కిమ్‌ రాజ్యంలో తొలి కరోనా కేసు.. కిమ్ సంచలన నిర్ణయం..

North Korea Reports First Covid Case
x

కిమ్‌ రాజ్యంలో తొలి కరోనా కేసు.. కిమ్ సంచలన నిర్ణయం..

Highlights

North Korea: కరోనా వైరస్‌ దాడి చేయని దేశం ఏదైనా ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం మనకు కష్టం ఎందుకంటే ప్రపంచాన్నే గడగడలాడించిందని మనందరికీ తెలుసు

North Korea: కరోనా వైరస్‌ దాడి చేయని దేశం ఏదైనా ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం మనకు కష్టం ఎందుకంటే ప్రపంచాన్నే గడగడలాడించిందని మనందరికీ తెలుసు.. కానీ.. నిజానికి నిన్నటివరకు ఓ దేశ సరిహద్దుల్లోకి వెళ్లడానికి కూడా వైరస్‌ బయపడింది.. అనేక విఫల ప్రయత్నాల అనంతరం ఇప్పుడు ఆ దేశంలోకి కూడా వైరస్‌ చొరబడింది.. మొదటి కేసు నమోదయ్యింది. ఆ దేశం మరేదో కాదు అమెరికాపై అణుబాంబులు వేస్తామని నిత్యం బెదిరించే ఉత్తర కొరియానే ఆధునిక నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ దేశమే. ఈ దేశంలో తొలిసారి కేసు నమోదవడంతో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఏకంగా లౌక్‌డౌన్‌ విధించారు. సరిహద్దుల్లో కఠిన నియంత్రణ చర్యలు చేపట్టారు.

ప్రపంచ దేశాల్లో ఉత్తర కొరియా చాలా ప్రత్యేకమైనది. ఆధునిక పరిస్థితులకు దూరంగా అభివృద్ధిలో ఎన్నో ఏళ్లు వెనక్కి ఉంటుంది. ప్రజలు పేదరికంతో నిత్యం అవస్థలు పడుతున్నారు. మనం వినియోగిస్తున్న లేటెస్ట్‌ ఫోన్లు వారికి అస్సలు తెలియవు. ఇంటర్నెట్‌ కూడా వీఐపీలకు మాత్రమే అనుమతి ఉంటుంది. బయటి ప్రపంచంలో ఏం జరుగుతోందో అక్కడి ప్రజలకు అస్సలు తెలియదు. నిత్యం అణు పరీక్షలను నిర్వహిస్తూ ప్రపంచాన్ని ఆ దేశ అధ్యక్షడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ గడగడలాడిస్తున్నాడు. శాంతి భద్రతల పరిక్షణకే అణ్వస్త్ర పరీక్షలు నిర్వహిస్తున్నట్టు కిమ్‌ చిలక పలుకులు పలుకుతుంటాడు. దేశంలో పేదరికం విలయతాండవం ఆడుతున్నా.. అమెరికాతో మాత్రం కయ్యానికి కాలు దువ్వుతుంటాడు. ప్రపంచ దేశాలను వైరస్ వణికిస్తున్న సమయంలో కఠిన ఆంక్షలను విధించాడు. వైరస్‌ ఎవరికైనా సోకితే కాల్చి పడేస్తామని ప్రజలను కిమ్‌ హెచ్చరించాడు. చైనాలో వైరస్‌ గుర్తించిన వెంటనే సరిహద్దులను మూసేశాడు. 2020 నుంచి ఇప్పటివరకు వైరస్ రాకుండా కిమ్‌ అడ్డుకున్నాడు.

అయితే ఉత్తర కొరియాలోని ప్యాంగాంగ్‌ నగరంలో తాజాగా తొలి కరోనా కేసు నమోదవడం సంచలనం సృష్టించింది. జ్వరంతో బాధపడుతున్న ఓ వ్యక్తికి పరీక్షలు నిర్వహించగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకినట్టు గుర్తించారు. రెండేళ్లుగా కరోనా మహమ్మారిని దేశంలోకి రానివ్వకుండా కట్టడి చేసిన తర్వాత మొట్టమొదటిసారి పాజిటివ్‌ కేసు నమోదవడాన్ని కిమ్‌ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. వెంటనే సంక్షోభ పోలిట్‌బ్యూరో సమావేశాన్ని నిర్వహించిన కిమ్‌.. జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి అత్యవసర వైరస్ నియంత్రణ వ్యవస్థను అమలు చేస్తామని కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు. అత్యల్ప వ్యవధిలో కరోనా మూలాన్ని తొలగించడమే తమ లక్ష్యమని కిమ్ చెప్పారు. దేశంలోని అన్ని నగరాలు, కౌంటీలను పూర్తిగా లాక్‌డౌన్ విధించడంతో హానికరమైన వైరస్‌ను అడ్డుకట్ట వేస్తామని ప్రజలకు కిమ్‌ హామీ ఇచ్చారు. ఒక్క కరోనా కేసు నిర్ధారణ అవడంతో సరిహద్దుల్లో కఠినమైన నియంత్రణ చర్యలు చేపట్టారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కూడా విధించారు.

కరోనాను కట్టడి చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ, చైనా, రష్యా దేశాల నుంచి టీకాల ప్రతిపాదన వచ్చినా కిమ్‌ తిరస్కరించారు. 2 కోట్ల 50 లక్షల జనాభా ఉన్న ఆ దేశంలో ఇప్పటివరకు వైరస్‌కు అడ్డుకట్టే వేసేందుకు ఎవరూ టీకాలను తీసుకోలేదు. ఉత్తర కొరియా చుట్టూ ఉన్న దేశాలు ఇప్పటికీ కరోనాతో పోరాడుతున్నాయి. చైనా, దక్షిణ కొరియాలో అయితే నిత్యం వేలాది కేసులు నమోదవుతున్నాయి జీరో కోవిడ్‌ పేరుతో చైనా కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. రాజధాని బీజింగ్‌తో సహా పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధించింది. భారీగా క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రజలను బయటకు రావొద్దంటూ ఆదేశాలను జారీ చేసింది. అయితే దక్షిణ కొరియా కరోనా నిబంధనలను మాత్రం సడలించిది.

ప్రస్తుతం ఉత్తర కొరియాలో కిమ్‌ ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. అయితే ఇది ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. తాము వైరస్‌ను కట్టడి చేయగలమని కిమ్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే కిమ్‌కు అంత సీన్‌లేదని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2020లో జరిగిన సైనిక కవాతులో కిమ్‌కు ప్రజలు, సైనికులు పదే పదే కృతజ్ఞతలు తెలిపారు. వైరస్‌కు దూరంగా తాము ఆరోగ్యంగా ఉన్నామని ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాకుండా 2020 జనవరి 3 నుంచి నిన్నటివరకు ప్రపంచ వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నా ఉత్తర కొరియాలో మాత్రం ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

తాజాగా కరోనా కేసులు నమోదవడంతో ఇక నిషేధిత ఆయుధ ప్రయోగాలకు బ్రేక్ పడొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ప్యాంగాంగ్‌లో ఇప్పటివరకు డజనుకు పైగా అణ్వాయుధ పరీక్షలను ఉత్తర కొరియా నిర్వహించింది. 2017 తరువాత తొలిసారి పూర్తి స్థాయి ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించింది. ఉత్తర కొరియా మరిన్ని అణుపరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్టు ఇటీవల అమెరికా హెచ్చరికలు జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories