North Korea: తండ్రి వెంట తనయ.. రేపటి సారథిగా రెడీయా?

North Koreas Leader Kim Reveals his Daughter in Rare Appearance
x

North Korea: తండ్రి వెంట తనయ.. రేపటి సారథిగా రెడీయా?

Highlights

North Korea: ఆయుషు ఉండగానే ఆయుధాలు సమకూర్చుకుంటున్నాడు కిమ్ జోంగ్ ఉన్.

North Korea: ఆయుషు ఉండగానే ఆయుధాలు సమకూర్చుకుంటున్నాడు కిమ్ జోంగ్ ఉన్. ఆయన ముందుచూపు గురించి తలచుకున్నప్పుడల్లా అమెరికా వెన్నులో వణుకు పుడుతోంది. కొద్ది గంటల తేడాతోనే రెండు క్షిపణులు ప్రయోగించి అమెరికాను.. అమ్మో! అనిపిస్తున్నాడు. అంతేకాదు.. తాజా క్షిపణి ప్రయోగానికి ఎన్నడూ లేంది.. కూతురును కూడా వెంటపెట్టుకొని వెళ్లాడు. రేపటి రోజుల్లో తన కూతురు ప్రయాణించే మార్గం ఎలా ఉంటుందో ప్రపంచానికి ఇన్‎డైరెక్టుగా చెబుతున్నాడా?

ఎప్పుడూ ఎక్కడా కనిపించని కిమ్.. తనగురించి ప్రపంచమంతా మాట్లాడుకునేలా చేస్తాడు. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే అమెరికా చేత మాట్లాడిస్తాడు. అదీ ఆయన స్టైల్. క్షిపణుల ప్రయోగాల్లో ప్రపంచ దేశాలను తలదన్నే రీతిలో వ్యవహరిస్తున్న ఉత్తర కొరియా.. తాజాగా మళ్లీ క్షిపణులు ప్రయోగించింది. కొన్ని గంటల తేడాలోనే రెండు ఖండాంతర క్షిపణులు ప్రయోగించడం సంచలనం సృష్టిస్తోంది. జపాన్‌ ప్రాదేశిక జలాల సమీపంలోకి ఖండాంతర క్షిపణిని ప్రయోగించడంతో జపాన్ ఉలిక్కిపడింది.

ఈ ప్రయోగంతో నార్త్ కొరియా దగ్గర ఎంత ప్రమాదకరమైన అణ్వస్త్రాలు ఉన్నాయో జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిడా ప్రపంచానికి విడమరచి చెప్పారు. అమెరికా భూభాగాన్ని సైతం తాకే సామర్థ్యం గల ఖండాంతర క్షిపణుల్ని కిమ్ సమకూర్చుకుంటున్నాడని కిషిడా అన్నారు. థాయిలాండ్‌లో ఆసియా పసిఫిక్‌ తీర దేశాల ఆర్థిక సహకార మండలి-అపెక్‌ సమావేశం జరుగుతున్నప్పుడే కిమ్ క్షిపణి ప్రయోగం చేశారు. దీంతో కిమ్ చర్యను అపెక్ దేశాలు సంయుక్తంగా ఖండించాయి. అమెరికా అయితే నార్త్ కొరియాను రోగ్ కంట్రీగా అభివర్ణించింది. నార్త్ కొరియా దగ్గర బాంబు ఉందంటే.. పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్టేనని ప్రపంచానికి చెబుతోంది.

నార్త్ కొరియా ఒక్క ఈ సంవత్సరమే దాదాపు 70 వరకు క్షిపణి ప్రయోగాలు చేసిందట. ప్రపంచానికి తెలిసినంతవరకు 40 ఖండాంతర క్షిపణులు, మరో 20 ఇతర పరీక్షలు నిర్వహించినట్లు అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. మొత్తమ్మీద చూస్తే ఈ సంవత్సరం 70 దాకా క్షిపణి పరీక్షలు నిర్వహించిందంటున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో పరీక్షలు గతంలో ఎప్పుడూ జరగలేదంటున్నారు. 2011 లో కిమ్-జోంగ్-ఉన్ అధికారంలోకి వచ్చాక క్షిపణుల తయారీ, వాటి పరీక్షలు అనూహ్యంగా జరుగుతున్నాయి. తాజాగా జరిగిన క్షిపణి సామర్థ్యం 15వేల కిలోమీటర్లుగా జపాన్ వెల్లడించింది. అమెరికాను పూర్తిగా కవర్ చేయగల రేంజ్ తాజా క్షిపణి సొంతమంటున్నారు. అందుకే అమెరికా తీవ్రస్థాయిలో రియాక్టవుతోంది. అటు యూఎన్ భద్రతా మండలి కూడా కిమ్ ప్రయోగంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇక రష్యా మాత్రం కిమ్ ను అమెరికా కావాలనే రెచ్చగొడుతోందని కిమ్ కు వంత పాడుతోంది.

ఇక తాజా పరీక్షలో ఎన్నడూ లేని ఓ కొత్త అంశం తెరమీదికొచ్చింది. ఖండాంతర క్షిపణి ప్రయోగానికి ముందు దాన్ని పరిశీలించేందుకు వెళ్లిన కిమ్.. తన కూతురును వెంటబెట్టుకొని వెళ్లడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తండ్రి వెంట నడుస్తూ, తండ్రి చెబుతున్న విషయాలు ఆసక్తిగా వింటున్నట్టుగా కనిపిస్తున్న ఫొటో తాజాగా వైరల్ అవుతోంది. గతంలో ఓ బహిరంగ కార్యక్రమంలో కిమ్ కూతురు తొలిసారిగా తళుక్కున మెరిసింది. ఆ తరువాత కనిపించడం మళ్లీ ఇప్పుడే. కిమ్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడని గతంలో కొన్ని కథనాలు వెలువడ్డాయి. ఓ అమెరికన్ క్రీడాకారుడి ద్వారా ఆమె పేరు జు-యె అని తెలిసింది. అంతకు మించిన సమాచారం కిమ్ కూతురు గురించి ఎవరికీ తెలియదు.

ఖండాంతర క్షిపణి ప్రయోగ స్థలానికి కూతుర్ని వెంటబెట్టుక రావడం తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. కిమ్ ముందుచూపుతోనే కూతురును తీసుకొచ్చాడా? తన తరువాత పగ్గాలు చేపట్టేది ఆమె కూతురేనా? రక్షణకు సంబంధించిన ముఖ్యమైన రహస్యాలను ఇప్పట్నుంచే కూతురికి వివరిస్తున్నాడా? ఇలాంటి అంశాలు చర్చగా మారాయి. మరో నాలుగైదేళ్లలో కిమ్ కూతురు సైన్యంలో బాధ్యతలు నిర్వహించే దశకు చేరుకుంటుందని ప్రపంచ యుద్ధ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటినుంచే కూతురును యుద్ధ వాతావరణానికి అలవాటు చేస్తే తనలాగే రాటు దేలుతుందని కిమ్ భావిస్తున్నట్టు అంచనా వేస్తున్నారు. వారసత్వ బాధ్యతలు అప్పగించడమే తరువాయి అంటున్నారు.

కిమ్ తర్వాత నార్త్ కొరియాను పాలించేదెవరు అనే దానిపై కిమ్ కుటుంబం నుంచి ఇంతవరకైతే ఎలాంటి ప్రకటనా రాలేదు. ఒకవేళ కిమ్ పాలించలేని దశలో ఉంటే వారసుడు వచ్చేవరకు ఆయన సోదరి బాధ్యతలు చూసుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కిమ్ నాలుగో తరం ఏలుబడికి నార్త్ కొరియా ప్రజలంతా సిద్ధంగా ఉండాలన్న ఇండైరెక్ట్ మెసేజ్ ప్రస్తుత పరిణామంలో ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కిమ్ సతీమణి కూడా చాలా అరుదుగానే బయట కనిపిస్తుంటారు. ఆమె బాహ్య ప్రపంచంలోకి రావడం కూడా వ్యూహాత్మక సందేశంగానే ఉంటుందంటున్నారు. ఉద్రిక్తతలు తగ్గించడం, అంతర్గత సమస్యల సమయంలో కుటుంబం ఐక్యంగా ఉందని తెలియజేయడానికి తప్ప ఇతర సందర్భాల్లో కిమ్ భార్య బయటకు రాదంటున్నారు.

ఇక నార్త్ కొరియాలో మిలిటరీ రిక్రూట్ మెంట్ కు అధిక ప్రాధాన్యత ఉంటుంది. దేశంలో సామాన్య పౌరుల కన్నా సైనికులే అధిక సంఖ్యలో ఉంటారట. ప్రతి ముగ్గురు నార్త్ కొరియన్లలో ఒకరు తప్పనిసరిగా మిలిటరీతో కనెక్ట్ అయి ఉంటాడట. పురుషులు తప్పనిసరిగా మిలిటరీలో చేరాలి. మహిళల విషయంలో మాత్రం స్వల్ప మినహాయింపులు ఉన్నాయి. ఆ మినహాయింపులు తప్పిస్తే అందరూ మిలిటరీలో చేరాల్సిందే. బాలబాలికలు 14వ ఏట అడుగు పెట్టినప్పుడు మిలిటరీ సెలక్షన్ జరుగుతుంది. ఇక 17వ ఏట తుపాకీ పట్టి యుద్ధ క్షేత్రంలోకి వెళ్లాల్సిందే. 30 ఏళ్లు వచ్చేదాకా సైన్యంలో కొనసాగి ఆ తరువాత సాధారణ జీవితం కోసం రిటైర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక సెలక్షన్ చేయడం కూడా పాఠశాల స్థాయిలో, ఆయా యాజమాన్యాలదే బాధ్యత. అయితే రాజకీయంగా ఉన్నతమైన, కీలకమైన పొజిషన్లలో ఉన్న వ్యక్తుల పిల్లలకు మాత్రం ఈ నిబంధనలు వర్తించవు. అందుకే నార్త్ కొరియాను అతిపెద్ద సైనిక సమాజంగా అభివర్ణిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో కిమ్ కూతురు రానున్న అతికొద్ది కాలంలోనే ఉత్తరకొరియాకు మహిళా నియంతగా అవతరిస్తుందా? కిమ్ ఆరోగ్యం కూడా క్షీణిస్తోందా? కిమ్ తీరు గిట్టని దేశాలు ఇప్పుడెలా స్పందిస్తాయన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories