Imran Khan: రాజీనామా చేయనున్న పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌...

Pakistan Prime Minister Imran Khan Resigning Today 31 03 2022 | Live News
x

Imran Khan: రాజీనామా చేయనున్న పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌...

Highlights

Imran Khan: ఇవాళ పాక్ జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌...

Imran Khan: పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ ఇవాళ రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. అధికార పార్టీ పాకిస్థాన్‌ తెహ్రీక్‌ - ఇ - ఇన్సాఫ్‌-పీటీఐకి 12 మంది సభ్యులున్న మిత్రపక్షం ఎంక్యూఎం-పీ మద్దతు ఉపసంహరించుకుంది. దీంతో ఇమ్రాన్‌ ప్రభుత్వం మైనార్టీలో పడింది. చివరి బంతి వరకు పోరాడుతానని ప్రకటించిన ఇమ్రాన్‌.. గత్యంతరం లేక రాజీనామా చేసే పరిస్థితి తలెత్తింది. జాతినుద్దేశించి ప్రసంగించాలనుకున్న ఆయన.. ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. కేబినెట్‌ మంత్రుల అత్యవసర సమావేశం, ఐఎస్‌ఐ చీఫ్‌, పాకిస్థాన్‌ సైనిక దళాల ప్రధానాధికారులతో పలు దఫాలుగా ప్రధాని భేటీ కావడంతో పరిణామాలు ఉత్కంఠ రేపాయి. ఇమ్రాన్‌ రాజీనామాకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.

ఇమ్రాన్‌ఖాన్‌ సారథ్యంలోని ప్రభుత్వం.. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై నెగ్గేందుకు దారులన్నీ మూసుకపోయాయి. సొంత పార్టీ ఎంపీలతో పాటు ప్రధాన మిత్రపక్షం ఎంక్యూఎం-పీ కూడా ప్రతిపక్షాలతో కలిసిపోయింది. దీంతో ఎంక్యూఎం-పీకి చెందిన ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారు. దీంతో పాక్‌లోని సంకీర్ణ ప్రభుత్వం మైనార్టీలో పడింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ఖాన్‌ రాజీనామా చేయడం అనివార్యమైంది. ఇమ్రాన్‌ ప్రధానిగా కొనసాగే నైతిక హక్కును కొల్పోయారని.. తక్షణమే రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌ చేశాయి. తదుపరి ప్రధానిగా షెహ్‌బాజ్ షరీఫ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

342 మంది ఎంపీలు ఉన్న పాకిస్థాన్‌ అసెంబ్లీలో.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 172 మంది సభ్యులు ఉండాలి. ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వానికి మిత్రపక్షాలతో కలిపి 176 మంది సభ్యుల బలం ఉండేది. ఏడుగురు సభ్యులున్న ఎంక్యూఎం పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో పీటీఐ సభ్యుల సంఖ్య 163కు పడిపోయింది. ఇమ్రాన్‌ ఖాన్‌ సొంత పార్టీకి చెందిన 12 మంది సభ్యులు కూడా ప్రతిపక్షాలకు మద్దతు ప్రకటించారు. వారు ఓటింగ్‌లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు కోర్టు ద్వారా ఉత్తర్వులు పొందేందుకు పీటీఐ పార్టీ ప్రయత్నిస్తోంది. వంద మంది ఎంపీల సంతకాలతో ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి. అయితే ఎంక్యూఎం పార్టీ మద్దతు ప్రకటించడంతో ప్రతిపక్షాలు బలం పుంచుకుంది.

ఎంక్యూఎం మద్దతు ఉప సంహరణతో ఇమ్రాన్‌ రాజీనామా దిశగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానానికి ముందే ప్రధాని పదవిని వదిలేయాల్సిన పరిస్థితి నెలకొంది. దేశంలో పెరుగుతున్న పేదరికం, రెండంకెలకు చేరిన ద్రవ్యోల్బణం, మండుతున్న నిత్యావసరాల ధరలపై పాకిస్థాన్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు ఇమ్రాన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా పాకిస్థాన్‌ చరిత్రలో ఏ ప్రధాని కూడా ఐదేళ్లు పూర్తికాలం పని చేయలేదు. దాయాది దేశం... నిరంతరం రాజకీయ అనిశ్చితి.. సైన్యం తిరుగుబాటుతో అతలాకుతలమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories