అమెరికాకు అణుభయం.. ప్రతి 10 మందిలో ముగ్గురికి... అణుదాడి జరగొచ్చని...

Nuclear Fear of America due to Vladimir Putins Character | Russia Ukraine War Update
x

అమెరికాకు అణుభయం.. ప్రతి 10 మందిలో ముగ్గురికి... అణుదాడి జరగొచ్చని...

Highlights

America - Nuclear Fear: రష్యా అణుదాడికి దిగొచ్చంటున్న అమెరికన్లు...

America - Nuclear Fear: అణు యుద్ధం... అమెరికన్లు తీవ్రంగా భయపెడుతోంది. ఉక్రెయిన్‌ ఆక్రమణకు దిగిన రష్యా.. అమెరికాను కూడా యుద్ధంలోకి లాగుతుందని ఆ దేశ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. రష్యా నేరుగా అమెరికాను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగొచ్చని ప్రతి 10 మంది అమెరికన్లలో ముగ్గురు భయపడుతున్నారు. ఉక్రెయిన్‌పై అణుబాంబులను ప్రయోగించే ప్రమాదముందని ప్రతి 10 మందిలో 9 మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు సర్వేలు చెబుతున్నాయి.

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం నేపథ్యంలో అణుదాడి జరిగే అవకాశం ఉందని ప్రపంచ దేశాలో ఆందోళన చెందుతున్నాయి. ఉక్రెయిన్‌పై ఫిబ్రవరి 24న రష్యా సైనిక చర్యకు దిగింది. ఉక్రెయిన్‌ విషయంలో ఏ దేశం జోక్యం చేసుకున్నా... ఊరుకోమంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తీవ్ర హెచ్చరికలు చేశారు. తమకు అణ్వాయుధాలు ఉన్నాయనే విషయం గుర్తించుకోవాలన్నారు. ఆ తరువాత పాశ్యాత్య దేశాలు కవ్వింపు వ్యాఖ్యలపై పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అణ్వాయుధాలను సిద్ధం చేయాలంటూ అణ్వస్త్ర దళాలను పుతిన్‌ ఆదేశించారు. దీంతో ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. అణుదాడి చేస్తే.. మారణహోమం జరుగుతుందని పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

పుతిన్‌ ప్రకటనతో... ఆయన తీరు తెలిసిన పాశ్చాత్య దేశాలకు భయం పట్టుకుంది. పుతిన్‌ అన్నంత పని చేస్తారనే అనుమానాలు కలుగుతున్నాయి. మొదట్లో ఉక్రెయిన్‌ఫై దాడికి దిగమని చెప్పిన పుతిన్‌.. సైనిక చర్య చేపట్టారు. కేవలం ఉక్రెయిన్‌ సైనిక స్థావరాలు, విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకునే దాడులు చేస్తామని పుతిన్‌ ప్రకటించారు. కానీ.. పలు నగరాల్లోని నివాస ప్రాంతాలే లక్ష్యంగా దాడులుకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో పుతిన్‌ అణుదాడికి దిగే ప్రమాదం ఉందని ముఖ్యంగా అమెరికన్లు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రష్యా నేరుగా అణ్వాయుధాలతో అమెరికా లక్ష్యంగా దాడి చేయొచ్చని సగానికి పైగా అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు. ప్రతి పది మందిలో ముగ్గురికి ఈ భయం నెలకొన్నట్టు అమెరికాకు చెందిన సెంటర్‌ ఫర్‌ పబ్లిక్‌ అఫైర్స్‌ పరిశోధన చెబుతోంది.

ఉక్రెయిన్‌పై రష్యా అణుదాడికి దిగొచ్చని ప్రతి పది మంది అమెరికన్లలో 9 మంది బలంగా నమ్ముతున్నారు. వారిలో 6 మంది భయపడుతున్నారు. పుతిన్‌ తనకు తాను నియంత్రణలో ఉండరని.. ఆయన వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని 71 శాతం మంది అమెరికన్లు భయపడుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. ఇటీవల ఉత్తర కొరియా నిర్వహిస్తున్న క్షిపణుల ప్రయోగాలపైనా అమెరికాన్లలో భయాందోళనలు ఉన్నాయి. అయితే 29 శాతం మంది అమెరికాకు ముప్పు పొంచి ఉందని ఆందోళన చెందుతున్నారు.

రష్యా విషయంలోనే అమెరికన్లు ఎక్కువగా భయపడుతున్నట్టు సర్వే చెబుతోంది. అమెరికా నేరుగా యుద్ధానికి దిగకపోయినప్పటికీ.. వారిని అణుభయం మాత్రం వెంటాడుతోంది. సోవియట్‌ యూనియన్‌ను తిరిగి పొందడమే రష్యా లక్ష్యంగా అమెరికన్లు భావిస్తున్నారు. అదే జరిగితే అణుయుద్ధం తప్పకపోవచ్చని టెన్షన్ పడుతున్నారు. నాటో సభ్య దేశాలపై ర‌ష్యా తలదూర్చితే.. అమెరికా జోక్యం చేసుకోవాల్సి వస్తుంది కదా.. అంటూ వారు విశ్లేషిస్తున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక అణువార్‌ హెడ్లు కేవలం రష్యా వద్ద మాత్రమే ఉన్నాయని.. విషయాన్ని అమెరికన్లు గుర్తు చేస్తున్నారు.

అయితే ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో అమెరికా సరైన నిర్ణయమే తీసుకుందని ఎక్కువ మంది అమెరికన్లు అభిప్రాయపడుతుండడం గమనార్హం. అమెరికా కూడా మొదట అణుదాడి జరపరాదన్న విధానం కొంత ఊరట కలిగిస్తోందని నిపుణులు చెబుతున్నట్టు సర్వే వెల్లడిస్తోంది. అయితే ఉక్రెయిన్‌ విషయంలో రష్యా తీవ్రంగా స్పందించే అవకాశం ఉందని మాత్రం అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. త్వరగా ఉక్రెయిన్‌ యుద్దానికి ముగింపు పలకాలని.. శాంతి కోసం ప్రపంచ దేశాలు కృషి చేయాల్సిన అవసరం ఉందని అమెరికన్లు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories