America: గర్భస్త్రావం హక్కులపై అమెరికాలో ఆందోళనలు

Protests Against Abortion Law Held Across America | Telugu News
x

America: గర్భస్త్రావం హక్కులపై అమెరికాలో ఆందోళనలు

Highlights

America: దేశ వ్యాప్తంగా రోడ్లెక్కిన వేలాది మంది మహిళలు

America: అగ్రరాజ్యం అమెరికాను కుదిపేస్తున్న సమస్యల్లో గర్బస్త్రావ హక్కులు ఒకటి. ఇటీవల కోర్టు ప్రతులు కొన్ని బయటకు రావడంతో అమెరికన్‌ మహిళల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నది. పలు నగరాల్లో మహిళలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జూన్‌ చివరి వారంలో అమెరికాలో గర్భస్త్రావ హక్కులపై ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పును ఇవ్వనున్నది. 50 ఏళ్లుగా ఉన్న అబార్షన్ హక్కులను కోర్టు రద్దు చేస్తుందా? లేక అనుమతిస్తుందా? అనేది ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. రో వర్సెస్‌ వేడ్ కేసుగా పిలిచే ఈ కేసుకు అధికార పార్టీకి చెందిన 80 శాతం మంది డెమొక్రాట్లు అనుకూలంగా ఉన్నారు. 65 శాతం మంది రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నారు.

1973కు ముందు అబార్షన్‌పై అమెరికాలో ఎలాంటి చట్టాలు లేవు. అయితే గర్భస్త్రావం అనేది మహిళ ఇష్టమని.. రో వర్సెస్‌ వేడ్‌ కేసులో 1973లో అమెరికా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే పేరెంట్‌హుడ్‌ వర్సెస్‌ కేసీ కేసులో 1992లో సుప్రీంకోర్టు మరో నిర్ణయం తీసుకున్నది. గర్భం ధరించిన తరువాత 22 నుంచి 24 వారాలకు ముందు మాత్రమే అబార్షన్ చేయించుకోవడాన్ని అనుమతినిచ్చింది. ఆ తరువాత గర్భం పూర్తి స్థాయిలో జీవంగా మారుతుందని.. అప్పుడు అబార్షన్‌ చేయించుకోవడాన్ని నిషేధించింది. అయితే అబార్షన్‌ హక్కులపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గర్భస్త్రావంతో మహిళల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయంటున్నారు. అబార్షన్లను రద్దు చేయాలంటూ ఇటీవల సుప్రీం కోర్టులో కేసు నమోదయ్యింది. కోర్టుకు సంబంధించిన ముసాయిదా ప్రతి ఇటీవల లీక్‌ అయ్యింది. ఈ ముసాదాలో జస్టిస్‌ శామ్యూల్‌ అలిటో కొన్ని కీలకమైన విషయాలను ప్రస్తావించారు. 1973లోని వచ్చిన రో వర్సెస్‌ వేడ్‌ కేసులో ఇచ్చిన వివరణ బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. దీన్ని ప్రజా ప్రనిధులే నిర్ణయిస్తారని జస్టిస్‌ అలిటో అందులో వివరించారు. తాజాగా ఈ కేసుపై సుప్రీంకోర్టు తీర్పు నివ్వనున్నది. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

అయితే ఈ నిర్ణయం రిపబ్లికన్లకు అనుకూలంగా ఉంది. రిపబ్లికన్లు రో వర్సెస్‌ వేడ్‌ చట్టానికి వ్యతిరేకంగా ఉన్నారు. రిపబ్లికన్లు పాలించే 13 రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని నిషేధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే రిపబ్లికన్ల ఆధ్వర్యంలోని వెస్ట్ వర్జీనియా, మిస్సిస్సిపి రాష్ట్రాల్లో అబార్షన్‌ క్లినిక్‌లను భారీగా నిషేధించారు. టెక్సాస్‌లో గతేడాది సెప్టెంబరు 1 నుంచే అబార్షన్లపై నిషేధం విధించింది. ఇక సుప్రీం కోర్టు నుంచి రో వర్సెస్‌ వేడ్‌ కేసు చట్ట సభలకు వెళ్తే.. అక్కడ రిపబ్లికన్లు అడ్డుకునే అవకాశం ఉంది. రో వర్సెస్‌ వేడ్‌కు అధికార పార్టీ డెమొక్రాట్లు అనుకూలంగా ఉన్నప్పటికీ.. ప్రతిపక్షం వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. 80 శాతం మంది డెమొక్రాట్లు అనుకూలంగా ఉన్నారు. కానీ. 65 శాతం మంది రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నారు. ఇదే అమెరికా మహిళ్లలో నిరసనలకు కారణమైంది. చట్టసభలకు వస్తే.. అబార్షన్‌ హక్కులను తొలగించే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.

గణాంకాల ప్రకారం 2020లో అమెరికాలో 9 లక్షల 30 వేల అబార్షన్లు జరిగాయి. ప్రతి వెయ్యి మందికి 14 మంది మహిళలు గర్భస్త్రావం చేయించుకుంటున్నారు. ఇది అభివృద్ధి చెందిన అన్ని దేశాల సగటు రేటులాగానే ఉంది. దిగువ మధ్య తరగతికి చెందిన 50 శాతం మంది మహిళలు అబార్షన్లకు సిద్ధపడుతున్నారు. 92 శాతం అబార్షన్లు ఏడాదిలో మొదటి త్రైమాసికంలోనే జరుగుతున్నట్టు అమెరికాకు చెందిన సెంటర్స్‌ ఫర్ డీసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌-సీడీసీపీ చెబుతోంది. 60 శాతం మంది అమెరికన్లు గర్భస్త్రావం అనేది చట్టబద్ధంగా ఉండాలని కోరుకుంటున్నారు. గర్భస్త్రావ హక్కులపై మత విశ్వాసం కూడా ముడిపడి ఉంది. 77 శాతం మంది శ్వేతజాతి మత ప్రచారకులు అబార్షన్లను వ్యతిరేకిస్తున్నారు. 2016 ఎన్నికల్లో శ్వేతజాతీయులను ఆకర్షించేందుకు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆబార్షన్లను నిషేధిస్తామని హామీ ఇచ్చాడు. ఇప్పటికీ దీనిపై రిపబ్లికన్లు అదే మాటపై ఉన్నారు.

గర్భస్త్రావం హక్కులపై అమెరికాలో ఆందోళనలు వెల్లువెత్తున్నాయి. అబార్షన్‌ హక్కుల చట్టాన్ని రద్దు చేస్తున్నట్టు సంకేతాలు రావడంతో కొన్ని రోజులుగా పలు రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. మా శరీరం, మా భవిష్యత్తు, మా అబర్షన్‌ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అబార్షన్‌ నిర్ణయం మహిళదేని.. ఆమె శరీరానికి సంబంధించిన నిర్ణయాన్ని మరొకరు తీసుకోవడమేమిటని అమెరికా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యూయార్క్‌, వాషింగ్టన్‌, టెక్సాస్‌, కెంటకీతో పాటు పలు రాష్ట్రాల్లో ప్రజలు రో వర్సెస్‌ వేడ్‌ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. తమ హక్కులను కాపాడుకునేవరకు పోరాటాన్ని ఆపేది లేదంటూ మహిళలు స్పష్టం చేస్తున్నారు. అమెరికాలో ఇప్పుడు అబార్షన్‌ అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. రాజకీయంగా.. ఎవరికి వారు అబార్షన్‌ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు.

1973లో అబార్షన్‌ హక్కులను చట్ట బద్దం చేస్తూ.. రో వర్సెస్‌ వేడ్‌ చట్టాన్ని అప్పటి ప్రభుత్వం అమోదించింది. 50 ఏళ్ల తరువాత ఈ చట్టంపై దుమారం రేగుతోంది. ఒకవైపు ప్రజలు భారీగా ఉద్యమం చేస్తుంటే దాన్ని అవకాశంగా మలుచుకునేందుకు రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే తమకు అనుకూలంగా చట్టంలో మార్పులు చేస్తారని మాత్రం అక్కడి మహిళలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories