రష్యా ప్రతిపక్ష నాయకుడి ఆరోగ్యంపై వైద్యుల ఆందోళన

రష్యా ప్రతిపక్ష నాయకుడి ఆరోగ్యంపై వైద్యుల ఆందోళన
x
Highlights

Russia Opposition Leader Navalny: రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది.

Russia Opposition Leader Navalny:రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఏ క్షణమైనా ఆయన మరణించే అవకాశముందని వైద్యులు తెలపడంతో సర్వత్వా ఆందోళన నెలకొంది. ఆయనకు వెంటనే మెరుగైన చికిత్స అందించాలంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌‌పై ప్రపంచ నలుమూలల నుంచి ఒత్తిడి పెరుగుతోంది.

జైల్లో ఉన్న రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషయమించింది. ఆయన ఏ క్షణమైనా మరణించే అవకాశం ఉందని ఆయన వ్యక్తిగత వైద్య బృందం తెలిపింది. 3 వారాలుగా నిరాహార దీక్షలో ఉన్న ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని డాక్టర్లు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన వైద్య నివేదికలను పరిశీలిస్తే ఆయనలో పొటాషియం స్థాయిలు ప్రమాదకర స్థాయికి చేరినట్లు తెలుస్తోందన్నారు. ఇది ఏ క్షణంలోనైనా గుండెపోటుకు దారితీయొచ్చని పేర్కొన్నారు.

నావల్నీ ఏ క్షణమైనా మరణించొచ్చని ఆయన వ్యక్తిగత వైద్యుడు యారోస్లోవ్‌ అశిఖ్‌మిన్‌ ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారు. అలాగే నావల్నీ వైద్య బృందానికి నేతృత్వం వహిస్తున్న వైద్యుడు అనస్టాసియా వసిల్‌యేవా స్పందిస్తూ.. వెంటనే చర్యలు తీసుకోవాలని ట్విటర్‌ ద్వారా తెలిపారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ విధానాలను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న నాయకుడే అలెక్సీ నావల్నీ. అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌పై పోటీ చేయడంతో దేశవ్యాప్తంగా ఆయనకు ఆదరణ లభించింది. ఈ క్రమంలో ఆయనపై విష ప్రయోగం జరిగింది. దాదాపు 5 నెలల పాటు జర్మనీలో చికిత్స పొందారు. పుతిన్‌పై పోరాటం ఆపేది లేదంటూ తిరిగి రష్యాకు చేరుకున్న ఆయన్ని జనవరి 17న పోలీసులు విమానాశ్రయంలోనే అరెస్టు చేశారు. అనేక అవినీతి కేసులు మోపారు. కోర్టు ఆయనకు రెండున్నరేళ్లు జైలు శిక్ష విధించింది.

ఈ ఏడాది జనవరి నుంచి జైలు జీవితం గడుపుతున్న నావల్నీ తీవ్రమైన వెన్నునొప్పి, కాళ్లలో నిస్సత్తువ వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, చికిత్స అందజేయడానికి తన వైద్య బృందాన్ని పోలీసులు అనుమతించడం లేదు. దీంతో ఆయన నిరాహార దీక్షకు దిగారు.

Show Full Article
Print Article
Next Story
More Stories