Nuclear War: అణు యుద్ధానికి పుతిన్ సిద్ధం?

Russia to Send Nuclear-Capable Missiles to Belarus
x

Nuclear War: అణు యుద్ధానికి పుతిన్ సిద్ధం?

Highlights

Nuclear War: *బెలారస్‌కు ఆయుధాల తరలింపు *ఐరోపాపై దాడి చేయడానికేనని అనుమానాలు

Nuclear War: రెండు దేశాల మధ్య యుద్ధమే ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. అదే ప్రపంచ యుద్ధం జరిగితే మానవాళి సమూలంగా నాశనమవుతుందేమో.. బెలారస్‌కు అణ్వస్త్రాలను విక్రయిస్తామని ర‌ష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. బెలారస్‌కు వాటిని పుతినే తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐదు నెలలైనా.. యుద్ధం సాగుతుండడం.. పశ్చిమ దేశాలు సహకారం అందిస్తుండడంతో పుతిన్ తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్‌పై దాడి ప్రారంభ సమయంలోనూ అణ్వస్త్రాలను సిద్ధం చేయమని రష్యా అధ్యక్షుడు హెచ్చరించారు. దీంతో తాజా ప్రకటనతో ప్రపంచ దేశాలు భయాందోళనకు గురవుతున్నాయి.

ఈనెల 24తో ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం ఐదు నెలలకు చేరింది. ఆ మరుసటి రోజే రష్యా అధ్యక్షుడు పుతిన్‌.. బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకోతో మాస్కోలో సమావేశమయ్యారు. అనంతరం బెలారస్‌కు ఇసికందర్‌-ఎం వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థ, బాలిస్టిక్‌, క్రూజ్‌ క్షిపణలు, అణు వార్‌హెడ్లను అందించనున్నట్టు పుతిన్‌ తెలిపారు. ఇప్పటికే ఇరుదేశాల రక్షణ శాఖలు ఈ వ్యవస్థల విక్రయంపై చర్చలు జరిపినట్టు వివరించారు. పుతిన్‌ ప్రకటన ఇప్పుడు ఐరోపా దేశాధినేతలకు టెన్షన్‌ పట్టుకున్నది. బెలారస్‌కు ఆయుధాలను విక్రయిస్తామని పుతిన్‌ చెబుతున్నారు. కానీ.. పుతిన్‌ బెలారస్‌కు అణ్వస్త్రాలు విక్రయించడం లేదని.. దాడికే వాటిని సిద్ధం చేస్తున్నట్టు అనుమానిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రారంభించిన మొదట్లోనూ పుతిన్‌ అణ్వస్త్రాల హెచ్చరికలు చేశారు. ఇప్పుడు బెలారస్‌కు ఇస్తామనడంతో అణ్వాయుధాల దాడికి పుతిన్ సిద్ధమవుతున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అణ్వస్త్రాలను బెలారస్‌కు తరలిస్తామనడంపై ముఖ్యంగా ఐరోపాదేశాలకు భయం పట్టుకున్నది. ఉక్రెయిన్‌పై అణుదాడికి పుతిన్ దిగాలనుకుంటే.... అణ్వాయుధాలను బెలారస్‌కు ఎందుకు తరలిస్తారని ఐరోపా దేశాలు ప్రశ్నిస్తున్నాయి. ఒకవేళ ఉక్రెయిన్‌పై అణు దాడి చేయాలనుకుంటే... డాన్‌బాస్‌, మరియూపోల్‌, ఖేర్సన్‌ ప్రాంతాలే సురక్షితం. పుతిన్‌ బెలారస్‌కు అణ్వాయుధాల తరలింపు.. ఐరోపా దేశాలపై దాడికే అనే అనుమానాలు మొదలయ్యాయి. బెలారస్‌కు పశ్చిమ సరిహద్దులో పోలాండ్‌, లిథువేనియా, లాట్వియా దేశాలు ఉంటాయి. ఇటీవల రష్యా గూడ్స్‌ రైళ్లను కాలినిన్‌గ్రాడ్‌కు వెళ్లకుండా లిథువేనియా బ్యాన్ చేసింది. రష్యా ఎగుమతులు అత్యధిక భాగం... బాల్టిక్‌ సముద్రతీరంలోని కాలినిన్‌గ్రాడ్‌ నుంచే వెళ్తాయి. గూడ్స్‌ రైళ్ల నిషేధం విధించడంతో లిథువేనియాపై మాస్కో ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి బదులు తీర్చుకుంటామని క్రెమ్లిన్‌ ప్రకటించింది. దీంతో ముఖ్యంగా పోలాండ్‌, లిథువేనియా దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం ప్రారంభం నుంచి పశ్చిమ దేశాలు.. నేరుగా సైన్యాన్ని పంపడం లేదు. కానీ.. ఉక్రెయిన్‌ బలగాలకు అవసరమైన ఆయుధాలను భారీగా అందిస్తున్నాయి. ఆర్థిక సాయంతో పాటు వ్యూహాలను కూడా రూపొందించి.. జెలెన్‌స్కీ సేనలను ముందుండి నడిపిస్తున్నాయి. పుతిన్‌ను కట్టడి చేసేందుకు అవకాశమున్న అన్ని మార్గాల్లో ఆంక్షలను విధిస్తున్నాయి. తాజా జీ7 దేశాధినేతలు కూడా రష్యా బంగారాన్ని బ్యాన్‌ చేశాయి. దీంతో రష్యాకు 19 వందల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లనున్నది. పశ్చిమ దేశాల చర్యలను పుతిన్‌ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. కానీ.. పశ్చిమ దేశాలు మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. జీ7 శిఖరాగ్ర సదస్సు నిర్వహిస్తున్న సమయంలోనే పుతిన్‌ కీలక నిర్ణయం తీసుకోవడం.. ఆయా దేశాలకు హెచ్చరికగానే విశ్లేషకులు చెబుతున్నారు.

అణ్వాయుధాలను ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై దాడి చేయడానికే బెలారస్‌కు తరలిస్తున్నట్టు కొన్ని ఐరోపా దేశాలు అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నాయి. రెండ్రోజుల్లో ముగుస్తుందనుకున్న యుద్ధం ఐదు నెలలకు చేరింది. ఎంతకీ కీవ్‌ నగరానికి పుతిన్‌ సేనలు చేరుకోలేకపోతున్నాయి. కీవ్‌పై అణుదాడి చేసి... ఉక్రెయిన్‌ను సొంతం చేసుకునే దిశగానే పుతిన్‌ అడుగులు వేస్తున్నాని తెలుపుతున్నారు. డాన్‌బాస్‌, మరియూపోల్‌, ఖేర్సన్‌ ప్రాంతాలకంటే.. బెలారస్‌ సరిహద్దుకే కీవ్‌ నగరం మరింత దగ్గరని.. అందుకే అటుగా పుతిన్‌ ఆయుధాలను తరలిస్తున్నట్టు వివరిస్తున్నారు. ఒకవేళ ఉక్రెయిన్‌పైనే అణుదాడి జరిపినా... భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అయితే పుతిన్‌ న్యూక్లియర్‌ వార్‌హెడ్‌లతో దాడి చేయకపోవచ్చని స్పష్టం చేస్తున్నారు.

ఏదేమైనా ఉక్రెయిన్ - రష్యా యుద్ధం ప్రపంచ దేశాల్లో ఆర్థిక, ఆహార, చమురు సంక్షోభం తలెత్తింది. సుమారు 46 దేశాల్లో లక్షలాది మంది ప్రజలు ఆకలి కేకలతో అల్లాడుతున్నారు. ఇప్పటికైనా యుద్ధం ఆపాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories