Fuel Crisis: శ్రీలంక బాటలో నడుస్తున్న నైజీరియా.. పెట్రోలు బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూలు..
Fuel Crisis: ఆ దేశం తీవ్ర అప్పులు పాలయ్యింది. విదేశీ మారక నిధుల నిల్వలు పడిపోయాయి. ఫలితంగా దిగుమతులు ఆగిపోయాయి.
Fuel Crisis: ఆ దేశం తీవ్ర అప్పులు పాలయ్యింది. విదేశీ మారక నిధుల నిల్వలు పడిపోయాయి. ఫలితంగా దిగుమతులు ఆగిపోయాయి. ప్రజలు పెద్ద ఎత్తున పెట్రోలు బంకుల వద్ద భారీగా క్యూ కట్టారు. ఆహారం, పెట్రోలు, గ్యాస్ కోసం కోసం అల్లాడిపోయారు. చివరికి అవి ఆందోళనలుగా మారాయి. ఇవన్నీ వింటుంటే టక్కున మనకు శ్రీలంకనే గుర్తొస్తుంది. కానీ.. ఇప్పుడు మనం చూడబోయేది మాత్రం శ్రీలంక కథ కాదు.. అది ముగిసిపోయింది. ఇప్పుడు శ్రీలంక బాటలోనే మరో దేశం అడుగులు వేస్తోంది. అక్కడ కూడా భారీగా పెట్రోలు కోసం ప్రజలు క్యూలు కడుతున్నారు. ఆ దేశం కూడా సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ కథలో ట్విస్ట్ ఏమిటంటే... పెట్రోలు సంక్షోభం నెలకొన్న ఆ దేశంలో చమురు నిక్షేపాలు విస్తారంగా ఉన్నాయి. అలాంటి దేశంలో పెట్రోలు దొరకని పరిస్థితి నెలకొంది. పైగా బ్లాక్‌లో నాలుగు రెట్ల అధిక ధరలకు పెట్రోలను ఆ దేశ ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. ఇంతకు ఏ ఆఫ్రికా దేశంలో సంక్షోభం నెలకొంది?.. చమురు నిక్షేపాలు భారీగా ఉన్నా.. ఎందుకు పెట్రోలు కొరత ఏర్పడింది?.. ఆ దేశ ప్రజలు సంక్షోభంపై ఏమంటున్నారు?
ఈ దృశ్యాలు గుర్తున్నాయా?.. 2022లో శ్రీలంక వ్యాప్తంగా ఏ పెట్రోలు బంకులో చూసినా.. భారీగా జనం క్యూలు కట్టేవారు. గ్యాస్ బండ కోసం రోజుల తరబడి ఎదురుచూశారు. పెట్రోలు, గ్యాస్ కోసం క్యూలో నిల్చుని.. తమకు అవి దొరుకుతాయో లేదో అన్న ఆందోళనతో గుండె ఆగి.. పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా ప్రత్యేక సైనిక చర్యకు దిగింది. దీంతో ఉన్నట్టుండి ప్రపంచ సప్లయ్ చైన్ దెబ్బతిన్నది. అప్పటికే పూర్తిగా సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. మొదటి నుంచి నిత్యావసరాలైన ఆహారం, చక్కెర, పప్పులు, పెట్రోలియం, పేపరు, మెడిసిన్లు, సిమెంట్‌తో పాటు భారీగా నిత్యావసరాలను విదేశాల నుంచి శ్రీలంక దిగుమతి చేసుకుంటోంది. పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడిన శ్రీలంక.. విదేశీ మారక నిధుల నిల్వలు పడిపోయాయి. దీంతో ఫారెన్ కరెన్సీ లేక దిగుమతులను నిలిపేసింది. ఈ కారణంగా శ్రీలంకలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. ఆఖరికి స్కూల్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే పేపరును కూడా కొనలేని పరిస్థితి నెలకొంది. పెట్రోలు, ఆహారం కోసం దేశంలో ఎక్కడ చూసినా ప్రజల క్యూలో నిలబడడం కనిపించింది. అప్పట్లో దేశంలోని పలు చోట్ల ఆహారం, పెట్రోలు కోసం ప్రజలు ఆందోళనలకు దిగారు. నిరసనలను అణిచివేసేందుకు అప్పటి అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే సైన్యాన్ని రంగంలోకి దింపాడు. ఇది పరిస్థితులు మరింతగా దిగజారడంతో ప్రజలు ప్రభుత్వంపై తిరగబడ్డారు.
ఇప్పుడు శ్రీలంక తరహా పరిణామాలు ఆఫ్రికా దేశం నైజీరియాలో నెలకొంటున్నాయి. ఆ దేశంలో చమురు కోసం ప్రజలు పెద్ద ఎత్తున పెట్రోలు బంకుల్లో క్యూ కడుతున్నారు. గంటల తరబడి వేచి చూసినా.. పెట్రోలు లభించడం లేదని నైజీరియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ దేశ రాజధాని అబుజాతో సహా లాగోస్, కదూనా, కానో వంటి ఇతర పట్టణాల్లో పెట్రోలు ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. కొందరు టిన్నులతో, మరికొందరు వాహనాలతో గంటల తరబడి క్యూలో నిల్చుంటున్నారు. ఈ క్యూలు కూడా కిలోమీటర్ల మేర ఏర్పడుతున్నాయి. తాజా పరిస్థితులుకు నైజీరియా ప్రధాన ఆయిల్ సరఫరా సంస్థనే కారణమంటూ మార్కెట్లు నిందిస్తున్నాయి. నైజీరియా ప్రభుత్వ చమురు సంస్థ సప్లయ్ సమస్యలను ఎదుర్కొంటోంది. సప్లయ్ సమస్యలతో స్థానికంగా ఇబ్బందులు తలెత్తున్నాయని.. త్వరగానే సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వ అయిల్ సంస్థ ప్రతినిధి వారం క్రితమే చెప్పారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పెట్రోలు, డీజిల్ పరిస్థితి భిన్నంగా ఉంది. చాలా చోట్ల పెట్రోలు కోసం ప్రజలు బంకుల యజమానులతో గొడవకు దిగుతున్నారు. మరికొన్ని చోట్ల ఆందోళనలు చేపడుతున్నారు. నైజీరియాలో లీటరు పెట్రోలు ధర 7 వందల నుంచి 12 వందల నైరాలు పలుకున్నాయి. నైజీరియా కరెన్సీ నైరా. ఇక పెట్రోలు వచ్చిన కొన్ని గంటలకే అయిపోతున్నట్టు బంకుల యజమానులు చెబుతున్నారు. పెట్రోలు కోసం ప్రజలు గొడవలు పడుతుండడంతో చాలా చోట్ల బంకులను యజమానులు మూసేశారు.
ప్రస్తుతం వాహనానికి పెట్రోలు నింపుకోవడానికి సుమారు 6 గంటల పాటు క్యూలో నిల్చోవాల్సి వస్తోందని నైజీరియన్లు వాపోతున్నారు. ఇదే అదునుగా అక్రమార్కులు చమురును బ్లాక్ మార్కెట్‌కు తరలించి.. సొమ్ము చేసుకుంటున్నారు. బ్లాక్‌లో లీటరు ప్రీమియం పెట్రోల్‌ను 2వేల నైరాలకు విక్రయిస్తున్నారు. గంటల తరబడి క్యూలో వేచి ఉండనివారు.. సంపన్నులు గత్యంతరంలేక బ్లాక్ మార్కెట్‌లోనే లీటరుకు 2వేల నైరాలను చెల్లించి పెట్రోలును కొనుగోలు చేస్తున్నారు. పలు నగరాల్లో పెట్రోలు బంకుల వద్ద భారీ క్యూలతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. చమురు కొరత కారణంగా రవాణా చార్జిలు కూడా రెట్టింపవడంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోలు సరఫరాలో సమస్యలు తలెత్తాయని.. వెంటనే పరిస్థితిని చక్కదిద్దుతామని ప్రభుత్వ ఆయిల్ సంస్థ చెబుతున్నా.. నైజీరియన్లు మాత్రం నమ్మడం లేదు. పెట్రోలు దొరకదేమోననే భయంతో పలువురు భారీగా చమురును కొనుగోలు చేస్తున్నారు. దయచేసి.. బ్లాక్ మార్కెట్లకు చమురును తరలించొద్దని.. ఆ పెట్రోలును కొనొద్దని నైజీరియన్ ప్రభుత్వ రంగ సంస్థ ప్రజలను కోరింది. పెట్రోలియం ఉత్పత్తుల రేట్లు పెంచడం లేదేని.. దేశానికి సరిపడా ఆయిల్ ఉందని వివరిస్తోంది. కానీ... ప్రభుత్వ రంగ సంస్థ చెబుతున్నది ఒకటి.. చేస్తున్నది ఒకటని ప్రజలు మండిపడుతున్నారు. నిజానికి బంకుల్లోనూ, బ్లాక్ మార్కెట్లలోనూ అసలు పెట్రోలు లేదని నిపుణులు వివరిస్తున్నారు. కానీ.. ప్రభుత్వ ఆయిల్ కంపెనీ మాత్రం కథలు చెబుతోందని విమర్శిస్తున్నారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆఫ్రికా ఖండంలోనే అత్యధికంగా చమురును ఉత్పత్తి చేసే దేశం నైజీరియానే. ఇలాంటి దేశంలో చమురు సంక్షోభం నెలకొనడం ఏమిటంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఘోరమైన పరిస్థితికి నైజీరియన్ ప్రభుత్వం లోపభూయిష్టమైన విధానాలే కారణమని ప్రజలు మండిపడుతున్నారు. గతేడాది నైజీరియన్ అధ్యక్షుడు బోలా టినుబు పెట్రోలుపై ఉన్న సబ్సిడీని ఎత్తేశారు. దీంతో 184 నైరాలు పలుకుతున్న లీటరు పెట్రోలు ధర అమాంతంగా... 600 నైరాలకు చేరుకుంది. చమురు రంగంపై నియంత్రణలను సడలించడమే లక్ష్యంగా సబ్సిడీలను ఎత్తి వేసినట్టు ప్రభుత్వం తెలిపింది. కానీ.. ఈ చర్య నైజీరియన్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చమురు ధరలు అమాంతంగా పెరగడంతో.. ఆ దేశంలో ద్రవ్యోల్బణం రేటు 1996 తరువాత.. గరిష్ట స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం నైజీరియాలో ద్రవ్యల్బోణం రేటు 33.20 శాతానికి చేరింది. ఫలితంగా.. నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చాయి. సామాన్యుడు కొనలేని స్థాయికి ధరలు చేరుకున్నాయి. పెట్రోలు, నిత్యావసరాల ధరలు పెరగడంతో.. నైజీరియన్లు గత సెప్టెంబరు నుంచి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. జీవన వ్యయం పెరిగిన నేపథ్యంలో కనీస వేతనాన్ని పెంచాలని కార్మికు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పెట్రోలు కొనేంత స్థోమత తమకు లేదని మధ్యతరగతి ప్రజలు చెబుతున్నారు. దేశంలో పెట్రోలు ధరలు పెరగడంతో.. ఆహారం, ఇతర వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగాయంటున్నారు. సరుగుడు పిండి, బియ్యం ధరలు చూస్తే కొనలేని స్థాయికి చేరాయని వాపోతున్నారు.
ధరలు పెరిగిన నేపథ్యంలో పిల్లలను స్కూళ్లకు పంపలేకపోతున్నామని పలువురు నైజీరియన్లు వాపోతున్నారు. అయితే నైజీరియన్ అధ్యక్షుడు టినుబు పదే పదే తన ఆర్థిక సంస్కరణలను సమర్థించుకుంటున్నారు. దేశం దివాలా తీయకుండా ఉండాలంటే. పెట్రోలు సబ్సిడీని తొలగించడం అవసరమని తాజాగా వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో టినుబు వెల్లడించారు. కానీ.. ఏడాడి గడచినా... దేశంలో ఎలాంటి మార్పులు కనిపించడం లేదు. నిజానికి అధ్యక్షుడు టినుబుపై బయటి నుంచి ఒత్తిడి తీవ్రమైంది. ప్రధానంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ-ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ సంస్కరణల చేపట్టాలంటూ టినుబుకు సూచించాయి. అందులో భాగంగానే గతేడాది చమురు రాయితీని అధ్యక్షుడు ఎత్తి వేశారు. ప్రపంచ స్వేచ్ఛా మార్కెట్‌లోకి నైజీరియాను చేర్చాలని ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ కోరుకుంటున్నాయి. నిజానికి అధ్యక్షుడు టినుబు తీసుకున్న నిర్ణయం సరైనదే. సబ్సిడీ కోసం కోట్ల డాలర్లను ప్రభుత్వం వెచ్చిస్తోంది. దీంతో ఆర్థిక వ్యవస్థ నిలకడ లేకుండా మారింది. కానీ.. ఆచరణలో మాత్రం అది దేశాన్ని మరింత క్రుంగదీస్తోందని నిరూపితమైంది. బహుశా ఒక్కసారిగా సబ్సిడీని ఎత్తి వేయడంతోనే ప్రజలపై భారం ఎక్కువైంది. మొత్తంగా సబ్సిడీని ప్రభుత్వం ఉపసంహరించుకోవడం నైజీరియన్లను షాక్‌కు గురిచేసింది. అప్పటి నుంచి ప్రజలు తీవ్ర ఆగ్రహతో రగిలిపోతున్నారు. మూలుగుతున్న కోతిపై తాటికాయ పడిన చందంగా మారింది నైజీరియన్ల పరిస్థితి. అసలే ఉపాధి లేక.. సంపాదించే మార్గాలు లేక ప్రజలు అల్లాడుతున్నారు.
దిగుమతుల వ్యయం పెరిగితే.. నిత్యావసరాల ధరలు కూడా ఆటోమెటిక్‌గా పెరుగుతాయి. ద్రవ్యోల్బణం రేటుకు రెక్కలొస్తాయి. మొత్తంగా... నైజీరియా అధ్యక్షుడు టినుబు చేపట్టిన సంస్కరణలు వినాశనానికి దారి తీశాయి. అతడి ఉద్దేశాలు మంచివే. కానీ.. అమలు మాత్రం భయంకరంగా మారింది. నైజీరియన్ ప్రజలు అక్షరాలా మూల్యం చెల్లిస్తున్నారు. ఇప్పటికే పేదరికంలో అల్లాడుతున్న ప్రజలను అధ్యక్షుడి సంస్కరణలు మరింతగా బాధిస్తున్నాయి. దీంతో పశ్చిమ ఆఫ్రికా దేశ ప్రజలు ఆందోళనబాట పడుతున్నారు. శ్రీలంక తరహాలోనే ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire