ప్రపంచాన్ని చుట్టేస్తున్న కొత్త రకం

ప్రపంచాన్ని చుట్టేస్తున్న కొత్త రకం
x
Highlights

* 30 దేశాలకు పాకిన నూతన వేరియంట్‌ * తాజాగా, వియత్నాంలో అడుగుపెట్టిన కొత్త స్ట్రెయిన్ * యూకే నుంచి వచ్చిన ప్రయాణికురాలిలో గుర్తింపు

బ్రిటన్‌లో వెలుగు చూసిన కరోనా వైరస్‌లోని కొత్త రకం అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు 30 దేశాలలో ఇది అడుగుపెట్టింది. తొలి వైరస్‌ కంటే వేగంగా వ్యాపిస్తూ ప్రపంచ దేశాల్ని మరోసారి కలవరానికి గురిచేస్తోంది. రోజుకో దేశంలో ఈ రకం వెలుగులోకి వస్తూనే ఉంది. ఓ వైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుండగానే కొత్త వైరస్‌ ప్రపంచ దేశాల్ని చుట్టేస్తోంది. దీంతో దాదాపు అన్ని దేశాలు దీని కట్టడికి పటిష్ఠ చర్యలు చేపడుతున్నాయి. తొలి వైరస్‌ వ్యాప్తి నివారణలో వేసిన తప్పటడుగులను గుర్తుంచుకొని వ్యవహరిస్తున్నాయి. విమాన రాకపోకలపై ఆంక్షలు, అవసమైన చోట లాక్‌డౌన్‌లు విధించడంలో వేగంగా స్పందించాయి. మరికొన్ని దేశాలు వైరస్ ఉనికిలో ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించాయి.

నిన్న వియత్నాంలో బ్రిటన్ వైరస్‌కు సంబంధించి తొలి కేసు నమోదైంది. ఇటీవల యూకే నుంచి వచ్చిన మహిళలో ఈ వైరస్‌ను గుర్తించారు. అప్రమత్తమైన అధికారులు ఆమెను ఐసోలేషన్‌కు తరలించారు. కాగా, అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఇప్పటికే నిషేధం విధించిన వియత్నాం.. యూకేలోని తమ పౌరుల కోసం ప్రత్యేక విమానాలు నడుపుతోంది. యూకే నుంచి తిరిగి వచ్చిన 15 మందిలో కొత్త వైరస్ లక్షణాలను గుర్తించినట్టు మొన్న టర్కీ ప్రకటించింది. అమెరికాలో ఇప్పటి వరకు మూడు కొత్త కేసులు నమోదయ్యాయి.

నిజానికి ఈ వైరస్ అమెరికాలో పెద్ద ఎత్తున వ్యాపించి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, జన్యుక్రమ విశ్లేషణ పరీక్షల సామర్థ్యం తక్కువగా ఉండడంతో గుర్తించలేకపోతున్నారు. ఇప్పటికే కరోనా వైరస్‌తో అల్లాడిపోతున్న అమెరికాలో కొత్త వైరస్ మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, వైరస్ వెలుగు చూసిన బ్రిటన్‌లో దాని వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. స్కూళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, పార్క్‌లను మూసివేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories