కిమ్‌ ప్రసంగానికి వైద్యులు కన్నీరు.. చిన్న పిల్లల్లా వెక్కి వెక్కి ఏడ్చిన వైద్యులు

North Koreas Kim Jong Un Praises Military Medics
x

కిమ్‌ ప్రసంగానికి వైద్యులు కన్నీరు.. చిన్న పిల్లల్లా వెక్కి వెక్కి ఏడ్చిన వైద్యులు

Highlights

Kim Jong Un: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ అంటే కరుడుగట్టిన నియంత ఎప్పడూ అణు పరీక్షలతో ప్రపంచ దేశాలను టెన్షన్‌ పెడుతుంటాడు..

Kim Jong Un: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ అంటే కరుడుగట్టిన నియంత ఎప్పడూ అణు పరీక్షలతో ప్రపంచ దేశాలను టెన్షన్‌ పెడుతుంటాడు అలాంటి కిమ్‌ తన హృద్యమైన ప్రసంగంతో కంటతడి పెట్టించారు. కరోనా సమయంలో ప్రజలకు అండగా నిలిచిన వైద్యులను ఉద్దేశించిన కిమ్‌ చేసిన వ్యాఖ్యలు వారిని భావోద్వేగానికి గురిచేశాయి. కిమ్‌ మాటలతో చిన్న పిల్లల్లా డాక్టర్లు వెక్కి వెక్కి ఏడ్చారు. ఎప్పుడూ భయపెట్టే కిమ్‌ జోంగ్‌ ఆర్మీ వైద్యులను ఆకట్టుకునేలా ప్రసంగం, అక్కడి వైద్యుల కన్నీటి పర్యంతం అవుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

నార్త్‌ కొరియా చీఫ్‌, కిమ్‌ జోంగ్‌ ఉన్ ఆధునిక నియంతగా నిత్యం అమెరికా, పశ్చిమ దేశాలపై నిప్పులు చెరుగుతూ ఉంటారు. అణు పరీక్షలు నిర్వహిస్తూ ప్రపంచ దేశాలను టెన్షన్‌ పెడుతుంటారు. అమెరికా తోక జాడిస్తే అణుదాడి తప్పదంటూ ప్రగల్బాలు పలుకుతుంటాడు ఈ ఏడాది ఏప్రిల్‌ చివరి వారంలో నిర్వహించిన సైనిక వేడుక తరువాత దేశ వ్యాప్తంగా పలువురు అస్వస్థతకు గురయ్యారు. నాటి నుంచి దేశ వ్యాప్తంగా లక్షలాది మంది అనారోగ్యంతో విలవిలలాడారు. అయితే అది కరోనా వైరస్సేనని నిపుణులు అనుమానించారు. కానీ కిమ్‌ ప్రభుత్వం ఒప్పుకోలేదు. కేవలం హైఫీవర్‌గా చెప్పింది. అయితే కేసులు భారీగా పెరుగుతుండడంతో దేశ వ్యాప్తంగా కిమ్‌ లాక్‌డౌన్‌ విధించారు. సరిహద్దులు మూసివేశారు. అదే సందర్భంలో కిమ్‌ కూడా అనారోగ్యం బారినపడి తీవ్ర జ్వరంతో విలవిలలాడారు. అయితే కోవిడ్‌ సోకితే 15 రోజుల క్వారంటైన్‌‌లో ఎలా ఉంటారో కిమ్‌ కూడా అలాగే క్వారంటైన్‌లో గడిపారట ఈ విషయం ఇటీవలే కిమ్‌ సోదరి కిమ్‌ యో ఉన్‌ తెలిపారు.

అయితే మహమ్మారి సమయంలో ఉత్తర కొరియా మిలటరీ వైద్యులు ప్రజలకు సేవలందించారు. కొత్త కేసులు నమోదవడం లేదని వారం రోజుల క్రితమే కిమ్‌ ప్రకటించారు. ప్రాణాంతక వైరస్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో అద్భుతమైన విజయం సాధించినట్టు కిమ్‌ వెల్లడించారు. ఇటీవల రాజధాని ప్యాంగ్యాంగ్‌లో ఆరోగ్య కార్యకర్తలు, శాస్త్రవేత్తలతో నిర్వహించిన సమావేశానికి హాజరై మాట్లాడారు. తమ ప్రజలు, తమ ఆచారాలతోనే మహమ్మారిపై విజయం సాధ్యమైనట్టు కిమ్‌ వివరించారు. ప్రపంచానికి మరోసారి తమ సత్తా ఏమిటో చూపించామని అప్పట్లో కిమ్‌ స్పష్టం చేశారు. కిమ్‌ ప్రసంగం ముగింపు సందర్భంగా హర్షధ్వానాలు చేశారు. కష్టకాలంలో తన సోదరుడు కిమ్‌ జోంగ్‌ ఎంతో శ్రమించినట్టు సోదరి కిమ్‌ యో తెలిపారు. నిద్ర కూడా పోకుండా ప్రజల గురించే ఆలోచించేవారని ఆమె వెల్లడించింది. తనకు వైరస్‌ సోకినా ప్రజల ఆరోగ్య పరిస్థితిపైనే ఆలోచించినట్టు తెలిపారు.

వైరస్‌ విజృంభించిన సమయంలో అండగా నిలిచిన మిలిటరీ వైద్య సిబ్బందిపై తాజాగా కిమ్‌ ప్రశంసల వర్షం కురిపించారు. విపత్తు సమయంలో ప్రజలకు అండగా నిలిచిన వారిని అభినందించేందుకు రాజధాని నగరం ప్యాంగ్యాంగ్‌లో ఏకంగా ఓ భారీ సభ నిర్వహించారు. ఈ సభకు భారీ సంఖ్యలో మిలిటరీ వైద్యులు, పారామెడికల్ సిబ్బంది హాజరయ్యారు. కష్టకాలంలో వారందించిన సేవల గురించి ప్రస్తావించారు. వైద్యులు చూపిన ధైర్య సాహసాలు అమోఘమంటూ ప్రశంసించారు. వారి తోడ్పాటుతోనే మహమ్మారిపై ఉత్తర కొరియా విజయం సాధించగలిగిందని మెచ్చుకున్నారు. కిమ్‌ వ్యాఖ్యలతో సభలోని కొందరు వైద్యులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వైరస్‌ విజృంభించిన సమయంలో ఎదుర్కొన్న సవాళ్లను వైద్యులు గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఉత్తర కొరియాలో కరోనాను నియంత్రించేందుకు కిమ్‌ జోంగ్‌ కోటి మంది సిబ్బందిని రంగంలోకి దింపినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.

ఇక ఉత్తర కొరియాలో ఏప్రిల్‌ చివరి వారంలో నిర్వహించిన సైనిక వేడుకల్లో నుంచే కరోనా వైరస్‌ వ్యాపించినట్టు నిపుణులు అనుమానిస్తున్నారు. వైరస్‌ గుర్తించిన నాటి నుంచి కఠిన లాక్‌డౌన్‌ను కిమ్‌ ప్రభుత్వం విధించింది. ఉ్తతర కొరియాలో మొత్తం 48 లక్షల మంది వైరస్‌ బారిన పడ్డారు. మొత్తంగా 74 మంది మరణించారు. అయితే వైరస్‌ను కిమ్‌ ప్రభుత్వం ఫీవర్‌గానే చెబుతోంది తప్ప కరోనాగా పేర్కొనడం లేదు. ఉత్తర కొరియాలో ఎలాంటి కరోనా టెస్టింగ్‌ కిట్‌లు, టీకాలు లేవు. ఇక అమెరికా, భారత్‌, ఇంగ్లండ్‌, చైనా వంటి అగ్రదేశాల్లో ఇప్పటికీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. వైరస్‌ను కట్టడి చేయడంలో ఆయా ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. అయినా కిమ్‌ మాత్రం కంట్రోల్‌ చేయడంపై నిపుణులు ముక్కున వేలేసుకుంటున్నారు. వైరస్‌ అణిచివేయడంలో కిమ్‌ నుంచి చైనాతో పాటు అగ్ర దేశాలు పాఠాలు నేర్చుకోవాల్సిందేనేమో.

వైరస్‌ సంగతి పక్కన పెడితే కిమ్‌ ప్రసంగం మాత్రం అక్కడి వైద్యులను భావోద్వేగానికి గురిచేసింది. వారు కన్నీటిపర్యంతమవుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. నియంత కూడా ఏడిపించగలడా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories