Pakistan: అప్పుల ఊబిలో పాక్‌.. కోట్లకు పడగలెత్తుతున్న పాక్‌ ఆర్మీ చీఫ్‌

Pakistan Army Chiefs Family Became Billionaires in Last six Years
x

Pakistan: అప్పుల ఊబిలో పాక్‌.. కోట్లకు పడగలెత్తుతున్న పాక్‌ ఆర్మీ చీఫ్‌ 

Highlights

Pakistan: అయేషా అంజద్‌.. ఆమె ఆస్తి 2015లో సున్నా.. 2016 నాటికి 220 కోట్ల రూపాయలకు చేరింది.

Pakistan: అయేషా అంజద్‌.. ఆమె ఆస్తి 2015లో సున్నా.. 2016 నాటికి 220 కోట్ల రూపాయలకు చేరింది. మహనూర్‌ సాబిర్‌.. 2018 నవంబరులో ఆమె పెళ్లయ్యింది. అప్పటికి ఆమె ఆసక్తి కూడా సున్నా.. కానీ.. వారానికే అనూహ్యంగా ఆమె పేరిట 127 కోట్ల రూపాయల ఆస్తులు పెరిగాయి. అయేషా అంజద్‌, మహనూర్‌ సాబిర్‌ అత్తా కోడలు.. అయితే ఉన్నట్టుండి వారికి అంత ఆస్తులు ఎలా వచ్చాయని ఆశ్చర్యం కలుగుతుంది కదూ.. అయితే మీరు పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ కమర్‌ జావెద్‌ బజ్వా గురించి మీరు తెలుసుకోవాల్సిందే. ఆరేళ్లలో ఆయన కుటుంబ ఆస్తి పాకిస్థాన్‌ కరెన్సీలో 12వందల 70 కోట్లకు పెరిగింది. ఇస్లామాబాద్‌, కరాచీ, లాహోర్‌లో లగ్జరీ ఆస్తులు బజ్వా కుటుంబ సంపదలో అలా చేరిపోయాయి. అదే ఆరేళ్లలో పాకిస్థాన్‌ ఆర్థిక పరిస్థితి క్రమంగా క్షీణించింది. దేశం దివాళా అంచుకు చేరడంతో పాక్‌ ప్రజలు తినడానికి కూడా సరిగా తిండి దొరకక అల్లాడుతున్నారు. బజ్వా ఆస్తులపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఇటీవల కాలంలో పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ కమర్‌ జావేద్‌ బజ్వా పేరు తరచుగా వార్తల్లో వినిపిస్తోంది. సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌ను గట్టెక్కించేందుకు రుణాల కోసం ఆయన కాలికి బలపం కట్టుకుని తిరిగారు. అమెరికా, చైనా, యూకే వంటి దేశాల్లో పర్యటించారు. అమెరికా కీలకమైన ఎఫ్‌-16 ఫైటర్ జెట్ల అప్‌గ్రేడ్‌కు అంగీకరించడంలో సఫలమయ్యాడు బజ్వా.. చైనాలో బజ్వా పర్యటనతో బీజింగ్‌ కూడా సానుకూలంగా స్పందించింది. ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ పర్యటనకు బాటలు వేశారు. ఈ క్రమంలో దేశ రక్షణే కాదు దేశ ఆర్థిక పరిస్థితిని కూడా బాగుచేసే సేనాధిపతి బజ్వా అంటూ అక్కడి మీడియా అయనను ఆకాశానికి ఎత్తేసింది. ప్రజలు కూడా తమ ఆర్మీ చీఫ్‌ తమకోసం ఎంత కష్టపడుతున్నారని అభిమానించారు. మరోవైపు ఆయన పదవీ కాలం కూడా ఈనెల 29తో ముగుస్తోంది. దీంతో మరోసారి ఆయన వార్తల్లో నిలిచారు. రిటైర్‌మెంట్‌ అయిపోయినా.. మళ్లీ బజ్వానే పగ్గాలు చేపడుతారా? లేక మరొకరికి పగ్గాలు అప్పగిస్తారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. అదే సమయంలో పాక్‌ అధ్యక్షుడు అరీఫ్‌ అల్వీ, ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌లను బజ్వా కలిశారు. ఆర్మీ చీఫ్‌ ఎన్నిక ఇప్పుడు పాకిస్థాన్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. పాక్‌ ఆర్మీ చీఫ్‌ అంటే.. సర్వాధికారి లెక్క పాకిస్థాన్‌ రాజకీయాలన్నీ ఆర్మీ కనుసన్నల్లోనే నడుస్తుంటాయి. ఈ నేపథ్యంలో కొత్త్ బాస్‌ ఎన్నిక చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుత ఆర్మీ చీఫ్‌ కమర్‌ జావేద్‌ బజ్వాలో ఇప్పటివరకు చూసింది నాణానికి ఒక వైపు మత్రమే. తాజాగా బజ్వా గురించి ఓ వార్త పాకిస్థాన్‌లో కలకలం రేపుతోంది. వారం రోజుల్లో బజ్వా పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఆయన కుటుంబ సంపద ఆరేళ్లలో అమాంతంగా కోట్లకు పడగలెత్తినట్టు ఓ కథనం బయటకు వచ్చింది. బాజ్వా ఆస్తులపై ఫ్యాక్ట్‌ ఫోకస్‌ అనే సంస్థ ఓ పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. ఆరేళ్లలో బజ్వా కుటుంబ సభ్యులు, బంధువులు దేశ, విదేశాల్లో కోట్లాది రూపాయల విలువైన వ్యాపారాలను ప్రారంభించారట. లగ్జరీ ఆస్తులనుకూడా కొనుగోలు చేశారని ఆ కథనం వెల్లడించింది. ఇస్లామాబాద్‌, కరాచీల్లో కమర్షియల్‌ ప్లాజాలు, ప్లాట్ల వారి పేరిట ఉన్నట్టు తెలిపింది. లాహోర్‌లో ఓ ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీని బజ్వా కుటుంబం కొనుగోలు చేసినట్టు పేర్కొంది. ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం.. ఆరేళ్లలో బజ్వా కుటుంబం కొనుగోలు చేసిన ఆస్తులు, వ్యాపారాల విలువ పాకిస్థాన్‌ కరెన్సీ ప్రకారం.. 12 వందల 70 కోట్ల రూపాయలకు పైనే సంపాధించినట్టు సదరు కథనం వెల్లడించింది. అసలు ఉన్నట్టుండి ఈ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయన్నది మాత్రం ఫ్యాక్ట్‌ ఫోకస్‌ చెప్పలేదు.

2016 నవంబరు 29న పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌గా బజ్వా బాధ్యతలను స్వీకరించాడు. ఆ తరువాతనే ఆయన కుటుంబ ఆస్తులు అమాంతంగా పెరిగాయి. 2015లో బజ్వా సతీమణి అయేషా అంజద్‌ పేరిట ఎలాంటి ఆస్తులు లేవు. ప్రభుత్వ రికార్డుల్లో ఆమె ఆస్తుల విలువను సున్నా రూపాయలుగా ప్రకటించారు. అయితే ఒక్క ఏడాదిలోనే... అంటే 2016లో ఆమె ఆస్తులు 220కోట్ల రూపాయలకు చేరాయి. అటు బజ్వా కోడలు మహనూర్‌ సాబిర్‌ ఆస్తులు కూడా అమాంతం పెరిగాయి. 2018 నవంబరులో బజ్వా కుమారుడితో మహనూర్‌ వివాహం జరిగింది. పెళ్లికి ముందు ఆమె పేరిట ఎలాంటి ఆస్తులు లేవు. కానీ పెళ్లైన వారానికే 127కోట్ల రూపాయలకు ఆమె ఆస్తులు పెరిగాయని ఫ్యాక్ట్‌ ఫోకస్‌ కథనం తెలిపింది. పాకిస్థాన్‌లో అత్యంత శక్తివంతమైన వ్యక్తి బాజ్వా అతడికి ప్రధాని, అధ్యక్షుడు కూడా వణికిపోవాల్సిందే. అలాంటి వ్యక్తికి వ్యతిరేకంగా కథనాలు రాస్తే ఆ మీడియా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. కథనం వెలువడిన కొద్దిసేపటికే ఏకంగా ఆ వెబ్‌సైటే మాయమైంది. అయితే పాకిస్థాన్‌లో బజ్వా ఆస్తుల కథనం తీవ్ర కలకలం రేపింది. ఆర్థిక సంక్షోభంతో తాము తినడానికి తిండి కూడా దొరకడం లేదని.. కానీ.. బాజ్వా ఆస్తులు ఎలా పెరిగాయంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్‌ తీవ్ర అప్పుల్లో కూరుకుపోయింది. రుణాల కోసం యత్నించిన బజ్వా వాటిలోనే నొక్కేశారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంటోంది. 640 కోట్ల డాలర్ల రుణాలను పాకిస్థాన్‌ వచ్చే మూడేళ్లలో చెల్లించాల్సి ఉంది. అయితే షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం మాత్రం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ -ఐఎంఎఫ్‌పై ఆశలు పెట్టుకుంది. 316 కోట్ల డాలర్ల రుణాన్ని ఇవ్వాలని ఐఎంఎఫ్‌ను పాకిస్థాన్‌ కోరుతోంది. ఐఎంఎఫ్‌ సంస్కరణలను అమలు చేసే దిశగా షెహబాజ్‌ షరీఫ్ ప్రభుత్వం యత్నిస్తోంది. ఇప్పటికే నిత్యావసరాలు, చమురుతో పాటు భారీగా పన్నులను భారీగా పెంచారు. దీంతో ఐఎంఎఫ్‌ను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా యత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో మరింత ధరలు పెంచితే ప్రజలు వ్యతిరేకిస్తారన్న ఆందోళన ప్రధాని షెహబాజ్‌ను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో ఐఎంఎఫ్‌ సూచించిన సంస్కరణలను తీసుకురాకపోతే.. రుణాలు మంజూరు చేసే అవకాశమే లేదని.. పాక్‌ ఆర్థికవేత్తలు చెబుతున్నారు. చమురు, విద్యుత్‌, ఔషధాలు, ఆహారం ధరలు పెరగడంతో పాటు విదేశీ మారక నిధుల నిల్వలు దారుణంగా పడిపోతున్నాయి. దేశంలో నెలకొన్న తాజా పరిణామాలపై పాకిస్థానీయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గత 35 ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులను చూడలేదంటున్నారు. పరిస్థితులు అత్యంత దయనీయంగా మారాయని రాజధాని ఇస్లామాబాద్‌లో పలువురు వాపోతున్నారు. పెట్రోలు ధరలు భారీగా పెరగడంతో ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు జంకుతున్నట్టు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పాకిస్థాన్‌లో సామాన్యుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కానీ ధనవంతుల సంపద మాత్రం పెరుగుతోంది. ఇది పాక్‌ ప్రజల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. పరిస్థితులు చూస్తుంటే.. శ్రీలంకలాగే.. ఇక్కడ కూడా ప్రజలు తిరుగుబాటుకు దిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories