పేనని మాత్రం అంగీకరించాల్సిందే. కానీ ఇతర దేశాల్లో మాత్రం పరిస్థితులు మరింత ఘోరంగా మారుతున్నాయి. మానవ హక్కులను పూర్తిగా హరించి వేస్తున్నాయి. షరియా చట్టం పేరుతో వారిపై కఠినమైన ఆంక్షలు విధిస్తున్నాయి. ఆ ఆంక్షలకు వ్యతిరేకంగా ఇరాన్‌లో మహిళలు తిరగబడుతున్నారు. పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అప్ఘాన్‌లో మాత్రం ప్రశ్నిస్తేనే దాడులు చేస్తున్నారు. ఎక్కువ మాట్లాడితే కాల్చి పడేస్తామంటూ తుపాకీలను ఎక్కు పెడుతున్నారు.
మొత్తంగా ఇతర ఇస్లాం దేశాలకు భిన్నంగా సౌదీ అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో మహిళల విషయంలో మరిన్ని సంస్కరణలను సౌదీ తీసుకొచ్చే అవకాశం ఉంది. సౌదీ మార్గంలో ఇతర ఇస్లాం దేశాలు కూడా అడుగేస్తే అభివృద్ధి వైపు దూసుకుపోవడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire