Afghanistan: ఆఫ్గనిస్తాన్‌ రాజధాని కాబుల్‌లో యుద్ధవాతావరణం..!

Rockets hit Neighbourhood Near Kabul Airport Amid us Pullout
x

కాబుల్ ఎయిర్పోర్ట్ వద్ద మల్లి రాకెట్ల దాడి (ఫైల్ ఇమేజ్)

Highlights

Afghanistan: అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో యుద్ధవాతావరణం నెలకొంది. కాబుల్ ఎయిర్‌పోర్టును లక్ష్యంగా మళ్లీ రాకెట్‌ దాడులు

Afghanistan: అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో యుద్ధవాతావరణం నెలకొంది. కాబుల్ ఎయిర్‌పోర్టును లక్ష్యంగా చేసుకుని మళ్లీ రాకెట్‌ దాడులు జరిగాయి. అయితే వీటిని క్షిపణి రక్షణ వ్యవస్థ ద్వారా కూల్చేసినట్ల తెలుస్తోంది. సోమవారం ఉదయం పలు రాకెట్లు ఎయిర్‌పోర్టు వైపు దూసుకొచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు కొందరు తెలిపారు. కాసేపటి తర్వాత వాటిని కూల్చేసిన శబ్దాలు వినిపించినట్లు చెప్పారు.

లాబ్‌ జార్‌ ఖైర్ఖానాలోని ఖోర్‌షిద్‌ ప్రైవేటు యూనివర్శిటీ సమీపంలో ఉంచిన ఓ వాహనం నుంచి ఈ రాకెట్లను ప్రయోగించినట్లు తెలిసింది. ఎయిర్‌పోర్టులో ఉన్న క్షిపణి రక్షణ వ్యవస్థ వీటిని గుర్తించి ప్రతిదాడి చేయడంతో.. అవి విమానాశ్రయం సమీపంలోని సలీం కార్వాన్‌ ప్రాంతంలో కూలిపోయాయి. అయితే, రాకెట్ల దాడికి పాల్పడింది ఎవరనేది ఇంకా తెలియరాలేదు. పేలుడు శబ్దాలతో ఎయిర్‌పోర్టు వద్ద ఉన్న అఫ్గాన్‌ పౌరులు భయాందోళనలతో అక్కడి నుంచి పరుగులు పెట్టారు. మొత్తం 5 రాకెట్లు ప్రయోగించినట్లు స్థానిక మీడియా కథనాల సమాచారం.

కాబుల్‌ ఎయిర్‌పోర్టు వద్ద ఆదివారంకూడా ఇలాంటి దాడి చోటుచేసుకున్న విషయం తెలిసిందే. విమానాశ్రయానికి వాయవ్య దిశలో.. కేవలం ఒక కిలోమీటరు దూరంలోని ఖువ్జా బుఘ్రా ప్రాంతంలో రాకెట్‌ దాడి జరిగింది. ఈ ఘటనలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు నిన్న కాబుల్‌లో భారీ ఉగ్ర కుట్రను అమెరికా భగ్నం చేసింది. నిన్న ఎయిర్‌పోర్టు వద్ద త్మాహుతి పేలుళ్లకు పాల్పడేందుకు ఓ వాహనంలో ముష్కరులు దూసుకురావడాన్ని గమనించిన అమెరికా భద్రతా బలగాలు డ్రోన్‌ దాడి ద్వారా వారిని మట్టుబెట్టారు. ఇదిలా ఉండగా అఫ్గాన్‌ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ రేపటితో ముగియనుండటం గమనార్హం.

Show Full Article
Print Article
Next Story
More Stories