చైనాపై రిషి సునక్‌ నిప్పులు.. తాను బ్రిటన్‌ ప్రధానమంత్రి అయితే డ్రాగన్‌ కంట్రీకి చుక్కలేనని హెచ్చరికలు

చైనాపై రిషి సునక్‌ నిప్పులు.. తాను బ్రిటన్‌ ప్రధానమంత్రి అయితే డ్రాగన్‌ కంట్రీకి చుక్కలేనని హెచ్చరికలు
x
Highlights

Rishi Sunak: భారత్‌పై నిత్యం డ్రాగన్‌ విషం కక్కుతుంది సరిహద్దులో కయ్యానికి కాలుదువ్వుతోంది.

Rishi Sunak: భారత్‌పై నిత్యం డ్రాగన్‌ విషం కక్కుతుంది సరిహద్దులో కయ్యానికి కాలుదువ్వుతోంది. భారత భూభాగాలపై కన్నేసింది. పలు ప్రాంతాల్లో భారీ నిర్మాణాలను కూడా చేపట్టింది. కశ్మీరు విషయంలో పాకిస్థాన్‌ను ఎగదోస్తుంది. భారత్‌ను ఇరుకున పెట్టేందుకు యత్నిస్తోంది. అయితే భారత్‌ ఎప్పటికప్పుడు చైనా చర్యలను అంతర్జాతీయ సమాజం ముందు ఎండగడుతూనే ఉంది. భారతే కాదు ప్రతి భారతీయుడూ చైనా తీరుపై ఉడికిపోతాడు. బ్రిటన్‌ ప్రధాని పదవికి పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన రిషి సుకన్‌ సైతం చైనాపై నిప్పులు కురిపించారు. తాను ప్రధాని పదవి చేపడితే డ్రాగన్‌ కోరలు పీకుతానని రిషి ప్రకటించారు.

జమ్ము కశ్మీర్ రాష్ట్రం పూర్తిగా భారత అంతర్భాగమే. అటు లడఖ్‌ అయినా.. ఇటు గిల్గిత్‌, బాలిస్తాన్‌ అయినా... ఇది భారత్‌ మాట కాదు.. ప్రతి భారతీయుడి మాట. అయితే లడక్‌ వైపు డ్రాగన్‌ కంట్రీ తన కుయుక్తులను ప్రదర్శిస్తూనే ఉంది. భారత భూభాగాలను సొంతం చేసుకునేందుకు నిత్యం కయ్యానికి కాలు దువ్వుతోంది. సరిహద్దులో కృత్రిమ గ్రామాలను నిర్మిస్తూ అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘిస్తోంది. మరోవైపు పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌-పీవోకేలోని గిల్గిత్‌, బాలిస్తాన్‌ ప్రాంతంలో బెల్ట్‌ అండ్‌ రోడ్‌ను నిర్మిస్తోంది. అంతేకాదు పీవోకేలోని పలు ప్రాంతాలను పాకిస్థాన్‌ నుంచి సొంతం చేసుకుంది. అత్యంత కీలకమైన పీవోకేలో తిష్ఠ వేసేందుకు యత్నిస్తోంది. సరిహద్దుల్లో చైనా తీరును ఎప్పటికప్పుడు భారత్‌ ఎండగడుతూనే ఉంది. అయినా డ్రాగన్‌కు మాత్రం బుద్ది రావడం లేదు. సరిహద్దులోనే కాదు అంతర్జాతీయంగా కూడా చైనా తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బ్రిటన్‌ ప్రధాని ఎన్నిక ప్రచారంలోనూ చైనానే టార్గెట్‌ అయ్యింది. బ్రిటన్ ప్రధాని అభ్యర్థి, భారత సంతతికి చెందిన రిషి సునక్‌ చైనాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికైతే డ్రాగన్‌ కంట్రీకి చుక్కలు చూపుతామన్నారు. బ్రిటన్‌లోని 30 ఇన్‌స్టిట్యూట్లను మూసివేస్తామని తెలిపారు. దీంతో సంస్కృతి, భాషా కార్యక్రమాలతో విస్తరిస్తున్న డ్రాగన్‌ కంట్రీకి చెక్‌ పెడుతామన్నారు. చైనా గూఢచర్యాన్ని అడ్డుకునేందుకు బ్రిటన్‌ దర్యాప్తు సంస్థ ఎంఐ5ని ఉపయోగిస్తామని వెల్లడించారు. చైనా సైబర్‌ దాడులను అరికట్టేందుకు నాటో తరహా అంతర్జాతీయ సహకారాన్ని నిర్మిస్తామని స్పష్టం చేశారు. సాంకేతికతను దొంగిలించి యూకే విశ్వవిద్యాలయాలలోకి చొచ్చుకుపోతోందని విమర్శలు గుప్పించారు. అక్రమంగా ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యాకు చైనా మద్దతు ఇస్తోందని ఆరోపించారు. తైవాన్‌తో సహా భారత్‌ వంటి పొరుగు దేశాలను బెదిరించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.

డ్రాగన్‌ కంట్రీ చేపట్టిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ పథకంపైనా రిషి సునక్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పులను ఆశచూపి అభివృద్ధి చెందుతున్న దేశాలను తన కంట్రోల్‌లోకి తెచ్చుకుంటుందోని విమర్శించారు. జింజియాంగ్‌, హాంకాంగ్‌లోని సొంత ప్రజలను వేధించటం, అరెస్టులు చేస్తూ మానవ హక్కులను చైనా కాలరాస్తోందని ఆరోపించారు. వారి కరెన్సీని తగ్గిస్తూ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను చైనా అనుకూలంగా మలుచుకున్న తీరును రిషి ఖండించారు. చాలా కాలంగా బ్రిటన్‌తో పాటు పశ్చిమ ప్రాంతంలోని రాజకీయ నాయకులు చైనాకు ఎర్ర తివాచీ పరిచిందన్నారు. చైనా కుటిల బద్ధిపై గుడ్డిగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానిగా బాధ్యతులు చేపట్టిన మొదటి రోజు నుంచే డ్రాగన్‌ను కట్టడి చేసేందుకు యత్నిస్తానని రిషి చెప్పారు. ఇదిలా ఉంటే యూకే-చైనా సంబంధాల అభివృద్ధికి రిషి సునాక్‌ సరైన వ్యక్తి అని డ్రాగన్‌ అధికారిక మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ ఇటీవల పేర్కొనటం గమనార్హం. చైనా, రష్యా పట్ల రిషి సునాక్‌ బలహీనుడిగా ప్రత్యర్థి లిజ్‌ ట్రస్‌ ఆరోపించారు. దీంతో భారత్‌ శత్రువే తన శత్రువు అన్నట్టు రిషి రెచ్చిపోయారు.

బ్రిటన్‌లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రధాని అభ్యర్థికి చివరి రౌండ్‌లో రిషి సుకన్‌, లిజ్‌ ట్రస్‌ పోటీ పడుతున్నారు. ఇరువురిపై యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో సర్వేలు హోరెత్తుతున్నాయి. లిజ్‌ ట్రస్‌కు అనుకూలంగా సర్వేలు వస్తున్నాయి. టోరీ నేతల్లో ఎక్కువ మంది లిజ్‌ ట్రస్‌ వైపే మొగ్గు చూపుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. అయితే మొదటి నుంచీ సర్వేలు రిషికి సానుకూలంగా లేవు. అయినప్పటికీ ప్రతి రౌండ్‌లోనూ ముందంజలోనే ఉన్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. సర్వేలు పెద్ద మ్యాటర్‌ కాదని బ్రిటన్ రాజకీయ పరిశీలకులు కూడా చెబుతున్నారు. ప్రత్యర్థి లేబర్‌ పార్టీపై గెలిపించే సామర్థ్యమున్న వారికే టోరీ నేతలు జైకొడుతారంటున్నారు. లేబర్ పార్టీని ఎదుర్కొనే సత్తా లిజ్‌ ట్రస్‌కు లేదంటున్నారు. రిషి సునక్‌కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

అయితే తన ప్రధాని పదవిని కోల్పోవడంతో పాటు సొంత పార్టీ నేతలే ద్వేషించేలా రిషినే చేశారని తాత్కాలిక ప్రధాని బోరిస్‌ రగిలిపోతున్నారు. ఆయన రిషికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లిజ్‌ ట్రస్‌కు అనుకూలంగా ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories