Ukraine: ఖార్కివ్ ప్రాంతంలో ఉక్రెయిన్ భీకర దాడులు
Ukraine: ఉక్రెయిన్ యుద్ధం 200 రోజులకు చేరుకుంది.. యుద్ధంలో రష్యా బలగాలకు ఉక్రెయిన్ భారీ షాక్ ఇచ్చింది. ఆ దేశంలోనే అతి పెద్ద రెండో నగరం.. ఉత్తరాన ఉన్న ఖార్కివ్ పట్టణానికి 2వేల కిలోమీటర్ల దూరం వరకు మాస్కో బలగాలను కీవ్ తరిమికొట్టింది. యుద్ధం ప్రారంబమైన తరువాత 7 నెలల్లో ఉక్రెయిన్ సాధించిన అతి పెద్ద విషయం ఇదే కావడం గమనార్హం. ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పిందే నిజమవుతోంది. రష్యా ఆక్రమించుకున్న ప్రాంతాలను క్రిమియాతో సహా తిరిగి స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. అందులో భాగంగానే ఖేర్సన్‌పై ఉధృతమైన దాడులు చేస్తోంది. దక్షిణ, తూర్పు ప్రాంతాల్లోని రష్యా సైన్యానికి సాయం అందకుండా ఉక్రెయిన్ బ్లాక్ చేసింది.
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకన్.. తాజాగా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో పర్యటించారు. ఉక్రెయిన్‌కు మరో 100 కోట్ల డాలర్ల ఆయుధ సాయం అందిస్తున్నట్టు ప్రకటించారు. అదే సమయంలో ఉక్రెయిన్ బలగాలు.. రష్యా సైన్యానికి చుక్కలు చూపించారు. ఇటీవల అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటనను నిజం చేసేలా దూకుడు ప్రదర్శించారు. ఉక్రెయిన్‌లో కెల్లా అతిపెద్ద రెండో నగరం ఖార్కివ్ నుంచి మాస్కో సైన్యాన్ని తరిమికొట్టాయి. 2వేల చదరుపు కిలోమీటర్ల ప్రాంతాన్ని తిరిగి దక్కించుకున్నట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. మొత్తంగా 50 కిలోమీటర్లకు పైగా రష్యా సేనలను తరిమికొట్టినట్టు తెలిపింది. తమ దాడిని తట్టుకోలేక ప్రాణాలను రక్షించుకునేందుకు రష్యా సైన్యం పారిపోయినట్టు కీవ్ ప్రకటించింది. అదే సమయంలో ఖార్కివ్ నుంచి తమ బలగాలను వెనక్కి తీసుకుంటున్నట్టు క్రెమ్లిన్ ప్రకటించింది. దీంతో.. పరోక్షంగా ఓటమిని రష్యా సైన్యం అంగీకరించినట్టయ్యింది. ఈ విషయాన్ని అటు బ్రిటన్ రక్షణ శాఖ, అమెరికా ప్రకటించాయి. తాజా పరిణామాలతో ఖార్కివ్ ప్రాంతంపై ఉక్రెయిన్ పూర్తి పట్టు సాధించినట్టయ్యింది. డాన్‌బాస్ ప్రాంతానికి వెళ్లేందుకు అత్యంత కీలకమైనది ఈ ఖార్కివ్ ప్రాంతం.. ఇక్కడి నుంచే డాన్‌బాస్‌లోని కీలకమైన లిజియం ప్రాంతంలో తిష్టవేసిన రష్యా బలగాలకు ఆహారం అందకుండా దారులన్నింటిని ఉక్రెయిన్ బ్లాక్ చేసింది.
ఏడు నెలల యుద్ధంలో ఉక్రెయిన్‌కు చెందిన మూడు ప్రాంతాలను రష్యా స్వాధీనం చేసుకుంది. నల్ల సముద్రానికి అనుకుని ఉన్న మరియూపోల్, ఖేర్సన్, తూర్పున డాన్‌బాస్‌లోని లుహాన్‌స్క్ ప్రాంతాలను పుతిన్ సేనలు దక్కించుకుంది. ఒక్క ఖేర్సన్ తప్ప.. మిగతా రెండు ప్రాతాల్లో మాస్కో సేనలతో ఉక్రెయిన్ బలగాలు భీకరంగా పోడాయి. చివరికి ఉక్రెయిన్ ఆ రెండు ప్రాంతాలను కోల్పోయింది. అయితే ఈ యుద్ధంలో 50 నుంచి 70 వేల మంది సైన్యాన్ని రష్యా కోల్పోయినట్టు నివేదికలు వచ్చాయి. అంతేకాకుండా మాస్కో ఆయుధాగారంలో నిల్వలు పడిపోవడంతో... యుద్ధంలో పుతిన్ సేనలు కాస్తా బలహీనపడ్డాయి. ఈ విషయాన్ని రష్యా ధ్రువీకరించకపోయినా.. సైనిక నియామకాలు చేపట్టడానికి పుతిన్ ఆదేశాలు ఇవ్వడం.. ఆయుధాల కోసం ఇతర దేశాలతో చర్చలు జరపడం.. వంటి పరిణామాలు నిజమేనని నిర్దారిస్తాయి. అదునుచూసి.. ఉక్రెయిన్ ఎదురుదాడికి దిగింది. గతనెలలో రష్యా ఆధీనంలోని క్రిమియాపై రెండు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో సాకి సైనిక స్థావరంలోని ఏడుకు పైగా ఫైటర్ జెట్లు ధ్వంసమయ్యాయి. ఇక్కడ రాకెట్ దాడి జరిగినట్టు స్పష్టమవుతోంది. ఈ దాడి ఉక్రెయిన్ పనేనని రష్యా ఆరోపించింది. తమకు సంబంధం లేదని ఉక్రెయిన్ తెలిపింది. అయితే క్రిమియాలో వరుస దాడులతో రష్యన్లు భయాందోళనకు గురయ్యారు. పలువురు స్వదేశానికి వెళ్లిపోయారు.
ఇక ఆగస్టు చివరిలో జెలెన్‌స్కీ రష్యా సేనలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బతికి బట్ట కట్టాలనుకుంటే.. పారిపోవాలని రష్యా సైన్యానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. రష్యా ఆక్రమించుకున్న క్రిమియాతో సహా అన్ని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. మాస్కో దళాలను సరిహద్దు వరకు తరిమికొడతామని తెలిపారు. రష్యా స్వాధీనం చేసుకున్న ఖేర్సన్, మరియూపోల్, లుహాన్‌స్క్ ప్రాంతాలతో పాటు 2014లో ఆక్రమించుకున్న క్రిమియాకు విముక్తి కల్పించేవరకు యుద్ధాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. జెలెన్‌స్కీ చెప్పినట్టుగానే.. గతంలో కంటే.. ఈసారి కీవ్ బలగాలు భీకర దాడులకు దిగుతున్నాయి. రష్యా ఆధీనంలోని ఖేర్సన్ రణరంగంలా మారింది. ఖేర్సన్‌లోని జపోరిజ్జియా న్యూక్లియర్ ప్లాంట్‌పై దాడి జరుగుతుందన్న ఆందోళనలు మొదలయ్యాయి. ఈ ప్లాంట్‌కు సమీపంలో కూడా రాకెట్ దాడులు జరిగాయి. ఐరోపాలోనే అతి పెద్ద న్యూక్లియర్ ప్లాంట్ జపోరిజ్జియా. ఇదే పేలితే భారీ నష్టం వాటిల్లుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. ఇదిలా ఉంటే.. తాజా పరిణామాలను చూస్తే.. జెలెన్‌స్కీ ప్రకటనలు నిజమవుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఖేర్సన్ నుంచి రష్యన్ దళాలను తరిమేయడమే అందుకు నిదర్శనం. మరోవైపు ఉక్రెయిన్‌కు అమెరికా భారీగా ఆయుధ సాయం చేస్తోంది. అమెరికా, బ్రిటన్ అందిస్తున్న ఆధునిక ఆయుధాలతోనే ఉక్రెయిన్ ఎదురుదాడికి దిగుతున్నట్టు తెలుస్తోంది.
ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు దిగింది. ప్రారంభంలో రెండ్రోజుల్లో యుద్ధం పూర్తవుతుందని పుతిన్ అంచనా వేశారు. బెలారస్ మీదుగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ దశగా.. మాస్కో బలగాలు వేలమంది సైన్యం దండెత్తింది. కీవ్‌కు 50 కిలోమీటర్ల దూరంలోనే నిలిచిపోయింది. ఉక్రెయిన్ గెరిల్లా పోరాటానికి క్రెమ్లిన్ సైన్యం విలవిలలాడింది. కీవ్‌ను మాత్రం చేరుకోలేకపోయింది. మూడు నెలల తరువాత.. గత్యంతరం లేక.. డాన్‌బాస్ వైపు మళ్లాయి. కానీ.. ఖార్కివ్‌లో మాత్రం రష్యా సైన్యం తిష్టవేసింది. ఈ యుద్దంలో ఉక్రెయిన్‌కు చెందిన నగరాలు, పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా ధ్వంసమయ్యాయి. ఉక్రెయిన్ సైన్య, పౌరులు కలిపి.. మొత్తం 15 వేల మంది మృత్యువాత పడ్డారు. రష్యాకు మాత్రం భారీగా సైనిక, ఆయుధ నష్టం వాటిల్లింది. ఈ యుద్ధం కారణంగా.. ఉక్రెయిన్‌కు చెందిన 60 లక్షలకు పైగా ప్రజలు విదేశాలకు వలసవెళ్లారు. మరో కోటి మందికి పైగా స్వగ్రామాలను వదిలి.. సురక్షిత ప్రాతాలకు తరలివెళ్లారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత.. ఐరోపాలో తొలిసారి భారీ మానవ వలసలు సంభవించినట్టు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం తెలిపింది.
ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. యుద్ధం ఏడాది పాటు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా.. పలు చిన్న దేశాలు.. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేవ్ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలు పతనావస్థకు చేరుకున్నాయి. ఇప్పటికైనా యుద్ధం ఆపేయాలంటూ పలు దేశాలు కోరుతున్నాయి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire