Pakistan: దేశంలో ముదురుతున్న రాజకీయ సంక్షోభం
Pakistan: ఉక్రెయిన్-రష్యా యుద్ధం, అంతర్జాయ పరిణామాలతో మార్కెట్లు విలవిలలాడుతున్నాయి. కానీ పొరుగునున్న పాకిస్థాన్‌తో పోల్చుకుంటే మెరుగ్గానే ఉన్నాయి. శ్రీలంక తరువాత ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న రెండో ఆసియా దేశం పాకిస్థాన్. తాజా స్టాక్ మార్కెట్ల పరిస్థితులను పరిశీలిస్తే శ్రీలంక కంటే దాయాది దేశ స్టాక్ మార్కెట్లు దారుణంగా మారాయి. పాక్ స్టాక్ మార్కెట్లు ఏకంగా 6 లక్షల 95వేల కోట్ల రూపాయలను నష్టపోయింది. దాదాపు లక్షా 35 కోట్ల రూపాయలు ఆవిరయ్యాయి. ఆ దేశ చరిత్రలోనే అత్యంత దారుణ ఆర్థిక పతనం ఇదేనని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి కారణం పాకిస్థాన్‌లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సంక్షోభం, సీపెక్ ప్రాజెక్టులే కారణమని విశ్లేషిస్తున్నారు.
రాజకీయ, ఆర్థిక సంక్షోభం.. పొరుగు దేశం పాకిస్థాన్‌ను నిండా ముంచుతున్నాయి. ద్రవ్యోల్బణం రాకెట్ కంటే వేగంగా దూసుకుపోతోంది. అంతే వేగంగా విదేశీ మారక నిధులు పడిపోతున్నాయి. పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్సోభం కన్నా.. రాజకీయ ఘర్షణలే ఆందోళనకరంగా మారాయి. ప్రస్తుత సంక్షోభానికి ఇమ్రాన్ ఖాన్ పీటీఐ ప్రభుత్వమే కారణమని ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపిస్తున్నారు. బాగున్న పరిస్థితులను పాకిస్థాన్ ముస్లిం లీగ్ షరీఫ్-పీఎంఎల్‌ఎన్ ప్రభుత్వమే మరింత దారుణంగా మార్చిందని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం 24 వేల 900 కోట్ల డాలర్ల విదేశీ రుణాలు పాక్ చెల్లించాల్సి ఉంది. ఇది శ్రీలంక, నేపాల్, ఆఫ్ఘానిస్థాన్ దేశాల మొత్తం జీడీపీ కంటే అధికం. పాకిస్థాన్ ఎంత సంక్షోభంలో కూరుకుపోయిందో చెప్పడానికి ఇది చాలు. ఈ అప్పులకు ఇమ్రాన్ ఖాన్ కారణమంటూ ప్రస్తుత ప్రభుత్వం విమర్శిస్తోంది. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం చేసిన విపరీతమైన అప్పులతోనే ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం నెలకొన్నదని ఇన్‌ఫర్మేషన్ మరియమ్ ఔరంగజేబ్ ఆరోపించారు.
పీటీఐ ప్రభుత్వ హయాంలో 25 లక్షల కోట్ల రూపాయల నుంచి 44 లక్షల కోట్ల రూపాయలకు అప్పులు పెరిగినట్టు పాక్ ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి మిస్తాహ్ ఇస్మాయిల్ తెలిపారు. దాదాపు 78 శాతం అప్పులు ఇమ్రాన్‌ఖాన్ హయాంలోనే పెరిగాయన్నారు. మొత్తంగా ప్రస్తుత విదేశీ రుణాలకు, ఆర్థిక సంక్షోభానికి గత ప్రభుత్వమే కారణమంటూ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను పీటీఐ తోసిపుచ్చుతోంది. పీటీఐ ప్రభుత్వ హయాంలో 5వేల 200 కోట్ల డాలర్లను రుణాలను తీసుకున్నట్టు పీటీఐకి చెందిన మాజీ మంత్రి పవాద్ హుస్సేన్ ఆరోపించారు. ఆ తీసుకున్న లోన్లలో గత ప్రభుత్వాలు చేసిన అప్పులకు 3వేల 800 కోట్ల డాలర్లను చెల్లించినట్టు స్పష్టం చేశారు. ఆ అప్పుల పాపం నవాజ్ షరీఫ్‌దేనంటూ విమర్శలు గుప్పించారు. ప్రస్తుత పేద ప్రభుత్వానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ -ఐఎంఎఫ్ ఒప్పందాలు నచ్చకపోతే ఎందుకు చర్చలు జరుపుతున్నారంటూ ప్రశ్నించారు.
తాజాగా షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ద్రవ్య లోటును తగ్గించే దిశగా భారీ కోతలను విధించారు. దీంతో భారీగా అప్పులు వచ్చే అవకాశం ఉందని పాక్ ఆశిస్తోంది. అయితే నిపుణులు మాత్రం ప్రస్తుత బడ్జెట్‌పై పెదవి విరుస్తున్నారు. ఐఎంఎఫ్ లోన్లకు ఇచ్చేందుకు ఇది ఏమాత్రం సరిపోదని చెబుతున్నారు. బడ్జెట్‌లో తీసుకున్న నిర్ణయాలు ఐఎంఎఫ్ అంచనాలకు సరిపోయేలా లేవని నిధులు ఇవ్వడం కష్టమేనని వివరిస్తున్నారు. ముంచుకొస్తున్న ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి ఐఎంఎఫ్ నుంచి ప్రస్తుతం పాకిస్థాన్ 90 కోట్ల డాలర్లను కోరుతోంది. అయితే పాక్ కఠిన ఆర్థిక విధానాలను అమలు చేయాలని.. చైనాతో ఒప్పందాలపై పునరాలోచన చేయాలని ఐఎంఎఫ్ కోరుతోంది. ప్రత్యేకంగా చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్-సీపెక్‌పై డీల్స్ గురించి గట్టిగా పట్టుబడుతోంది. సీపెక్ చెల్లింపులను పరిమితం చేయాలని మొత్తం ప్రాజెక్ట్ డీల్‌ను మరింత తగ్గించుకోవాలని ఐఎంఎఫ్ సూచిస్తోంది.
పాకిస్థాన్‌లో ఆర్థిక స్థిరత్వం రావాలంటే తప్పకుండా చైనా ప్రాజెక్టులను ఆపేయాలని చెబుతోంది. చైనా కంపెనీలు చేపడుతున్న ప్రాజెక్టులకు భారీగా నిధులను వసూలు చేస్తున్నట్టు ఐఎంఎఫ్ ఆరోపిస్తోంది. సీపెక్ ప్రాజెక్టులపై పునరాలోచన చేస్తున్నట్టు పాక్ బడ్జెట్‌లో ప్రకటించింది. సీపెక్ ప్రత్యేక ఆర్థిక మండలి ప్రారంభంపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నట్టు ప్రకటించింది. అయితే సీపెక్ ప్రాజెక్టుల్లో ఎలాంటి మార్పులకు చాన్స్ లేదని నిపుణులు చెబుతున్నారు. అవన్నీ చైనా చట్టాలకు అనుగుణంగానే చేసుకున్నట్టు చెబుతున్నారు. సీపెక్‌పై ఎలాంటి నిర్ణయాలు పాకిస్థాన్‌కు తీసుకేనేందుకు వీలు లేదని వివరిస్తున్నారు. ఒకవేళ ప్రాజెక్టులను ఆపేసినా చైనా నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని స్పష్టం చేస్తున్నారు. సీపెక్ ప్రాజెక్టుల విషయంలో ఏం చేయాలన్నా.. చైనా అనుమతి తప్పనిసరి అంటున్నారు. 2018లోనే సీపెక్ ప్రాజెక్టుల విషయంలో ఇమ్రాన్ ఖాన్ ప్రాజెక్టు విలువ తగ్గించేందుకు ప్రయత్నాలు చేశారు. దీనిపై అప్పట్లో చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్మీ చీఫ్‌కు నోటీసులు కూడా పంపింది.
పాక్ ఆర్థిక వ్యవస్థను ముంచడానికి ఈ చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడర్ చాలని నిపుణులు చెబుతున్నారు. పాకిస్థాన్ పాలిట సీపెక్ ప్రాజెక్టులు యమపాశాలుగా మారాయని చెబుతున్నారు. పాక్‌ను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడం కష్టమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire