Pakistan: పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌కు ఎదురుదెబ్బ

Pakistan Supreme Court Restores Parliament in Pakistan | Telugu News Today
x

పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌కు ఎదురుదెబ్బ

Highlights

Pakistan: అసెంబ్లీ రద్దు రాజ్యాంగానికి విరుద్ధమన్న సీజే

Pakistan: పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు ఆ దేశ సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఇమ్రాన్‌ సర్కారుపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని తోసిపుచ్చుతూ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. డిప్యూటీ స్పీకర్‌ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగంలోని నిబంధనలకు విరుద్ధంగా ఉందని సుప్రీం స్పష్టం చేసింది. పాక్‌ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహించాలని స్పీకర్‌ను ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు రేపు నిర్వహించే ఓటింగ్‌లో ఇమ్రాన్‌ బలం నిరూపించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. సుప్రీం తీర్పుతో పాకిస్థాన్‌ రాజకీయాలు మరింత వేడెక్కాయి.

పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఆదివారం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ ఖ్వాసిం సూరి తిరస్కరించారు. అవిశ్వాస తీర్మానం పాక్‌ రాజ్యాంగానికి, నిబంధనలకు విరుద్ధమని సూరి తెలిపారు. అనంతరం అసెంబ్లీని రద్దు చేస్తున్నట్టు ఇమ్రాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాని ఇమ్రాన్‌ స్పష్టం చేశారు. అయితే దీనిపై ప్రతిపక్షాలు అక్కడి సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. మరోవైపు మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని పాకిస్థాన్‌ ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది. నియోజకవర్గాల పునర్విభజనతో ఓటర్ల జాబితాను రూపొందించడం సవాలేనని ఎన్నికల కమిషన్‌ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలు నిర్వహించాలంటే కనీసం ఆరు నెలలు అవసరమని ఎలక్షన్‌ కమిషన్‌ స్పష్టం చేస్తోంది. అంతేకాకుండా.. ఎన్నికలు నిర్వహించాలంటే. కనీసం నాలుగు నెలల ముందే ప్రణాళికను వెల్లడించాలని ఎన్నికల చట్టంలోని సెక్షన్‌ 14ను కారణంగా చూపుతోంది.

తాజాగా అవిశ్వాస తీర్మానం తిరస్కరణ, అసెంబ్లీ రద్దుపై పాకిస్థాన్‌ సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఉమర్‌ బండియల్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం విచారణ చేపట్టింది. ధర్మాసనం ఎదుట అటర్నీ జనరల్‌ ఖలీద్‌ జావెద్‌ఖాన్‌ వాదనలు వినిపించారు. పార్లమెంట్‌ అంతర్గత వ్యవహారాల్లో న్యాయస్థానం జోక్యం సరికాదని జావెద్‌ ఖాన్‌ వాదించారు. స్పీకర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేసే అధికారం కోర్టులకు లేవని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ తరఫున వాదించారు. అయితే వాదనలు విన్న సుప్రీం కోర్టు చీఫ‌‌ జస్టిస్‌ ఉమర‌‌ బండియల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగంలోని నిబంధనలకు విరుద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పాక్‌ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై శనివారం ఉదయం 10 గంటలకు ఓటింగ్‌ నిర్వహించాలని స్పీకర్‌ను ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు.

పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై తీవ్ర ప్రభావం చూపనున్నది. గత్యంతరం లేక అవిశ్వాస తీర్మానంలో పాల్గొనాల్సి వస్తోంది. శనివారం నిర్వహించే అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్‌ బలం నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే మైనార్టీలో ఉన్న ఇమ్రాన్‌ ప్రభుత్వం పడిపోనున్నది. దీంతో గత్యంతరం లేక ఇమ్రాన్‌ రాజీనామా చేయాల్సి వస్తుంది. అసెంబ్లీలో సర్కారు బలం నిరూపించుకోకపోతే.. అవిశ్వాస తీర్మానం ద్వారా రాజీనామా చేసిన మొదటి ప్రధానిగా ఇమ్రాన్‌ పాక్‌ చరిత్రలో నిలిచిపోనున్నారు. గతంలో ఇద్దరు ప్రధానులపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినా.. ఓటింగ్‌కు ముందే రాజీనామా చేశారు. అయితే ఇమ్రాన్‌ మాత్రం రాజీనామా చేసేదే లేదంటూ భీష్మించారు. చివరి బంతి వరకు పోరాడుతానని భీరాలు పలికారు. ఇప్పుడు పాక్‌లో అందరి దృష్టి శనివారం నిర్వహించే అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌పైనే నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories